Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

పెరుగుతున్న ఇంజినీరింగ్ కళాశాలలు

* అన్నీ జేఎన్‌టీయూహెచ్ పరిధిలోనివే
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ సీట్లకు కోతతో పాటు, కళాశాలలకు అనుబంధ గుర్తింపు మంజూరునూ నిరాకరించిన జేఎన్‌టీయూహెచ్.. క్రమంగా ఒక్కో దానికి అనుమతి మంజూరుచేస్తోంది. ఫలితంగా కౌన్సెలింగ్‌లో పాల్గొనే కళాశాలలు, అందుబాటులోని సీట్ల సంఖ్యా పెరుగుతోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిబంధనలతోపాటు విశ్వవిద్యాలయ నిబంధనల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఇంజినీరింగ్ బ్రాంచీలను తొలగించడమే కాక, కళాశాలలకు అనుబంధ గుర్తింపు(అఫిలియేషన్)నూ నిరాకరించి యాజమాన్యాలకు జేఎన్‌టీయూహెచ్ కంగు తినిపించిన సంగతి తెలిసిందే. 241 ఇంజినీరింగ్ కళాశాలలు అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేసుకుంటే 158కే ఆమోదం తెలిపినట్లు ఈనెల 3న వర్సిటీ ప్రకటించింది. ఆ సంఖ్య ఏడో తేదీకల్లా 173కు చేరింది. కొద్దిరోజుల్లో మరికొన్ని కళాశాలలకు అనుమతి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. రెండో విడత కౌన్సెలింగ్ నాటికి వాటి సంఖ్య భారీగానే పెరగనుందని భావిస్తున్నారు. మరికొన్ని ముస్లిం మైనారిటీ కళాశాలలూ కౌన్సెలింగ్ జాబితాలో చేరొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నాటికి కళాశాలతోపాటు కొన్నిచోట్ల తొలగించిన బ్రాంచీలకు అనుమతి దక్కనుంది. అధ్యాపకులు, ప్రయోగశాలల్లో పరికరాల కొరత, విశ్వవిద్యాలయ నామినీ లేకుండా నియామకాలు పూర్తిచేయటం వంటి కారణాలను చూపుతూ జేఎన్‌టీయూహెచ్ మొదట అనుమతి నిరాకరించింది. తర్వాత లోపాలపై వివరణ ఇస్తుండటం, యాజమాన్యాలు ప్రశ్నిస్తుండటంతో క్రమేణా కళాశాలలకు అనుమతినిస్తోంది. ఫలితంగా కళాశాలలు, సీట్ల సంఖ్య పెరుగుతోంది. ఐదోతేదీ తర్వాత అనుమతి ఇచ్చిన తొమ్మిది కళాశాలల వల్ల దాదాపు 2,100 సీట్లు పెరిగాయి. అనుబంధ గుర్తింపు పొందని కళాశాలలింకా 68 ఉన్నాయి. వాటిల్లో ఎన్నింటికి అనుమతిస్తారో తేలాల్సి ఉంది.
* పెరిగిన క్రమమిదీ..
జులై 3న: 158 కళాశాలలు
4న: 164
5న: 172
7న: 173
(గమనిక: ఈనెల 6న మరో 4 బీఫార్మసీ కళాశాలలకూ జేఎన్‌టీయూహెచ్ అనుమతి ఇచ్చింది. వాటికి నిర్ణయించిన ఫీజులపై ప్రభుత్వం జీవో జారీచేసింది.)

Published on 08.07.2016