Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఎంబీబీఎస్ వెబ్ ఆధారిత ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 2016-17 విద్యాసంవత్సరానికి సంబంధించి వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల ప్రవేశానికి సంబంధించి వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమైంది. హైదరాబాద్ జేఎన్‌టీయూ, విశాఖపట్నం ఆంధ్రా వైద్య కళాశాల, తిరుపతి ఎస్వీయూ, విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కేంద్రాల్లో ఉదయం తొమ్మిదింటికి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటిసారి వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కావడంతో అధికారులు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. బీసీ కులాల ధ్రువీకరణ పత్రాల జారీ పేరుతో దళారులు దండుకుంటున్నారని 'ఈనాడు-ఈటీవీ బట్టబయలు చేయడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయకపోవడంతో కొంత మంది అభ్యర్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మొదటి రోజున ఒకటో ర్యాంకు నుంచి 1500 ర్యాంకుల వారి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో 188 మంది, ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో 382 మంది, జేఎన్‌టీయూ(హైదరాబాద్)లో 543 మంది, తిరుపతి ఎస్వీయూలో 244 మంది కలిపి మొత్తం 1357 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయించుకున్నారు. బుధవారం 1501 ర్యాంకు నుంచి 4500 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది.

Published on 13.07.2016