Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Preparation Plan

పోటీకి... దీటుగా!

ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఉమ్మడి ప్రవేశపరీక్ష... ఎంసెట్‌ తేదీ దగ్గర పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజుల తేడాలో జరగబోతోందీ ప్రవేశపరీక్ష. అన్ని సబ్జెక్టుల్లో పునశ్చరణకు తుది మెరుగులు దిద్దుకుని, పూర్తిస్థాయిలో సన్నద్ధం అవ్వాల్సిన తరుణమిది. ఇందుకు ఉపకరించే నిపుణుల సూచనలు... మీ కోసం!
      ఇంజినీరింగ్‌, మెడికల్‌ మొదలైన కోర్సుల్లో చేరటానికి ఉత్సాహంగా ఎంసెట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు... ఈ కొద్దిరోజుల్లో రోజూ ఒక గ్రాండ్‌టెస్ట్‌ రాయటం మేలు. దీంతో సమయ నిర్వహణ తెలుస్తుంది. ప్రతి సబ్జెక్టులో కొన్ని కొత్త ప్రశ్నలు తెలుస్తాయి. అని చేయగలిగితే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. ఏ అధ్యాయానికి ఇంకా తుదిమెరుగులు ఎలా దిద్దుకోవాలో తెలుస్తుంది.
ముఖ్యంగా విస్మరించరాని విషయం... ఎంసెట్‌లో రుణాత్మక మార్కులు లేవనేది. ఏ ప్రశ్నకూ జవాబు గుర్తించకుండా వదలవలసిన అవసరం లేదు. ఈ తరుణంలో ఒక్కో సబ్జెక్టులో ఏ అంశాలను ఎలా మననం చేసుకోవాలో వివరంగా చూద్దాం.

