Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Counselling Info

మూడు బ్రాంచిలూ...మౌలికాంశాలూ!

ఇంజినీరింగ్‌ బ్రాంచిల్లో దేని ప్రాముఖ్యం దానిది. విద్యార్థులు అన్నిటి గురించి ప్రాథమికంగా తెలుసుకోవాలి. తన అభిరుచికి తగ్గ బ్రాంచిని అప్పుడు సరిగా ఎంచుకోవటానికి వీలవుతుంది. ఈ సంచికలో మూడు ఇంజినీరింగ్‌ బ్రాంచిల విశేషాలు తెలుసుకుందాం!

ఉపాధికి అవకాశాలు: ఇన్‌స్ట్రుమెంటేషన్‌
మనిషి నాగరిక ప్రస్థానంలో నిరంతరం నూతన ఆవిష్కరణలకూ, నవ్యతకూ ప్రాముఖ్యమిస్తూ సరికొత్త పరికరాలను కనుక్కునే ప్రయత్నం చేస్తుంటాడు. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో వివిధ పరికరాలు ఎంతగా వినియోగపడుతున్నాయో అందరికీ తెలుసు. ఈరోజుల్లో పరికరాలు, పనిముట్లు మానవజీవితంలో అంతర్భాగాలైపోయాయి. యంత్రాల వివిధ అవసరాలకు పనికొచ్చే పరికరాల రచన, అభివృద్ధి, తయారీ, ప్రతిష్ఠాపన, నిర్వహణ లాంటివి ఇన్‌స్ట్రుమెంట్‌ ఇంజినీర్ల విధులుగా ఉంటాయి.ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అంటే... మాన్యుఫాక్చరింగ్‌ రంగంలోని వివిధ ప్రక్రియల్లోని అంశాల కొలత, నియంత్రణలకు సంబంధించిన కళ, విజ్ఞానం. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో అంతర్భాగంగా ఉండి ప్రత్యేక శాఖ స్థాయిగా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ ఎదిగింది. దీంతో ఈ రంగంలో ఎన్నో కొత్త ఉపాధి అవకాశాలు కలిగాయి. ఈ శాఖ కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ విభాగాల సమ్మిళితమైన శాఖ. దాదాపు అన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇంకా బిట్స్‌ లాంటి ప్రముఖ విద్యాసంస్థలు బీటెక్‌ స్థాయిలో ఈ కోర్సును అందిస్తున్నాయి.
ఈ కోర్సు చదవాలంటే భౌతికశాస్త్రంలోని ఇంచుమించు అన్ని అధ్యాయాలూ బాగా నేర్చుకునివుండాలి. దీంతోపాటు రసాయనిక శాస్త్రం, గణితశాస్త్రంలో కూడా మంచి మెలకువలు అవసరం.
ఇంజినీరింగ్‌లో...
మౌలిక సబ్జెక్టులైన సిస్టమ్‌ డైనమిక్స్‌, ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ప్రక్రియల నియంత్రణ, అనలిటికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, బయోమెడికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ వంటి సబ్జెక్టులతో పాటు రోబోటిక్స్‌, మైక్రో ప్రాసెసర్స్‌, మైక్రో కంట్రోలర్స్‌, వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌లాంటి ఎలక్ట్రానిక్స్‌ రంగానికి చెందిన సబ్జెక్టులు, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ శాఖకు సంబంధించిన ప్రోగ్రామింగ్‌ మెలకువలు, కంప్యూటర్‌ నిర్మాణ వ్యవస్థ, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ వంటివి కూడా అభ్యసిస్తారు.
ఉన్నత విద్యకు సంబంధించి...ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో పాటు ఎలక్ట్రానిక్స్‌ శాఖలో ఎంటెక్‌, ఎంఎస్‌లకు ఎన్నో అవకాశాలున్నాయి.
ఉద్యోగావకాశాలు
ఇనుము, ఉక్కు, రసాయనిక, ఎరువులు, సిమెంట్‌, చక్కెర, కాగితం, చమురు, విద్యుదుత్పత్తి, విద్యుత్‌ సరఫరా మొదలైన కర్మాగారాల్లో, సంస్థల్లో వివిధ రకాల యాంత్రీకరణ పద్ధతుల్లో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్ల అవసరం ఎంతో ఉంది. త్వరితగతిన ఉపాధి, సత్వర పురోభివృద్ధి విరివిగా ఉండే రంగమిది. విమానయానం, అంతరిక్ష శాస్త్రం, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లోనూ వీరికి అవకాశాలున్నాయి.
భారత ప్రభుత్వ ‘మేకిన్‌ ఇండియా’ చొరవతో ఈ రంగంలో అత్యధిక పెట్టుబడులకు ఆస్కారం ఉందని ఒక అంచనా. కెరియర్‌ ఆరంభంలో జీతం కొంత తక్కువే అయినా స్వల్పకాలంలోనే ఆకర్షణీయమైన జీతాలకు వీలుంది. కొంత అనుభవం మీదట స్వతంత్రంగా పరికరాల పంపిణీ, తయారీ, మరమ్మతు సంస్థలను స్థాపించి నిర్వహించవచ్చు.

