Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Preparation Plan

మైనింగ్‌, ఎంఎంఈ - ఆర్థిక పురోగతితో లంకె!

ఏ ఇంజినీరింగ్‌ బ్రాంచి ఎంచుకోవాలో నిర్ణయానికి వచ్చేముందు వివిధ బ్రాంచిల ప్రాధాన్యాన్నీ, వాటి తీరుతెన్నులనూ గమనించాలి; అవగాహనకు రావాలి. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సందర్భంగా రెండు బ్రాంచిల స్థూల చిత్రాన్ని విద్యార్థుల ప్రయోజనార్థం ఇక్కడ అందిస్తున్నాం.

మైనింగ్‌ ఇంజినీరింగ్‌

మెకానికల్‌ రంగంలో కొన్ని సెమిస్టర్లకు మాత్రమే పరిమితమై ఉండి, ప్రత్యేక శాఖలుగా ఉద్భవించిన శాఖలు కొన్ని ఉన్నాయి. ఒక శాఖకు అనుబంధ శాఖగా/ ఒక సెమిస్టరు కోర్సుగా ఉండి కాలక్రమేణా ప్రత్యేక బ్రాంచిగా తన ఉనికిని, అవసరాన్ని చాటిన కోర్సు మైనింగ్‌ ఇంజినీరింగ్‌. ఇది తన మాతృశాఖకు సమానంగా ఉద్యోగ, ఉన్నత చదువులకు అవకాశాలు కల్పిస్తోంది.
మనదేశం వంటి వర్ధమాన దేశాలు ఆర్థిక పురోభివృద్ధికి అవసరమైన శక్తివనరుల సమీకరణకు సహజ వనరుల అన్వేషణ ముఖ్యమైనది. మానవ జీవితంలో ప్రతిదినం ఎన్నో రకాల ఖనిజాల వినియోగం కూడా అవసరమవుతుంది. జాతీయ స్థూల ఉత్పత్తి 5- 6% అభివృద్ధి చెందాలంటే ఖనిజ వనరుల అన్వేషణ, వాటి అభివృద్ధి ప్రధానం. దీనికోసం ప్రతిభ ఉన్న మైనింగ్‌ ఇంజినీర్ల అవసరం ఎంతో ఉంది.
ప్రకృతిలో లభ్యమయ్యే లోహ, లోహేతర విలువైన సహజ వనరుల, ఖనిజాల ఉనికిని గుర్తించడం, ఆర్థిక సాధ్యాసాధ్యాల పరీక్ష- నిర్ణయం, వెలికితీత, శుభ్రపరచడం, దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే పద్ధతులను, అనువర్తన మెలకువలను నేర్పే శాఖ మైనింగ్‌ ఇంజినీరింగ్‌. ముడి వనరుల నుంచి ఉపయుక్తమైన ఖనిజాల ఉత్పత్తికి దోహదపడే శాస్త్రపరమైన సిద్ధాంతాలను, ఆధునిక సాంకేతిక పద్ధతులను అనువర్తించి అవలంబింపజేయడం మైనింగ్‌ ఇంజినీర్ల ప్రధాన విధి. బొగ్గు, పెట్రోల్‌, యురేనియం వంటి రేడియోధార్మికశక్తి వనరుల ఉత్పత్తి ద్వారా ఆర్థిక స్వావలంబనకు విశిష్ట సేవలందించే శాఖగా మైనింగ్‌ ఇంజినీరింగ్‌ది ప్రముఖ పాత్ర.
ఏం నేర్చుకుంటారు?
మొదటి సంవత్సరంలో అందరికీ వర్తించే గణితం, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రాలతోపాటు మెకానికల్‌ శాఖకు వర్తించే గతిశాస్త్రం, ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌ వంటి ప్రాథమిక సబ్జెక్టుల పఠనం ఉంటుంది. వీటి ద్వారా సమస్యలకు శాస్త్రీయ పద్ధతిలో సమాధానాలు కనుక్కోవడం నేర్చుకుంటారు.