Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

పారదర్శకత.. ప్రక్రియ సులభం

* వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌తో ప్రయోజనాలెన్నో
* ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ఈ ఏడాది నుంచి అమలు
* విద్యార్థులు ఇంటి నుంచే నమోదు చేసుకోవచ్చు
* ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఉపకులపతి రవిరాజు వెల్లడి

ఈనాడు, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్న వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. గతంలో కంటే మరింత పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 2016-17 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య, దంత కళాశాల్లో సీట్ల భర్తీకి వెబ్ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 12 నుంచి 17 వరకూ ఏపీ ఎంసెట్ రాసిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఈ సందర్భంగా రవిరాజు 'ఈనాడు'తో మాట్లాడారు.
* గతంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్ కోసం విశ్వవిద్యాలయానికి వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చేది. ప్రస్తుతం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ వల్ల ఆ పరిస్థితి ఉండదు. విద్యార్థులు ఇంటి దగ్గర నుంచే నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
* వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌లో కళాశాలల ఎంపిక విషయంలో అభ్యర్థులు తడబడాల్సిన పనేలేదు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యాక.. వారికి వెబ్ ఆప్షన్ల నమోదుకు మరికొంత సమయం ఉంటుంది. కళాశాలల ఆప్షన్ల నమోదు ప్రక్రియను వివరించే వీడియోను రూపొందించి 'డబ్లూడబ్లూడబ్ల్యూ.ఎంఈడీఏడీఎం.ఏబీఎస్‌సీహెచ్ఈ.ఏపీ.ఇన్, ఎన్‌టీఆర్‌యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్‌సైట్లలో ఉంచుతాం. ఈ నెల 12 నుంచి ధ్రువపత్రాల పరిశీలన సమయంలోనే వెబ్ ఆప్షన్ల నమోదుపై అక్కడి సిబ్బంది అవగాహన కల్పిస్తారు. 8978780501, 7093924743 ఫోన్ నెంబర్లలోనూ సంప్రదించొచ్చు.
* విజయవాడలోని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం, తిరుపతి ఎస్వీయూ, విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ, హైదరాబాద్ జేఎన్‌టీయూల్లో సహాయ కేంద్రాలు (హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేస్తాం. ఎలాంటి సందేహాలున్నా.. వీటిలో సంప్రదించవచ్చు.
* జులై ఆఖరు లేక ఆగస్టు మొదటి వారంలో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ఉంటుంది. దీనికోసం మరో ప్రకటన విడుదల చేస్తాం.
* ఏపీ ఎంసెట్ రాసిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వ కళాశాలల సీట్లు, ప్రైవేటు కళాశాలల్లోని కన్వీనర్ కోటా, విజయవాడలోని సిద్ధార్థ రాష్ట్రస్థాయి మెడికల్ కళాశాల, 15 శాతం నాన్‌లోకల్ కోటా సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులందరికీ ప్రకటించిన తేదీల్లో ఒకేసారి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నాం.
* ఏపీలో 3,100 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 1800, ఎస్వీయూ పరిధిలో 1300 ఉన్నాయి. బీడీఎస్ సీట్లు 1250 ఉండగా.. ఏయూ పరిధిలో 900, ఎస్వీయూ పరిధిలో 350 ఉన్నాయి. ఇవి కాకుండా విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఎంబీబీఎస్ 150, దంత వైద్య కళాశాలలో 40 సీట్లున్నాయి. వీటిని ఏయూకు 42 శాతం, ఓయూకు 36 శాతం, ఎస్వీయూకు 22 శాతం నిష్పత్తిలో పంచడం జరుగుతుంది.

Published on 09.07.2016