Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

గరిష్ఠ ఫీజు రూ.1.13 లక్షలు!

* ఇంజినీరింగ్‌ కళాశాలల ఫీజులను ఖరారుచేసిన కమిటీ
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలలకు గరిష్ఠ ఫీజు రూ.1.13 లక్షలుగా తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించింది!! ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ తదితర వృత్తి విద్యా కళాశాలల్లో వచ్చే మూడేళ్లకుగాను ఫీజులను కమిటీ ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కమిటీ జులై 1న సమావేశమైంది. ఈ సందర్భంగా ఫీజులను కమిటీ ఖరారుచేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. వాటిపై 2 లేదా 3 వ తేదీల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదానికి పంపిస్తే.. జీవో జారీకి మరో రోజు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. గరిష్ఠంగా సీబీఐటీకి రూ.1.13 లక్షల ఫీజు ఖరారైంది. కనీస ఫీజు గతంలో మాదిరిగానే రూ.35 వేలు ఉండనుంది. సమావేశంలో కమిటీ ఛైర్మన్‌ స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరావు, జేఎన్‌టీయూహెచ్‌ ఇన్‌ఛార్జి వీసీ శైలజా రామయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆ ఫీజునకు సీబీఐటీ అంగీకారం!: గత ఏడాది సీబీఐటీకి రూ.1.13 లక్షల ఫీజు ఉండగా.. వచ్చే మూడేళ్లకు కూడా అదే ఫీజును కమిటీ ఖరారుచేసి అదే విషయాన్ని యాజమాన్యానికి తెలిపింది. ఆ ఫీజునకు సమ్మతం కాదని సీబీఐటీ యాజమాన్యం అంగీకార పత్రంపై సంతకం చేయలేదు. మరో 22 కళాశాలలు కూడా సంతకాలు చేయలేదు. అయితే ఫీజులపై తుది నిర్ణయం తీసుకున్న జులై 1 నాడు సీబీఐటీ యాజమాన్యం సంతకాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Published on 02.07.2016