రెండు, మూడు, నాలుగు సంవత్సరాల్లో ఖనిజాల శుద్ధిక్రమం, ముడి ఖనిజాల విశ్లేషణ, శిలాయాంత్రిక శాస్త్రం, గనుల అవలోకనం- ప్రణాళిక, కర్మాగార నిర్వహణ, తవ్వకాలు, పేలుడు పదార్థాల వినిమయ పద్ధతులు, గనుల ఆరోగ్య క్షేమం వంటి సబ్జెక్టులు; ఇంకా పర్యావరణంపై గనుల తవ్వకాల ప్రభావం గురించి నేర్చుకుంటారు. వీటికితోడు కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రైవేటు విద్యాసంస్థలు గనుల్లో రోబోల ఉపయోగావకాశాలపై ప్రత్యేకమైన సబ్జెక్టుతోగానీ సెమినార్‌, వెబినార్‌లవంటి పద్ధతుల ద్వారా గానీ పరిచయం కలిగిస్తున్నాయి. ఉపరితల, భూగర్భ గనుల తవ్వకాల్లోని పద్ధతులను కూడా తెలుసుకుంటారు. ఇలా తక్కువ ఖర్చులో నాణ్యమైన ఖనిజాల తయారీనీ, వృత్తిలో ఆచరించగలిగిన మెలకువలనూ నేర్చుకుంటారు.
కావాల్సిన అర్హతలు
మైనింగ్‌ ఇంజినీరింగ్‌ చేయాలంటే రసాయనిక శాస్త్రంలోని మెటలర్జీలో మంచి ప్రవేశం అవసరం. వివిధ పదార్థాల రసాయనిక చర్యలు, అవి జరపాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన ముఖ్యం. గనులంటే కొన్నిసార్లు కలుషిత వాతావరణ పరిస్థితుల్లో పనిచేయవలసి ఉంటుంది. దినసరి కూలీల నుంచి నిపుణుల స్థాయివరకు అందరితో కలుపుగోలుగా వ్యవహరించవలసి ఉంటుంది. అదే సమయంలో కూలీలను, కార్మికులను సమర్థంగా నడిపించగల నాయకత్వ లక్షణం ఈ రంగంలో ఉండాలనుకునేవారికి అవసరం.
ఉద్యోగావకాశాలు, ఉన్నత విద్య
గనులను ప్రభుత్వరంగ సంస్థలతోపాటు ప్రైవేటుపరం చేయడం వల్ల ఈ రంగంలో ఉద్యోగావకాశాలకు అనుకూల పరిస్థితులున్నాయి. కోల్‌ ఇండియా లిమిటెడ్‌, ఓఎన్‌జీసీ, హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, బాల్కో, నాల్కో, ఇండియన్‌ ఆయిల్‌ లిమిటెడ్‌, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌, భారత్‌ గోల్డ్‌మైన్స్‌, నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌, సింగరేణి గనులు వంటి భారీ సంస్థల్లో వీరికి మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలుగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రైవేటు సంస్థల విషయానికొస్తే టాటా, రిలయన్స్‌, జిందాల్‌, భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల్లో అవకాశాలున్నాయి. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌లకు కూడా ఆస్కారముంది. కొంత అనుభవం మీద విదేశాల్లో కూడా ఉపాధి దొరుకుతుంది.
ఉన్నత చదువుల విషయానికొస్తే- గేట్‌ అర్హత ఆధారంగా ఎంటెక్‌ స్థాయిలో మైనింగ్‌ ఇంజినీరింగ్‌, ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌, మైన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌, రాక్‌ ఎక్స్‌కవేషన్‌ ఇంజినీరింగ్‌, అండర్‌గ్రౌండ్‌ స్పేస్‌ టెక్నాలజీ, జియోమాటిక్‌ ఇంజినీరింగ్‌ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.

