Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Preparation Plan

విద్యార్ధీ.... విజయోస్తు!

తెలుగు రాష్ట్రాల సీనియర్‌ ఇంటర్‌ ఎం.పి.సి., బై.పి.సి. విద్యార్థులకు అతి ముఖ్యమైన పరీక్ష... ఎంసెట్‌ కొద్ది రోజుల్లోనే! ఈ కీలక సమయంలో ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? పునశ్చరణను ఎలా ఫలవంతం చేసుకోవాలి? పరీక్షను విజయవంతంగా రాసి, ఆశించిన ర్యాంకువైపు దూసుకువెళ్ళేదెలా?... మెలకువలు ఇవిగో!

ఈకొద్దిరోజుల్లో విద్యార్థులు చేసే ప్రయత్నం ఒక మార్కు పెంచడానికి ఉపయోగపడినా ర్యాంకు మెరుగుపడుతుంది. అది వారి భవిష్యత్తును మార్చివేయవచ్చు. ఇంతవరకూ నేర్చుకున్నవాటి జవాబులు సరిగా గుర్తించగలుగుతున్నామో లేదో చూసుకుంటే పరీక్షలో నెగ్గినట్లే! ఈనెల 29న/ మే 2న మూడు గంటలు మనసును పూర్తిగా పరీక్షపై కేంద్రీకరించగలిగితే రెండు సంవత్సరాల కష్టానికి ఫలితం దక్కుతుంది. ఈ తరుణంలో నూతన అంశాలను నేర్చుకొనే ప్రయత్నం చేయకూడదు. తెలిసినవి పునశ్చరణ చేసుకోవాలి. గుర్తుంచుకోవలసిన అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ పునశ్చరణ చేయాలి. కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులో గ్రూపులు చదవడం, వాటి ధర్మాలను పట్టికల రూపంలో తయారుచేసుకోవడం, భౌతిక శాస్త్రంలో పాఠ్యపుస్తక వాక్యాలను ప్రశ్నల రూపంలో తయారుచేసుకోవడం, అనువర్తనాలు, ఉపయోగాలపై దృష్టి సారించడం చేయాలి.

ఫిజిక్స్‌లో సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఎక్కువగా ద్వితీయ సంవత్సర సిలబస్‌లోని కాంతి, ఆధునిక భౌతిక శాస్త్రం నుంచి వస్తున్నాయి. వాటిలోని అంశాలు, ఉపయోగాల గురించి కొంత ఎక్కువగా చదువుకుంటే అధిక లాభం చేకూరుతుంది. మాధమేటిక్స్‌లో వాడే ఫార్ములాలను ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. తెలివితేటలనే కాకుండా విద్యార్థి వేగాన్నీ, కచ్చితత్వాన్నీ కూడా అంచనా వేసే పరీక్ష ఎంసెట్‌. కాబట్టి పునశ్చరణ వల్ల ఉపయోగం తథ్యం. తుది పరీక్ష ముందురోజు వదిలివేసి మిగిలిన రోజుల్లో ప్రతిరోజూ ఒక నమూనా పరీక్షను పూర్తి సిలబస్‌లో రాయాలి. తెలిసిన ప్రశ్నలకు ఎన్ని తప్పు సమాధానాలు పెట్టారో, ఎందువల్ల ఆ తప్పు సమాధానాన్ని గుర్తించవలసి వచ్చిందో విశ్లేషించుకుంటూ పోవాలి. ప్రతిరోజూ పరీక్ష రాసి పరీక్ష అయిన వెంటనే సమంగా తయారైన ముగ్గురు నలుగురు విద్యార్థులు కలిసి 160 ప్రశ్నలను విశ్లేషించుకోవాలి. ప్రతి ప్రశ్నలోని నాలుగు జవాబులను కూడా విశ్లేషిస్తూ పోగలిగితే తుది పరీక్షలో ఎటువంటి తప్పులూ చేయరు. బైపీసీ విద్యార్థులు బయాలజీ చదివేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలను రాసుకుంటూ పోగలిగితే పరీక్ష ముందు రోజు పునశ్చరణకు ఉపయోగం.

ఒకే వరస క్రమం...

