Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

వచ్చే నెల మొదటివారంలో వైద్యవిద్య ప్రవేశాలు

* ఈనెల 25 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
* కన్వీనర్ కోటా షెడ్యూల్‌ను విడుదల చేసిన మంత్రి లక్ష్మారెడ్డి

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్యవిద్య సీట్ల ప్రవేశాల ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించనున్నారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ప్రవేశాల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణలో జేఎన్‌టీయూ, ఉస్మానియా వర్సిటీ, కాకతీయ వర్సిటీల్లోని కేంద్రాలతోపాటు విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలోనూ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. బుధవారం సచివాలయంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మంత్రి విడుదల చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ అనంతరం ఆయుష్ సీట్ల ప్రవేశాల ప్రక్రియను చేపడతామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్య సీట్ల భర్తీకి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇంకా తేదీలను ప్రకటించకపోవడంతో.. తెలంగాణలోనూ తేదీల ప్రకటనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల ప్రవేశాలు ఒకేసారి నిర్వహిస్తే విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయనీ.. అందుకే ఏపీలో తొలివిడత ప్రవేశాలు పూర్తయిన అనంతరం తెలంగాణలో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తామని కాళోజీ విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్న ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1060, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 720 ఉన్నాయి. బీడీఎస్ సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో 140 ఉండగా, ప్రైవేటు కళాశాలల్లో 500 ఉన్నాయి.
షెడ్యూల్ ఇలా..
* ఈనెల 25 నుంచి 29 వరకూ జనరల్ కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన
* ఈనెల 30, 31 తేదీల్లో వికలాంగులు, ఆర్మీ, క్రీడా తదితర ప్రత్యేక కేటగిరీల విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన
* ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల ప్రక్రియ

Published on 14.07.2016