మెటలర్జికల్‌ &మెటీరియల్స్‌(ఎంఎంఈ)

లక్షలమంది సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ ఇంజినీర్లు; కొన్నివేల మంది సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్ల సమూహం మధ్యలో మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ది విలక్షణ స్థానం. సాంకేతిక విప్లవాల ప్రపంచంలో లోహాల, ద్రవ్యాల తయారీ, వినిమయ విజ్ఞానం తెలిసిన ఇంజినీర్ల కొరత ఇటీవల కనిపిస్తోంది.
విద్య, ఉద్యోగాలకు అవకాశాలున్నా విద్యార్థుల, తల్లిదండ్రుల అవగాహన లోపంవల్లనో, సమాచారం లభించకనో నిర్లక్ష్యానికి గురవుతున్న శాఖ ఇది. ప్రతి ఐఐటీ బీటెక్‌ స్థాయిలో, ఐఐటీ గౌహతి, ఐఐటీ దిల్లీ తప్ప మిగతా అన్ని ఐఐటీలూ ఎంటెక్‌ స్థాయిలో ఈ కోర్సును నిర్వహిస్తున్నాయి. విద్యా ప్రమాణాల దృష్ట్యా ఐఐటీల తరువాతి స్థానాన్ని ఆక్రమించే ఎన్‌ఐటీల్లో కూడా ఇదే స్థితి ఉంది.
వివిధ రంగాల్లో కీలకపాత్ర
లోహాలు, ధాతువులు, వాటి మిశ్రణాలను గుర్తించి వెలికితీయడం, శుద్ధి, నిర్మాణ ప్రక్రియల గురించి తెలిపి, వివిధ రంగాల్లో ఈ మిశ్రణాల, లోహాల వినియోగానికి విజ్ఞానాన్ని నేర్పే ఇంజినీరింగ్‌ శాఖ మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌.
అడ్వాన్స్‌డ్‌ మెటాలిక్‌ మెటీరియల్స్‌, సెరమిక్స్‌, కాంపోజిట్‌ మెటీరియల్స్‌, పాలిమర్స్‌, ఎలక్ట్రానిక్‌ ద్రవ్యాలు, సెమీ కండక్టర్లు వంటి పదార్థాల సంయోజనం, అభివృద్ధి గురించి తెలిపే రంగమిది. ఇనుము ఉక్కు కర్మాగారం, రక్షణశాఖకు అవసరమయ్యే వ్యూహాత్మక అవసరాలు, ఏరోస్పేస్‌, రేడియోధార్మిక, పెట్రోకెమికల్‌, ఆటోమోటివ్‌ రంగాల్లో ఎంఎంఈ కీలకపాత్ర పోషిస్తోంది.
ఎందుకు చదవాలి?
తెలుగు రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలతో కలుపుకుని కేవలం ఏడు విద్యా సంస్థల్లోనే ఈ బ్రాంచి అందుబాటులో ఉంది. ఏటా వేలల్లో ఉండే ఇతర బ్రాంచిల ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పోలిస్తే ఈ బ్రాంచి నుంచి 200 మంది మాత్రమే బయటికి వస్తున్నారు. అంటే వీరికి ఇతర బ్రాంచిలకన్నా ఉద్యోగాలు దొరకడానికి పట్టే సమయం చాలా తక్కువన్నమాట. ఇంచుమించు అన్ని రంగాలకు చెందిన భారీ, మధ్య స్థాయి పరిశ్రమల్లో వీరికి అవకాశాలుంటాయి. పారిశ్రామికీకరణ అభివృద్ధితోపాటు ఎదిగే రంగం ఎంఎంఈ. ఈ బ్రాంచిలో అర్హత ఉన్న అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది. కాబట్టి గిరాకీ ఎక్కువే.
ఏం నేర్చుకుంటారు?
ఎంఎంఈ కోర్సులో ముఖ్యంగా లోహశాస్త్రం (మెటలర్జీ)కి సంబంధించిన అంశాలను తెలుసుకుంటారు. గతిశాస్త్రం, భౌతిక లోహశాస్త్రం, యంత్రలోహశాస్త్రం, ఖనిజ శుద్ధి, ఇనుము, ఇతర లోహాల మౌలికాంశాలు నేర్చుకుంటారు. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ రంగానికి చెందిన కొన్ని మౌలిక సబ్జెక్టులు కూడా నేర్చుకుంటారు. వివిధ రకాల లోహాల తయారీకి కావాల్సిన పద్ధతులపై అవగాహన ఏర్పరచుకుంటారు.
ఉన్నత విద్యావకాశాలు
నానోటెక్నాలజీకి అవసరమయ్యే పదార్థాల తయారీకి దోహదపడే ఈ రంగంలో ఉద్యోగాలు దొరకడం అంత కష్టమేమీ కాదు. జీతాలు కూడా ఆకర్షణీయమే. పైగా ఈ రంగంలో బీటెక్‌ ముగించి వచ్చే విద్యార్థుల సంఖ్య బాగా తక్కువ. వీరికి ఐటీ రంగంలో కూడా ఉద్యోగావకాశాలు బాగానే ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సహజ వనరుల తయారీ రంగంలో ఉన్న అన్ని సంస్థల్లోనూ వీరికి ఉద్యోగాలుంటాయి.
ఈ రంగంలో ఐఐటీల్లో బీటెక్‌ చేస్తున్న ప్రతిభావంతులకు నెలకు రూ.4000 ఉపకారవేతనం లభిస్తోంది. 2020 నాటికి 150 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యాన్ని సాధించే దిశలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. ఈ రంగానికి సర్కారు ఎంత ప్రాముఖ్యాన్నిస్తోందో ఇది తెలుపుతోంది. ఈ పథకం మొదటగా 2012లో రెండు సంవత్సరాలకు వర్తింపజేసినా ఇటీవలనే ఈ పథకాన్ని 2017- 18 వరకు పొడిగించారు.
దాదాపు అన్ని ఐఐటీల్లో, ఎన్‌ఐటీల్లో ఈ రంగంలో ఎంటెక్‌, పీహెచ్‌డీలకు అవకాశముంది. ఇంకా ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా ఉన్నత విద్యావకాశాలున్నాయి.

posted on 22.07.2015