ఈ కొద్దిరోజులూ త్వరగా పడుకోవడం, వీలైనంత త్వరగా నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఈ సమయంలో శారీరక ఒత్తిడికి లోనయితే తుది పరీక్ష రోజు పరీక్షా సమయంలో విశ్లేషణా పరిజ్ఞానం లోపించే ప్రమాదం ఉంది. మితాహారం, శాకాహారం, పండ్లు తీసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉన్నందున బయట తిరగడం పూర్తిగా ఆపివేయాలి. ఈ కొద్దిరోజులూ రాసే నమూనా పరీక్షల్లో ఒకే వరుస క్రమాన్ని అవలంబించడం మేలు. అంటే ఏ సబ్జెక్టుతో ప్రారంభిస్తారో దాన్నే అనుసరించాలి. అంతేకానీ ఈ సమయంలో ప్రయోగాలు చేయకూడదు. పరీక్ష రాసేటప్పుడు కూడా ప్రశ్నలు చదివే విధానాన్నీ, ఓఎంఆర్‌ షీట్‌లో గుర్తించే విధానాన్నీ ఒకేవిధంగా అలవాటు చేసుకోవాలి. ఈసారి గడియారం పెట్టుకోవడానికి అనుమతించడం లేదు. అందువల్ల నమూనా పరీక్షల్లో కూడా చేతికి వాచీ లేకుండా రాయడం అలవాటు చేసుకోవాలి. గడియారం పక్కన ఉంచుకొని పరీక్ష రాసే అలవాటున్నవారు ఈ విషయం గ్రహించాలి.

ముందు రోజు

పరీక్ష రోజు ఏమి చేయబోతున్నారో అదే తరహాలో ముందురోజు చేసుకోగలిగితే కొంత ఒత్తిడి తగ్గుతుంది. వీలైనంత త్వరగా లేచి పరీక్షకు వెళ్లేవిధంగా తయారుకావాలి. ఇంజినీరింగ్‌ విభాగం విద్యార్థులైతే పరీక్ష ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు కాబట్టి ఆ విధంగానూ; మెడికల్‌ విద్యార్థులు పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు కాబట్టి ఆ విధంగానూ తయారు కావాలి.
పరీక్షకు వెళ్లేటప్పుడు విద్యార్థి తనతో తీసుకువెళ్లవల్సినవి:
1) హాల్‌ టికెట్‌
2) నింపిన ‘ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫారం’. దీనిలో ఇంటర్‌ చదివిన కాలేజీ ప్రిన్సిపల్‌తో అటెస్టేషన్‌ చేయించుకొని తీసుకొని వెళ్లాలి.
3) బ్లూ/ నలుపురంగు బాల్‌పెయింట్‌ పెన్నులు-2.
4) ధ్రువీకరించిన కులపత్రం (ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులు కులధ్రువీకరణ నంబరును ఆన్‌లైన్‌లో ఇవ్వకుంటే ఇప్పుడు అదివ్వాలి).

తీసుకువెళ్లకూడనివి:
1) వాచీ
2) కాల్‌క్యులేటర్‌, సెల్‌ఫోన్‌ ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు.
పైన చెప్పిన సర్టిఫికెట్లలో ఏదైనా లేని పక్షంలో ముందురోజు అవి తీసుకోవాలి. ఒకవేళ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫారం పోగొట్టుకొనివుంటే వెబ్‌సైట్‌లో తీసుకోవచ్చు. వేరొక కాపీ తీసుకొని ప్రిన్సిపల్‌సంతకంతో తయారుగా ఉంచుకోవాలి.

