Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Counselling Info

ఏ బ్రాంచికి ఏ ప్రత్యేకత?

ఇంజినీరింగ్‌ విద్యలో వివిధ బ్రాంచిల గురించిన సమాచారం తెలుసుకోవటం ఈ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉపయోగకరం. తమ అభిరుచులకు తగిన బ్రాంచిని ఎంచుకోవటానికి ఇది దోహదపడుతుంది. ఈ వారం కొన్ని ప్రసిద్ధ ఇంజినీరింగ్‌ శాఖలూ, వాటిని చదివితే లభించే భవిష్యదవకాశాల గురించి తెలుసుకుందాం!

విశేష ఆదరణ పొందుతున్న ఈసీఈ
ఇంజినీరింగ్‌ శాఖలన్నింటిలోకి బాగా గిరాకీ ఉన్న శాఖ ఇది. దాదాపు 80 శాతం విద్యార్థులు ఈ కోర్సు చేయడానికి ఆసక్తి చూపుతారు. మానవ జీవన శైలిని అనునిత్యం ప్రభావితం చేస్తున్న శాఖ ఈసీఈ. ప్రైవేటు రంగంలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఉద్యోగావకాశాలు తక్కువే అయినా సాఫ్ట్‌వేర్‌ వంటి ఇతర రంగాలకు మళ్లడం ఈ శాఖ చదివినవారికి సులభం.
వినిమయదారుల జీవన శైలి సులభతరం చెయ్యడంలో ఈసీఈ పాత్ర ఎంతో ఉంది. వాషింగ్‌ మెషిన్‌, ఓవెన్‌, గ్రైండర్‌ వంటి గృహోపకరణాల నుంచి ఉపగ్రహాల వరకు, చివరకు షేవింగ్‌ సెట్‌లలోనూ ఈ రంగం ఉత్పత్తుల ప్రభావం కనిపిస్తుంది. సమాచార వ్యవస్థను అత్యంత ప్రభావితం చేసిన చరవాణి (మొబైల్‌) వ్యవస్థ మానవాళికి ఈ రంగం ఇచ్చిన బహుమతే.
ఈ కోర్సు చేయాలంటే ఇంటర్మీడియట్‌ స్థాయిలో భౌతికశాస్త్రంలోని విద్యుచ్ఛక్తి, అయస్కాంతం, విద్యుదయస్కాంతం, ఆధునిక భౌతిక శాస్త్రం, సెమీ కండక్టర్లు వంటి సబ్జెక్టుల్లో పటిష్ఠమైన పునాది చాలా అవసరం. గణిత శాస్త్రంలోని సంకలనం, వ్యవకలనం ఇంకా తత్సంబంధిత అంశాలు బాగా ఆకళింపు చేసుకుని ఉండాలి.
బీటెక్‌లో ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్స్‌ అండ్‌ డివైజెస్‌, ఎలక్ట్రో మాగ్నెటిక్‌ ఫీల్డ్స్‌, మైక్రో ప్రాసెసర్స్‌, పల్స్‌ అండ్‌ డిజిటల్‌ సర్క్యూట్స్‌ వంటి ముఖ్యమైన మౌలిక సబ్జెక్టులతో పాటు ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వి.ఎల్‌.ఎస్‌.ఐ., మొబైల్‌ కమ్యూనికేషన్స్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ వంటి అత్యాధునికమైన సబ్జెక్టులు విద్యార్థులు చదువుతారు.
ఉన్నత చదువుల విషయానికొస్తే- బీటెక్‌ ఈసీఈ చేసిన విద్యార్థులు ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, ఇంకా కంప్యూటర్స్‌ రంగాల్లోనూ ఎంటెక్‌ చెయ్యవచ్చు. విదేశాల్లోనూ నూతన రంగాల్లో ఎంఎస్‌కి అవకాశాలున్నాయి.
ఉద్యోగావకాశాలు
ఇతర ప్రసిద్ధ బ్రాంచిల కన్నా అవకాశాలు కొద్దిగా తక్కువే అయినా అటు ప్రభుత్వ రంగంలోనూ, ఇటు ప్రైవేటు రంగంలోనూ అవకాశాలున్న రంగం ఇదే. ఈసీఈ ప్రధానంగా ఉద్యోగావకాశాలున్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు.. రక్షణ శాఖ, భారతీయ రైల్వే, భారత ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సి, ఇస్రో, అణు ఇంధన శాఖ, ఈసీఐల్‌, హెచ్‌.ఎ.ఎల్‌ వంటి అగ్రగామి సంస్థలు. ఇక ప్రైవేటు రంగంలో గృహ ఉపకరణాల తయారీ సంస్థలు, టీవీ తయారీ సంస్థలు, మొబైల్‌, టెలిఫోన్‌ తయారీ సంస్థలు మొదలైనవి.

