Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - 2014 Medicine Toppers Voice
 • న్యూరాలజిస్ట్‌ కావడమే లక్ష్యం

  సాయిశ్రీనివాస్‌ (మొదటి ర్యాంకు)

   'మంచి న్యూరాలజిస్ట్‌ కావడమే నా లక్ష్యం. తమిళనాడులోని వెల్లూరు సీఎంసీ కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటికే ముఖాముఖికి అర్హత సాధించా. ఏఐఐఎంఎస్‌, జిప్‌మర్‌ ఫలితాలు రావాల్సి ఉంది. విజయవాడ శ్రీచైతన్యకు చెందిన గోశాల భరద్వాజ భవన్‌ ప్రాంగణంలో చదివా. ప్రథమ సంవత్సరంలో ర్యాంకుల గురించి ఆలోచించలేదు. ద్వితీయ సంవత్సరంలో మా అమ్మ డాక్టర్‌ రాధిక మంచి ర్యాంకు సాధించాలని ప్రోత్సహించారు. టాప్‌-10లో చోటు ఉంటుందని వూహించా. రాష్ట్రంలో టాపర్‌గా నిలుస్తానని వూహించలేదు. పదో తరగతి చదివేటప్పుడు ఐఐటీ చేయాలని ఆశయం ఉండేది. తల్లిదండ్రులిద్దరూ వైద్యులు కావడంతో సేవ చేయడానికి మంచి వృత్తిగా భావించే డాక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నా.'
   కుటుంబ నేపథ్యం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన వైద్యులు గుర్రం మోహన్‌రామ్‌, రాధికల కుమారుడు సాయిశ్రీనివాస్‌. 'ఈనాడు' నిర్వహించిన మాక్‌ ఎంసెట్‌లో మెడికల్‌ విభాగంలో ఈ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు పొందడం విశేషం.
 • చిన్ననాటి నుంచీ కోరిక

  దివ్య (రెండో ర్యాంకు)

   'చిన్ననాటి నుంచి డాక్టర్‌ కావాలని కోరిక ఉండేది. అందుకే మెడిసిన్‌ను ఎంచుకున్నా. రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు వచ్చేందుకు మా కళాశాల అధ్యాపకులు సహకరించారు. తల్లిదండ్రుల కృషివల్ల ర్యాంకు రావడంతో ఎంతో ఆనందంగా ఉంది.'
   కుటుంబ నేపథ్యం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో మహిళా శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న అరుణా భాస్కర్‌ కుమార్తె బి.దివ్య. దివ్య తండ్రి భాస్కర్‌ రామ్మూర్తి చెన్నైలోని ఎఫ్‌ఎల్‌ స్మిత్‌లో డీజీఎంగా పని చేస్తున్నారు. విజయవాడలోని చైతన్యనారాయణలో ఇంటరు బైపీసీ చదివి, ఆ క్యాంపస్‌లోనే మెడిసిన్‌ కోచింగ్‌ తీసుకుంది. ఈ బాలిక స్వస్థలం చెన్నైలోని తామ్రం. తల్లి అరుణా భాస్కర్‌ ఉద్యోగ రీత్యా షార్‌లో ఉంటున్నారు. దివ్య ఇటీవల 'ఈనాడు' నిర్వహించిన మాక్‌ ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు.
 • పట్టుదలతో సాధించా

  పృథ్వీరాజ్‌ (మూడో ర్యాంకు)

   'పట్టుదల, లక్ష్యం ఉంటే ర్యాంకు సాధించవచ్చు. నిత్యం మనసులగ్నం చేసి 6గంటలపాటు చదివి ర్యాంకు సాధించా.'
   కుటుంబ నేపథ్యం: దిల్‌సుఖ్‌నగర్‌లోని మైత్రీనగర్‌లో నివసించే పృథ్వీరాజ్‌ తల్లి శ్రీలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, తండ్రి నారాయణ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
 • ఇష్టంగా చదివా

  దారపునేని హరిత (4వ ర్యాంకు)

   'చిన్ననాటి నుంచే సైన్స్‌ పాఠ్యాంశాలంటే ఇష్టం. దీంతో ఇంటర్‌లో బైపీసీ గ్రూపును ఎంపిక చేసుకున్నా. 4వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. పాఠ్యాంశాలపై పట్టు సాధించడం, సైన్స్‌ ఫార్ములాలను ఒంటపట్టించుకోవడం ద్వారా ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకును సాధించగలిగా. బోటనీ, కెమిస్ట్రీ పాఠ్యాంశాలను ఇష్టంగా చదివా. కళాశాలలో రోజూ నిర్వహించే పరీక్షలకు హాజరుకావడం ద్వారా పరీక్షను ఎదుర్కోవడంపై ఆత్మవిశ్వాసం కనబరిచా. కళాశాలలో చదివిన అంశాలనే ఎలాంటి ఒత్తిడి లేకుండా పునశ్చరణ చేసుకున్నా. గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదవాలని ఉంది. భవిష్యత్తులో కార్డియాలజిస్ట్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నా.'
   కుటుంబ నేపథ్యం: నాన్న శ్రీనివాస్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ రజని గృహిణి. గుంటూరులోని స్తంభాలగరువు ప్రాంతానికి చెందిన హరిత గుంటూరులోని శ్రీచైతన్యలో చదివారు.
 • కార్డియాలజిస్ట్‌నవుతా

  మనోజ్ఞితారెడ్డి (5వ ర్యాంకు)

