Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

అప్రమత్తంగా లేకుంటే సీటు గల్లంతే!

* అవసరమైన పత్రాలుంటేనే సజావుగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌
* ఒక్కటి లేకున్నా రెండో కౌన్సెలింగ్‌కు వెళ్లక తప్పదు
* అప్పటికి మిగిలేది నాసిరకం కళాశాలల్లో సీట్లే
* అధికారుల సూచనలు

ఈనాడు - హైదరాబాద్‌: రమేష్‌...పేద కుటుంబానికి చెందిన వాడు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో 8,500 ర్యాంకు సాధించాడు. మంచి కళాశాలలో సీటు వస్తుందని ఆశించాడు. బోధనా రుసుం వస్తుందని...కుటుంబానికి ఆర్థిక భారం ఉండదని ఆనందంగా ఉన్నాడు. కౌన్సెలింగ్‌కు వార్షిక ఆదాయం రూ.లక్ష ఉన్న ధ్రువపత్రం తీసుకెళ్లాడు. నిబంధనల ప్రకారం 2015 జనవరి 1 తర్వాత పొందిన ఆదాయ ధ్రువపత్రాన్నే అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. అక్కడే పొరపాటు చేశాడు. ఫలితంగా మొదటి విడత కౌన్సెలింగ్‌ను విరమించుకున్నాడు. రెండో విడతలో పాల్గొన్నా అప్పటికే మంచి కళాశాలల్లో సీట్లు భర్తీ అయ్యాయి. విద్యార్థులు చేసిన ఇలాంటి పొరపాట్లు కారణంగా గత ఏడాది ఎంతో మంది మంచి కళాశాలల్లో సీట్లు కోల్పాయారు. కొందరు ఆర్థిక భారం మోశారు. రిజర్వేషన్‌ ఉన్నా తగిన ధ్రువపత్రాలు సమర్పించక జనరల్‌ విభాగంతో సరిపెట్టుకొని, ఆశించిన కళాశాలలో కోరుకున్న గ్రూపులో చేరలేకపోయారు. అలాంటి పొరపాట్లు ఈసారి అభ్యర్థులు చేయవద్దని ప్రవేశాల కమిటీ అధికారులు సూచిస్తున్నారు. జూన్ 22వ తేదీ నుంచి తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ జరగనున్నందున ఇక మిగిలింది 20 రోజులే. ఈలోగా ఆయా ధ్రువపత్రాలను సేకరించుకోవాలని, ముఖ్యంగా రెండుమూడు జిల్లాల్లో చదివిన వారు, రిజర్వేషన్‌ ఉన్న వారు ముందుగా మేల్కోవాలని హెచ్చరిస్తున్నారు. చివరి నిమిషంలో ధ్రువపత్రం కోసం వెళితే ప్రధానోపాధ్యాయులు, తహసీల్దార్లు అందుబాటులో లేకుంటే నష్టపోతారని చెబుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తీసుకున్న కుల ధ్రువపత్రాలు మాత్రమే...
రిజర్వేషన్‌ ఉన్నవారు ఎప్పుడో తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం చెల్లదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అంటే 2014 జూన్‌ 2 నుంచి తీసుకున్న దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం సైతం 2016 జనవరి 1 తర్వాత పొందినది మాత్రమే చెల్లుతుంది. ఎస్సీ, ఎస్టీలకు ఎంత ర్యాంకు వచ్చినా రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే పూర్తి బోధనా రుసుం చెల్లిస్తారు. ఇతరులకు మాత్రం 10 వేల లోపు ర్యాంకు వచ్చి... గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైతే వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు, పట్టణాలకు చెందిన వారైతే రూ.2 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి పూర్తి బోధనా రుసుం ఇస్తారు.
కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలివీ...
* ఎంసెట్‌ హాల్‌టికెట్‌
* ఎంసెట్‌ ర్యాంకు కార్డు
* 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు బోనఫైడ్‌ ధ్రువపత్రాలు (వీటిని బట్టే మీరు స్థానికులా? స్థానికేతరులా? అనేది పరిగణనలోకి తీసుకుంటారు)
* పది, ఇంటర్‌ మార్కుల మెమోలు
* ఆదాయపు ధ్రువపత్రం
* రిజర్వేషన్‌ ఉన్న వారు కుల ధ్రువపత్రం
* ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాలు (ఎన్‌సీసీ, క్రీడలు, ఆర్మీ కుటుంబాలకు చెందిన, దివ్యాంగులు. ఎన్‌సీసీకి- ఒక శాతం, దివ్యాంగులకు 3 శాతం, ఆర్మీ కుటుంబాలకు చెందిన వారికి 2 శాతం, క్రీడాకారులకు 0.5 శాతం...మొత్తం 6.5 శాతం రిజర్వేషన్‌ ఇస్తారు. కళాశాలలో ఉన్న మొత్తం సీట్లను పరిగణలోకి తీసుకొని ఈ రిజర్వేషన్‌ వర్తింపజేస్తారు).
అసలు ధ్రువపత్రాలను తీసుకోం
కౌన్సెలింగ్‌కు అసలు ధ్రువపత్రాలతోపాటు రెండు సెట్ల నకలు ధ్రువపత్రాలను తీసుకొని రావాలి. అసలు ధ్రువపత్రాలను తనిఖీ చేసి వెనక్కి ఇస్తాం. నకలు పత్రాలను మాత్రం తీసుకుంటాం. అసలు ధ్రువపత్రాలను కళాశాలల్లో చేరినప్పుడు అక్కడ అందజేయాలి.
- బి.శ్రీనివాస్‌, ప్రవేశాల క్యాంపు ఆఫీసర్‌

published on 02.06.2016