Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఐచ్ఛికంలో అప్రమత్తం!

* ఇంజినీరింగ్‌లో సీటు సాధనకు అదే కీలకం
* అధిక సంఖ్యలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి
* విద్యార్థులకు అధికారుల సూచన

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకోగానే సరిపోదు. మంచి కళాశాలలో కోరుకున్న బ్రాంచీలో సీటు దక్కాలన్నా...కనీసం ఏదో ఒక కళాశాలలలో సీటు పొందాలన్నా వెబ్‌ ఐచ్ఛికాల (ఆప్షన్స్‌) విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే మొదటి విడతలో ఎక్కడా సీటు దక్కకపోయే ప్రమాదమూ ఉండకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈసారి కన్వీనర్‌ కోటా సీట్లు భారీగా తగ్గినందున విద్యార్థులు జాగరూకతతో వ్యవహరించాలని తెలిపారు.
గత ఏడాది కన్వీనర్‌ కోటా సీట్లు 81 వేలకుపైగా ఉండగా...ఈసారి అవి 65,379కి తగ్గిపోయాయి. మరోవైపు కన్వీనర్‌ సీట్ల కోసం పోటీపడే వారి సంఖ్య పెరిగింది. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు మరో 3,205 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. దాంతో కన్వీనర్‌ కోటా కింద వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హత సంపాదించిన వారి సంఖ్య 67,531కి చేరింది. అందువల్ల ప్రతి సీటుకు ఒకరి కన్నా ఎక్కువ మందే పోటీ పడుతున్నట్లయ్యింది. మరో వైపు మొదటి రోజు జులై 5న 18,981 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. 1-45 వేల ర్యాంకర్లకు జులై 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవడానికి సమయం ఉంది.
కొన్ని బ్రాంచీలకు అధికపోటీ: అత్యధిక మంది కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఈసీఈ సీట్లకు పోటీ పడతారు. దాంతో అధిక సంఖ్యలో వెబ్‌ ఐచ్ఛికం వాటికే ఇస్తారు. అంటే పోటీ ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చుకోవటం ఉత్తమమని అధికారుల సూచన.
* ఒక విద్యార్థికి 10 వేల ర్యాంకు వచ్చింది. తనకు టాప్‌ కళాశాలల్లో సీటు వస్తుందనే అంచనాతో సీఎస్‌ఈ బ్రాంచీ కోసం 10 కళాశాలల్లోనే ఆప్షన్లు ఇచ్చుకున్నాడు. అయితే, ఆ పది కళాశాలల్లో ఉన్న సీట్లను, రిజర్వేషన్‌ విద్యార్థులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 10 కళాశాలల్లోనే ఆప్షన్లు ఇచ్చుకోవడంతో అతనికి సీటు దక్కలేదు. మరి కొన్ని కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లయితే కనీసం 11వ కళాశాలలో అయినా సీటు దక్కేది. రెండో విడత కౌన్సెలింగ్‌ ఉన్నా అప్పటికే మంచి కళాశాలల్లో సీట్లు భర్తీ అవుతాయి. అంటే అతను ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటే సాదాసీదా కళాశాలల్లో చేరాల్సిందే. అదే సమయంలో 11 వేల ర్యాంకు విద్యార్థికి మాత్రం మంచి కళాశాలలోనే సీటు దక్కింది. అందుకు అతను ఎక్కువ కళాశాలలకు ఐచ్ఛికాలు ఇచ్చుకోవడమే.
* ఐచ్ఛికం ఇచ్చుకునే ముందు కళాశాల, కోర్సుల వారీగా ప్రాధాన్య క్రమాన్ని ఒకచోట రాసుకోవాలి. దానివల్ల ఐచ్ఛికం ఇచ్చుకునే ప్రక్రియ సులభం అవుతుంది.
* 10 వేల లోపు ర్యాంకు వచ్చి.. నిబంధన ప్రకారం వార్షిక ఆదాయం ఉన్న వారికి పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ చెల్లిస్తారు. ఆపై ర్యాంకు వచ్చిన వారికి రూ.35 వేలు మాత్రమే ఇస్తారు. రుసుములు పెరిగినందున ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.

Published on 06.07.2016