ఆర్థిక ప్రగతి సూచి: మెటలర్జీ అండ్‌ మెటీరియల్‌సైన్స్‌
మానవ నాగరిక చరిత్రలోని వివిధ పరిణామాలను మంచుయుగం, రాతియుగం, లోహ యుగం, ధాతుయుగం అని సంబోధించడంలో వివిధ పదార్థాల ప్రభావం, వాటి ప్రాముఖ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అంతర్భాగాలుగా ఉండి, పరిశోధనల ఫలితంగా స్వయంప్రకాశాలుగా ఎన్నో శాఖలు వెలుగుతున్నాయి. మెకాట్రానిక్స్‌, మెటలర్జీ, నానో టెక్నాలజీ లాంటి ఈ శాఖలకు తలమానికమైనది మెటలర్జీ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌.
అన్ని ఐఐటీలూ, ప్రతి ఎన్‌ఐటీ, ఇంకా అనేక ఇతర విశ్వవిద్యాలయాలూ ఈ శాఖలో నాలుగేళ్ళ ఇంజినీరింగ్‌ కోర్సును అందిస్తున్నాయి. దేశ ఆర్థిక పురోగతికి అవసరమైన ఉత్పాదక రంగంలో ఈ శాఖకు చెందిన కొన్ని పదుల వందల సంఖ్యలో చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు సేవలందిస్తున్నాయి.ఉపాధికీ, ఉన్నత విద్యకూ, పరిశోధనకూ అవకాశాలున్నా కొన్ని అపోహల వల్ల ఆదరణ పొందని శాఖ ఇది. అత్యధిక పరిశోధనలు జరుగుతున్న ఈ రంగంలో నిష్ణాతుల కొరత తీవ్రంగా ఇబ్బంది కలిగించే విషయం. అమెరికాలాంటి దేశాల్లో మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌ ఇంజినీర్లు అత్యధిక పారితోషికం పుచ్చుకునే ఉద్యోగాల పట్టికలో కంప్యూటర్‌ సైన్స్‌ నిపుణులకన్నా పై స్థాయిలో ఐదో స్థానంలో ఉన్నారు. ఇదీ ఈ శాఖకున్న ప్రాముఖ్యం.
బీటెక్‌ చేయాలంటే... ఇంటర్మీడియట్‌ స్థాయిలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రంలో సమపాళ్ళలో ప్రావీణ్యం అవసరం. రసాయనిక శాస్త్రంలోని ధాతుశాస్త్రంపై మంచి అవగాహన ఉండాలి. వివిధ మూలకాల భౌతిక రసాయనిక గుణాల గురించి బాగా తెలిసివుండాలి. వివిధ రకాల అకర్బన రసాయన సూత్రాల, రసాయనిక చర్యల పట్ల అవగాహన అవసరం.
మన దైనందిన జీవనశైలిని ప్రభావితం చేసే పరిశోధనలకు ఈ బ్రాంచిలో అవకాశముంటుంది. అందుకే దీనిలో ఉన్నతవిద్యకు ప్రాముఖ్యం. ఆకర్షణీయమైన ద్రవ్యాలు, నానో టెక్నాలజీ, సూక్ష్మ లఘు ద్రవ్య ఉత్పత్తి వంటి రంగాల్లో పరిశోధనలు చురుగ్గా సాగుతున్నాయి.
ఉద్యోగావకాశాలు
ప్రతిభావంతులకు ఇంచుమించు డిగ్రీ ముగిసిన కొద్దికాలంలోనే ఉద్యోగం దొరుకుతుంది. అయితే బీటెక్‌తో ఆగకుండా ఎంటెక్‌ గానీ, పీహెచ్‌డీ గానీ చేస్తే పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో వీరికి ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి. ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న ఇనుము, ఉక్కు, ఇతర ఖనిజ ఉత్పత్తి, శుద్ధి సంస్థల్లో ఇంజినీర్లుగా, సూపర్‌వైజర్లుగా, ఫోర్‌మన్లుగా ఉద్యోగాలు లభిస్తాయి. లోహ, లోహేతర గనుల శాఖల సంస్థల్లో కూడా ఉపాధికి వీలుంది.

