Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Preparation Plan

అత్యాధునిక సేవల ఐటీ రంగం

గత రెండు దశాబ్దాల్లో మానవ జీవనశైలిని ఎంతో ప్రభావితం చేసిన రంగం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ. ఇంజినీరింగ్‌లో దీనికీ, కంప్యూటర్‌ సైన్స్‌కూ సిలబస్‌లో పోలికలూ, అనువర్తనంలో తేడాలను గ్రహించాలి.
ఆహారం మొదలుకుని ప్రయాణ ప్రణాళికల ఖరారు, సుదూర ప్రాంతాల్లో ఉన్నవారితో ముఖాముఖి సంభాషణలకు కాలు కదపకుండా వీలు కల్పించిన ఘనత దీనిదే. వస్తువుల కొనుగోళ్ల నుంచి సినిమా టికెట్ల బుకింగ్‌, పోటీ పరీక్షల, విదేశీ చదువుల దరఖాస్తు వంటి విశిష్ట సేవలకు ఐటీనే ఆస్కారం కలిగించింది.
కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌ఈ)లో కంప్యూటర్‌ పరికరాలు, ప్రోగ్రాముల గురించి వ్యవస్థాగతంగా చదువుతారు. ఐటీ విషయానికొస్తే.. కంప్యూటర్ల సమర్థ వినిమయ పద్ధతుల అభివృద్ధి, ఆయా రంగాలకు, సంస్థలకు వినియోగపడే సమాచార సేకరణ, నిర్మాణ, సంకలన, నిర్వహణ, భద్రత, వినిమయ వ్యవస్థల రూపకల్పన వీరి ప్రధాన వృత్తి. వీటికితోడు సంస్థలకు తమ వనరులను సమర్థంగా వినియోగించుకోవడంలో సలహాదారులుగా విశిష్ట సేవలనందిస్తారు. ఇంకా సంక్లిష్టమైన కంప్యూటర్‌ వ్యవస్థను సామాన్య జనం ఉపయోగించుకునేలా వ్యవస్థల నిర్మాణం కూడా వీరు చేసే పనులే.
సూక్ష్మంగా చెప్పాలంటే- కంప్యూటర్‌ ఇంజినీర్లు నిర్మించిన కంప్యూటర్‌ వ్యవస్థలను ఐటీ ఆధారిత సేవల రూపంలో కంప్యూటర్‌ నెట్‌వర్క్‌, సమాచార వ్యవస్థల రూపకల్పన, అమలు, నిర్వహణ ఐటీ ఇంజినీర్ల బాధ్యత. అందుకే వీరు బీటెక్‌లో డేటాబేస్‌ సిస్టమ్స్‌, డేటా మైనింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, మైక్రో ప్రాసెసర్ల అనుసంధానం వంటి సబ్జెక్టుల అధ్యయనం చేస్తారు. కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లపై వీరికి మంచి పట్టు ఉంటుంది.
* ఐటీ శాఖ వివిధ సంస్థలకు అవసరమైన, ఉపయోగపడే తగిన హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లను గుర్తించి అభివృద్ధి చేస్తుంది.
* ఈ పనుల, బాధ్యతల విభజనపరంగా కొంతమేరకు సీఎస్‌ఈని ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌తో, ఐటీని సివిల్‌ ఇంజినీరింగ్‌తో పోల్చవచ్చు.
* మన దేశంలోకన్నా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇతర రంగాల నుంచి వలస వచ్చి, తమ మాతృరంగాల్లో కంప్యూటరీకరణకు తమ సేవలనందించే వారి శాఖగా ఐటీకి ప్రాచుర్యముంది.
అధునాతన టెక్నాలజీల వినియోగం వల్ల కలిగే లబ్ధి సామాన్య జనానికి అందుబాటులోకి తేవాలన్న సంకల్పం ఉంటే ఐటీ ఇంజినీరింగ్‌ చక్కని అవకాశం కల్పిస్తుంది. నూతన ఆవిష్కరణల అధ్యయనం, వాటి అనువర్తన విధానాల యోచన, సంస్థ ఆలోచనలకు అనుగుణంగా సాంకేతికత వినియోగించగలవారిని ఈ రంగం కచ్చితంగా ఆదరిస్తుంది. వివిధ వ్యవస్థలను అధ్యయనం చేసి వాటి తీరుతెన్నులను అర్థం చేసుకుని, కంప్యూటరీకరణ ద్వారా లోపాలను సవరించి, వాటి సామర్థ్యాన్ని పెంచగలవారు ఐటీ రంగంలో చక్కగా ఇమడగలరు.
