Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

కోర్సా...కళాశాలా!

* ఇంజినీరింగ్‌లో ప్రాధాన్యాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు సతమతం
* జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ ప్రవేశాల్లో కీలకమైన కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 5వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వివిధ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు అసలైన ఆందోళన ఇప్పుడే మొదలైంది. తల్లిదండ్రుల్లోనూ అదే టెన్షన్. తమ ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాల్సింది దేనికి? కళాశాలలకా? బ్రాంచికా? వేల మంది మెదళ్లను వేధిస్తున్న ప్రశ్నిది. ఈ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంతోష్‌కు ఎంసెట్‌లో 15 వేల ర్యాంకు వచ్చింది. అతనికి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్ఈ)పై ఆసక్తి. టాప్-10 కళాశాలల్లో కోరుకున్న బ్రాంచిలో సీటు రాదు. బీ గ్రేడ్ కళాశాలల్లో ఈ బ్రాంచిలో సీటు ఖాయం. అయితే, ఇప్పుడు ఏం చేయాలన్నది ఆ విద్యార్థిని, వారి తల్లిదండ్రులను సంకటంలో పడేసిన ప్రశ్న.
ఈ సమస్య ఒక్క సంతోష్‌దే కాదు. తెలంగాణ రాష్ట్రంలో వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులది కూడా. తెలంగాణ ఎంసెట్‌లో 1.03 లక్షల మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 242 కళాశాలలున్నా నాణ్యమైన విద్యనందించే కళాశాలలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులను ఎంచుకోవాలా? మంచి కళాశాలలో ఏదో ఒక బ్రాంచీని తీసుకుంటే చాలా? ఈ సందేహాలపై తుది నిర్ణయానికి రావడం అంతతేలికైన విషయమేమీ కాదు. అయితే, ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చిన వారికి కూడా తమ నిర్ణయం సరైనదేనా? తప్పు చేస్తున్నామా? అన్న అనుమానం లేకపోతేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు మార్గమేమిటన్న దానిపై కొందరు నిపుణులతో 'ఈనాడు' మాట్లాడింది. వాసవి కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జయశంకర్, మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపాల్ ఆచార్య కె.రవీంద్ర ...
విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు చేస్తున్న సూచనలివి...
తొలిప్రాధాన్యం నాణ్యతకే...

