Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Counselling Info

మెడికల్‌ కౌన్సెలింగ్‌కు సిద్ధం కండి!

ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఈ ఏడాది కొత్తగా వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ ప్రారంభం కాబోతోంది. సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్‌ ఖరారయింది. ఆంధ్రా, ఎస్వీయూ పరిధిలో అందుబాటులో ఉన్న వైద్య, దంత కళాశాలల్లో కన్వీనర్‌, యాజమాన్య కోటా సీట్లు వెల్లడయ్యాయి. ఈనెల 12 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ఆన్‌లైన్‌ కేంద్రాలకు వెళ్లే వెసులుబాటు కల్పించారు.

ఆంధ్రా ఎంసెట్‌ ర్యాంకులు ఇప్పటికే ప్రకటించారు. మెరిట్‌ కార్డుల్లో ప్రకటించిన లోకల్‌ ఏరియా ర్యాంకులు కాకుండా ఓవరాల్‌ ర్యాంకుల ఆధారంగానే కౌన్సెలింగ్‌ చేపడతారు. భారతీయ వైద్యమండలి నిర్దేశకాల ప్రకారం ఆగస్టు ఒకటో తేదీ నుంచి వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తరగుతులు ప్రారంభం కావల్సిఉంది.ఏపీ ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా మెరిట్‌ ఆర్డరు ప్రకారం నిర్వహించే కౌన్సెలింగుకు అభ్యర్థులు హైదరాబాద్‌ జేఎన్‌టీయూ (కూకట్‌పల్లి), విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం క్యాంపస్‌, తిరుపతి ఎస్వీయూలోని పాత ఎంబీఎ భవనం, విజయవాడడాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కేంద్రాల్లో ఎక్కడైనా హాజరుకావచ్చు.
వయసు నిబంధన: భారతీయ వైద్యమండలి మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు 31.12.2016 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే 02.01.2000 తర్వాత జన్మించిన అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు అనుమతించరు.
విద్యార్హతలివీ: అభ్యర్థులు ఏపీ ఎంసెట్‌-2016 ప్రవేశ పరీక్షలో తప్పక అర్హత సాధించినవారై ఉండాలి. విద్యార్హతల్లో ఓసీ కేటగిరీ అభ్యర్థులు ఎంసెట్‌లో 50 శాతం (80 మార్కులు), బీసీ/ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 40శాతం (64 మార్కులు), ఓసీ వికలాంగులకు 45 శాతం (72 మార్కులు) తెచ్చుకునివుండాలి. వీరికే కౌన్సెలింగ్‌కు అనుమతి ఇస్తారు. ఇదే శాతాల్లో ఇంటర్లోనూ మార్కులు రావల్సిఉంటుంది.
జీవో నెంబరు 42 ప్రకారం అన్‌ రిజర్వుడు సీట్లకు ముందు కౌన్సెలింగ్‌ చేపట్టిన అనంతరం లోకల్‌ ఏరియా సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ప్రత్యేక కేటగిరీ స్పోర్ట్సు, గేమ్స్‌-(0.5శాతం)ఆర్మీ సంతతి (1శాతం), ఎన్‌సీసీ(1శాతం), పోలీస్‌ అమరవీరుల సంతతి-(0.25శాతం), ఆంగ్లో ఇండియన్‌ కేటగిరీ( 1 ఎంబీబీఎస్‌ సీటు, 1 బీడీఎస్‌ సీటు), వికలాంగులు కేటగిరీ (3శాతం) అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.

ఏ ధ్రువీకరణ పత్రాలు?
కౌన్సెలింగ్‌కు వచ్చే అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల అటెస్ట్‌డ్‌ జిరాక్స్‌ కాపీలనుతీసుకురావాల్సివుంటుంది.
* ఎంసెట్‌-2016 హాల్‌టికెట్‌
* ఎంసెట్‌ మెరిట్‌ ర్యాంకు కార్డు
* పదో తరగతి/తత్సమాన మార్కుల జాబితా (జన్మించిన తేదీ నిమిత్తం)
* ఇంటర్‌/ 10+2/ తత్సమాన కోర్సుల రెండు సంవత్సరాల మార్కుల జాబితాలు
* బదిలీ సర్టిఫికేట్‌ (టి.సి.)
* ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు (లోకల్‌/నాన్‌లోకల్‌ నిర్థారణ)
* ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు పదేళ్ల మార్కుల జాబితాలు/ ఎంఆర్‌వో/ తహశీల్దార్‌తో రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌
* బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు శాశ్వత కుల ధ్రువీకరణపత్రాలు
* ఆధార్‌ కార్డు
* ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కోరే అభ్యర్థులు తండ్రి/తల్లి తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం ఎంఆర్‌వో/తహశీల్దార్‌ జారీ చేసిన పత్రం తీసుకురావల్సిఉంటుంది.
* కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ వద్ద ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.800 చెల్లించాల్సివుంటుంది.
* కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులతో పాటు తల్లిదండ్రులు/ గార్డియన్‌గా ఒకరిని మాత్రమే లోపలకు అనుమతిస్తారు.
కుల, ప్రాంత నిజనిర్ధారణకు...: కుల, ప్రాంతాల నిజనిర్ధారణకు విశ్వవిద్యాలయం ఎదుర్కొనే న్యాయసమస్యలను దృష్టిలో ఉంచుకొని రూ.100 స్టాంపు/ స్టాంపు పత్రంపై తల్లి/తండ్రి, అభ్యర్థి అఫిడవిట్‌ ఇవ్వాల్సిఉంటుంది. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తును ప్రతి విద్యార్థీ డౌన్‌లోడ్‌ చేసుకొని పూర్తి చేసి యూనివర్సిటీకి అందజేయాలి.
పాస్‌వర్డు పదిలం: అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ ముగిసిన తర్వాత వారి మొబైల్‌కు పాస్‌వర్డు వస్తుంది. అభ్యర్థులు దీనిని పదిలంగా ఉంచుకొని ఆప్షన్ల కసరత్తుకు ఉపయోగించుకోవాలి. ఆప్షన్ల ప్రక్రియను సవివరంగా http://medadm.apsche.ac.inను చూడవచ్చు. ఆప్షన్లు పెట్టుకున్నవారికి ప్రకటించిన తేదీల్లో ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రవేశాలు అందుతాయి. అభ్యర్థులు అలాట్‌మెంట్‌ పత్రాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని ఆయా కళాశాలలకు వెళ్లి చేరాల్సిఉంటుంది. ఏయే కళాశాలలో ఏ కోర్సు, సీట్లు అందుబాటులో ఉన్నాయో వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు గుర్తించవచ్చు. ఆప్షన్ల కసరత్తు పూర్తి చేసినతర్వాత దానిని ప్రింట్‌ తీసుకొని భద్రపర్చుకోవాలి. ఆప్షన్లు మార్చుకునే విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్‌ ఆప్షన్ల మార్పిడికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి విడత కౌన్సెలింగ్‌లో పొందిన సీటును నిర్ణీత గడువులో వదులుకోవాల్సిఉంటుంది.


యూనివర్సిటీ ఫీజుల్లో కొంతమేర పెరిగే అవకాశం ఉంది. అభ్యర్థులు సంబంధిత ఫీజును ‘రిజిస్ట్రార్‌, డాక్టర్‌ ఎన్టీఆర్‌యూహెచ్‌ఎస్‌’, పేయబుల్‌ ఎట్‌ విజయవాడ పేరిట డీడీలు తీసుకు రావల్సి ఉంటుంది.

Posted on 11.07.2016