Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఎంసెట్‌-2కు 55,464 దరఖాస్తులు

* ముగిసిన దరఖాస్తు గడువు
* ఎంసెట్‌-1 కంటే 48 వేలు తక్కువ
* జూన్ 15 నుంచి రూ.500 ఆలస్య రుసుంతో దరఖాస్తునకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌-2కు మొదటి ఎంసెట్‌ కంటే దాదాపు 48 వేల మంది అభ్యర్థులు తగ్గారు. ఎంసెట్‌-2కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు జూన్ 14తో ముగిసింది. దానికి 55,464 మందే దరఖాస్తు చేశారు. అందులో అమ్మాయిలు 37,276 మంది, అబ్బాయిలు 18,188 మంది ఉన్నారు. ఎంసెట్‌-1 మెడికల్‌ విభాగానికి 1,03,923 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఎంసెట్‌-2కు 48,459 దరఖాస్తులు తగ్గాయి. రూ.500 ఆలస్య రుసుంతో జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా రూ.వెయ్యి, రూ.5 వేలు, రూ.10 వేల ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉన్నా దానికి మరో 500ల దరఖాస్తుల కంటే ఎక్కువ ఉండొకపోచ్చని భావిస్తున్నారు. మొత్తంమీద పరీక్ష రాసే వారి సంఖ్య 48 వేలు తగ్గనుంది.
ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకే..: ప్రథమ ఎంసెట్‌కు వైద్య విద్య, ఆయుష్‌, వ్యవసాయం తదితర అన్ని కోర్సులకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే పరీక్ష నిర్వహించేనాటికి కేవలం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కాకుండా ఇతర కోర్సులకేనని ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంసెట్‌-2ను జులై 9వ తేదీన జరపనున్నారు. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లనే భర్తీ చేస్తారు.
ఏపీ నుంచి 17,755 మంది: ఎంసెట్‌-2కు ఏపీలోని ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం జోన్ల నుంచి వరుసగా 10,465, 7290 మంది (మొత్తం 17,755) దరఖాస్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారి నుంచి 1647 దరఖాస్తులు అందాయి. తెలంగాణ నుంచి అత్యధికంగా 36,062 మంది పరీక్ష రాయనున్నారు.
విభాగాల వారీగా దరఖాస్తులు: జనరల్‌- 14,588, ఎస్‌సీ- 10,380, ఎస్‌టీ- 4,538, బీసీ ఏ- 3,746, బీసీ బీ- 8,752, బీసీ సీ- 902, బీసీ డి- 7,519, బీసీ ఈ- 5039.

published on 15.06.2016