గిరాకీలో అగ్రశ్రేణి... సీఎస్‌ఈ
సమకాలీన సమాజాన్ని అత్యంత ప్రభావ పరిచినశాఖ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ శాఖ. ప్రైవేటు ఉద్యోగాలకు అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఘనత నిస్సందేహంగా ఈ సీఎస్‌ఈకే చెందుతుంది. అత్యంత గిరాకీ ఉన్న శాఖగా మొదటి రెండు స్థానాల కన్నా ఎన్నడూ కిందకు వెళ్లని శాఖ ఇది.
కంప్యూటర్లు ఉపయోగించని రంగం దాదాపు లేదనే చెప్పొచ్చు. కంప్యూటర్లు ప్రపంచ గతినే మార్చగల శక్తి ఉన్నవి. వివిధ రంగాల్లో నూతన అన్వేషణలకు ఈ రంగం దోహదకారిగా ఉపయోగపడుతోంది. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ టెక్నాలజీ రంగంలో తన ముద్ర వెయ్యగలుగుతోంది. త్వరితగతిన దొరికే ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతాలు, త్వరితగతిన పురోగతి, ఎండసోకని ఉద్యోగం, సమాజంలో లభించే గౌరవం, విదేశీ ఉన్నత విద్యకు సులభమైన అవకాశం వంటి అనే కారణాల వల్ల కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో అగ్రశ్రేణిలో వెలుగుతోంది.
బీటెక్‌ చదవాలంటే....
ఈ కోర్సు విజయవంతంగా చెయ్యాలంటే అధ్యాపకులు చెప్పని అంశాల్లో ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలి. తార్కికమైన ఆలోచన, వేగంగా ఆలోచించడం, సృజనాత్మకత, వైవిధ్యమైన ఆలోచనా శక్తి, ఒకే సమస్యకు వివిధ మార్గాల్లో సమాధానాలు రాబట్టడం వంటి స్వీయ సామర్థ్యం ఉండాలి. ఇంటర్మీడియట్‌ స్థాయిలో మాతృకలు, సమితులు, ప్రమేయాలు వంటి సరళ బీజగణిత అంశాలపై మంచి పట్టు సాధించాలి. ఇంకా సంభావ్యత, గణాంక శాస్త్రంలో మంచి నేర్పు ఉండాలి.
కంప్యూటర్‌ నిర్మాణం, క్రమసూత్ర పద్ధతుల రచన, విశ్లేషణ, సీ, జావా, డీబీఏమ్‌ఎస్‌ వంటివి మౌలిక సబ్జెక్టులు. వెబ్‌ టెక్నాలజీస్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌, సమాచార భద్రత వంటి ముఖ్యమైన సబ్జెక్టులు చదువుతారు. వీటితోపాటు శాస్త్రీయ పద్ధతిలో కంప్యూటర్‌ ప్రోగ్రాములు రచన చేసి మెలకువలు నేర్చుకుంటారు. అయితే ప్రతి క్షణం నూతన ఆవిష్కరణలతో ఎన్నో కొత్త మార్పులకు కేంద్రమైన ఈ శాఖలో రాణించాలంటే నిత్య విద్యార్థిగా ఉండటం తప్పనిసరి.
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, డాటా అనలిస్ట్‌, డాటా సైంటిస్ట్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, డాటా బేస్‌ అడ్మినిస్ట్రేటర్‌, టెస్టర్‌ వంటి ఉన్నత మధ్య శ్రేణి ఉద్యోగాలతో పాటు వినియోగదారుడి కేంద్రమైన బీపీఓ, కేపీఓ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అయితే అవసరాలకు అనుగుణంగా మెలకువలు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు లభ్యమవడం లేదు. ప్రయోగాలు ప్రతి నిత్యం చేస్తూ కొన్ని ప్రాజెక్టులు చేసి, అనుభవం సంపాదించటం, పరిశ్రమల అంచనాలకు తగిన విధంగా సంసిద్ధులవటం చేస్తే విద్యార్థుల పురోగతికి ఈ శాఖలో ఆకాశమే హద్దు!