ప్రయాణ సమయం బేరీజు
పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో అక్కడికి నిర్ణీత సమయంలో వెళ్ళాలి. అంటే ఎంపీసీ విద్యార్థులు ఉదయం 9 గంటలకు, బైపీసీ విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ప్రయాణానికి పట్టిన సమయాన్ని బేరీజు వేసుకోవడం మేలు. పరీక్షా కేంద్రాన్ని సందర్శించి వెంటనే ఇంటికి చేరుకొని వీలైతే విద్యార్థులు తమ పరీక్ష జరిగే సమయంలో తేలికైన పరీక్ష రాస్తే మంచిది. 160 మార్కులకు 160 తెచ్చుకొనేలా ఉండే ప్రశ్నపత్రాన్ని తీసుకొంటే ఒత్తిడి తగ్గుతుంది. పరీక్ష రాశాక.. చేసిన తప్పులను విశ్లేషించుకొని గుర్తుంచుకోవలసిన అంశాలను నాలుగు గంటలు పునశ్చరణ చేసుకోవాలి. ఒత్తిడి లేకుండా వీలైనంతవరకు ఆహ్లాదంగా ఉంటూ త్వరగా నిద్రకు ఉపక్రమించాలి. తరువాత రోజే తుది పరీక్ష కాబట్టి కొంత ఒత్తిడికి లోనయి నిద్ర రాకపోవచ్చు. అరగ్లాసు గోరువెచ్చని పాలు తాగితే వెంటనే నిద్ర పట్టేస్తుంది. కచ్చితంగా 10 గంటలకు నిద్రపోయేలా ప్రయత్నించాలి. మరుసటిరోజు పరీక్షకు తీసుకువెళ్లవలసిన వాటిని మళ్ళీ జాగ్రత్తగా సరిచూసుకొని నిద్రపోవాలి.

పరీక్ష రోజు

సీనియర్‌ ఇంటర్‌ పూర్తి చేసిన అత్యధిక విద్యార్థులకు ఇది పండుగరోజు. జీవితంలో స్థిరపడటానికి ఉపయోగపడే రోజు కాబట్టి ఇది పండుగ రోజుగానే భావించి తయారవడం మేలు. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పరీక్షా సమయంలో ఇబ్బంది లేకుండా ఉండే వస్త్రాలను ధరించాలి. హాల్‌ టికెట్‌, నింపిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫారంతోపాటు రెండు బాల్‌ పాయింట్‌పెన్నులు, రెండు పెన్సిళ్లు తీసుకోవాలి. అర లీటరు నీటి బాటిల్‌లో గ్లూకోజ్‌ కలిపి దానినీ, ఒక అట్టనూ తీసుకొని బయలుదేరాలి. అట్టను పరీక్ష హాలులో అనుమతించరు కానీ ఒకవేళ పరీక్షా కేంద్రంలో బెంచీలు సరిగా లేనప్పుడు ఉపయోగపడతాయి. అందుకే తీసుకు వెళితే మంచిది. పరీక్ష హాలుకు కనీసం 45 నిముషాలు ముందుగా చేరాలి. ఒక నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించరు. 30 నిమిషాల ముందే తనకు కేటాయించిన సీటుకి చేరుకోవాలి. సీటులో కూర్చోగానే పరిసరాలను అవగాహన చేసుకోవాలి.

