Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Counselling Info

కెమికల్‌, బయోటెక్‌...ప్రత్యేకతలు ఇవీ!

ఇంజినీరింగ్‌ విద్యలో వివిధ బ్రాంచిల సమాచారం తెలుసుకోవటం ఈ రంగంలోకి రాదల్చిన విద్యార్థులకు ఉపయోగకరం. ఈ వారం రెండు ప్రసిద్ధ ఇంజినీరింగ్‌ శాఖలూ, వాటి భవిష్యదవకాశాల గురించి తెలుసుకుందాం!

నూతనత్వానికి వీలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌
కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖల పట్ల పెరిగిన మోజులో గుర్తింపు కొరవడి అనాదరణకు గురైన శాఖల్లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఒకటి. టీవీ చిత్రాల్లో, ప్రకటనల్లో వ్యోమగాముల, అంతరిక్ష యాత్రికుల చిత్రీకరణ చాలా చూస్తాము. కానీ కెమికల్‌ ఇంజినీర్ల మీద చిత్రాలు బహుశా లేవనే చెప్పాలి. ఐతే సంఖ్యాపరంగా దేశానికి అవసరమైన వ్యోమగాముల కన్నా కెమికల్‌ ఇంజినీర్ల అవసరం ఎన్నో రెట్లు ఎక్కువ. నూతనత్వానికీ, సృజనాత్మకతకూ అవకాశం ఉన్న ఈ శాఖ గురించి విద్యార్థులు తెలుసుకోవాలి.రసాయనిక శాస్త్రవేత్త నూతన ఔషధాన్ని సృష్టించి, చిన్న మోతాదులో ఉత్పత్తి చేస్తాడు. దాన్ని వివిధ రకాలుగా పరీక్షించి దాన్నుంచి ఆశించిన ఫలితాలను ధ్రువీకరించినమీదట కెమికల్‌ ఇంజినీర్‌ పాత్ర మొదలౌతుంది. పరిశ్రమ భారీ మోతాదులో ఈ ఔషధాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు తక్కువ ఖర్చులో, సరళమైన రీతిలో భారీ మోతాదులో ఎలా ఉత్పత్తి చెయ్యవచ్చు, ఔషధ లక్షణాలకు భంగం వాటిల్లకుండా వివిధ పీడన, ఉష్ణ స్థితుల్లో ప్రయోగాలు చేసి ఎటువంటి పరిస్థితులలో ఉత్పత్తి చేస్తే ఫలితాలు ఉంటాయి అనేది కెమికల్‌ ఇంజినీర్లు నిర్ణయిస్తారు.
ఈ కోర్సు చదివేవారికి...
ఇంటర్‌ స్థాయిలో గణితం, రసాయనిక శాస్త్రాల్లో మంచి పట్టు ఉండాలి. వివిధ రసాయనిక సూత్రాలు, వాటి సమ్మేళన ప్రక్రియలు బాగా వచ్చివుండాలి. అణు జీవశాస్త్రం, డి.ఎన్‌.ఎ. జన్యు సంబంధ సూత్రావళి లేదా జన్యు సూత్రావళి (జెనెటిక్‌ కోడ్‌) పట్ల అవగాహన అవసరం. వీరు బృందాల్లో పని చెయ్యవలసి ఉన్నందున స్పష్టమైన భావ వ్యక్తీకరణ, మంచి రచనా పటిమ కూడా అవసరమౌతాయి.
బీటెక్‌లో ఏమి చదువుతారు?
ఇంటర్‌లో చదువుకున్న ఉష్ణ స్థానాంతరణం (హీట్‌ ట్రాన్స్‌ఫర్‌), ద్రవ్య వాహనాంతరణం, ద్రవ ప్రవాహం వంటి సబ్జెక్టుల జ్ఞానాన్ని ప్రయోగించి వివిధ రసాయనాల ప్రవర్తనల పట్ల అవగాహన ఏర్పరచుకుంటారు. ఇంజినీరింగ్‌లో గణితంలో కలన గణితం, ప్రక్రియ సూత్రాలు, బహుచర రాశి కలన గణితం, ఉష్ణగతిక శాస్త్ర నియమం, రసాయనిక శాస్త్రం, ఇంజినీరింగ్‌ నమూనా, సిమ్యులేషన్‌, ఇంజినీరింగ్‌ పరిశోధన, గణాంక విశ్లేషణ, ప్రతిచర్య ఇంజినీరింగ్‌, వాహనాంతరణా దృగ్విషయం వంటి కెమికల్‌ ఇంజినీరింగ్‌కి అవసరమైన సబ్జెక్టులు చదువుతారు. ప్రాజెక్టులు చాలా ప్రాముఖ్యం వహిస్తాయి.
