Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

జులై కాదు.. ఆగస్టు 1 నుంచే

* ఇంజినీరింగ్‌ తరగతుల ప్రారంభ తేదీ ఖరారు
* విజిలెన్స్‌ తనిఖీల తర్వాతే కళాశాలలకు అనుబంధ గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: జులై 1 నుంచే ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభమని ఇప్పటివరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చెబుతూ వచ్చింది. అయితే ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తాజాగా మే 26న వెల్లడించారు. అంటే ముందుగా అనుకున్న దానికంటే నెల రోజులు ఆలస్యంగా తరగతులు మొదలు కానున్నాయి. ఎంసెట్‌ ప్రవేశ కౌన్సెలింగ్‌కు కళాశాలలను అనుమతించాలంటే జేఎన్‌టీయూహెచ్‌ తన పరిధిలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఆయా కళాశాలల తనిఖీ పూర్తయినా ఇంకా అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. తనిఖీ బృందాలు గుర్తించిన లోపాలపై వర్సిటీ కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసి 10 రోజుల్లో ఆన్‌లైన్‌ ద్వారా వివరణ ఇవ్వాలని సూచించింది. కళాశాలలు వివరణ ఇచ్చిన తర్వాత జేఎన్‌టీయూహెచ్‌ ఏ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇస్తుంది? దేనికి ఇవ్వదు? ఏ కళాశాలకు ఎన్ని సీట్లు మంజూరు చేస్తుంది? దేనికి ఎన్ని కోత పెడుతుందనేది తేలుతుంది. ఈ ప్రక్రియ మరో 15 రోజుల్లో ముగిసి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని, మొత్తానికి జులై 1 నుంచి తరగతులు ప్రారంభం కావచ్చని భావిస్తూ వచ్చారు.
రెండు నివేదికలు పోల్చి: ఇంజినీరింగ్‌ కళాశాలలతోపాటు ఉన్నత విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ బృందాలతో తనిఖీ చేయిస్తోంది. ఈ తనిఖీల నివేదికలు ఇస్తే జేఎన్‌టీయూహెచ్‌ తనిఖీ నివేదికలతో పోల్చి చూడనున్నారు. ఆ తర్వాతే అనుబంధ గుర్తింపు ఇవ్వడం, ఇవ్వకపోవడంపై నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి విజిలెన్స్‌ తనిఖీలు పూర్తయిన తర్వాత అనుబంధ గుర్తింపు ఇస్తామని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సర్కారు బడుల్లోనూ వార్షికోత్సవాలు: ప్రైవేటు బడుల్లో మాదిరిగా ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ వార్షికోత్సవాలను తప్పనిసరిగా నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఎంసెట్‌ ఫలితాల విడుదల అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో పాఠశాల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సైన్స్‌ ఫెయిర్లు, క్రీడా పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఈ మేరకు నూతన విద్యా సంవత్సరానికి విద్యా క్యాలెండర్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టినా ఓయూ పరిధిలోని కళాశాలలకు ఫీజు నిర్ణయించలేదు. ఈ నేపథ్యంలో కొన్ని కళాశాలలకు ఫీజులు నిర్ణయించి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇస్తామని, మిగతాది విద్యార్థులు భరించేలా సమాలోచనలు సాగుతున్నాయని కడియం చెప్పారు.

published on 28.05.2016