Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఇంజినీరింగ్‌ విద్యార్థులూ.. జర భద్రం!

* వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి
* కళాశాలలో చేరితే స్వీయ నివేదిక ఇవ్వాలి
* 24, 25ల్లో తుది విడత కౌన్సెలింగ్‌

ఈనాడు - హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మొదటి విడతలో వచ్చిన సీటును కోల్పోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఇంజినీరింగ్‌ సీట్లను జులై 16న కేటాయించగా అధికారికంగా ఇంకా 11,183 సీట్లను ఎవరికీ కేటాయించలేదు. వాటిని జులై 24, 25వ తేదీల్లో ప్రారంభమయ్యే చివరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారికి కేటాయిస్తారు. మొదటిసారి సీటు వచ్చిన కళాశాల, కోర్సు నచ్చకపోతే వచ్చే కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈసారి ఎక్కడైనా సీటు వస్తే...మొదటిసారి వచ్చిన సీటు దానంతటదే(ఆటోమేటిగ్గా) రద్దు అవుతుంది. అంటే దాన్ని మరొకరికి కేటాయిస్తారు. ఒకవేళ చివరి విడతలో ఎక్కడా రాకుంటే మొదటిసారి వచ్చిన సీటు మాత్రం ఉంటుంది. తొలి విడతలో సీటు వచ్చిన విద్యార్థులు తప్పనిసరిగా వెబ్‌సైట్‌ ద్వారా కళాశాలలో చేరినట్లుగా స్వీయనివేదిక(సెల్ఫ్‌ రిపోర్ట్‌) ఇవ్వాలి. అలా చేయకుంటే అది రద్దు అవుతుంది. అప్పుడు చివరి కౌన్సెలింగ్‌లో పాల్గొన్నా ఎక్కడ సీటు వచ్చినా చేరక తప్పదు. అయితే చివరిగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునే ముందు తొలిసారి కళాశాల, కోర్సు కంటే మంచి వాటికి మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలని, లేకుంటే అంతకంటే నాసిరకం కళాశాలలో చేరాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
దాదాపు 15 వేల వరకు సీట్లు!
మొదటి విడతలో అధికారికంగా 11,183 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీటు వచ్చినా కళాశాల, కోర్సు నచ్చనివారు మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంది. వారితోపాటు తొలి కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకున్నా సీట్లు దక్కని వారు 8,626 మంది పోటీపడతారు. కొందరు బీ కేటగిరీ సీట్ల వైపు వెళ్లే అవకాశం ఉంది. దానికితోడు కొన్ని కళాశాలలకు చివరి కౌన్సెలింగ్‌ నాటికి అనుబంధ గుర్తింపు, కొన్ని బ్రాంచీల్లో సీట్ల పునరుద్ధరణకు అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదు. దానిపై యాజమాన్యాలు సైతం జులై 18 ఆందోళనకు దిగనున్నాయి. మొత్తానికి సీట్లు 15 వేలకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
వెబ్‌సైట్లో ఖాళీల వివరాలు
ఏయే కళాశాలల్లో, ఏ బ్రాంచీల్లో సీట్లు మిగిలాయో వివరంగా వెబ్‌సైట్‌లో ఉంచారు. వెబ్‌సైట్‌ నుంచి వివరాలను తెలుసుకోవచ్చని ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. సీటు దక్కిన వారు ఎట్టి పరిస్థితుల్లో అసలు ధ్రువపత్రాలు ఇవ్వొద్దని, కళాశాలల సిబ్బంది కూడా తీసుకోవద్దని ఆయన సూచించారు.
https://tseamcet.nic.in/Default.aspx

Published on 18.07.2016