Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

వైద్య విద్యార్థులకు అవస్థలు

* ‘స్థానికత’పై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కరవు
* ధువపత్రాల పరిశీలనలో గందరగోళం

ఈనాడు -హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తోంది. ‘స్థానికత’పై భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనందున వారు అయోమయంలో పడుతున్నారు. మార్గదర్శకాలను జారీచేసే అంశంపై ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో చర్చించినప్పటికీ నిర్ణయం వెలువడలేదు. స్థానికత అంశంపై 371డీకి సవరణలు చేస్తూ జూన్‌ 9న రాష్ట్రపతి రాజముద్ర వేశారు. 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ రెండో తేదీలోగా ఏపీకి వెళ్లిన వారికి స్థానికులతో సమానంగా గుర్తింపు లభిస్తుందని అందులో పేర్కొన్నారు. విద్యా విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తుందని స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల జారీలో మాత్రం జాప్యం కొనసాగుతూనే ఉంది. మరోవైపు విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో వైద్య విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జులై 12 నుంచి మొదలైంది.
మా గోడును పట్టించుకోవడం లేదు: విద్యార్థులు, తల్లిదండ్రులు
ధ్రువపత్రాల పరిశీలన నోటిఫికేషన్‌ అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ వాసులై హైదరాబాద్‌, ఇతర చోట్ల ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాష్ట్రపతి జారీ చేసిన ప్రకటన ప్రకారం స్వరాష్ట్రానికి స్థానికులుగా తమను గుర్తిస్తారని ఆశించారు. పలువురు ఇక్కడినుంచి ఏపీకి కూడా వెళ్లిపోయారు. ఓ విద్యార్థిని కుటుంబం కిందటేడాది హైదరాబాద్‌ నుంచి ఏలూరుకు వెళ్లింది. ఆధార్‌కార్డు చిరునామాను సైతం ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకుంది. విజయవాడ, హైదరాబాద్‌ జేఎన్‌టీయూ కేంద్రాల్లో జరిగిన ధ్రువపత్రాల పరిశీలనకు హైదరాబాద్‌, ఇతర చోట్ల ఉండి ఏపీకి వెళ్లిన వారు కూడా హాజరయ్యారు. ఓ విద్యార్థినికి వచ్చిన ర్యాంకు ప్రకారం స్థానిక కోటాలోనైతే ఏయూ మినహా గుంటూరు, విజయవాడ, ఇతర చోట్ల సీటు వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన సీట్ల భర్తీ తీరును అనుసరించి ఈ విద్యార్థిని హైదరాబాద్‌ జేఎన్‌టీయూ కేంద్రానికి వెళ్లారు. విద్యార్థినిని ఏపీలో స్థానికురాలిగా గుర్తించలేమని, స్థానికేతర కోటా కిందకు వస్తారని అక్కడి నిర్వాహకులు చెప్పారు. ఇలా మరో ఐదారుగురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేంద్రానికి వచ్చి అయోమయంలో పడినట్లు తెలిసింది. విజయవాడలోనూ ఇలాగే ఇద్దరు విద్యార్థులు తమను స్థానికులుగా గుర్తించాలని అక్కడి అధికారులను ప్రాధేయపడ్డారు. వారి అభ్యర్థననూ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. తమకు ఎదురైన ప్రతికూల పరిస్థితులను నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం విజయవాడలో ఉన్న అధికారులకు ఫోన్లో వివరించేందుకు ప్రయత్నించగా అవి అసలు పనిచేయడం లేదని ఓ విద్యార్థి తండ్రి ‘ఈనాడు’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ఇతరచోట్ల విద్యార్థులు చదివినట్లయితే అలాంటి వారి తల్లిదండ్రులు పదేళ్లపాటు ఏపీలో ఉన్నట్టు స్థానిక (రెసిడెన్షియల్‌) ధ్రువపత్రం తీసుకురావాలని ప్రవేశాల నోటిఫికేషన్‌లో పేర్కొనడం వెనక అంతరార్థం తెలియడం లేదని పేర్కొన్నారు. దీన్ని తాము ‘స్థానిక’ సర్టిఫికేట్‌ అంశానికి సంబంధించిందిగా భావించి వ్యయప్రయాసలకోర్చి తెచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
ఆదేశాలకు అనుగుణంగా చర్యలు: రిజిస్ట్రార్‌
‘స్థానికత’పై ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ అనూరాధను వివరణ కోరగా.. స్థానిక, స్థానికేతర అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు తమకు కొత్తగా ఎలాంటి ఆదేశాలు రాలేవని అన్నారు. కిందటేడాది విధానాన్నే అనుసరిస్తున్నామని, ప్రస్తుతం విద్యార్థుల ధ్రువపత్రాలను మాత్రమే పరిశీలిస్తున్నామని వివరించారు. వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా ఆప్షన్ల నమోదుకు సమయం ఉందని, ఈలోగా ప్రభుత్వ ఆదేశాలు వస్తే దానికి అనుగుణంగా అర్హతలు కలిగిన వారి ధ్రువపత్రాలను పరిశీలించేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఏమీ చేయలేమని అన్నారు. సహాయ కేంద్రం ఫోన్‌నంబర్లు పనిచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

Published on 13.07.2016