Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Counselling Info.

ఫార్మసీ.. ప్రాణావసరం నాణ్యతే!

ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ... రెండు గ్రూపులవారూ ఎంచుకునే కోర్సు..ఫార్మసీ! మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ కోర్సులకు ఒక ప్రత్యామ్నాయంగా దీన్ని భావిస్తున్నారు. ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో బైపీసీవారికి ఫార్మసీ అడ్మిషన్ల ప్రకటన త్వరలోనే వెలువడబోతోంది. ఈ నేపథ్యంలో ఈ వృత్తివిద్యాకోర్సు స్థితిగతులేమిటి? మంచి కళాశాలను ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాం!

ఫార్మసీలో రెండు రకాల డిగ్రీ కోర్సులున్నాయి. 4 సంవత్సరాల బీఫార్మసీ, 6 సంవత్సరాల ఫార్మాడీ. ఈ కోర్సుల్లో ఇంటర్‌ మేథ్స్‌ వారికి సగం సీట్లు, బయాలజీ వారికి మిగతా సగం కేటాయిస్తారు. ఇంటర్‌లో బైపీసీ చేసినవారు బీఫార్మసీలో రెమిడియల్‌ మేథ్స్‌, ఇంటర్‌లో మేథ్స్‌ పూర్తిచేసినవారు రెమిడియల్‌ బయాలజీ చదవాల్సివుంటుంది..

బీ ఫార్మసీ: అభివృద్ధి చెందిన దేశాల్లో (అమెరికాతో సహా) ఫార్మసీ కోర్సు కమ్యూనిటీ ఫార్మసీ- క్లినికల్‌ ఫార్మసీ ఓరియెంటెడ్‌గా ఉండగా భారత్‌లో ఇందుకు భిన్నంగా బీఫార్మసీ కోర్సు పూర్తిగా ఫార్మా ఇండస్ట్రీ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఇటీవలికాలంలో ఫార్మసీ విద్యలో నాణ్యత తగ్గిన మాట వాస్తవం. అందుకే నాణ్యత ఉన్న, పారిశ్రామిక శిక్షణ ఏర్పాటు చేసే కళాశాలల్లో చేరితే కోర్సు పూర్తయ్యాక ఉపాధికి ఇబ్బంది ఉండదు.

ఫార్మా డీ: రోగికి నాణ్యమైన ఔషధ సేవలు అందించటానికి మందుల సమగ్ర సమాచారం అందించే ప్రక్రియలో భాగంగా ఈ కోర్సును 2008లో మనదేశంలో ప్రారంభించారు. ఇది పూర్తిగా క్లినికల్‌ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఈ కోర్సును అందించే ప్రతీ కళాశాలకు అనుబంధంగా కనీసం 300 పడకల సదుపాయం ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలి. లేదా 300 పడకలు ఉన్న ఆస్పత్రితో ఒడంబడిక చేసుకుని ఉండాలి.
ఫార్మాడీలో చేరడానికి డిప్లొమా ఇన్‌ ఫార్మసీ (డీఫార్మా) చదివినవారు కూడా అర్హులు.
ఇప్పటివరకూ ఫార్మాడీ చదివిన వారికి ప్రభుత్వం కల్పించిన ఉద్యోగావకాశాలు స్వల్పం. ఇప్పటికే 4 బ్యాచ్‌లు బయటకు వచ్చినా ఈ కోర్సు ఇంకా బాల్యావస్థలో ఉందని చెప్పాలి.

కళాశాలలెన్ని? సీట్లెన్ని?
దేశంలో సుమారు 1150 బీఫార్మసీ కళాశాలలు ఉండగా వాటిలో సుమారు 75 వేల బీఫార్మసీ సీట్లు ఉన్నాయి. ప్రతీ బీఫార్మసీ కళాశాలకూ ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) గుర్తింపు తప్పనిసరి. దీంతోపాటు ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ), సంబంధిత విశ్వవిద్యాలయం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో 7 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఒక డీమ్డ్‌ యూనివర్సిటీల్లో బీఫార్మసీ కోర్సు ఉంది. వీటిలో 520 బీఫార్మసీ సీట్లు ఉన్నాయి. తెలంగాణలో 3 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు 180 బీఫార్మసీ సీట్లను అందిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ (420 సీట్లు)
1. ఆంధ్రా విశ్వవిద్యాలయం, విశాఖపట్నం- 40 సీట్లు
2. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం - 60 సీట్లు
3. జేఎన్‌టీయూ, అనంతపురం - 60 సీట్లు
4. జేఎన్‌టీయూ, కాకినాడ- 60 సీట్లు
5. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు- 100 సీట్లు
6. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, తిరుపతి- 40 సీట్లు
7. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి- 60 సీట్లు

డీమ్డ్‌ యూనివర్సిటీ
1. గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం- 100 సీట్లు