వృక్షశాస్త్రం: రోజుకు 3 గంటలు చాలు


వృక్షశాస్త్రం (బోటనీ)లో 27 అధ్యాయాలున్నాయి. వీటిలో నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ప్రతీ అధ్యాయాన్నుంచి ఒకటి కనీసం వస్తుంది. మిగిలినవి 13 ప్రశ్నలు. అవి మొదటి సంవత్సరంలోని 5వ అధ్యాయం, 9, 11, 13వ అధ్యాయాలు; రెండో సంవత్సరంలోని 2, 4, 5, 9, 10, 11 అధ్యాయాల నుంచి రావచ్చు. అంటే- వీటిని ఇంకొంచెం శ్రద్ధగా చూడాలి.
1) ఎందరో మహానుభావులు: ప్రతీ యూనిట్‌ దగ్గర ఒక శాస్త్రజ్ఞుని గురించి ఇచ్చారు. వాటితో పాటు పాఠ్యాంశంలో వచ్చిన శాస్త్రజ్ఞులు, వారి ఆవిష్కరణలు, అన్ని అధ్యాయాల్లో వరుసగా చదువుకుంటూపోవాలి. ఆ విధంగా జతపరచటం లేదా MCQ లో అడిగే ప్రశ్నలకు జవాబులు సులభంగా తెలుస్తాయి.
2) సారాంశం: ప్రతీ అధ్యాయానికి చివరున్న సారాంశాలను చదివితే ఆ అధ్యాయాన్ని సంక్షిప్తంగా చదివినట్టే. వీటిలో పాఠ్యాంశంలో ఇవ్వని కొన్ని కొత్త పాయింట్లూ కనిపిస్తాయి.
3) పారిభాషిక పదకోశం: ఇదీ అంతే! ప్రతి అధ్యాయానికీ చివర ఉంటుంది. వీటిలో పాఠ్యాంశాల్లో లేని కొత్త పాయింట్లు ఎన్ని ఉన్నాయో చదివితే తెలుస్తుంది.
4) అభ్యాసాలు: ఇవి అమృత భాండం లాంటివి. వీటిని ప్రతి అధ్యాయం చివర చూడవచ్చు. వీటిలోని ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి. ఈ అధ్యాయాల నుంచి నేరుగా ఎంసెట్‌లో ప్రశ్నలడిగిన సందర్భాలున్నాయి.
5) పటాలు: అధ్యాయాల్లో ఉన్న పటాలన్నింటినీ ఒకసారి పరిశీలించాలి. వాటిలో (లేబిలింగ్‌) గుర్తించిన భాగాలను చూడాలి. పటాలలో ఇచ్చిన కొన్ని అంశాలు పాఠ్యాంశంలో ఉండవు. పటాలనే నేరుగా ఇచ్చి ‘గుర్తించండి’ అనే ప్రశ్నలడగవచ్చు. ఏటా పట్టికల నుంచి ఒకటి రెండూ, ఇంకా ఎక్కువ ప్రశ్నలడిగిన సందర్భాలున్నాయి. ఇవన్నీ పునశ్చరణలో భాగం అనుకోవాలి. ప్రశ్నలడిగే వాళ్లకు ఈ పట్టికల నుంచి ప్రశ్నలను ఎంచుకోవడం సులభం. అంచేత వాటిని వదలొద్దు.
6) మొక్కల పరిజ్ఞానం: నిజజీవితంలో మనం రోజూ ఎక్కువ మొక్కలతో, వాటి ఉత్పన్నాలతో సంబంధం కలిగివుంటాం. పాఠ్యాంశంలో ఉన్న ఉదాహరణలన్నీ ఎంతో ముఖ్యం. మొక్కల పేర్లు (ఉదాహరణలు) గుర్తుపెట్టుకోవడం, వాటికి సంబంధించిన అంశాలు మననం చేసుకోవడం చాలా అవసరం. పాఠ్యాంశాలలో ఇచ్చిన శాస్త్రీయ నామాలు, సాధారణ నామం, వాటి ఆర్థిక ప్రాముఖ్యానికి సంబంధించిన విషయాలు చదవాలి. ఉదాహరణలన్నీ గుర్తుపెట్టుకుంటే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.
7) తెలుగు అకాడమీ ప్రశ్నల నిధి: దీనిలో అన్ని రకాల ప్రశ్నలున్నాయి. వాటిని మించి అడగరు. దీన్ని కనీసం ఒకసారైనా తిరగేయాలి. ఎగ్జామినర్‌ తప్పకుండా దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని... అవే ప్రశ్నలు ఇవ్వకపోయినా కొంచెం మార్చి ఇస్తారు.
8) ప్రాక్టికల్‌ మాన్యువల్‌: తెలుగు అకాడమీ ద్వారా ప్రభుత్వం ప్రచురించిన ప్రాక్టికల్స్‌ మాన్యువల్‌లో ఉండే ప్రయోగాలనూ, వాటిలోని విషయాలనూ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో అడిగారు కూడా. అంచేత ప్రాక్టికల్స్‌ చేసినా చేయకపోయినా మాన్యువల్‌ తిరగేయక తప్పదు. అది పాఠ్యపుస్తకంలాగే అనుకోవాలి.
9) సమస్యాత్మక ప్రశ్నలు: బోటనీలో రోజురోజుకూ ఈ రకం ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. వీటికి జవాబు తట్టాలంటే థియరీ పార్ట్‌ అంతా మనకు తెలియాల్సిందే. ప్రతి సంవత్సరం కనీసం అయిదయిన్నా సమస్యాత్మక ప్రశ్నలుంటున్నాయి. అభ్యాసం చేస్తే పరీక్షలో తక్కువ సమయంలోనే వీటిని గుర్తించగలుగుతాం.
10) అంకెలతో కూడా పని: ప్రతి పాఠ్యాంశంలో ఇచ్చిన సంఖ్యలన్నింటినీ ఒకచోట రాసుకుంటే చాలా మంచిది. వీటిని ఆధారం చేసుకొనే ఆరోహణ, అవరోహణ క్రమం అడుగుతారు.

