Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

23, 24 తేదీల్లో ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్

* 'జోసా' నిర్ణయంతో మారిన తేదీలు
* బైపీసీ విద్యార్థులకు 18 నుంచి కౌన్సెలింగ్

ఈనాడు, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల్ని రెండు విడతలుగానే జరపాలని ఏపీ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. చివరి కౌన్సెలింగ్ ఈ నెల 23, 24 తేదీల్లో జరగనుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల్ని గతంలో ప్రకటించినట్లు నాలుగు విడతల్లో కాకుండా ఆరు విడతల్లో జరపాలని 'జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)' తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ మార్పు అవసరమయింది. ఐఐటీల కౌన్సెలింగ్ ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. అందువల్ల రాష్ట్రంలో కౌన్సెలింగ్‌ను ఈ నెల 15 నుంచి కాకుండా 23, 24 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో చేరే విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే మూడు దఫాలుగా కౌన్సెలింగ్ జరపాలని తొలుత అనుకున్నామని, అయితే ఆ ప్రవేశాలు 20వ తేదీలోపు ముగుస్తున్నందున మలివిడత లేకుండా ఒకేసారి తుది విడత నిర్వహించనున్నట్టు ఏపీ ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఈ నెల 25 లేదా 26వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది.
20వ తేదీ వరకు అవకాశం
తొలివిడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది, వెబ్‌సైట్ ద్వారా సెల్ రిపోర్టింగ్ చేసి, సంబంధిత కళాశాలల్లో చేరని వారికి ఈ నెల 20వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించారు. సీటు పొందినప్పటికీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వారు కూడా ఈ అవకాశాన్ని పొందొచ్చు. ఐఐటీ, ఎన్ఐటీ, ఇతరచోట్ల సీట్లు పొందిన వారు సంబంధిత కళాశాలలకు సమాచారం ఇచ్చి ఉంటే ఈ నెల 20లోగా రద్దు చేసుకోవచ్చు. కళాశాలల వారీగా సీట్ల ఖాళీల వివరాల్ని ఈ నెల 22వ తేదీలోగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ప్రవేశాల పర్యవేక్షణాధికారి డాక్టర్ రఘునాధ్ తెలిపారు.
బైపీసీ విద్యార్థులకు 18 నుంచి కౌన్సెలింగ్
బీఫార్మసీ, ఫార్మా-డి, బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరే ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మరుసటిరోజు సీట్లను కేటాయించనున్నారు. ఈ నెల 11న అధికారిక ప్రకటన జారీచేయనున్నారు. 12న ఏపీఎంసెట్ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాల్ని అందుబాటులో ఉంచుతారు.

Published on 09.07.2016