Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Preparation Plan

ఎంసెట్‌కు ప్రణాళిక

తెలుగు రాష్ట్రాల్లో 50 శాతానికి పైౖగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఎంసెట్‌కు తయారవుతున్నారు. ఇంత ముఖ్యమైన ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ప్రణాళిక తప్పనిసరి. దరఖాస్తు ప్రక్రియ సరిగా పూర్తిచేసుకొని ఏ తీరులో అధ్యయనం చేయాలో గ్రహించి, సిద్ధమవ్వాలి. ఇక పరీక్ష కేంద్రంలో ఒత్తిడి లేకుండా రాయగలిగితే జీవితంలో స్థిరపడటానికి తొలిమెట్టు ఎక్కినట్లే!
      మూడు లక్షలమంది వరకు ఇంజినీరింగ్‌ విభాగంలో, లక్షా ముప్పై వేలమంది వరకూ మెడికల్‌ విభాగంలో ఎంసెట్‌ రాయబోతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ దరఖాస్తు ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవలసిఉంటుంది. నిర్ణీత పరీక్ష రుసుముతో దరఖాస్తు పూర్తిచేసినవెంటనే విద్యార్థికి రిజిస్ట్రేషన్‌ నంబరు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఇంకా "Filled in online Application form" కూడా రిజిస్ట్రేషన్‌ నంబరు, బార్‌కోడ్‌తో వస్తుంది. దాన్ని ప్రింట్‌ తీసుకొని కింది భాగంలో ఫొటో జతచేసి తమ కాలేజీలో అటెస్టేషన్‌ చేయించుకోవాలి. ఈ ఫార్మ్‌, హాల్‌టికెట్‌ రెండింటినీ తీసుకువెళితేనే పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. దరఖాస్తులో మొబైల్‌ నంబరు, మెయిల్‌ ఐడీ... విద్యార్థి తనదో తల్లిదండ్రులదో ఇవ్వడం మేలు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ ఏప్రిల్‌ 29వ తేదీ ఇంజినీరింగ్‌ విభాగంలో ఉదయము 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరీక్షను మే 2వ తేదీ ఉదయం, మధ్యాహ్నం అదే సమయాల్లో నిర్వహిస్తారు. ఈ కొద్ది రోజులూ నిర్దిష్ట ప్రణాళికతో పునశ్చరణ, సమయపాలన అభ్యాసం ముఖ్యం.
ఇంజినీరింగ్‌ విభాగం
మ్యాథమేటిక్స్‌లో 80, భౌతికశాస్త్రంలో 40, రసాయన శాస్త్రంలో 40 కలిపి మొత్తం 160 ప్రశ్నలతో 3 గంటల కాల వ్యవధితో పరీక్ష జరుగుతుంది. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లలో అధికశాతం లెక్కలుంటాయి కాబట్టి ఎం.పి.సి. విద్యార్థులకు పరీక్ష సమయంలో కాల ఒత్తిడి అధికం. వీరిలో అధికశాతం జేఈఈ-మెయిన్‌ కూడా రాస్తున్నారు. ఏప్రిల్‌ 3వ తేదీ ఆఫ్‌లైన్‌ పరీక్ష రాసేవారికి ఆ పరీక్ష పూర్తవుతుంది. ఆన్‌లైన్‌లో పరీక్ష రాసే విద్యార్థికి అయితే ఏప్రిల్‌ 9, 10వ తేదీల్లో జేఈఈ-మెయిన్‌ పరీక్ష పూర్తవుతుంది.
జేఈఈ-మెయిన్స్‌కయినా, ఎంసెట్‌కయినా సిలబస్‌ ఒకటే. పరీక్షలోని తేడాలు గమనించాలి. జేఈఈ-మెయిన్‌లో 3 గంటల్లో 90 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ఎంసెట్‌లో అదే వ్యవధిలో 160 ప్రశ్నలు రాయాల్సివుంటుంది. ఈ రకంగా జేఈఈ-మెయిన్‌లో కాల ఒత్తిడి ఉండదు కానీ ఎంసెట్‌లో ఇది చాలా ఎక్కువ.
