Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఎంసెట్-2 ప్రాథమిక 'కీ' విడుదల

* పరీక్షకు 90.76 శాతం హాజరు
* ఆలస్యంగా చేరుకొని కన్నీళ్లు పెట్టిన విద్యార్థులు
* పరీక్షాకేంద్రాల సమాచారం లేమిపై తల్లిదండ్రుల ఆగ్రహం

ఈనాడు, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి శనివారం నిర్వహించిన తెలంగాణ ఎంసెట్-2కు 90.76 శాతం మంది హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినా.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య, పరీక్షా కేంద్రాలు దూరంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు వచ్చి.. అనుమతించకపోవడంతో కన్నీళ్లతో వెనుదిరిగారు. మరోవైపు జేఎన్‌టీయూహెచ్‌లో పరీక్షా కేంద్రాల అయోమయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్-2ను రెండు తెలుగు రాష్ట్రాల్లో 95 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 56,153 మందికి హాల్‌టికెట్లు జారీకాగా వారిలో 50,964 మంది (90.76 శాతం) హాజరయ్యారు. అత్యధికంగా హైదరాబాద్ జోన్ 'సీలో 94.65 శాతం మంది పరీక్ష రాయగా.. అత్యల్పంగా ఆదిలాబాద్ జోన్ పరిధిలో 82.94 శాతం మందే హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ హాజరు నమోదు చేశారు. అధికారులు ముందుగా ప్రకటించినట్లుగానే సాయంత్రానికి ప్రాథమిక 'కీ'ని విడుదల చేశారు. ప్రశ్నాపత్రంలో తప్పులు ఏమీ లేవని, 'కీ' పై అభ్యంతరాలుంటే ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఈమెయిల్ పంపించాలని ఎంసెట్ కన్వీనర్ ఆచార్య ఎన్‌వీ రమణారావు తెలిపారు. ప్రాథమిక 'కీ'ని వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. ఈనెల 14వ తేదీన ర్యాంకులను ప్రకటిస్తారు.
జేఎన్‌టీయూహెచ్‌లో ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఏది ఎక్కడో తెలియక విద్యార్థులు పలు చోట్ల తిరిగారు. చెప్పే అధికారులు కూడా లేకపోవడంతో తల్లిదండ్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు నగరంలోని ఒక వైపు నివాసం ఉండే వారికి నగరానికి మరో వైపు ఉన్న పరీక్షా కేంద్రాను కేటాయించారు. దాంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉప్పల్‌లో ట్రాఫిక్ జామ్‌తో కొందరు ఓయూకు ఆలస్యంగా చేరుకొని వెనుదిరిగారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించమని అధికారులు స్పష్టంచేయడంతో పలువురు విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోకి ఉరుకులు పరుగులు పెట్టారు. మాసబ్‌ట్యాంకులోని ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం గేట్లు మూసి వేసినా కొందరు విద్యార్థులు దూరి లోపలికి వెళ్లారు.

Published on 10.07.2016