* నాణ్యమైన విద్య అందితే ఏ బ్రాంచైనా పర్వాలేదు
* నాణ్యమైన విద్య అందించే (ఏ గ్రేడ్) కళాశాలల్లో ఏ బ్రాంచీలో సీటు వచ్చినా చేరడం మంచిది. వాటిల్లో సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ(సర్య్కూట్ బ్రాంచీలు)లతోపాటు ఇతర బ్రాంచీల విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు సాఫ్ట్‌వేర్, కోర్ కంపెనీలు ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తాయి. ఆ కళాశాలల్లో అధిక శాతం మంది ఎంపికయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కొంత మంది మిగిలినా సబ్జెక్టుపై ఉన్న పట్టు వల్ల త్వరగా ఉద్యోగం సంపాదించడానికి దోహదపడుతుంది.
* బీ గ్రేడ్ కళాశాలలుగా భావించే కళాశాలల్లో సీటు వస్తే బ్రాంచికి ప్రాధాన్యమివ్వాలి. ఉదాహరణకు ఈ కేటగిరీలో 20 కళాశాలలు ఉన్నాయనుకుందాం. మొదటి కళాశాలలో ఇష్టమైన సీఎస్ఈ రాదు. 15వ కళాశాలలో ఆ సీటు వస్తుంది. అప్పుడు 15వ స్థానంలో ఉన్న కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌నే ఎంచుకోవాలి. ఎందుకంటే అక్కడికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు రావొచ్చుగానీ...నాన్ సర్కూట్ బ్రాంచీల్లోని విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి కోర్ కంపెనీలు రాకపోవచ్చు. ఇక సీ గ్రేడ్ కళాశాలల్లో సీటు వచ్చినా బ్రాంచికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాంటి కళాశాలల్లో సీటు వస్తే దగ్గరగా ఉన్న వాటిని ఎంచుకోవచ్చు.
* ఇప్పుడు మంచి డిమాండ్ ఉందని భావిస్తున్న బ్రాంచికి భవిష్యత్తులోనూ అదే గిరాకి ఉంటుందని భావించలేం. అందువల్ల నాణ్యమైన విద్య అందేచోట చేరి...ఇంజినీరింగ్ సబ్జెక్టుపై పట్టు సంపాదించడం చాలా ముఖ్యం.
* ఒకప్పుడు కొన్ని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొన్ని అగ్ర కళాశాలల్లోనే ప్రాంగణ నియామకాలకు వెళ్లేవి. ఆ అభిప్రాయాన్ని కొన్ని కంపెనీలు మార్చుకొని సాధారణ కళాశాలల్లోనూ తెలివైన విద్యార్థులు ఉంటారన్న అభిప్రాయానికి వచ్చి నియామకాలు చేపడుతున్నాయి. ఇంజినీరింగ్‌లో చేరిన తర్వాత తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన సంస్థ(టాస్క్) ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాల సాధనలో ప్రయోజనం పొందొచ్చు.
* సాఫ్ట్‌వేర్ కంపెనీలు కేవలం సీఎస్ఈ, ఐటీ విద్యార్థులనే ఎంపిక చేసుకోవు. ఏ బ్రాంచి అయినా ప్రతిభావంతులై ఉంటే చాలు.
ఎవరికి ఏ బ్రాంచి?
* కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచి తీసుకోవాలనుకునే వారికి లాజికల్ రీజనింగ్, పజిల్ సాల్వింగ్ సామర్థ్యం అవసరం. అంటే గణితం...గణాంక శాస్త్రంలపై ఆసక్తి, పట్టు ఉండాలి. న్యూమరికల్ మెదడ్స్‌పై పట్టు ఉన్న వారు ప్రోగ్రామింగ్, కోడింగ్‌లో ముందుంటారు. ఒక సమస్యను సులభంగా... పరిష్కారానికి 10 రకాలుగా ఆలోచించగలిగే వారికి ఈ బ్రాంచి తగినది.
* ఈసీసీ చదవాలనుకునే వారికి ప్రధానంగా భౌతికశాస్త్రం...అందులోనూ నానో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లపై ఆసక్తి ఉంటే ఈ బ్రాంచి ఇష్టంగా చదవగలుగుతారు. గణితంపై కూడా పట్టు ఉండాలి.
* మెకానికల్ ఇంజినీరింగ్‌కు రసాయన, భౌతికశాస్త్రాలపై ఆసక్తి, పట్టు ఉండాలి. రసాయనశాస్త్రం ఇష్టమున్న వారికి ఇంజినీరింగ్‌లో మెటీరియల్ సైన్స్ సులభమవుతుంది.
* సివిల్ ఇంజినీరింగ్‌కు ముఖ్యంగా రసాయన, భౌతికశాస్త్రాలపై ఇష్టం ఉంటే నీరు, మెటీరియల్ సైన్స్, థర్మో డైనమిక్స్ డిజైన్ తదితర అంశాలు సులభంగా పట్టుబడతాయి. వీరు కేవలం కార్యాలయానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులు జరిగే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది.
అర్హులైన అధ్యాపకులు ముఖ్యం
- ఆచార్య ఎన్‌వీ రమణారావు, కన్వీనర్, తెలంగాణ ఎంసెట్

అర్హులైన అధ్యాపకులు తగినంత మంది ఉన్న కళాశాలలను ఎంచుకోవాలి. పీహెచ్‌డీ...అదీ పరిశోధనపై ఆసక్తి ఉన్న వారు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అధ్యాపకులకు కనీసం ఎంటెక్ ఉండటం అవసరం. వారి సమాచారం కళాశాల వెబ్‌సైట్ల నుంచి పొందొచ్చు. ముఖ్యంగా అక్కడ చదివిన వారు, చదువుతున్న వారిని అధ్యాపకుల పరిస్థితిపై, ప్రయోగశాలలు, విద్యా నాణ్యతపై యాజయాన్యానికి ఉన్న అంకితభావం, సదస్సులు, కార్యశాలల నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీయడం ముఖ్యం. ఇక విద్యాసంస్థ మొత్తానికి న్యాక్, బ్రాంచీల వారీగా ఎన్‌బీఏ గుర్తింపు, యూజీసీ స్వయంప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలో కొంత మెరుగైన సదుపాయాలుంటాయి.
* ఇలా పరీక్షించుకోండి
ఐఐటీ, ఎన్ఐటీ నిపుణులు సంయుక్తంగా ఇంజినీరింగ్‌లో ఏ విద్యార్థికి ఏ బ్రాంచి తగినదో తెలుసుకునేందుకు ఒక టూల్‌ను రూపొందించారు. దాంట్లోని ప్రశ్నావళికి నిజాయతీగా సమాధానాలు ఇచ్చి ఏ బ్రాంచీని ఎంచుకోవాలో ఒక నిర్ణయానికి రావొచ్చు.

Published on 02.07.2016