సరిచూసుకోవాలి

ఇన్విజిలేటర్‌ ఇచ్చిన ఓఎంఆర్‌ షీట్‌మీద విద్యార్థి పేరు, హాల్‌టికెట్‌ నంబర్‌, ఫొటోగ్రాఫ్‌ ప్రింట్‌ అయి ఉంటాయి. అవి సరిగా ఉన్నాయో లేదా సరిచూసుకొని, నిబంధనలు చూసుకోవాలి. ఈలోపు ప్రశ్నపత్రం కూడా ఇస్తారు. ఆ ప్రశ్నపత్రపు బుక్‌లెట్‌ నంబరు, బుక్‌లెట్‌ కోడ్‌, నామినల్‌ రోల్‌ నంబర్‌లు ఓఎంఆర్‌ షీట్‌పై జాగ్రత్తగా నింపాలి. ఓఎంఆర్‌ షీట్‌ మార్చడం జరగదు, ఒకసారి బబ్లింగ్‌ చేసిన తర్వాత మార్చుకోవడం వీలుకాదు. కాబట్టి జాగ్రత్తగా నింపాలి. షీట్‌ నింపిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూడటానికి ప్రయత్నం చేయకూడదు. బాటిల్‌లోని గ్లూకోజ్‌ నీటిని గ్లాసు తాగి కళ్లు మూసుకొని గాలిని బలంగా పీల్చి వదలాలి. గ్లూకోజ్‌ నీరు తాగడం వల్ల నరాల వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది; డీప్‌ బ్రీతింగ్‌ వల్ల మెదడుకు ఆక్సిజన్‌ అదనంగా అంది ఏకాగ్రత పెరుగుతుంది. ఈ విధంగా మూడు నాలుగు సార్లు గాలి పీల్చుకొని బెల్లు మోగగానే ప్రశ్నపత్రాన్ని చదవటం ప్రారంభించవచ్చు. ప్రశ్నపత్రం తెరవగానే గబగబా జవాబులు గుర్తించడం ప్రారంభించవద్దు. ఒకసారి ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీనీ తిప్పుతూ ప్రశ్నల వరుస సంఖ్య గమనించాలి. ప్రతి పేజీలోనూ ప్రశ్నపత్రపు కోడ్‌ తనకు సంబంధించినదో లేదో గమనించాలి. దీనికి ఒక నిమిషం సమయం కేటాయించినప్పటికీ ఎటువంటి నష్టమూ లేదు. పొరపాటున ఎక్కడైనా ముద్రణ లోపం, ఇంకా ఏమైనా పొరపాట్లు ఉంటే మొదట్లోనే ప్రశ్నపత్రాన్ని మార్చుకునే వీలుంటుంది. ఒకసారి ఆ విధంగా గమనించిన తర్వాత పరీక్ష రాయడం ప్రారంభించాలి.

సులువైనవీ, కష్టమైనవీ

విద్యార్థి గతంలో నమూనా పరీక్షలు రాసేటప్పుడు ఏ క్రమాన్ని అనుసరించాడో అదే వరుసలో పరీక్ష ప్రారంభించడం మేలు. ప్రారంభంలోనే ప్రశ్నపత్రాన్ని రెండుసార్లు చదివేలా ప్రణాళిక వేసుకోవడం మేలు. మొదటిసారి ప్రశ్నలను చదువుతూ తెలిసిన ప్రశ్నలకు అంటే నేరుగా జవాబులు గుర్తించగల ప్రశ్నలను గుర్తిస్తూ పోవాలి. ఆ విధంగా వెళితే మొదటి గంటలో 70 నుంచి 80 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తారు. ప్రశ్నపత్రంలో ఎక్కడ సులభమైన ప్రశ్నలు ఉన్నాయి, ఎక్కడ కష్టంగా ఉన్నాయనేది అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ తనకు తెలిసిన ప్రశ్నల దగ్గరే ఎక్కువ సమయం కేటాయించుకొనే అవకాశం లభిస్తుంది. ప్రశ్నలు చదివేటప్పుడు కొంత ఏకాగ్రత అవసరం. సిద్ధాంతపరమైన ప్రశ్నలలో కరెక్ట్‌, ఇన్‌కరెక్ట్‌ వద్ద ఎక్కువమంది పరీక్ష ఒత్తిడిలో తప్పుగా చదువుకొంటున్నారు. మ్యాచింగ్‌ ప్రశ్నలకు జవాబులు గుర్తించేటప్పుడు నాలుగు మ్యాచింగ్స్‌ చేసి జవాబులు చూడకుండా ప్రతి జవాబునీ వెనుకకు చెక్‌ చేస్తూ వెళితే త్వరగా గుర్తించవచ్చు. Assertion, Reason ప్రశ్నల జవాబులు గుర్తించేటప్పుడు ఎక్కువ తప్పులు చేస్తున్నారు.

* Assertion, Reason ప్రశ్న చదివేటప్పుడు రెండు వాక్యాలు కలిపి చదవవద్దు. తొలిగా మొదటి వాక్యాన్ని చదివి ఆ వ్యాఖ్య సరిఅయినదో కాదో చూడాలి. తర్వాత రెండో వాక్యం సరి అయినదో కాదో చూసుకొని ఇప్పుడు మొదటి వాక్యాన్ని రెండో వాక్యం సమర్థించగలదో లేదో చెప్పాలి.

* భౌతిక, రసాయన శాస్త్రాల్లో Assertion, Reason ప్రశ్నకూ, బోటనీ- జువాలజీలలోని ప్రశ్నకూ తేడా ఉంటుంది. బయాలజీలో ఉదాహరణే విశ్లేషణ కావచ్చు కానీ ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో కాదు.

