Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

సీఎస్‌ఈ, ఐటీకే విద్యార్థుల ఓటు

* అవకాశాలు మెండుగా ఉండటమే కారణం
* ఈ రెండు విభాగాల్లోనే అత్యధిక సీట్ల భర్తీ
* ఈసారీ అదే పరిస్థితి ఉంటుందని అంచనా
* డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్న ఇంజినీరింగ్‌ కళాశాలలు

ఈనాడు - హైదరాబాద్‌: కంప్యూటర్‌సైన్స్‌(సీఎస్‌ఈ).. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ).. ఇంజినీరింగ్‌లో చేరబోయే విద్యార్థుల నోట నుంచి అధికంగా వినిపిస్తున్న మాటలివి. కన్వీనర్‌ కోటా కింద పోటీపడే విద్యార్థులే కాదు.. బీ-కేటగిరీలో సీట్లను కోరుకునేవారి మొదటి ప్రాధాన్యం సీఎస్‌ఈ, ఐటీ విభాగాలే. ఈ డిమాండ్‌ను పసిగట్టిన పేరున్న కళాశాలల యాజమాన్యాలు బీ-కేటగిరీ సీటు రేటును గతేడాది కంటే 30-40శాతం పెంచేయడం గమనార్హం. కంప్యూటర్‌సైన్స్‌, ఐటీ కోర్సులవైపు విద్యార్థులు ఎందుకు చూస్తున్నారు? ఆ బ్రాంచీలకు డిమాండున్న మాట నిజమేనా? లేక వేలం వెర్రా? నిపుణులు మాత్రం సాఫ్ట్‌వేర్‌రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువ ఉండటమే కారణంగా చెబుతున్నారు. ప్రతి రంగంలోకి కంప్యూటర్‌ పరిజ్ఞానం చొచ్చుకొస్తుండటంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతుందిగానీ..తగ్గకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఏది చదివినా మళ్లీ అక్కడికేనని..
ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచి చదివినా.. వారిలో 90శాతం మంది ఏదో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, వాటికి సంబంధించిన కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. దీంతో ఇతర బ్రాంచీలు చదివి మళ్లీ కంప్యూటర్‌రంగం వైపు ఎందుకని బీటెక్‌ సీఎస్‌ఈ, ఐటీలవైపే మొగ్గు చూపుతున్నారు. ఐఐటీల్లోనూ ఇదే పరిస్థితి ఉందని జేఎన్‌టీయూహెచ్‌ కంప్యూటర్‌సైన్స్‌ ఆచార్యుడు కామాక్షి ప్రసాద్‌ చెబుతున్నారు. సీఎస్‌ఈలో లాజిక్‌ ఓరియెంటెడ్‌గా కంప్యూటర్‌సైన్స్‌ను నేర్చుకుంటారని, అందువల్ల బీటెక్‌లో మిగతా బ్రాంచీల్లో చదివి సాఫ్ట్‌వేర్‌వైపు వచ్చినా సీఎస్‌ఈ చదివిన విద్యార్థితో సమానంగా ఉండలేరన్నారు. కాకపోతే మిగిలిన బ్రాంచీలను చదివి వాటిల్లో మంచి పట్టున్నవారికి మాత్రం అది వర్తించదని చెప్పారు. ఒకప్పుడు బీటెక్‌ ఐటీ అంటే విద్యార్థులు చేరేవారు కాదు. కొన్నేళ్లుగా సీఎస్‌ఈ, ఐటీ సమానమేనని గ్రహిస్తున్నారన్నారు. ‘సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది నిజం. త్వరగా జీవితంలో స్థిరపడాలంటే సీఎస్‌ఈ చదివితే మంచిదని విద్యార్థులు భావిస్తున్నారు’అని సన్‌టెక్‌ కార్ప్‌ సెల్యూషన్స్‌ సీఈఓ వెంకట్‌ కాంచనపల్లి తెలిపారు.
ప్రాంగణ నియామకాలకు వస్తున్నవి అత్యధికంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలే. గరిష్ఠసంఖ్యలో ఎంపిక చేసుకుంటున్నవీ అవే. ఉత్పత్తితరహా కోర్‌ కంపెనీలు వచ్చినా కొన్ని ప్రధాన కళాశాలలకే పరిమితం. అంతేకాక అతితక్కువ మందిని ఎంపిక చేసుకుంటున్నాయి. ఇప్పుడొస్తున్న అంకుర కంపెనీలుసైతం సాఫ్ట్‌వేర్‌తో సంబంధమున్నవే కావడం గమనార్హం. ఫలితంగా విద్యార్థులు సీఎస్‌ఈ, ఐటీకోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్‌ ఉంటుండడంతో కొన్ని కళాశాలలు బీ-కేటగిరీలోని సీఎస్‌ఈ సీట్లకు రూ.8-12లక్షల పైచిలుకు వసూలు చేస్తున్నాయి.
భర్తీ శాతమూ అధికమే
రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అత్యధికశాతం సీట్ల భర్తీ సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచీల్లో ఉండటం వాటికున్న డిమాండ్‌ను చెబుతోంది. అత్యధిక ఆప్షన్లు సీఎస్‌ఈకే ఇచ్చారని ప్రవేశాల కమిటీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఏపీలో ముగిసిన ఎంసెట్‌ ఆప్షన్లలోనూ సీఎస్‌ఈకే అత్యధిక ఆప్షన్లు ఇచ్చుకున్నారు. జులై 5 నుంచి ప్రారంభంకానున్న తెలంగాణ ఎంసెట్‌ ఆప్షన్లలోనూ అదే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
పెరగడమేగానీ..తగ్గదు!
సాఫ్ట్‌వేర్‌, ఐటీరంగాలకు ప్రాధాన్యం పెరగడమేగానీ, తగ్గే అవకాశం లేదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రతి రంగంలోకి సాఫ్ట్‌వేర్‌ చొచ్చుకుపోతోంది. సాఫ్ట్‌వేర్‌ను వినియోగించకుండా ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువు తయారు చేయడంలేదు. ఆటోమొబైల్‌లాంటి రంగాల్లోనూ ప్రాధాన్యం పెరిగిపోయింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలోని వివిధ విభాగాల్లో అభ్యర్థికి ఉన్న పట్టునుబట్టి అవకాశాలుంటాయని చెబుతున్నారు. సంక్షోభాలు వచ్చినప్పుడల్లా సాఫ్ట్‌వేర్‌కు డిమాండ్‌ పెరుగుతుందని, ఆ సమస్యలను పరిష్కరించాలంటే మళ్లీ సాఫ్ట్‌వేర్‌నే వాడుకోవాల్సి ఉంటుందని కంప్యూటర్‌ నిపుణులు చెబుతున్నారు.Published on 04.07.2016