బహుముఖ పరిజ్ఞానం: ఫార్మాస్యూటికల్‌
హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఔషధ, రసాయనిక పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉన్నాయి. మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయి. వీటి అవసరాలను గుర్తించి, రెండు పరిశ్రమల్లోనూ పనిచేయగల నైపుణ్యాలను అందించే నవీన బ్రాంచి.. ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌. ఈ ఇంటర్‌డిసిప్లినరీ బ్రాంచిలో ఫార్మసీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌ పాఠ్యాంశాలుగా ఉంటాయి.
ఈ రోజుల్లో ఔషధాలు, బల్క్‌డ్రగ్‌, రసాయన, ఆహార, పాడి, సౌందర్య సాధనాలు, ఇతర ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదివితే ప్రాజెక్టు ఇంజినీర్లు, ఉత్పత్తి ఇంజినీర్లు, డిజైన్‌ ఇంజినీర్లు, భద్రత-నిర్వహణ ఇంజినీర్లు, పర్యావరణ, పరిశోధన శాస్త్రజ్ఞులుగా భవిష్యత్తును మల్చుకోవటానికి అవకాశం ఉంటుంది.ఔషధ పరిశ్రమల్లో ఫార్మా ఇంజినీర్లకు బాగా గిరాకీ ఉంది. కెమికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు ద్వారా కెమికల్‌ ఇంజినీర్లు, ఉత్పత్తి ఇంజినీర్లు, డిజైన్‌ ఇంజినీర్లు రసాయన పరిశోధన కార్యాచరణ అంశాల విధులను నిర్వర్తించగలరు. వీరికి ఫార్మసీ, సైన్స్‌ సంబంధిత మందుల తయారీకీ, ఉత్పత్తికీ, వాటిని అభివృద్ధిపరిచేందుకూ తగినంత పరిజ్ఞానం ఉండదు.
ఫార్మసీ కోర్సులు అభ్యసించినవారికి ఫార్మసీ మందులు, సైన్స్‌ సంబంధిత ఔషధాల తయారీ, పరిశోధనల్లో అనుభవం ఉంటుంది. డిజైనింగ్‌, రసాయన పరిశోధన ఉత్పత్తి మొదలైన అంశాలపై పూర్తి అవగాహన ఉండదు.
ఈ కారణంతో ఔషధ, రసాయనిక పరిశ్రమలు... ఫార్మసీ, కెమికల్‌ ఈ రెండు విభాగాలకూ గ్రాడ్యుయేట్లను వేర్వేరుగా నియమించుకోవాల్సి వస్తుంటుంది. దీన్ని అధిగమించటానికి రూపొందిన బ్రాంచి ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌. ఈ ఇంజినీర్లు డిజైన్‌, ఉత్పత్తి, నిర్మాణం, విలువైన ఔషధాలు, ఔషధ చికిత్సలకూ, రసాయన, పరిశ్రమల్లో పరిశోధనలకూ ఉపయోగపడతారు.
దేశంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మొదటిసారిగా 2015-16 విద్యాసంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టిన కళాశాల... మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఉన్న బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ. 1997లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ను ప్రవేశపెట్టిన ఈ కళాశాల ఆ విభాగానికి అనుబంధ కోర్సుగా ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ను ప్రవేశపెట్టింది. ఈ కోర్సు కొన్ని పరిమిత కళాశాలల్లో అందుబాటులో ఉంది. ‘ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ పేరుతో ముంబయిలోని కెమికల్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఐసీటీ) దీన్ని అందిస్తోంది. అన్నా విశ్వవిద్యాలయం (చెన్నై), డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరఠ్వాడా విశ్వవిద్యాలయం (ఔరంగాబాద్‌)లలో ఈ కోర్సు ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ పేరుతో లభిస్తోంది.
దీన్ని చదివినవారు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఫార్మా, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కోర్సుల్లో ఉన్నత విద్యలను అభ్యసించడానికి అవకాశాలున్నాయి.

Posted on 05.07.2016