Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

స్వల్పంగానే ఇంజినీరింగ్‌ ఫీజుల పెంపు!

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థుల కోసం భారీగా నిధులు వ్యయం చేశాం...ఫీజులు అధిక మొత్తంలో పెంచండంటూ ప్రతిపాదనలు సమర్పించిన ఇంజినీరింగ్‌ కళాశాలలకు నిరాశ ఎదురైంది. కొద్ది కళాశాలలకు తప్ప మిగతా కళాశాలలకు రూ.5 వేలలోపే పెంచారు. మరికొద్ది రోజుల్లో అధికారికంగా వీటిపై నిర్ణయం వెలువడనుంది.
ఇంజినీరింగ్‌ కళాశాలల ఫీజుల ఖరారు తుది దశకు చేరుకుంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజులు నియంత్రణ సంస్థ(టీఏఎఫ్‌ఆర్‌సీ) వచ్చే మూడేళ్లకు ఫీజులను నిర్దేశించనున్న విషయం తెలిసిందే. కళాశాలల ఆదాయం, వ్యయాలను పరిశీలించిన ఏఎఫ్‌ఆర్‌సీ 2016-17 నుంచి 2018-19 వరకు ఫీజులను నిర్ధారిస్తోంది. ఇప్పటికే ఆయా కళాశాలల యాజమాన్యాలను పిలిచి అభ్యంతరాలను స్వీకరించారు. ఈక్రమంలో ఇటీవల సమావేశమై వార్షిక రుసుములను ఖరారు చేసింది. త్వరలో మరోసారి సమావేశమై చర్చించనుంది. అనంతరం ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదం తెలిపితే రుసుములు అమల్లోకి వస్తాయి. ముందుగా అంచనా వేసినట్లుగా రుసుములు భారీగా పెరగలేదు. అతి కొద్ది కళాశాలలకు మాత్రమే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెరిగింది. రెండోస్థాయి కళాశాలల ఫీజు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ ఉంది. కనీస ఫీజు రూ.35 వేలే ఉండనుంది. భర్తీ అయిన సీట్లకు కాకుండా మొత్తం మంజూరైన సీట్లను బట్టి ఖర్చు గణించడంతో ఎక్కువ పెరగలేదు. దానికితోడు బోగస్‌ అధ్యాపకులను గుర్తించిన జేఎన్‌టీయూహెచ్‌ ఆ జాబితాను ఏఎఫ్‌ఆర్‌సీకి ఇవ్వడంతో వారి వేతనాలను కూడా తగ్గించారు. దీంతోపాటు ప్రతి అధ్యాపకుడి పాన్‌కార్డును సేకరించి ఆదాయపుపన్ను శాఖ ద్వారా తనిఖీ చేయించడంతో రుసుములు పెంపు నామమాత్రంగానే ఉందని తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం కొన్ని ప్రముఖ కళాశాలల ఫీజులు వివరాలివీ....
* సీబీఐటీ - రూ.1.16 లక్షలు
* శ్రీనిధి, సీవీఆర్‌, మాతృశ్రీ, గోకరాజు రంగరాజు, బీవీఆర్‌ఐటీ, వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి, కేశవ్‌ మెమోరియల్‌ (కేఎంఐటీ), కిట్స్‌, ఎంజీఐటీ, సీవీఎస్‌ఆర్‌ - రూ.95 వేలు
* నారాయణమ్మ- రూ.1.08 లక్షలు
* వర్ధమాన్‌ - రూ.1.05 లక్షలు
* వాసవి - రూ.1.15 లక్షలు
* విద్యాజ్యోతి -రూ.82 వేలు
* గురునానక్‌ - రూ.75 వేలు
* బీవీఆర్‌ఐటీ బాలికలు - రూ.65 వేలు

published on 09.06.2016