Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

టాపర్ల చూపు.. ‘జాతీయ స్థాయి’ వైపు

* ఎంసెట్లో అగ్రశ్రేణి ర్యాంకర్లు ఐఐటీ, ఎన్‌ఐటీలు,
* ట్రిపుల్‌ ఐటీలలో చేరికకే ప్రాధాన్యం
* ఇక్కడ ఇంజినీరింగ్‌లో చేరేది స్వల్పమే..
* గత ఏడాది 100 లోపు వారిలో చేరింది ‘ఒక్కరే’

ఈనాడు, హైదరాబాద్‌: అహర్నిశలు శ్రమించి ఎంసెంట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అత్యధిక స్కోర్‌ సాధించి అగ్రశ్రేణి ర్యాంకులను దక్కించుకున్నా..తెలంగాణ రాష్ట్రంలోని కళాశాలల్లో చేరుతున్నవారు అతికొద్ది మంది మాత్రమే. టాపర్ల చూపు జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలపైనే ఉంటోంది. వాటిల్లో రాకున్నా డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో చేరుతున్నారు తప్ప స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు ఈ సంవత్సరం 1.33 లక్షల మంది హాజరవగా.. 1.03 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. వీరందరి లక్ష్యం ఎంసెట్‌లో ర్యాంకుతో రాష్ట్రంలోని ఏదో ఒక కళాశాలల్లో సీటు సాధించడం కాదు.. వారిలో దాదాపు 25 శాతం మంది జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీటు సాధన దిశగానే సన్నద్ధత ఉంటోంది. సబ్జెక్టు పరిజ్ఞానం పరిశీలించుకోవచ్చన్న భావనతోనే ఎంసెట్‌కు హాజరవుతున్నారు. గత ఏడాది ఎంసెట్‌లో మొదటి 100 మంది ర్యాంకర్లలో తెలంగాణలోని కళాశాలల్లో చేరింది కేవలం ఒక్కరే కావడం గమనార్హం. 10వేల లోపు ర్యాంకు సాధిస్తున్న వారిలో కూడా 60శాతం మంది రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఉన్నత సంస్థల్లో చదివేందుకే..
* ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీలు జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ విద్యా సంస్థలు. ఐఐటీలకు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. జేఈఈ అడ్వాన్సుడ్‌లో మంచి ర్యాంకులు తెచ్చుకుని ఐఐటీల్లో ప్రవేశం పొందటానికి ఇక్కడి ర్యాంకర్లు సన్నద్ధమవుతుంటారు. అక్కడ చదువు పూర్తి చేస్తే మంచి వార్షిక ప్యాకేజీతో పాటు.. ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీల ప్రాంగణ నియామకాలుంటాయని వాటివైపే మొగ్గు చూపుతున్నారు.
* జాతీయస్థాయి సంస్థల్లో సీటు రాకుంటే బిట్స్‌ పిలానీ తదితర డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో చేరుతున్నారుగానీ...రాష్ట్రంలోచదివేందుకు ఆసక్తి చూపడం లేదు.
* పలు డీమ్డ్‌ వర్సిటీలు ప్రాంగణ నియామకాలకు కంపెనీలను తీసుకొచ్చేందుకు పోటీ పడుతుండటంతో విద్యార్థులు వాటిల్లోచేరేందుకు మొగ్గు చూపుతున్నారు.
* తమిళనాడులోని కొన్ని డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో 50 శాతం రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉంటున్నారు. రాష్ట్రంలోని ముఖ్యమైన కళాశాలల్లో యాజమాన్య కోటా కింద పది పదిహేను లక్షలు డొనేషన్‌ చెల్లించే బదులు... డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో చేరితే మంచిదన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని కళాశాలలు నాణ్యతను పెంచుకోకుండా...యాజమాన్య కోటా సీట్లను ఇష్టానుసారం అమ్మకానికి పెడితే ఇప్పుడు 10 వేల ర్యాంకుల వారే చేరుతుండగా...కొద్ది కాలంలోనే 25 వేలలోపు ర్యాంకర్లు ఎందరు చేరారని లెక్కించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

published on 28.05.2016