ఏప్రిల్‌ 29న జరిగే ఎంసెట్‌ ప్రిపరేషన్‌ 27వ తేదీకి పూర్తిచేసుకోవాలి. సమయపాలన అలవాటు కోసం వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు పూర్తి సిలబస్‌లో రాయాలి. 10 వరకు రాయగల్గితే మంచిది.
ఒకవేళ 3వ తేదీ పరీక్ష పూర్తిచేసుకొన్న విద్యార్థికి కూడా చదువుకోవడానికి మిగిలిన రోజులు ఆరు- ఏడు రోజులు మాత్రమే. దీనిలో అధిక సమయం మొదటి సంవత్సర సిలబస్‌ పునశ్చరణకు కేటాయించడం మేలు. తెలియని అంశాలకు ఈ సమయంలో ప్రాముఖ్యం అధికంగా ఇస్తే విద్యార్థి మానసిక ఒత్తిడికి లోనయి తన నిజ సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించలేకపోవచ్చు. విద్యార్థులు చేసే ఇంకొక తప్పుంది. 5 రోజులు మ్యాథ్స్‌, 5 రోజులు ఫిజిక్స్‌, 5 రోజులు వరుసగా కెమిస్ట్రీ చదవడం ద్వారా బాగా లాభించవచ్చునని భావిస్తున్నారు. ఇలా చదవడం వల్ల ఒక సబ్జెక్టు చదివేటప్పుడు వేరొక సబ్జెక్టుపై భయంతో ఒత్తిడికి లోనవుతున్నారు. అందుకే రోజూ అన్ని సబ్జెక్టులకూ సమ ప్రాధాన్యం ఇచ్చి చదవడం మంచిది. గ్రాండ్‌ టెస్టులు రాసి వాటిలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా తుది పరీక్షకు వెళ్ళేటప్పటికి 30- 40 మార్కులు పెంచుకోవచ్చు.
ఎం.పి.సి. విద్యార్థులు 2015లో జరిగిన ఎంసెట్‌ ఫలితాల విశ్లేషణ చూస్తే వారు కోరిన కాలేజీలో సీటు సాధించాలంటే ఎంసెట్‌లో ఎన్ని మార్కులు పొందాలో అర్థమవుతుంది. వీరు మ్యాథ్స్‌లో 70 పైన సులభంగా సాధించుకోవచ్చు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ఏదోఒకదానిలో 30 మార్కులు తెచ్చుకోగలిగితే కోరిన కళాశాలలో, ఆశించిన బ్రాంచిలో సీటు వస్తుంది. అంటే రెండు సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి తయారీ ప్రణాళిక తయారు చేసుకోవటం మంచిది. నిర్దిష్ట ప్రణాళికతో తయారవుతూ, ప్రతిరోజూ నమూనా పరీక్షలు రాస్తూ వాటిలోని దోషాలను తొలగించుకుంటూ సమయపాలన పాటిస్తుండాలి.
మెడికల్‌, అగ్రికల్చరల్‌ విభాగం
మెడికల్‌ విభాగంలో జాతీయస్థాయి పోటీ పరీక్షలు ఎంసెట్‌కు ముందు లేవు. అందుకని తయారీకి తగిన సమయం లభ్యమవుతుంది. గత సంవత్సరపు పట్టిక పరిశీలిస్తే విద్యార్థికి సీటు రావడానికి తోడ్పడే సబ్జెక్టు బయాలజీ, కోరిన కళాశాలలో సీటు సాధించుకోవడానికి ఉపయోగపడే సబ్జెక్టు ఫిజిక్స్‌ అని అర్థమవుతుంది.