జంతుశాస్త్రం: సమస్యగా ఉన్నవాటిపై శ్రద్ధ


జంతుశాస్త్రంలో 2015 పరీక్షలో పూర్తి మార్కులు సాధించినవారు ఇంచుమించు 50 మంది వరకు ఉన్నారు. 40కి 35 వరకు మార్కులు సాధించినవారు 6000 మంది వరకు ఉన్నారు. అంటే సీటు పొందిన విద్యార్థులు ఓపెన్‌ కేటగిరిలో 35కి పైన సాధించినవారే ఉంటారు.
* గత కొన్ని రోజులుగా రాస్తున్న ప్రశ్నపత్రాలలో చేస్తున్న తప్పులను ముందుగా చూసుకోవాలి. అందులో గుర్తురాక తప్పులు చేసిన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. ప్రశ్నలు సాధన చేస్తే ఏ అంశాలను మళ్ళీ చూసుకోవాలో తెలుస్తుంది.
* ఈ తక్కువ సమయంలో ప్రతీ అంశం మళ్ళీ చూసుకోవాలి అనే ధోరణితో ఉండకూడదు. మనకి సమస్య ఉండే అంశాలేమిటో గుర్తించి, వాటిని చదువుకుంటే సరిపోతుంది.
* మొదటి సంవత్సరం 3, 4 యూనిట్లకు సంబంధించి ఉదాహరణలు, వర్గీకరణ ఒకసారి గమనిస్తే మంచిది. లక్షణాలలో కూడా అనుమానంగా ఉండే అంశాలు చూసుకోవాలి.
* బొద్దింకలో నాడీ వ్యవస్థ, గ్రాహకాలు ఒకసారి చదువుకోవాలి.
* పర్యావరణ శాస్త్రం యూనిట్‌లో కూడా భిన్న అంశాలకు ఉదాహరణలను, కాలుష్య ప్రభావాలు, ఒప్పందాలు, సంవత్సరాలూ పరిశీలించాలి.
* రెండో సంవత్సరానికి సంబంధించిన అంశాల్లో హార్మోన్లు- వాటి లోపాలు, కపాల నాడులు తప్పనిసరిగా చూసుకోవాలి. ఈ అంశాలలో జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.
* అనువర్తిత జీవశాస్త్రం లో గుర్తుపెట్టుకోవలసిన అంశాలను వేగంగా పునశ్చరణ చేసుకోవాలి.
* రాసి పెట్టుకున్న పట్టికలు ఆఖరి రెండు రోజులు ఒకసారి చూసుకోవడం మేలు.
* జన్యు శాస్త్రంలో అనువంశికతలో ఉదాహరణలు, పరిణామ శాస్త్రంలో జియోలాజికల్‌ టైమ్‌ స్కేల్‌ భూ-కాలమాన పట్టిక పునశ్చరణ చేసుకోవాలి.
* జంతుశాస్త్రంలో ముఖ్యంగా Assertion & Reasoning ప్రశ్నల్లో 4 సమాధానాల వరుస గమనించి చేయాలి. ఇతర శాస్త్రాల్లో క్రమానికీ, జంతుశాస్త్రానికీ తేడా ఉంటుంది.

గణితశాస్త్రం: సగం ప్రశ్నలు రెండిటి నుంచే!


