Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

22 నుంచి టీఎస్ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌!

* జులై 30 నాటికి రెండు విడతల్లో సీట్ల కేటాయింపు
* ఆగస్టు 2 నుంచి తరగతులు
* త్వరలో తేదీల వారీగా షెడ్యూల్‌ ఖరారు

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలోని వివిధ దశల నిర్వహణకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ మరో రెండుమూడు రోజుల్లో ఖరారుకానుంది. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ను మే 15న నిర్వహించగా ఫలితాలు మే 26న విడుదలయ్యాయి. సాధారణంగా ఫలితాలు విడుదల నాడు ప్రవేశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తుంటారు. అయితే, జేఎన్‌టీయూహెచ్‌ తనిఖీలు పూర్తయినా...విజిలెన్స్‌ తనిఖీ నివేదికలు వచ్చాకే పరిశీలించి కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుందని, అందువల్ల మరో వారం రోజుల్లో షెడ్యూల్‌ ఖరారు చేస్తామని ఫలితాల విడుదల సమయంలో విద్యాశాఖ మంత్రి కడియం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రాథమికంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రభుత్వం మే 31న ఖరారు చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి ప్రకటించారు.
కౌన్సెలింగ్‌ ప్రక్రియ 39 రోజులు
ఈసారి జూన్‌ 22వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమై... జులై 30కి ముగుస్తుంది. అంటే మొత్తం కౌన్సెలింగ్‌ ప్రక్రియకు 39 రోజుల సమయం పట్టనుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌కు ధ్రువపత్రాల పరిశీలన 10 రోజుల వరకు సమయం పడుతుంది. ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైన మూడు నాలుగు రోజుల తర్వాత కళాశాలలు, కోర్సుల ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియ మొదలవుతుంది. అంటే జూన్‌ 26వ తేదీకల్లా అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలలు, సీట్లు ఖరారు కాక తప్పదు. దీనినిబట్టి జూన్‌ రెండో వారం కల్లా విజిలెన్స్‌ తనిఖీలు కూడా పూర్తవుతాయని స్పష్టమవుతుంది.
మెయిన్‌, అడ్వాన్సుడ్‌ ర్యాంకర్లూ వస్తారు
జేఈఈ అడ్వాన్సుడ్‌ ఫలితాలు జూన్‌ 12న విడుదలవుతాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలకు గత ఏడాది నుంచి సంయుక్త కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్‌ ర్యాంకులు వెల్లడి కావాలంటే అన్ని రాష్ట్రాల్లో ఇంటర్‌ ఫలితాలు రావాలి. మెయిన్‌ ఫలితాలు జూన్‌ 27వ తేదీలోపు వెల్లడవుతాయి. ఒకవేళ వాటి ఫలితాలు వారం ముందు వచ్చినా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ చివరలో ప్రారంభమవుతుంది. దాంతో ర్యాంకు వచ్చినా సీటు వస్తుందో రాదోనన్న అయోమయంలో ఉన్నవారు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు కూడా హాజరవుతారని భావిస్తున్నారు.
ఇదీ ప్రాథమిక షెడ్యూల్‌...
జూన్‌ 22: ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
జులై 30: తుది విడత (సాధారణంగా రెండో విడత) సీట్ల కేటాయింపు
ఆగస్టు 2: తరగతులు ప్రారంభం(జులై 31 ఆదివారం, ఆగస్టు 1 బోనాల సందర్భంగా సెలవు దినం. అందువల్ల గతంలో ప్రకటించిన ఆగస్టు 1వ తేదీకి బదులు 2 నుంచి తరగతులు మొదలవుతాయి.)

published on 01.06.2016