తెలంగాణ (180 సీట్లు)
1. శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్‌ - 60 సీట్లు
2. కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌- 60 సీట్లు
3. పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌నగర్‌- 60 సీట్లు

ప్రైవేటు కళాశాలలు
ఆంధ్రప్రదేశ్‌లో పీసీఐ గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలలు 116. వీటిలో 60 కళాశాలలు ఒక్కొక్కటి 100 బీఫార్మసీ సీట్లను అందిస్తుండగా మిగతా 56 కళాశాలల్లో 60 బీఫార్మసీ సీట్లు ఉన్నాయి. ఈ ప్రైవేటు కళాశాలల్లోని మొత్తం బీఫార్మసీ సీట్ల సంఖ్య 9360.
తెలంగాణలో ఫార్మసీ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన 131 కళాశాలలు 10,300 బీఫార్మసీ సీట్లను అందిస్తున్నాయి. వీటిలో 61 కళాశాలలకు 100 సీట్లకూ, 70 కళాశాలలకు 60 సీట్లకూ అనుమతులు ఉన్నాయి.

ఫార్మాడీ కళాశాలలు
దేశంలో 220 ఫార్మాడీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 6600 ఫార్మాడీ సీట్లు ఉన్నాయి. దేశంలోని సగం కళాశాలలు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం గమనించదగ్గ విషయం.
తెలంగాణలో 57 ఫార్మాడీ కళాశాలల్లో 1710 సీట్లు ఉన్నాయి. ఆంధ్రాలో కూడా 57 ఫార్మాడీ కళాశాలలు 1710 సీట్లను అందిస్తున్నాయి. ప్రభుత్వపరంగా ఫార్మాడీని అందిస్తున్న ఏకైక కళాశాల- ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నంలో ఉంది.
మంచి కళాశాలలో బీఫార్మసీ చదివి, నైపుణ్యం సంపాదించినవారికి ఫార్మా పరిశ్రమల్లో, ప్రభుత్వ రంగంలో అవకాశాలున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్ర¾భుత్వాలకు చెందిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, డ్రగ్‌ టెస్టింగ్‌ లేబొరెటరీల్లో ఎనలిస్ట్‌, కెమిస్ట్‌ ఉద్యోగాలు మొదలైనవాటికి బీఫార్మసీ, ఫార్మాడీ వారు అర్హులు.
ప్రారంభవేతనం కొంచెం తక్కువగా ఉన్నా నైపుణ్యం పెంచుకోవడానికి అవకాశం ఉన్న మంచి ఫార్మా సంస్థలో ఉద్యోగం చేస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. మెడికల్‌ రైటింగ్‌, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌, మెడికల్‌ కోడింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలుంటాయి.

కళాశాల ఎంపికలో మెలకువలు
* కళాశాలకు స్వయంగా వెళ్లి అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, చదివే విద్యార్థులను సంప్రదిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. సీనియర్‌ ఉపాధ్యాయులు, పనిచేసే అన్ని ఆధునిక పరికరాలు ఉన్న ప్రయోగశాలలు, చక్కని గ్రంథాలయం ఉన్న కళాశాలను ఎంపిక చేసుకోవడం సముచితం.
* గత 4 సంవత్సరాల్లో ఎంతమంది జీప్యాట్‌, పీజీసెట్‌, నైపర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారో తెలుసుకోవడం ద్వారా సదరు కళాశాల స్థాయిని అంచనా వేసుకోవచ్చు.
* ప్రాంగణ నియామకాల్లో ఏర్పాటు చేసే కళాశాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
* ఫార్మాడీలో చేరేవారు కళాశాలతోపాటు ఆ కళాశాలతో ఒప్పందమున్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను కూడా సందర్శించి నిర్ణయం తీసుకోవడం మేలు.
గత ఏడాది ఫార్మసీ సీట్లు సాధించిన ఎంసెట్‌ తుది ర్యాంకులను పట్టికలో చూడండి.

పీజీ తప్పనిసరా?
1. నాకు బయాలజీ ఇష్టం. కానీ, కెమిస్ట్రీ అంతగా ఆసక్తిలేని సబ్జెక్టు. నేను బీఫార్మసీలో చేరడం మంచిదేనా?
జ: బీఫార్మసీలో మూడు రకాల సైన్సులు- లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ సైన్సెస్‌, ప్యూర్‌ సైన్సెస్‌ మిళితమై ఉంటాయి. వీటితోపాటు కంప్యూటర్‌సైన్స్‌ కూడా బోధిస్తారు.
ఎంబీబీఎస్‌ మాదిరిగా ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, క్లినికల్‌ ఫార్మసీ సబ్జెక్టులు ఉంటాయి. ఔషధ తయారీకి సంబంధించి ఫార్మస్యూటిక్స్‌, ఫార్మస్యూటికల్‌ ఇంజినీరింగ్‌, ఫిజికల్‌ ఫార్మసీ, ఫోరెన్సిక్‌ ఫార్మసీలు ఉండగా ఫార్మస్యూటికల్‌ కెమిస్ట్రీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ)తోపాటు మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ అండ్‌ ఫైటో కెమిస్ట్రీ ఉంటాయి. ఔషధ విశ్లేషణకు సంబంధించి ఆధునిక విశ్లేషక పద్ధతులను నేర్పుతారు.
ప్యూర్‌ కెమిస్ట్రీ సబ్జెక్టులు ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి, భయపడాల్సిన అవసరం లేదు. దానికితోడు కెమిస్ట్రీని లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ సైన్స్‌తో కలిపి చదివితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందువల్ల బీఫార్మసీలో చేరడం మంచిదనే చెప్పాలి.