గణితంలోని ప్రతి పాఠ్యాంశంలోని మూలసూత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. 2015లో జరిగిన ఎంసెట్‌లో మ్యాథ్స్‌ పేపర్‌ మొత్తం 80 ప్రశ్నల్లో 45 ప్రశ్నలు సూటిగా ప్రాథమిక అంశాలపై ఆధారపడినవి ఇచ్చారు. 30 ప్రశ్నలు కొంత క్లిష్టతతో ఉన్నాయి. 5 ప్రశ్నలు బాగా క్లిష్టంగా ఉన్నాయి.
గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే... ఎక్కువ వెయిటేజీ బీజగణితం, కలన గణితం, రేఖాగణితం అధ్యాయాలకు లభించింది. వీటికి ప్రాధాన్యం ఇచ్చి సాధన చేయాలి.
ఈ కొద్దిరోజుల్లో మొదటి 3-4 రోజులను సదిశా బీజగణితం, 3 డీ జ్యామితి, తర్వాత 3-4 రోజులను రేఖాగణితం, త్రికోణమితిలకు కేటాయించాలి. మిగతా సమయాన్ని బీజగణితం, కలన గణితాలకు వెచ్చించటం ఉత్తమం. ఈ క్రమంలో వాటికి సంబంధించిన లెక్కలను సాధించటం మంచిది.
* ఇంటర్మీడియట్‌ అకాడమీ పుస్తకాలను మాత్రమే అనుసరించినప్పటికీ గణితంలో చాలా సులభంగా 80 మార్కులకు 65 మార్కులు సాధించవచ్చు.
* దాదాపు ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌కు సమ ప్రాధాన్యం ఇస్తారు.
* నిడివి ఎక్కువగా ఉన్న ప్రశ్నలను సాధించే క్రమంలో సమయాన్ని వృథా చేసుకోకూడదు. ముందు త్వరగా పూర్తిచేయగల ప్రశ్నలపై దృష్టి సారించటం మంచిది. జతపరచడం, నిశ్చితం- కారణం లాంటి ప్రశ్నలను చివరిగా సాధించటం మేలు.
* మ్యాథమెటికల్‌ ఇండక్షన్‌, బైనామియల్‌ ధీరమ్‌లోని ప్రశ్నల జవాబులకు లాజిక్స్‌ గుర్తించుకోవడం ద్వారా సులువుగా సమాధానం పొందవచ్చు.
* త్రికోణమితిలో అసంప్షన్స్‌ను ప్రత్యేకంగా రాసుకుని సాధన చేయాలి.
* కోఆర్డినేట్‌ జామెట్రీలో చాలా సమస్యలకు జవాబులను ఆప్షన్ల నుంచి రాబట్టవచ్చు. అందువల్ల వీటిని బాగా అభ్యాసం చేయాలి.
* బీజ గణితం, కలన గణితం నుంచి దాదాపు సగానికి పైగా ప్రశ్నలు వస్తున్నాయి. వాటిపై పూర్తి అవగాహన ఉన్న విద్యార్థులు మార్కులపరంగా లాభపడే అవకాశం ఉంది.
* ఈ చివరి సమయంలో ఎక్కువ గ్రాండ్‌ టెస్టులు రాయడం వల్ల సమయపాలన అలవడుతుంది. ఈ సబ్జెక్టుకు అవసరమైన వేగం, కచ్చితత్వం పెరుగుతాయి.
గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే... మార్కుల పరంగా బీజ గణితం (26 మార్కులు), కలన గణితం (19 మార్కులు), రేఖాగణితం (17 మార్కులు), త్రికోణమితి (9 మార్కులు), సదిశా బీజగణితం (6 మార్కులు), 3డీ జ్యామితి (3 మార్కులు) ప్రాధాన్యం పొందాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, వివిధ పాఠ్యాంశాల నుంచి కింది విధంగా మార్కులకు ఆస్కారం ఉండవచ్చు.
బీజగణితం: * సంకీర్ణ సంఖ్యలు, డీమాయిర్స్‌ సిద్ధాంతం నుంచి 3-4 * వర్గ సమీకరణాలు, సమీకరణ సిద్ధాంతం నుంచి కనీసం 5 * పాక్షిక భిన్నాల నుంచి 1 * ద్విపద సిద్ధాంతం నుంచి 2-3 * గణితానుగమనం నుంచి 1 * మాత్రికలు, నిర్థారకాల నుంచి 4-5 * ప్రస్తారాలు- సంయోగాల నుంచి 2-3 * ప్రమేయాల నుంచి 2-3
కలన గణితం: * అవధులు, అవిచ్ఛిన్నత నుంచి 2-3 * అవకలనం నుంచి 5-6 * అవకలన అనువర్తనాల నుంచి 4-5 * సమాకలనం నుంచి 3-4 * నిశ్చిత సమాకలనం నుంచి 3-4 * అవకలన సమీకరణాల నుంచి 2-3 మార్కులు వస్తాయి.

