Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

వంద ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ

* ఒక్కరూ చేరనవి రెండు
* 57,940 మందికి సీట్ల కేటాయింపు
* ఆప్షన్లు ఇచ్చుకున్నా సీట్లు దక్కనివారు 8,626
* మొదటి విడత కేటాయింపు తర్వాత 11,183 సీట్లు ఖాళీ
* 22లోపు కళాశాలల్లో చేరాలి

ఈనాడు - హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌లో ఈసారి సీట్ల సంఖ్య తగ్గడంతో సీట్లన్నీ భర్తీ అయిన కళాశాలల సంఖ్య తెలంగాణలో భారీగా పెరిగింది. మొదటి విడత సీట్లను ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ జులై 16న కేటాయించగా మొత్తం 198 ఇంజినీరింగ్‌ కళాశాలలకు.. 100 కాలేజీల్లో నూరు శాతం సీట్లు భర్తీ కావడం విశేషం.
ఎంసెట్‌లో ఉత్తీర్ణులై ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు అధికారులు జులై 16న ఉదయం 10గంటల ప్రాంతంలో సీట్లు కేటాయించారు. ఎంపీసీ విద్యార్థులకు ఇంజినీరింగ్‌తోపాటు బీఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ఉంది. సీట్లు కేటాయించిన వెంటనే విద్యార్థుల ఫోన్లకు సమాచారం అందింది. ఇంజినీరింగ్‌లో సగటున 86.6శాతం సీట్లు భర్తీ కాగా, బీఫార్మసీలో 5.4శాతం, ఫార్మా డిలో 12శాతం సీట్లే నిండినట్లు ఎంసెట్‌ ప్రైవేశాల కమిటీ కన్వీనర్‌ డాక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. తొలివిడతలో ఇంజినీరింగ్‌లో 57,789 సీట్లను విద్యార్థులకు కేటాయించారు(వారిలో అందరూ చేరకపోవచ్చు). ఇంకా ఇంజినీరింగ్‌లో 11,183 సీట్లు మిగిలాయి.
గతేడాది 68 కళాశాలలే...: గతేడాది సీట్లన్నీ నిండిన కళాశాలలు 68 ఉండగా...ఈసారి వాటి సంఖ్య 100కి పెరగడం విశేషం. గతేడాది 266 కళాశాలలుండగా ఈసారి 198కి తగ్గాయి. కన్వీనర్‌ సీట్ల సంఖ్యా దాదాపు 85వేల నుంచి ఈసారి 66,695కు పడిపోయింది. దీంతో ఈసారి 100శాతం నిండిన కళాశాలలు పెరిగాయని అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఆప్షన్లు తక్కువ ఇచ్చుకున్నందుకు...: కొందరు విద్యార్థులు తక్కువ కళాశాలలను, తక్కువ కోర్సులను ఎంపిక చేసుకొని వెబ్‌ఆప్షన్లు ఇచ్చారు. ఫలితంగా అందుబాటులో ఉన్నా 8,626 మందికి సీట్లు దక్కలేదు.
సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తప్పనిసరి..: సీట్లు వచ్చినవారు జులై 22లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో చేరాలి. 21లోపు ఎస్‌బీహెచ్‌లో చలానా ద్వారా ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. ఆ అవసరం లేనివారు(పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వచ్చేవారు) వెబ్‌సైట్‌ ద్వారా కళాశాలల్లో చేరుతున్నట్లు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. దాని ప్రింటవుట్‌ తీసుకొని కళాశాలల్లో 22లోపు చేరాలి.
ట్యూషన్‌ ఫీజు(సున్నా కంటే ఎక్కువ) చెల్లించాల్సినవారు వెబ్‌సైట్‌ నుంచి చలానా ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో మూడు కౌంటర్‌ ఫాయిల్స్‌ ఉంటాయి. అందులో పేర్కొన ఫీజును ఎస్‌బీహెచ్‌లో చెల్లించాలి. వారు ఒకటి ఉంచుకొని, రెండు కౌంటర్‌ ఫాయిల్స్‌ ఇస్తారు. ఈపని 21లోపు పూర్తి చేసుకోవాలి. అనంతరం 4గంటల తర్వాత వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి ప్రవేశం పొందినట్లు వచ్చే రసీదును (ప్రింటవుట్‌) తీసుకోవాలి. దాని సాయంతో 22లోపు కేటాయించిన కళాశాలల్లో చేరాలి. కాలేజీల్లో చేరేటపుడు అసలు ధ్రువపత్రాలు ఇవ్వొద్దని, సీటు కేటాయింపు, ఫీజు చలానా, వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కాపీ తదితరాల నకళ్లు ఇవ్వాలని ఎంవీరెడ్డి తెలిపారు. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేనివారు, చెల్లించాల్సినవారు ఇద్దరికీ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తప్పనిసరని, లేకుంటే మొదటి విడతలో కేటాయించిన సీట్లు రద్దవుతాయని ఆయన హెచ్చరించారు.
ఐటీ ఫుల్‌: ఇంజినీరింగ్‌లోని ప్రధాన బ్రాంచీల్లో ఒక్క ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ)లోనే సీట్లన్నీ నిండాయి. ఇంజినీరింగ్‌, బీఫార్మసీ, ఫార్మా డిలతో కలుపుకొని 30 బ్రాంచీలుండగా మొత్తం 20 బ్రాంచీల్లో 100శాతం భర్తీ కానున్నాయి. ఇక సివిల్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఈసీఈ, ట్రిపుల్‌ఈలో పెద్దసంఖ్యలో సీట్లు అందుబాటులో ఉండటంతో అవి మిగిలిపోయాయని, తక్కువ సీట్లున్న బ్రాంచీల్లో మొత్తం సీట్లు నిండాయని అధికారులు చెబుతున్నారు.
20 బ్రాంచీల్లో సీట్లు లేవు: తక్కువ సీట్లున్న 20 బ్రాంచీల్లో సీట్లన్నీ నిండాయి. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌, ఆటోమొబైల్‌, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, డైరింగ్‌, డిజిటల్‌ టెక్నాలజీస్‌ ఫర్‌ డిజైన్‌ అండ్‌ ప్లానింగ్‌, ఫుడ్‌ సైన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, మెటలర్జీ తదితర 20 బ్రాంచీల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. వాటిల్లో చాలా బ్రాంచీలు విశ్వవిద్యాలయాల కళాశాలల్లోనే ఉండటంతో అవి నిండాయి.Published on 17.07.2016