ఉద్యోగావకాశాలు
కెమికల్‌ ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలు బాగానే ఉంటాయి. దీర్ఘ కాలంలో ఆకర్షణీయమైన జీతాలకు అవకాశాలు అధికం. ఒ.ఎన్‌.జి.సి., రిలయన్స్‌, గ్యాస్‌ తయారీ, రసాయనిక ఎరువుల కంపెనీలు, పరిశోధన సంస్థలు, ఔషధ తయారీ కంపెనీల్లో కెమికల్‌ ఇంజినీర్‌, ఎనర్జీ ఇంజినీర్‌, పెట్రోలియం ఇంజినీర్‌, ఉత్పత్తి అభివృద్ధి శాస్త్రజ్ఞులు, అనలిటికల్‌ కెమిస్ట్‌, మెటీరియల్స్‌ ఇంజనీర్‌ వంటి ఉద్యోగాలు దొరుకుతాయి.
మనదేశంలోనూ, విదేశాల్లోనూ పి.హెచ్‌.డి., పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలో స్థాయి వరకు ఉన్నత చదువులకు ఆస్కారం ఉంది.
మేటి భవితకు చిరునామా: బయోటెక్నాలజీ
జీవశాస్త్రం, ఇంజనీరింగ్‌ టెక్నాలజి రంగాల సంయోజన శాఖగా, అధిక అంతర సబ్జెక్టు సంబంధిత శాఖగా బయో టెక్నాలజీ ఇంజినీరింగ్‌కి పేరు. ప్రాణి, జీవ వ్యవస్థలను ప్రయోగాత్మక మార్పులకు గురిచేసి ఆరోగ్య పరిరక్షణ, వైద్యం, వ్యవసాయం, ఆహారం, ఔషధీయ, పర్యావరణ నియంత్రణలలో పురోగతి సాధించడం ఈ శాఖ ముఖ్య లక్ష్యం.
జీవశాస్త్ర ప్రక్రియ, పారిశ్రామిక ప్రక్రియ అనే రెండు ప్రధాన వర్గాలుగా ఈ శాఖను విభజించవచ్చు. మొదటిదైన జీవశాస్త్ర ప్రక్రియ విభాగంలో వివిధ రుగ్మతల చికిత్స, వ్యవసాయరంగంలో అభివృద్ధి, నాణ్యమైన ఆహార ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ ఇత్యాది లక్ష్యాలుంటాయి. వీటిని సాధించేందుకు సూక్ష్మజీవ, కణ, జన్యు, అణుజీవ శాస్త్ర రంగాల్లో అవసరమైన పరిశోధన, అభివృద్ధుల అధ్యయనం జరుగుతుంది. అధిక శాతం ఈ ప్రక్రియ ప్రయోగశాలలో జరుగుతుంది.ఇక రెండోదైన పారిశ్రామిక ప్రక్రియ జీవ రసాయన ప్రక్రియలు, సాంకేతిక ప్రక్రియలను ఉపయోగించి మందులు, టీకాలు, జీవ ఇంధనాలు, ఔషధీయాల పరిశ్రమల స్థాయిలో ఉత్పత్తి పద్ధతుల అధ్యయనానికి ఉపయోగపడుతుంది. జన్యు పరంపర సాంకేతిక శాస్త్రం (genome technology), రసాయన క్రిమిసంహారకాలకు ప్రాకృతిక, సహజ ప్రత్యామ్నాయాలు, జీవ ఇంధనవనరుల ఆవిష్కరణ, మూలకణ సాంకేతిక శాస్త్రం... ఈ రంగంలో జరిగిన నవ్య పరిశోధనల ఫలితంగా మానవుడు సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చు.