భౌతికశాస్త్రం: క్లిష్టత తగ్గుతోంది


భౌతికశాస్త్రాన్ని ఎంపీసీ విద్యార్థులైనా, బైపీసీ విద్యార్థులైనా పెద్ద కష్టంగా భావించనవసరం లేదు. లెవెల్‌-1, లెవెల్‌-2 స్థాయి, గత సంవత్సరాల ప్రశ్నలను రెండు మూడు సార్లు పునశ్చరణ చేయటం మేలు.
* ఈ సబ్జెక్టులో గతంతో పోల్చినపుడు ప్రశ్నల క్లిష్టత తక్కువగా ఉంటోందని చెప్పవచ్చు. కాబట్టి అకాడమీ పాఠ్యపుస్తకాలు రెండుమూడు సార్లు చదివివుంటే జవాబులు గుర్తించటం సులువవుతుంది. * అకాడమీ పుస్తకాల్లో ప్రతి అధ్యాయం చివర్లో ఇచ్చిన ప్రాక్టీస్‌ ప్రశ్నలు, ఆయా అధ్యాయాల్లో హైలైట్‌ చేసిన అంశాలను కచ్చితంగా చదవాలి. * అకాడమీ పుస్తకాల్లోని ముఖ్యమైన వాక్యాలను ఆధారంగా చేసుకుని ప్రశ్నలను ఇస్తున్నారు. ఆ వాక్యాల ఆధారంగా తయారైన ప్రశ్నలను అభ్యసించాలి. * మొదటి సంవత్సరం సిలబస్‌ నుంచి 20 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 20 ప్రశ్నలు రావొచ్చు. మొదటి సంవత్సరం మెకానిక్‌, హీట్‌ అంశాలను బాగా నేర్చుకోవాలి. * రెండో సంవత్సరంలో వేవ్స్‌, ఆప్టిక్స్‌, మోడర్న్‌ ఫిజిక్స్‌ నుంచి ప్రశ్నలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అవగాహనతో వాటిని మననం చేసుకోవాలి. * హీట్‌ నుంచి 5-6 ప్రశ్నలకు అవకాశం ఉంది. గ్యాసెస్‌, థెర్మో డైనమిక్స్‌లను సిద్ధం కావాలి. * మెకానిక్స్‌ నుంచి 14-15 ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. ఇందులో లాస్‌ ఆఫ్‌ మోషన్‌, మోషన్‌ ఇన్‌ ఏ స్ట్రెయిట్‌ లైన్‌ అండ్‌ ప్లేన్‌ అధ్యాయాల నుంచి అధిక ప్రశ్నలు రావొచ్చు. క్లిష్టమైన సెంటరాఫ్‌ మాస్‌, రొటేటరీ మోషన్‌ల నుంచి కూడా రెండు ప్రశ్నలకు ఆస్కారం ఉంది. * ద్వితీయ సంవత్సరంలో మోడర్న్‌ ఫిజిక్స్‌ నుంచి అధిక ప్రశ్నలకు అవకాశం ఉంది. సెమీ కండక్టర్‌ డివైసెస్‌, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌, ఆటమ్‌ వంటి అధ్యాయాలకు ఎక్కువ సమయం కేటాయించటం మేలు. * ఆప్టిక్స్‌, వేవ్స్‌ అధ్యాయాల నుంచి 4 ప్రశ్నలకు వీలుంది. ఇందులో పోలరైజేషన్‌, క్రిటికల్‌ యాంగిల్‌, డాప్లర్‌ ఎఫెక్ట్‌, ఓపెన్‌, క్లోజ్డ్‌ పైప్స్‌, బీట్స్‌ను క్షుణ్ణంగా చదవాలి. * పరీక్ష దగ్గరపడిన ఈ తరుణంలో అకాడమీ పాఠ్యపుస్తకాలు చదువుతూ వీలైనన్ని గ్రాండ్‌ టెస్టులు రాయాలి.

