Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

‘అనుబంధం’ తేలేది ఎన్నడో!

* ఇంజినీరింగ్‌ కళాశాలలకు జేఎన్‌టీయూహెచ్‌ గుర్తింపుపై మల్లగుల్లాలు
* వెబ్‌ ఆప్షన్ల ప్రారంభానికి మిగిలింది 3 రోజులే
* ఈలోగా కళాశాలల జాబితాపై స్పష్టత అవసరం
* ఉన్నత విద్యామండలి అధికారుల్లో కలవరం

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కిరాకపోవటం ఉన్నత విద్యామండలి అధికారులను కలవరానికి గురిచేస్తోంది. ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులకు కళాశాలలు, కోర్సుల ఎంపికకు వెబ్‌ ఆప్షన్ల ప్రారంభానికి మరో మూడు రోజులే మిగిలి ఉంది. జేఎన్‌టీయూహెచ్‌ మాత్రం కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియపై మల్లగుల్లాలు పడుతోంది. విశ్వవిద్యాలయం, విజిలెన్స్‌ అధికారుల నివేదికల మధ్య వ్యత్యాసం ఉన్న 44 కళాశాలలను మినహాయించినా...ఇతర కళాశాలలకు సైతం జులై 1న వరకు పూర్తిచేయలేకపోయింది. రాత్రి వరకు చర్చోపచర్చలతో కసరత్తు చేసినా ప్రక్రియ పూర్తికాలేదు. అయిదో తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లను ప్రారంభించాలని నిర్ణయించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు..ఈలోగా కళాశాలల జాబితాను ప్రకటించగలమా లేదా అనే టెన్షన్‌కు గురవుతున్నారు.
ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) ఇచ్చే ప్రక్రియపై జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు ఎడతెగని కసరత్తు చేస్తున్నా అనుమతులు మాత్రం పూర్తికావడం లేదు. మొత్తం 174 కళాశాలలకు సమస్య లేకున్నా జులై 1 రాత్రి వరకు 100 కళాశాలలకే అనుమతిచ్చినట్లు సమాచారం. జులై 2వ తేదీ నాటికి అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని అనుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈ గడువులోగా ఆ పక్రియ పూర్తవటం అసాధ్యమనే అభిప్రాయాన్ని జేఎన్‌టీయూహెచ్‌ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. అయితే, జులై 1 అర్ధరాత్రికి చాలా వరకు పూర్తి చేస్తామని, జులై 2 నాటికి మిగిలిన వాటిపై నిర్ణయం తీసుకుంటామని వర్సిటీ ఉన్నతాధికారులు.. కళాశాలల యాజమాన్యాలతో చెబుతుండటం గమనార్హం. వర్సిటీ, విజిలెన్స్‌ నివేదికలు ఒకేవిధంగా ఉన్న కళాశాలలకు సంబంధించిన అనుమతులు జులై 2న పూర్తయినా వ్యత్యాసం ఉన్న 44 కళాశాలలపై ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వాటికి లోపాలు సరిదిద్దుకోవడానికి కొంత సమయం ఇచ్చి రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతివ్వాలా? వద్దా? అన్నది అధికారులు తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం.
కొన్ని బ్రాంచీలకు కోత?
ఒక బ్రాంచిలో ఉన్న సంఖ్యను తగ్గించే అధికారం విశ్వవిద్యాలయానికి లేదు. అయితే, బ్రాంచీని మాత్రం పూర్తిగా తొలగించవచ్చు. అంటే కంప్యూటర్‌ సైన్స్‌లో 120 సీట్లు ఉంటే 60కి తగ్గించడానికి కుదరదు. మొత్తం సీఎస్‌ఈకి అనుమతి నిరాకరించవచ్చు. లోపాల స్థాయిని బట్టి జేఎన్‌టీయూహెచ్‌ అదే చేస్తున్నట్లు సమాచారం. అయితే, కొన్ని కళాశాలల్లో సీట్లకు కూడా కోత పెడుతుండటం విశేషం.
కనీసం రెండు రోజులు ముందుగా ఇస్తేనే...
ఇంజినీరింగ్‌ కళాశాలలకు జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ గుర్తింపు ఇచ్చినా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంటుంది. జులై 5న వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాలంటే 3వ తేదీన ఉత్తర్వుల జారీతో ప్రవేశాల కమిటీకి జాబితా సమర్పించాలి. తప్పులు దొర్లకుండా కళాశాలల జాబితాను వెబ్‌సైట్లో పెట్టాలంటే 3వ తేదీనే జాబితా ఇస్తే బాగుంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి.

Published on 02.07.2016