ప్రశ్నను చదివేటప్పుడు తప్పులు దొర్లకుండా ఉండటానికి ఓ పని చేయవచ్చు. ఓఎంఆర్‌ షీటును ప్రశ్నపత్రంపై ఉంచి ప్రశ్న మాత్రమే కనబడి, జవాబులు కనపడకుండా ఉండేలా షీట్‌ జరుపుతూ చదవాలి. అప్పుడు పొరపాటుగా చదువుకొనే ప్రమాదం ఉండదు. ప్రశ్నలో విద్యార్థిని ఇబ్బంది పెట్టడానికి వాడే పదాలను పెన్సిల్‌తో అండర్‌లైన్‌ చేస్తే తప్పు చేసే అవకాశం ఉండదు.
జవాబులు ఎప్పటికప్పుడు..: ఓఎంఆర్‌ షీటుపై జవాబులు గుర్తించేటప్పుడు కూడా అన్ని ప్రశ్నలకూ ఒకేసారి జవాబులు గుర్తించకుండా ప్రతి ప్రశ్న సమాధానాన్ని వెంటనే ఓఎంఆర్‌ షీట్‌లో గుర్తించాలి. అలా చేయడం వల్ల విద్యార్థులు కొంత సమయం నష్టపోతామని అనుకొంటున్నారు. కానీ మొత్తం ప్రశ్నల సమాధానాలు ఒకేసారి గుర్తించేటప్పుడు పొరపాటున ఒక ప్రశ్న వరుస క్రమం మారితే అన్ని జవాబులూ మారిపోయి మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది.

ప్రతి ప్రశ్నకూ జవాబును వెంటనే గుర్తించే ప్రక్రియలో బబ్లింగ్‌ చేసే సమయం విద్యార్థిని పాత ప్రశ్న నుంచి కొత్త ప్రశ్నలోకి తీసుకుపోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక సబ్జెక్టు అయిపోయిన తర్వాతో ప్రశ్నపత్రం అంతా పూర్తిచేసిన తర్వాతో జవాబులు గుర్తించే పద్ధతి కాకుండా ప్రశ్నకు జవాబును వెంటనే గుర్తించాలి. ప్రతి సబ్జెక్టుకీ నిర్ణీత సమయం నిర్ణయించుకొని ఆ సమయంలో సబ్జెక్టు పూర్తయ్యేటట్లు చూసుకోవాలి. లేదా ఆ నిర్ణీత సమయం తర్వాత వేరొక సబ్జెక్టుకి వెళ్లాలి. కానీ అక్కడే సమయాన్ని వృథా చేయవద్దు. ఏ సబ్జెక్టులో మార్కులు వచ్చినా ప్రాముఖ్యత ఒక్కటే కాబట్టి సులభంగా మార్కులు సాధించే ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయో వాటికి సమయం కేటాయించగలవారే తెలివైన విద్యార్థి! రుణాత్మక మార్కులు లేవు కాబట్టి తెలియని ప్రశ్నలు వదిలివేయవద్దు. పరీక్ష మొత్తం పూర్తిచేసిన తర్వాత జవాబులు గుర్తించని ప్రశ్నలు ఏమున్నాయో చూసుకోవాలి. తొలిగా వాటిలో జవాబులు eliminate చేసే పద్ధతిలో జవాబులు గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇక మిగిలిన ప్రశ్నలన్నిటికీ ఒకే జవాబును గుర్తించడం ద్వారా కొన్ని అయినా సరి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 160 ప్రశ్నల జవాబులు గుర్తించి ఒకసారి మళ్ళీ సరిచూసుకోవాలి. ఓఎంఆర్‌ షీట్‌ను నలపకుండా, సరైన రీతిలో ఇన్విజిలేటర్‌కు ఇచ్చి రావాలి. ఆ మూడు గంటలూ మనసును నియంత్రించుకుని ఏకాగ్రతతో పరీక్ష వ్రాయగలిగితే విజయం లభించినట్టే!

Posted on 24.04.2016