రసాయనశాస్త్రం: స్కోరుకు ఆస్కారం


ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించటంలో రసాయనశాస్త్రానిది కీలకపాత్ర అని చెప్పవచ్చు. కారణం... దీనిలో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులకుఅవకాశం ఉండటమే.
* గత సంవత్సరాల పేపర్లను విశ్లేషిస్తే... 80-90 శాతం ప్రశ్నలు సులభం లేదా మధ్యస్థంగా ఉన్నాయని చెప్పవచ్చు.
* ఈ కొద్దిరోజుల వ్యవధిలో సిలబస్‌ను మొదటి, రెండో సంవత్సరాలు అని కాకుండా కర్బన, అకర్బన, భౌతిక రసాయనశాస్త్రాలుగా విభజించి తయారవడం ఉపయోగకరం. ఈ రెండు సంవత్సరాల సిలబస్‌ పరస్పర సంబంధమైనది. కర్బన, అకర్బన రసాయన శాస్త్రాల నుంచి 10 ప్రశ్నలు, భౌతిక రసాయనశాస్త్రం నుంచి అంతకంటే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
* ఇప్పుడున్న సమయంలో 2-3 రోజులు భౌతిక రసాయన శాస్త్రానికి కేటాయించడం మంచిది. ఈ విభాగంలోని భావనలు తార్కికంగా ఉంటాయి.
* తర్వాతి మూడు రోజులూ కర్బన రసాయనశాస్త్రానికి కేటాయించి, అందులోని రసాయన చర్యలను వీలైనన్నిసార్లు రాసి చూసుకోవటం మంచిది.
* చివరి మూడు రోజులను ‘గుర్తుంచుకుని జవాబు రాయాల్సిన భావనలు’ ఎక్కువగా ఉన్న అకర్బన రసాయన శాస్త్రానికి కేటాయించాలి.
* చివరగా జీవరసాయన శాస్త్రం, పాలిమర్స్‌ లాంటి ఇతర అధ్యాయాలను ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. అకాడమీ పుస్తకాల్లో వీటికి సంబంధించి ఇచ్చిన ప్రతి వాక్యాన్నీ చదివి సిద్ధమవ్వాలి. జవాబులు వెంటనే గుర్తించటానికి వీలవుతుంది.
* సిద్ధమవుతున్న టాపిక్‌, సబ్‌టాపిక్‌లకు సంబంధించిన వీలైనన్ని ఎక్కువ మంచి ప్రశ్నలను సాధించటం ముఖ్యం. దీనివల్ల విద్యార్థికి లోపం ఎక్కడ ఉంది అనేది గ్రహించి, తొలగించుకునే వీలుంటుంది.
* కర్బన రసాయనశాస్త్రంలోని నేమ్‌డ్‌ రియాక్షన్స్‌ను పట్టిక రూపంలో ఒకే దగ్గర రాసుకుని సాధన చేయాలి. దీంతోపాటు కర్బన సమ్మేళనాల తయారీ, వాటి భౌతిక రసాయనిక ధర్మాలు, ఇంటర్మీడియట్స్‌, రీయేజెంట్స్‌, ఉత్పన్నం ప్రాముఖ్యం, ఉపయోగాలు, ఇంటర్‌ కన్వర్షన్స్‌, నామిన్‌క్లేచర్‌, ఐసోమరిసమ్‌, ఆమ్ల క్షార ధర్మాలపై ప్రశ్నలు వస్తున్నాయి.
* అకర్బన రసాయనశాస్త్రంలోని రసాయన చర్యలు, మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను పోల్చుతూ తయారుచేసిన పట్టికలను, వాటి ఆరోహణ అవరోహణ క్రమాల సాధన ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు.
* భౌతిక రసాయనశాస్త్రంలో 6-7 ప్రశ్నలు లెక్కల రూపంలో ఉంటున్నాయి. సరైన సూత్రాన్ని అన్వయించడం ద్వారా జవాబును తేలిగ్గానే రాబట్టవచ్చు. అన్ని అధ్యాయాల్లోని సూత్రాలను ఒకే దగ్గర రాసుకుని సాధన చేస్తే ఉపయోగకరం. గత ఏడాది ‘సిగ్నిఫికెంట్‌ ఫిగర్స్‌’కు సంబంధించిన లెక్కను ఇచ్చారు.ఆ భావనకు చెందిన సమాచారాన్ని ఒకసారి చూసుకోవాలి.
* జీవ రసాయనశాస్త్రంలో ఉన్న మాలిక్యూల్స్‌, డ్రగ్స్‌ నిర్మాణం, డ్రగ్స్‌ విభాగం, ఉపయోగాలు, విటమిన్లు, హార్మోన్ల నిర్మాణం, లోపం వల్ల తలెత్తే సమస్యలపై ప్రశ్నలకు ఆస్కారం ఉంది.
* పుస్తక పరిధిలోని గ్రాఫ్‌లను పట్టిక రూపంలో ఉన్న సమాచారాన్ని ప్రత్యేకంగా పరిశీలించటం మంచిది. అలాగే రసాయనశాస్త్రంలో ‘ఎక్సెప్షనల్‌ కేసెస్‌’పై ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ.
* అకాడమీ పుస్తకంలోని ప్రతి వాక్యాన్నీ క్షుణ్ణంగా చదివిన విద్యార్థికి 35పైన మార్కులు సాధించటం సులభం.
* ఏ క్రమంలో ప్రారంభించినా ఈ సబ్జెక్టుకు 45 నిమిషాలు మించకుండా జాగ్రత్తపడి, ఇక్కడ మిగుల్చుకున్న సమయాన్ని అధిక సమయం అవసరమయ్యే సబ్జెక్టుకు ఉపయోగించటం ఉత్తమం.

Posted on 18.04.2016