Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఆదరణ ఉన్న సీట్లపైనే అంకుశం

* 6 బ్రాంచీల్లో అత్యధిక కోత
* ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లకు నేటి అర్ధరాత్రి దాకా అవకాశం

ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్‌లో విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్న బ్రాంచీల్లోని సీకే ఈ సారి జేఎన్‌టీయూహెచ్ కోత పెట్టింది. ప్రధానంగా ఆరు బ్రాంచీల్లోనే దాదాపు 15 వేల సీట్లు తగ్గిపోయాయి. అత్యధికంగా ఈసీఈలో సీట్ల సంఖ్య తగ్గింది. ఫలితంగా సీఎస్ఈ, ఈసీఈ లాంటి కోర్సులకు పోటీ అధికంగా ఉండనుంది.
తెలంగాణలో గత ఏడాది మొత్తం 32 ఇంజినీరింగ్ బ్రాంచీల్లో దాదాపు 85 వేల కన్వీనర్ కోటా సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి వాటి సంఖ్య 68,747కి పడిపోయింది. ఆరు ప్రధాన బ్రాంచీల్లోనే 14,740 సీట్లు తగ్గిపోయాయి.
కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించి ఒక ప్రముఖ కళాశాలలోనే నాలుగు సెక్షన్లలోని 240 సీట్లు రద్దయ్యాయి.
మొదటి విడత కౌన్సెలింగ్ కింద వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. సీట్లు తగ్గినందున ప్రధాన బ్రాంచీలైన సీఎస్ఈ, ఈసీఈ లాంటి కోర్సులకు పోటీ అధికంగా ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దాదాపు 66,300 మంది 33 లక్షలకుపైగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. సగటున ఒక్కో విద్యార్థి 47 ఆప్షన్లు ఇచ్చుకున్నారు.
రెండో విడతకు మరిన్ని సీట్లు..
ఈనెల 16న మొదటి విడత కింద సీట్లు కేటాయిస్తారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 24, 25వ తేదీల్లో జరగనుంది. ఈ క్రమంలో అప్పటికి సెక్షన్లు, బ్రాంచీలను తొలగించిన, అనుబంధ గుర్తింపు ఇవ్వని కొన్ని కళాశాలలకు మళ్లీ అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
పీజీ సీట్లకు అనుమతులు నెమ్మదిగా..
బీటెక్, బీ ఫార్మసీ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఎంటెక్, ఎంఫార్మసీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ మొదలవుతుంది. అందుకు చాలా సమయం ఉన్నందున ఎంటెక్, ఎంఫార్మసీ సీట్లకు అనుమతుల జారీ నెమ్మదిగా ప్రారంభించాలని వర్సిటీలు భావిస్తున్నాయి.

Published on 13.07.2016