Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

‘ఇంజినీరింగ్‌’ వివరాల్లో కిరికిరి

* పొంతన లేకుండా సమాచారం సమర్పణ
* 166 కళాశాలల్లో తేడాలను గుర్తించిన నియంత్రణ కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలలు చేసే కిరికిరిలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఫీజుల నిర్ధారణకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ)కి, అనుబంధ గుర్తింపు కోసం జేఎన్‌టీయూహెచ్‌కు సమర్పించిన వివరాల్లో భారీగా తేడాలున్నట్లు వెలుగు చూసింది. తమకు సమర్పించిన అధ్యాపకులు, వారి అర్హతలు తదితర వివరాలను జేఎన్‌టీయూహెచ్‌ ఇటీవల నియంత్రణ కమిటీకి సమర్పించింది. తమకు ఇచ్చిన వివరాలను, జేఎన్‌టీయూహెచ్‌ అందజేసిన వివరాలను పోల్చి చూసిన టీఎఎఫ్‌ఆర్‌సీ అధికారులు 166 కళాశాలలు ఇచ్చిన వివరాల్లో తేడా ఉన్నట్లు గుర్తించారు. అధ్యాపకుల విద్యార్హతలు, వారి పోస్టుల్లో తేడా ఉంది. అంతేకాకుండా ఒక అధ్యాపకుడు పలు కళాశాలల్లో పనిచేస్తున్నట్లు ఇటీవల జేఎన్‌టీయూహెచ్‌ తేటతెల్లం చేసింది.
వివరణ ఇవ్వండి
166 కళాశాలల యాజమాన్యాలు దీనిపై వివరణ ఇవ్వాలని, లేకుంటే విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులను తగ్గించి నిర్ధారిస్తామని టీఏఎఫ్‌ఆర్‌సీ తెలిపింది. తాము గుర్తించిన తప్పు సమాచారాన్ని జూన్ 13, 14వ తేదీల్లో టీఏఎఫ్‌ఆర్‌సీ నుంచి తీసుకోవచ్చని పేర్కొంది. జూన్ 16 నుంచి 20వరకు (ఆదివారం కూడా) నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం హాజరై వివరణ ఇవ్వాలని కమిటీ తెలిపింది.
సమర్పణ సమయంలో తేడాల వల్లే: యాజమాన్యాలు మాత్రం టీఏఎఫ్‌ఆర్‌సీకి జనవరి 31 నాటికి ఉన్న సమాచారం ఇవ్వగా.. జేఎన్‌టీయూహెచ్‌కు మార్చి 31 వరకు ఉన్న వివరాలు ఇచ్చామని చెబుతున్నాయి. అందువల్ల కొంత తేడా ఉండొచ్చని, అధ్యాపకులు ఒక చోట నుంచి మరో సంస్థలోకి వెళ్లి ఉండొచ్చని పేర్కొంటున్నాయి.
చివరి నిమిషంలో షాక్‌
టీఏఎఫ్‌ఆర్‌సీ కళాశాలల ఫీజును దాదాపు ఖరారు చేసింది. మరో సమావేశం నిర్వహించి ప్రభుత్వం ఆమోదం తీసుకోవడమే తరువాయి. ఈక్రమంలో జేఎన్‌టీయూహెచ్‌ ఇచ్చిన వివరాలను పోల్చి చూడటం...అందులో తేడా ఉండటంతో అధికారులు షాక్‌ తిన్నారు. జూన్ 22 నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈక్రమంలో ఈ వ్యత్యాసాలు బయటపడటంతో కమిటీపై ఒత్తిడి పెరగనుంది.

published on 11.06.2016