Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

22 నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌!

* జులై 1 వరకు ధ్రువపత్రాల పరిశీలన
* రాష్ట్రంలో 21 సహాయ కేంద్రాల ఏర్పాటు
* బయోమెట్రిక్‌ హాజరు నమోదు
* పెరిగిన ప్రాసెసింగ్‌ ఫీజు

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన జూన్ 22న ప్రారంభమై జులై 1 వరకు కొనసాగనుంది. ఆప్షన్లు ఎంచుకునే షెడ్యూల్‌ను తర్వాత ఖరారుచేస్తామని ప్రవేశాల కమిటీ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో జూన్ 15న ఉదయం ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశమై ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ఖరారుచేసింది. సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ ఎంవీ రెడ్డి, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు, ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రామచంద్రం, ప్రవేశాల క్యాంపు ఆఫీసర్‌ బి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజుల ఖరారు, జేఎన్‌టీయూహెచ్‌, విజిలెన్స్‌ తనిఖీల నివేదికలు, అనుబంధ గుర్తింపు తదితర అంశాలపై కమిటీ చర్చించింది. అనుబంధ గుర్తింపు ప్రక్రియను బట్టి కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు ఇచ్చుకునే తేదీలను ఖరారుచేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు...
* అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జూన్ 22 నుంచి జులై1 వరకు జరగనుంది.
* ఎంసెట్‌ సందర్భంగా బయోమెట్రిక్‌ హాజరు తీసుకోగా ధ్రువపత్రాల సందర్భంగా మరోసారి వేలిముద్రలు సేకరిస్తారు.
* గత ఏడాది వరకు ఎస్‌సీ, ఎస్‌టీలకు కౌన్సెలింగ్‌కు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.400 ఉండగా దాన్ని రూ.500లకు పెంచారు. ఇతరులకు రూ.800 నుంచి రూ.1000కు పెంచారు.
* విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 21 సహాయ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. హైదరాబాద్‌లో అయిదు, వరంగల్‌లో మూడు కేంద్రాలున్నాయి.
* ప్రత్యేక విభాగ అభ్యర్థులైన దివ్యాంగులు, సైనికులు, ఎన్‌సీసీ, క్రీడాకారులు, ఆంగ్లో ఇండియన్లు, తదితరులకు హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లోనే ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. వారికి 23 నుంచి 30 వరకు కౌన్సెలింగ్‌ జరుగుతుంది.
తేదీల వారీగా ధ్రువపత్రాల పరిశీలన:
ధ్రువపత్రాల పరిశీలన రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ ఉదయం 9, మధ్యాహ్నం 1.30 గంటలకు కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. ఒక రోజు కేటాయించిన ర్యాంకర్లలో సగం మందికి ధ్రువపత్రాల పరిశీలన ఉదయం జరుగుతుంది. మరో సగం మందికి మధ్యాహ్నం నుంచి చేస్తారు. సహాయ కేంద్రాలు, ఇతర పూర్తి వివరాలు https://tseamcet.nic.in/ ద్వారా తెలుసుకోవచ్చని క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు.
పాటించాల్సిన సూచనలు..
కౌన్సెలింగ్‌కు వచ్చే ముందు ఎంసెట్‌ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్‌, ఆధార్‌ కార్డు, పదో తరగతి మార్కుల మెమో, ఇంటర్‌ మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, బదిలీ ధ్రువపత్రం, 2016 జనవరి 1 తర్వాత తీసుకున్న వార్షిక ఆదాయ ధ్రువపత్రం, తెలంగాణ రాష్ట్రంలో మంజూరుచేసిన కుల ధ్రువీకరణ పత్రం, తెలంగాణకు చెంది స్థానికేతర కోటా కింద హాజరయ్యే(ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఉండి చదువుకున్నా...ఉంటున్నా) వారు తమ తల్లిదండ్రులు పదేళ్లపాటు తెలంగాణలో నివసించినట్లుగా రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకోవాలి. దూర విద్య ద్వారా చదివితే కూడా నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

Published on 16.06.2016