Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Counselling Info

ఏ ర్యాంకు? ఎక్కడ సీటు?

ఉత్తమ కళాశాలలో, ఆశించిన బ్రాంచిలో ఇంజినీరింగ్‌ చదవాలనేది ఎంసెట్‌ అభ్యర్థుల స్వప్నం. కౌన్సెలింగ్‌ త్వరలో ఆరంభం కాబోతోంది. ఈ సందర్భంగా ప్రసిద్ధ కళాశాలల్లో ఏ ర్యాంకు వరకూ సీటు లభిస్తుందో అంచనాలు వేసుకునే తరుణమిది. గత సంవత్సరం ఉభయ రాష్ట్రాల్లో జరిగిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ధోరణులను పరిశీలిస్తే... ఈ ఏడాది స్థూలంగా అవగాహన ఏర్పరుచుకోవచ్చు!

గత ఏడాది నుంచీ తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా ఎంసెట్‌లను నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయ కళాశాలల్లో వివిధ బ్రాంచిలను ఏ ర్యాంకుల వారు ఎంచుకున్నారో గమనిస్తే... ఆ కళాశాలల, బ్రాంచిల ప్రాముఖ్యం గ్రహించవచ్చు.
ఏఐసీటీఈ ఖరారు చేసిన ప్రకారం- ఈ సంవత్సరం తెలంగాణలో 284 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 1,41,178 సీట్లు ఉన్నాయి. వీటిలో 10 ప్రభుత్వ కళాశాలలున్నాయి. ఈ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వటంలో జేఎన్‌టీయూ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సివుంది. కౌన్సెలింగ్‌ సమయానికి 210 కళాశాలల్లో 1.10 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లే మిగులుతాయని ఓ అంచనా.
తెలంగాణలో గత ఏడాది 166 కళాశాలల్లో 1,26,468 సీట్లకు కౌన్సెలింగ్‌ జరిగింది. జేఎన్‌టీయూ తన పరిధిలోని 25 అనుబంధ కళాశాలలకు అప్పుడు గుర్తింపును ఇవ్వలేదు. ఈసారి ప్రత్యేక బృందాలతో తనిఖీ చేయించి, లోపాలపై నోటీసులు జారీచేసింది.
ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే 322 కళాశాలలు, 1,34,440 ఇంజినీరింగ్‌ సీట్లు ఉన్నాయి. వీటిలో 17 ప్రభుత్వ కళాశాలలు - వాటిలో 8,700 సీట్లు ఉన్నాయి.

దేనికి మొగ్గు?

ఎంచుకునేటపుడు విద్యాసంస్థకు ప్రాధాన్యమివ్వాలా? బ్రాంచికి ప్రాధాన్యమివ్వాలా? అనేది ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థుల్లో ఎక్కువమందిని సతమతం చేసే ప్రశ్న. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన బోధనసిబ్బంది, నాణ్యమైన బోధన... వీటితో పాటు ప్రాంగణ నియామకాలు... ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికే ఎక్కువమంది ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇది సహజం కూడా. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు వస్తే ఎవరైనా ఐఐటీలో చేరటానికే ప్రాధాన్యమిస్తారు కదా? అలాగే ఎన్‌ఐటీలో, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు వస్తే ఎన్‌ఐటీలో చేరటానికే మొగ్గు చూపిస్తుంటారు. కాబట్టి అత్యధికుల తొలి ప్రాధాన్యం విద్యాసంస్థకే.
కౌన్సెలింగ్‌లో నచ్చని బ్రాంచి వచ్చినపుడు సంస్థకు ప్రాధాన్యమిస్తుంటారు. ఈ రకంగా తొలి ప్రాధాన్యం సంస్థకూ... తర్వాత ప్రాధాన్యం బ్రాంచికీ ఇవ్వడం సాధారణంగా జరుగుతుంటుంది. బ్రాంచి తీసుకునేటపుడు కూడా పేరున్న బ్రాంచి అని కాకుండా విద్యార్థి తన సామర్థ్యం తెలుసుకుని బ్రాంచిని తీసుకోవడం మంచిదని విద్యారంగ నిపుణుల సూచన.
ఉదాహరణకు భౌతికశాస్త్రంలో సరైన పట్టు లేని విద్యార్థి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిని తీసుకుంటే పోటీలో వెనుకబడే ప్రమాదముంది. ఈ పోటీ ప్రపంచంలో ముందుండాలంటే ఎంపిక చేసుకున్న విభాగంలో అగ్రశ్రేణిలో ఉండాల్సిందే.

అలా ఉండాలంటే ఎంచుకోదగ్గవి...

* ఫిజిక్స్‌లో బాగా పట్టున్న విద్యార్థులు ఈఈఈ, ఈసీఈ లాంటి బ్రాంచీలు
* మేథమేటిక్స్‌లో ఎక్కువ అభిరుచి ఉన్న విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ లాంటి బ్రాంచీలు
* మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో సగటున సమంగా ఉన్న విద్యార్థులు సివిల్‌/ మెకానికల్‌ లాంటి బ్రాంచిలు
ఏ బ్రాంచికి, ఏ కళాశాల సీటుకు ప్రాధాన్యం ఎలా ఉందో గమనించడానికి ప్రభుత్వ కళాశాలల్లో గత సంవత్సరపు కౌన్సెలింగ్‌ తుది ర్యాంకులను ఇస్తున్నాం. (పట్టికలు చూడండి).
తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాల, ఆంధ్ర యూనివర్సిటీలోని కళాశాల, నాగార్జున యూనివర్సిటీలోని కళాశాల, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కళాశాలలు- వీటిలో ఫీజు వ్యత్యాసం తప్పించి మిగిలిన అంశాలు అన్నీ యూనివర్సిటీ కళాశాలల్లానే ఉంటాయి. కాబట్టి సమప్రాధాన్యంతో విద్యార్థులు ఈ కళాశాలలను కూడా ఎంచుకోవచ్చు.
రెండు రాష్ట్రాల్లో జేఎన్‌టీయూ కళాశాలలు హైదరాబాద్‌, కాకినాడ, అనంతపురం తప్పించి మిగిలిన కళాశాలలను ఎంచుకోవడానికి విద్యార్థులు అంతగా సుముఖంగా ఉండటం లేదు. మిగిలిన జేఎన్‌టీయూ కళాశాలలను కూడా ప్రాధాన్య క్రమంలో ఎంచుకుంటే మేలవుతుంది. పాత ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు కూడా ప్రాధాన్యమివ్వటం సరైనదే.
తొలి పది ఇంజినీరింగ్‌ కళాశాలల ఎంపికలో గత సంవత్సరాల ధోరణిలోనే... ఈ ఏడాది కూడా తుది ర్యాంకులు ఉండే అవకాశముంది. విద్యార్థులు మొదటగా ఈ కళాశాలల గురించి సరిగా అవగాహన ఏర్పరచుకోవాలి. కౌన్సెలింగులో తమకు తగిన కళాశాలను ఎంచుకుని విద్యాభ్యాసం చేస్తే మంచి ఇంజినీర్‌గా తయారవటానికి ఆస్కారం ఉంటుంది.



Posted on 23.05.2016