బయోటెక్‌ ఇంజినీరింగ్‌ చదవాలంటే...
బయోటెక్‌ ఇంజినీరింగ్‌ శాఖలో ప్రవేశం కోసం ఇంటర్‌ స్థాయిలో భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రంతో పాటు గణితం చదివినవారూ; లేదా ఈ రెండింటితో జీవశాస్త్రం చదివినవారూ అర్హులు. రెండు గ్రూపులకూ సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లోనూ మౌలికాంశాలలో ఒక స్థాయి వరకు ప్రవేశం ఉండాలి. ప్రత్యేకించి గణితంలో కలన గణితం, సరళ బీజగణితం సునాయాసంగా చెయ్యగలగాలి. జీవశాస్త్రం వారికి మౌలికాంశాలపై మంచి నైపుణ్యం సంపాదించాలి.
ఎం.పి.సి. స్రవంతితో బయోటెక్‌ ఇంజినీరింగ్‌ చేరే విద్యార్థులు ప్రధానంగా పారిశ్రామిక ప్రక్రియలకు సంబంధించిన సబ్జెక్టులు చదువుతారు. బై.పి.సి. చదివినవారు జీవశాస్త్ర సంబంధితమైన ఔషధాల సూత్రీకరణ, అనుకరణ, నిర్మాణం, నమూనీకరణ, చిన్న మోతాదులో ఉత్పత్తి పరీక్ష వంటి ప్రక్రియలకు సంబంధించిన పాఠ్యాంశాలు చదువుతారు.
బయో టెక్నాలజిలో బీటెక్‌ చదివే విద్యార్థులు జీవశాస్త్రానికి, ఇంజినీరింగ్‌ మెలకువలకు సంబంధించిన సబ్జెక్టులు చదువుతారు. జీవశాస్త్రానికి సంబంధించిన అణు జీవశాస్త్రం, జన్యు శాస్త్రం, కణ జీవ శాస్త్రం వంటి సబ్జెక్టులతో పాటు ఇంజినీరింగ్‌ మెలకువలకు సంబంధించిన జీవప్రక్రియ ఇంజనీరింగ్‌ (బయో ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌), జీవరసాయన ఇంజినీరింగ్‌ (బయోకెమికల్‌ ఇంజినీరింగ్‌), ఉష్టగతిక శాస్త్ర నిర్ణయం (థర్మో డైనమిక్స్‌), ద్రవ్య స్థానాంతరణం (మాస్‌ ట్రాన్స్‌ఫర్‌) మొదలైన సబ్బెక్టులు చదవాల్సి ఉంటుంది.
ఉద్యోగావకాశాలు
ఈ రంగం మనదేశంలో ఇంకా బాల్యదశలోనే ఉందని తెలుసుకోవాలి. కాబట్టి ఇతర రంగాలతో పోలిస్తే ఉద్యోగాల సంఖ్య, పారితోషికాలు కూడా ప్రారంభంలో తక్కువగానే ఉండే అవకాశాలుంటాయి. ఐతే కాలక్రమేణా దీర్ఘకాల వ్యవధిలో పారితోషికం గణనీయంగా పెరుగుతుంది.
బయోటెక్నాలజిలో బీటెక్‌ చేసినవారికి ఔషధీయ రంగంలో, పరిశోధన సంస్థలలో ఉద్యోగావకాశాలుంటాయి. ఈ రంగంలో పరిశోధనకు ఎంతో ఆస్కారం ఉన్నందున ఎక్కువమంది రీసెర్చ్‌ చెయ్యడానికి ఉన్నత విద్యలకు విదేశాలు వెళుతుంటారు. ఆసక్తి ఉన్న కొందరు ఎం.బి.ఎ. కూడా చేసుకోవచ్చు. మరికొందరు సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణిస్తున్నారు.
ప్రాంగణ నియామకాల కోసం ఈ రంగానికి సంబంధించిన సంస్థలు రావడం కొంత తక్కువే. కానీ సమీప భవిష్యత్తులో బయోటెక్నాలజీ... అత్యధిక ఉద్యోగావకాశాలకు వీలుకల్పించే రంగంగా ఎదుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Posted on 27.06.2016