అవకాశాల గని: ఐటీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)
సాంకేతిక రంగంలో వస్తున్న వివిధ కొత్త ఆవిష్కరణల ఫలితం కంప్యూటర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలైతే, ఆ ఆవిష్కరణల ఫలం సామాన్య ప్రజలు ఉపయోగార్థం ప్రభవించిన సరికొత్త రంగం ఐటీ రంగం. ప్రోగ్రామింగ్‌ మెలకువలు, హార్డ్‌వేర్‌లో ప్రవేశం, వివిధ రకాల వ్యవస్థల పట్ల అవగాహనలను మిళితం చేసి పరిశ్రమల, సార్వజనీన సౌలభ్యం కోసం కంప్యూటరీకరణను అమలుపరిచేది ఐటీ.
ఈ రంగం స్వల్పకాలంలోనే గుర్తింపు పొందింది. ఈనాడు జనం ఉపయోగిస్తున్న ఈ-సేవ వసతులు, సులభతరమైన బస్సు, రైల్వే, విమాన ప్రయాణాలకు అనుకూలించే రిజర్వేషన్‌ వ్యవస్థ, ఆన్లైన్‌ క్రయ విక్రయాలు, సింగిల్‌ విండో పద్ధతుల సహకారంతో అందుకుంటున్న సేవలన్నీ కూడా ఐటీ రంగం చలవే. భారీ సంఖ్యలో వివిధ స్థాయుల్లో ఉద్యోగావకాశాల లభ్యత కూడా ఈ రంగం వల్లనేననేది నిర్వివాదాంశం.
అంతేకాకుండా స్వయం ఉపాధికి కూడా ఎక్కువ అవకాశాలున్నది ఈ రంగం. మాంద్యం వలన కొంతకాలం మందగించినా తిరిగి పుంజుకుని నిలదొక్కుకుంటూ సి.ఎస్‌.ఇ.కి ప్రత్యామ్నాయంగా పూర్వ వైభవాన్ని పొందే ప్రయత్నం చేస్తోందీ శాఖ.
నాలుగేళ్ల బీటెక్‌ వ్యవధిలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లోని సబ్టెక్టులతో పాటు ఎలక్ట్రానిక్స్‌ రంగానికి ఎందిన కొన్ని ముఖ్యమైన సబ్టెక్టులను, ఇంకా అంతర్జాల వ్యవస్థ, ఇ-వాణిజ్య వ్యవస్థకు సంబంధించిన సబ్టెక్టులను విద్యార్థులు చదువుతారు.
సమాచార సేకరణ, నిర్వహణ, నియంత్రణ, భద్రత, వినిమయం వంటి సున్నితమైన, ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలంటే, సమాచార నిర్వహణ నిపుణులుగా విద్యార్థులను మలచడంలో ఈ శాఖ సేవలు అపారం. బి.టెక్‌లో విద్యార్థులు ప్రత్యేకించి జాల విజ్ఞానం (వెబ్‌ టెక్నాలజీ) ఇ-కామర్స్‌, డాటా మైనింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ వంటి సబ్జెక్టులు చదువుతారు.
అర్హతలు
ఇంటర్‌ స్థాయిలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం చదివి ఉండాలి. ఈ సబ్బెక్టును సులుభంగా ఆకళింపు చేసుకోవాలంటే కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ వారికి అవసరమైనట్టే గణితంపై మంచి పట్టు ఉండాలి. దీనికి తోడు తార్కికమైన ఆలోచనా విధానం చాలా అవసరం.
ఉద్యోగావకాశాలు
జటిలమైన సమస్యలకు సరళమైన సమాధానాలు కనుక్కుని వాటిని సామాన్య జనం ఉపయోగించేలా కంప్యూటర్‌ ఆధారిత సేవలను పెంపొందించడం వీరి ప్రధాన వృత్తి. అందువల్ల వీరికి వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ. జీతాలు కూడా ఒకప్పటిలాగా కాకపోయినా బాగానే ఉంటున్నాయి. ప్రతిభతో స్వల్పకాలంలోనే ఆర్థికంగా, వృత్తి పరంగా, నైపుణ్యాల పరంగా అభివృద్ధికి ఆస్కారం ఉన్న శాఖ ఇది. వెబ్‌ డెవలపర్‌, సమాచార భద్రత అధికారి, సమాచార నిర్వహణ అధికారి, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంజినీర్‌గా వీరికి ఉద్యోగావకాశాలుంటాయి.
ఉన్నత విద్య అవకాశాలు
మనదేశంలోనూ, విదేశాలలోనూ కూడా ఎం.టెక్‌, ఎంఎస్‌కి చాలా అవకాశాలున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌; ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వెబ్‌ టెక్నాలజీస్‌, ఇంటర్నెట్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ వంటి ఎన్నో సరికొత్త కోర్సుల్లో ఎంటెక్‌/ ఎంఎస్‌ చేసే అవకాశాలున్నాయి. ప్రత్యామ్నాయంగా ఆసక్తి ఉన్నవారు ఎంబీఏ కూడా చెయ్యవచ్చు. డేటాబేస్‌ రంగంలో నైపుణ్యం పెంచుకుని సమాచార నిర్వాహకులుగా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు.

Posted on 20.06.2016