మెడికల్‌లో ప్రభుత్వ కళాశాలలో, ప్రయివేటు మెడికల్‌ కళాశాలలో కేటగిరీ ‘ఎ’లో సీటు సాధించాలంటే 1000 లేదా 1200 లోపు ర్యాంకు రావాలి. దీనికి 135 మార్కులపైనే సాధించవలసి ఉంటుంది. ప్రయివేటు కళాశాలలో కేటగిరీ బి, కేటగిరీ సి లను వేరొక ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీచేస్తున్నారు. ఒక ఐఐటీ ఇంజినీరింగ్‌ చేయడం లేదా ఐఐఐటీ లో లేదా బిట్స్‌లో ఇంజినీరింగ్‌ ఫీజుతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలలో ఫీజు 20వ వంతు కూడా లేదు. మధ్య తరగతి విద్యార్థులు కూడా ఎంబీబీఎస్‌లో చేరడానికి ఎటువంటి సంకోచమూ పొందవలసిన అవసరం లేదు.
ఎంసెట్‌కు ‘ఇంపార్టెంట్‌’ అనేదేమీ ఉండదు. చాలా నిడివి ఉన్న అభ్యాసాలకంటే చిన్న అభ్యాసాలకు ప్రాధాన్యం ఇస్తే తక్కువ కాలంలో ఎక్కువ అధ్యాయాలు పూర్తి చేసుకోవచ్చు. ఈ తక్కువ సమయంలో తెలిసిన అంశాల పునశ్చరణ ద్వారా వేగం, కచ్చితత్వం బాగా పెంచుకోవచ్చు.
సీటు సాధించడానికి 135 మార్కులపైన రావాలంటే కచ్చితంగా బయాలజీ (బోటనీ, జువాలజీ కలిపి)లో 80 మార్కులకు 75 మార్కులపైనే రావాలి. ఉత్తమ విద్యార్థి అయితే 78, 79, 80నే లక్ష్యంగా చేసుకుంటాడు. కెమిస్ట్రీలో 40 మార్కులకు 35 పైన రావాలి. బయాలజీ, కెమిస్ట్రీ కలిపి 110 నుండి 115 వరకు సాధించడం చాలా సులభం. దీన్ని లక్ష్యంగా పెట్టుకొని ఫిజిక్స్‌లో 30 మార్కులపైన వచ్చేలా ప్రణాళిక తయారు చేసుకోవాలి.
బయాలజీలో ఎక్కువ ప్రశ్నలు పాఠ్యపుస్తకంలోని వాక్యాలే. అందుకని విద్యార్థులు ఎక్కువ సమయం పాఠ్యపుస్తకాలను చదవడానికి వినియోగిస్తున్నారు. పరీక్షలో సమాధానాలు గుర్తించేటప్పుడు వెనుక బడటానికి కారణాలు కాన్సెప్ట్‌ తెలియక కాదు, కేవలం అటువంటి ప్రశ్నలను గతంలో చూడకపోవడమే అవుతోంది. అందువల్ల పాఠ్య పుస్తకం చదవడానికంటే ప్రశ్నల రూపంలో అధిక అభ్యాసం చేయడమే మేలు. తెలుగు అకాడమీ వారి బోటనీ, జువాలజీ ప్రశ్నలనిధిలోని ప్రశ్నలను ఎక్కువసార్లు పునశ్చరణ చేసుకోవాలి. కెమిస్ట్రీ గ్రూపుల్లో 11 నుంచి 12 మార్కులు వస్తాయి. వాటిని టేబుల్స్‌ రూపంలో చేసుకొని పునశ్చరణ చేయాలి. ఫిజిక్స్‌లో ఫార్ములాకు సంబంధిత లెక్కలు మాత్రమే ఉంటున్నాయి. సాధారణ స్థాయి లెక్కలు చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రతిరోజూ ఒక నమూనా పరీక్ష రాసుకొని తప్పులపై చర్చించుకోవాలి. కనీసం 10 వరకు నమూనా పరీక్షలు పూర్తి సిలబస్‌లో రాయాలి.
మెడికల్‌ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు... అది కూడా మంచి వేసవిలో జరగబోతోంది. అందుకని కనీసం 10 పరీక్షలు అదే సమయంలో చేయాలి. ఈ సమయంలో బోధన వినడానికి కాకుండా అభ్యాసం, పునశ్చరణలకు బాగా ప్రాధాన్యం ఇవ్వగలిగితే మంచి మార్కులు సాధించుకోవచ్చు.posted on 29.03.2016