Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

10 తర్వాతే వైద్యవిద్య కౌన్సెలింగ్‌

* యథాతథంగా ధ్రువపత్రాల పరిశీలన
* ఏపీ కస్టోడియన్‌ ధ్రువపత్రాలు తెలంగాణలో చెల్లుబాటు కావు
* కాళొజీ విశ్వవిద్యాలయ ఉపకులపతి కరుణాకరరెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకు ఆగస్టు 10 తర్వాతే కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ఈ విషయాన్ని కాళొజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి జులై 22న వెల్లడించారు. జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్‌) 24న జరుగుతుందని, అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 9 వరకూ గడువుందని, ఆ తర్వాతే తెలంగాణలో ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తామని చెప్పారు. ఎంసెట్‌ ప్రశ్నపత్రం బహిర్గతమైందని అనడానికి ఇప్పటివరకు కచ్చితమైన ఆధారాలేమీ లభ్యం కాలేదనీ... ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన గతంలో ప్రకటించినట్లుగానే కొనసాగుతుందని ఆయన ‘ఈనాడు’కు వెల్లడించారు. జులై 25 నుంచి 30 వరకూ జనరల్‌ కేటగిరీ... 31 నుంచి ఆగస్టు 2 వరకు క్రీడా, వికలాంగ, రక్షణ, పోలీసు అమరవీరులు తదితర ప్రత్యేక విభాగ విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్య సీట్ల భర్తీకి తొలివిడత కౌన్సెలింగ్‌ పూర్తయిన కనీసం వారం రోజుల తర్వాతే తెలంగాణలో తొలిదశ కౌన్సెలింగ్‌ను చేపడతామనీ, రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి కౌన్సెలింగ్‌ చేపడితే విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదముందన్నారు. ‘‘ఏపీలో సీట్లు పొందిన విద్యార్థులు అక్కడ కౌన్సెలింగ్‌లో తమ ధ్రువపత్రాలను అందజేసి... అందుకు రుజువుగా పొందిన కస్టోడియన్‌ సర్టిఫికెట్‌లు తెలంగాణ కౌన్సెలింగ్‌లో చెల్లుబాటు కావు. ధ్రువపత్రాల పరిశీలనలో ఒరిజనల్స్‌ను సమర్పిస్తేనే పరిగణనలోకి తీసుకుంటారు. కాళొజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించే తొలి కౌన్సెలింగ్‌ ద్వారా తెలంగాణలోని వైద్య కళాశాలల్లో సీటు పొందిన విద్యార్థి... మలివిడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకుంటే, అప్పుడు తెలంగాణలో పొందిన కస్టోడియన్‌ సర్టిఫికెట్‌ చెల్లుబాటు అవుతుంది’’ అని ఉపకులపతి వివరించారు.

Published on 23.07.2016