Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలకు షాక్!

* కొన్ని బ్రాంచీల్లో ఒక్క సెక్షన్‌కూ లభించని అనుమతి
* పునరుద్ధరణ కోసం జేఎన్‌టీయూహెచ్‌ను ఆశ్రయిస్తున్న ఆయా కళాశాలల యాజమాన్యాలు

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇంజినీరింగ్ సీట్లు 34 వేలు తగ్గిపోగా... ప్రముఖమైనవిగా భావిస్తున్న కళాశాల్లోనూ సీట్లపై జేఎన్‌టీయూహెచ్ వేటు వేసింది. ఇప్పటివరకు ద్వితీయ శ్రేణి కళాశాలలుగా భావిస్తున్న విద్యాసంస్థలకు అనుబంధ గుర్తింపే ఇవ్వకపోవడంతో ఆయా యాజమాన్యాలు షాక్ తిన్నాయి. తాజాగా సీట్లపైనా కొరడా ఝుళిపించింది. హైదరాబాద్‌లో ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఒకటి. ఈ కళాశాలలో సీఎస్ఈ, ఈసీఈ విభాగాల్లో ఒక్కోదాంట్లో 4 సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్‌కు 60 సీట్లు చొప్పున ఒక్కో విభాగంలో 240 సీట్లున్నాయి. అయితే, ఇక్కడ ఒక్క సెక్షన్‌కు కూడా అనుమతిరాలేదు. విద్యార్థులు మంగళవారం ఆప్షన్లు ఇచ్చుకుందామని వెతికి వెతికి చివరకు అనుమతి రాలేదని మిన్నకుండిపోయారు. కళాశాల అధికారులు వర్సిటీ అధికారులను కలిసి సీట్ల విషయమై విన్నవించారు. అదేవిధంగా గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలోనూ భారీగా సీట్లకు కోత పెట్టారు. మెకానికల్, సివిల్ బ్రాంచీల్లో మొత్తం 8 సెక్షన్లలో 480 సీట్లకు అనుమతి దక్కలేదు. ప్రస్తుతం ఆయా కళాశాలల యాజమాన్యాలు సంబంధిత పత్రాలను వర్సిటీకి సమర్పించే పనిలో ఉన్నాయి. జేబీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అనుబంధ గుర్తింపే దక్కలేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రుసుముల జీఓలోనూ చోటుదక్కలేదు. దాదాపు 78 కళాశాలలకు ఈసారి అనుబంధ గుర్తింపును జేఎన్‌టీయూహెచ్ నిరాకరించింది. మరో వైపు ప్రముఖ కళాశాలైన వాసవికి బోధన రుసుము(ట్యూషన్ ఫీజు)ను కమిటీ భారీగా తగ్గించింది.
మంత్రుల చుట్టూ చక్కర్లు
సీట్లను భారీగా తగ్గించడం, కళాశాలలకు గుర్తింపే ఇవ్వకపోవడంతో విద్యాసంస్థల యజమానులు, ప్రతినిధులు మంత్రులు చుట్టూ తిరుగుతున్నారు. జేఎన్‌టీయూహెచ్ అధికారులకు ఫోన్ చేయాల్సిందిగా విన్నవిస్తున్నారు. అనుమతి దక్కలేదని తెలిసి విదేశీ పర్యటనలో ఉన్న యజమానులు కొందరు పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్ చేరుకొని కొంత మంది మంత్రులను కలిసే పనిలో ఉన్నారు.
164కు పెరిగిన కళాశాలల సంఖ్య
జేఎన్‌టీయూహెచ్ మొదట 158 ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చినట్లు ప్రకటన జారీ చేసింది. అయితే, ఆ సంఖ్య మంగళవారం నాటికి 164కి చేరింది. ఇంకా మరికొన్నింటికి గుర్తింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అనుబంధ గుర్తింపు దక్కితే ఇప్పటికే టీఏఎఫ్ఆర్‌సీ ఖరారు చేసిన రుసుములపై ప్రభుత్వం జీఓ జారీ చేస్తుంది. అంతేకాకుండా బ్రాంచీలను రద్దు చేసిన కళాశాలలు లోపాలు లేవని వివరణ ఇస్తుండటంతో ఆ సీట్లనూ పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. దాంతో సీట్ల సంఖ్యా పెరగవచ్చని తెలుస్తోంది.

Published on 06.07.2016