2. బీఫార్మసీలో కెమిస్ట్రీ-బయాలజీ సబ్జెక్టులు ఏ నిష్పత్తిలో ఉంటాయి?
జ: ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలు మొదటి రెండు సంవత్సరాల్లో చదవాల్సి ఉంటుంది. వీటికి 22 క్రెడిట్‌ పాయింట్లు ఉంటాయి. రెండో, మూడో సంవత్సరాల్లో చదివే మెడిసినల్‌ కెమిస్ట్రీకి 14 క్రెడిట్‌ పాయింట్లు ఉంటాయి. అంటే బీఫార్మసీలో మొత్తం 211 క్రెడిట్‌ పాయింట్లకుగానూ కెమిస్ట్రీకి సంబంధిత సబ్జెక్టులకు 36 క్రెడిట్‌ పాయింట్లు ఉంటాయి. ఇక బయాలజీకి సంబంధించి ఇంటర్‌లో మేథ్స్‌ చదివినవారు మొదటి సంవత్సరంలో రెమిడియల్‌ బయాలజీ చదవాల్సి ఉంటుంది. దీనికి 3 క్రెడిట్‌ పాయింట్లు ఉంటాయి.

3. బీఫార్మసీ తర్వాత ఎం.ఫార్మసీ చదవడం మెరుగైన భవితకు తప్పనిసరా? చదివితే లాభాలేంటి?
జ: ఏ కోర్సులోనైనా పీజీ అర్హత మంచిదే. బీఫార్మసీ వారికి వివిధ ఉద్యోగావకాశాలు ఉన్నా ఎంఫార్మసీ వారికి ప్రారంభవేతనం బీఫార్మసీ చదివిన వారికంటే ఎక్కువే ఉంటుంది. ఫార్మసీ కళాశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకూ, రిసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌ పోస్టులకూ ఎంఫార్మసీ వారే అర్హులు.
అయితే కొందరు విద్యార్థులు ఒక కళాశాలలో ఎంఫార్మసీలో చేరి బయట ఉద్యోగం చేసుకుంటూ రెగ్యులర్‌ ఎంఫార్మసీ కోర్సును దూరవిద్యా కోర్సుగా దిగజార్చారు. ఇలాంటి కళాశాలల్లో ఎంఫార్మసీ చదివితే ఉపయోగం ఉండదు.
మంచి ఉపాధ్యాయులూ, అన్ని వసతులూ ఉన్న ప్రముఖ ఫార్మసీ కళాశాలల్లో ఎంఫార్మసీ చదివితే ఉజ్వల భవిష్యత్తుకు ఆస్కారం ఉంటుంది.
బీఫార్మసీలో నెలరోజులు ఫార్మా పరిశ్రమలో తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా కళాశాలలు ఈ సదుపాయం కల్పించకపోవడం వల్ల శిక్షణ లేకుండా బోగస్‌ సర్టిఫికెట్లు ఇచ్చే సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సర్టిఫికెట్లతో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఎదురుదెబ్బలు తప్పవు.

4. బీఫార్మసీ చేసినవారికి రూ. 8000 - రూ. 10,000కి మించి వేతనాలను ఇవ్వరంటున్నారు. ప్రవేశ స్థాయిలో ఇలా ఉంటే, ఎన్నేళ్ల తరువాత వేతనాల్లో పెరుగుదల ఉంటుంది?
జ: ఇంజినీర్లతో పోలిస్తే బీఫార్మసీ చేసినవారికి తొలి వేతనం తక్కువగా ఉండటం వాస్తవం. ఇంజినీరింగ్‌ చేసినవారు కొద్దిపాటి శిక్షణతో సంస్థలకు ఉపయోగపడతారు. కానీ, ఫార్మసీ చదివినవారు సంవత్సరం అనుభవం గడిస్తేనే కానీ స్వతంత్రంగా పనిచేయలేరు. అందుకే వీరి వేతనం తక్కువ. రెండు సంవత్సరాల తరువాత బీఫార్మసీ వారికి వేతనాల్లో పెరుగుదల ప్రారంభం అవుతుంది.



Posted on 03.07.2017