Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

15 నుంచి ఇంజినీరింగ్ మలివిడత కౌన్సెలింగ్

* అడ్వాన్డ్సు సప్లిమెంటరీలో ఉత్తీర్ణత పొందిన వారికీ అవకాశం
ఈనాడు- హైదరాబాద్: ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ మలివిడత కౌన్సెలింగ్ ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీనిపై గురువారం అధికారిక ప్రకటన వెలువడబోతుంది. తొలుత ప్రకటించిన ప్రకారం మూడో విడత కూడా కౌన్సెలింగ్‌ను నిర్వహించాల్సి ఉంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర ప్రవేశాలు ఈ నెల 15వ తేదీతోనే ముగుస్తున్నందున మలివిడత ప్రవేశాల కౌన్సెలింగ్‌తో ప్రవేశాల ప్రక్రియను ముగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ధ్రువపత్రాల్ని పరిశీలన చేయించుకోని వారికి కూడా మలివిడత కౌన్సెలింగ్‌లో అవకాశాన్ని కల్పించనున్నారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినప్పటికీ ఇష్టపడితే మలివిడత కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చు. అయితే ఈ కౌన్సెలింగులో సీటు వస్తే తొలుత వచ్చిన సీటు రద్దయిపోతుంది. మలివిడత కౌన్సెలింగ్‌లో సీటు రాకుండా ఉంటే మాత్రం తొలివిడత సీటు అలాగే ఉంటుందని అధికారులు తెలిపారు. 18వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని ఏపీ ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి తెలిపారు. తొలివిడత జరిగిన కేటాయింపు ద్వారా సీట్లు పొందిన వారిలో ఆరువేల మంది నుంచి సమాచారం లేదని వెల్లడించారు. వీరి సెల్‌ఫోన్లకు మరోసారి సంక్షిప్త సందేశాల ద్వారా తెలియబరుస్తామని చెప్పారు.
ఇంటర్ అడ్వాన్డ్సు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి మలివిడత ఫలితాల్ని ఏపీ ఎంసెట్ కార్యాలయం బుధవారం ప్రకటించింది. తొలివిడత కింద 1,34,147 ఇంజినీరింగ్ ర్యాంకుల్ని, 87,890 ర్యాంకుల్ని వ్యవసాయం, వైద్య విద్యలో వెల్లడించింది. మలివిడత కింద ఇంజినీరింగ్‌లో 6,240 ర్యాంకుల్ని ఇంజినీరింగ్, 2,855 ర్యాంకుల్ని వ్యవసాయ, వైద్య విద్య విభాగంలో మొత్తం 9,095 ర్యాంకులను ప్రకటించింది. మొత్తమ్మీద ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో 1,40,387, వ్యవసాయ, వైద్య విద్యలో 90,745 ర్యాంకుల్ని కేటాయించారు. ఇంటర్ బోర్డు విద్యార్థులే కాకుండా ఇతర బోర్డు విద్యార్థులు అందచేసిన మార్కుల ఆధారంగా కూడా ర్యాంకుల్ని కేటాయించామని తెలిపింది. వీరికి తొలివిడతలోని చివరి ర్యాంకు తరువాత ర్యాంకులు మాత్రమే ఇస్తామని ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాల పర్యవేక్షణ అధికారి డాక్టర్ రఘునాధ్ వెల్లడించారు. మలివిడత కౌన్సెలింగ్‌లో ఫార్మా-డి కోర్సులో ప్రవేశాలకు ఫార్మసీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందిన కళాశాలల సంఖ్య తక్కువగా ఉంది. రాష్ట్రంలో 52 కళాశాలలు ఉండగా ఇప్పటివరకు ఆరింటికి మాత్రమే అవకాశం లభించినట్లు సమాచారం. ఫార్మసీ కోర్సులో ప్రవేశాల కోసం బైపీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ నెల 20వ తేదీ ప్రాంతంలో కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉంది.

Published on 07.07.2016