అర్హతలు, లక్షణాలు
* ఒక సమస్యను వివిధ కోణాల నుంచి చూసి, ఇతర అంశాలపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకునే లక్షణం చాలా అవసరం.
* ఒక సంస్థకు సంబంధించిన సమస్యకు సమాధానం రాబట్టాలంటే ఆ సంస్థ యాజమాన్యం నుంచి మొదలుపెట్టి కింది స్థాయి ఉద్యోగులవరకు ఎంతోమందితో చాలాసార్లు చర్చలు, సమావేశాలు అవసరమవుతాయి. దీనికోసం సంభాషణ నైపుణ్యం బాగా ఉండాలి.
విద్యా, ఉద్యోగావకాశాలు
బీపీఓ స్థాయి నుంచి పై స్థాయుల్లో ఎన్నోరకాల ఉద్యోగాలున్నాయి. ఐటీ రంగంలో బీటెక్‌ చేసినవారికి లభించే కొన్ని ఉద్యోగావకాశాలు...
* సమాచార భద్రత విశ్లేషకులు: అంతర్జాల ఆధారిత దాడులు (సైబర్‌ అటాక్స్‌) వంటి ప్రయత్నాల గుర్తింపు, విశ్లేషణ, నివారణ మార్గాలను నిర్వచించి, అనువర్తనం చేయడం వీరి ప్రధాన బాధ్యత. వేగంగా సైబర్‌ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత వాతావరణంలో వ్యాపార వ్యవస్థలు తమ వ్యాపారాలను, సున్నితమైన సమాచారాన్ని కాపాడుకోవడానికి వీరు తమ సేవలనందిస్తారు.
* నెట్‌వర్క్‌ ఆర్కిటెక్ట్‌: నెట్‌వర్క్‌ ఇంజినీర్లుగా కూడా వ్యవహరించే వీరు లాన్స్‌, వాన్స్‌, ఇంటర్నెట్‌ వంటి మౌలిక సమాచార వ్యవస్థల నిర్మాణానికి ప్రధాన బాధ్యత వహిస్తారు. ప్రతిభ ఉన్నవారికి ఆకర్షణీయమైన జీతాలూ ఉన్నాయి.
* కంప్యూటర్‌ సహాయక సేవలు: కంప్యూటర్ల నిర్వహణ, మరమ్మతు వీరి ప్రధాన కర్తవ్యం. గిరాకీ ఉన్న ఐటీ రంగ ఉద్యోగాల్లో ఇదొకటి.
* సమాచార నిర్వాహకులు (డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్స్‌): సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాముల ఆధారంతో సమాచార సేకరణ, నిర్వహణ, వాటి ప్రత్యామ్నాయ లభ్యతకు ప్రణాళిక వీరి విధి.
* వ్యవస్థ నిర్వాహకులు (సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌): కంప్యూటర్‌, సాఫ్ట్‌వేర్‌ అన్ని రకాల నెట్‌వర్క్‌ల దైనందిన నిర్వహణ వీరి పని. జీతాలు సామర్థ్యం, అనుభవం, సంస్థల మీద ఆధారపడి ఉంటుంది.
ఉన్నత చదువుల విషయానికొస్తే ఇంచుమించు ప్రతి విశ్వవిద్యాలయంలోనూ వీరికి పీజీ, రిసెర్చ్‌ స్థాయుల్లో విద్యావకాశాలు పుష్కలం. ప్రతి దేశం, రాష్ట్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల ప్రాంతాల ఏర్పాటుకు చొరవ చూపిస్తుండడం వల్ల ఉద్యోగావకాశాలు కూడా అధికమే.
విపరీతమైన పోటీ ఎదుర్కోవాల్సి రావడం ఈ రంగానికే వర్తిస్తుంది. పైగా ఆర్థిక మాంద్యానికీ, వ్యాపారాల ఒడిదుడుకులకూ త్వరగా ప్రభావితమయ్యే శాఖ కూడా ఇదే. అందువల్ల ఈ రంగంలో స్థిరపడాలనుకునేవారు నిత్య విద్యార్థులుగా, మానసికంగా పోటీకి సిద్ధపడి ఉండాలి.

posted on 14.07.2015