   'చిన్నప్పటి నుంచీ నాకు వైద్యురాలినవ్వాలనే కోరిక ఉండేది. ఆ లక్ష్యంతోనే ఇంటర్‌లో బైపీసీ తీసుకున్నాను. మొదటి నుంచీ మంచి ర్యాంకు తెచ్చుకోవాలనే పట్టుదలతో చదివాను. కళాశాలలో అధ్యాపకులు చెప్పే అంశాలను శ్రద్ధగా వింటూ ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకునేదాన్ని. ఎంసెట్‌ రాసిన రోజు వందలోపు ర్యాంకు వస్తుందని అనుకున్నా. 'కీ' విడుదల చేశాక పదిలోపు వస్తుందని భావించా. ఐదో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. కార్డియాలజిస్ట్‌ అవ్వాలనేది నా కోరిక.'
   కుటుంబ నేపథ్యం: నాన్న సుదర్శన్‌రెడ్డి, అమ్మ రమాదేవి.
 • కార్జియాలజిస్టునవుతా

  భరత్‌కుమార్‌, (6వ ర్యాంకర్‌)

   'ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా గుండె జబ్బులు, గ్యాస్టిక్‌ సమస్యలతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అందుకే మంచి కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ వైద్య నిపుణునిగా స్థిరపడాలని ఉంది.
   కుటుంబ నేపథ్యం: అమ్మానాన్న వెంకటేశ్వర్లు, రమాదేవి ఇద్దరూ వైద్యులే. ఇంటర్మీయట్‌ విజయవాడ శ్రీచైతన్య నారాయణ జూనియర్‌ కళాశాలలో చదివారు. అక్క ప్రత్యూష గాంధీ మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
 • కార్డియాలజిస్టునవుతా

  పట్టిసపు శ్రీవిద్య, (ఏడో ర్యాంకు)

   'మంచి ర్యాంకు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో కష్టపడి చదివా. మంచి ర్యాంకు తప్పనిసరిగా వస్తుందని భావించా. ఏకంగా ఏడో ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. జిప్‌మర్‌ పరీక్ష కూడా రాశా. ఫలితాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. అందులో సీటు వస్తే అక్కడే ఎం.బి.బి.ఎస్‌. చదవాలని ఉంది. తరువాత కార్డియాలజీలో పీజీ చేసి అంతిమంగా వైద్య పరిశోధనలపై దృష్టి సారించాలని భావిస్తున్నాను. తల్లిదండ్రులిచ్చిన అండదండలు, శ్రీచైతన్య నారాయణ అధ్యాపకులు ఇచ్చిన ప్రణాళికాబద్ధ శిక్షణ నా విజయానికి ప్రధాన కారణం.'
   కుటుంబ నేపథ్యం: శ్రీవిద్య తండ్రి పి.వి.ఎస్‌.ప్రసాద్‌ కంచరపాలెం ఎస్‌.బి.ఐ.లో మేనేజర్‌గా చేస్తుండగా తల్లి రాజ్యలక్ష్మి కెనరా బ్యాంకులో క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
 • రోజుకి పన్నెండు గంటలు చదివా

  సాత్విక్‌ గంగిరెడ్డి (ఎనిమిదో ర్యాంక్‌)

   'ఎంసెట్‌లో టాప్‌ 10లో ఉంటానని వూహించా. అది నిజమైంది. జిప్‌మెర్‌, ఎయిమ్స్‌ ప్రవేశ పరీక్షల్లోనూ మంచి ర్యాంకులు వస్తాయని ఆశిస్తున్నా. ఈ పరీక్షల కోసం రోజుకి 12 గంటలు చదివా.'
   కుటుంబ నేపథ్యం: సాత్విక్‌ గంగిరెడ్డి ఇంటర్మీడియేట్‌ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య నారాయణ కళాశాలలో చదివాడు. సాత్విక్‌ తండ్రి శివకుమార్‌రెడ్డి నీటి పారుదలశాఖలో డిప్యూటీ ఇంజినీర్‌గానూ, తల్లి హోమియోపతి వైద్యురాలిగానూ పని చేస్తున్నారు.
 • ఎంఎస్‌ చేస్తా

  సాయిహర్షతేజ, (9వ ర్యాంకర్‌)

   ఉత్తమ వైద్యునిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. పీజీలో సాధారణ వైద్య కోర్సు పూర్తి చేసిన తరువాత మా నగరంలోనే వైద్య వృత్తి చేపడతా. అమ్మానాన్న ఆశీర్వాదంతో మంచి ర్యాంకు సాధించా. ఇంటర్‌ విజయవాడ శ్రీచైతన్య నారాయణ జూనియర్‌ కళాశాలలో చదివా.
   కుటుంబ నేపథ్యం: తండ్రి, తల్లి రాయల వెంకటనారాయణ, సుజాత ఇద్దరూ ఉపాధ్యాయులే. అన్నయ్య సూర్యతేజ బహుళ జాతి సంస్థ సిస్కోలో ఉద్యోగం చేస్తున్నారు.
 • న్యూరాలజీ చేస్తా

  సాయినిఖిల (పదో ర్యాంకు)

   'ఎంబీబీఎస్‌ పూర్తిచేసి న్యూరాలజీలో ప్రత్యేక కోర్సు చేస్తా. 10వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది.'
   కుటుంబ నేపథ్యం: తెనాలికి చెందిన ఘంట సాయినిఖిల తండ్రి నాగేశ్వరరావు పంచాయతీరాజ్‌శాఖలో ఏఈగా పనిచేస్తుండగా, సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన తల్లి గాయత్రి గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎయిమ్స్‌, జిప్‌మర్‌, సి.ఎమ్‌.సి. వెల్లూరు వైద్య కళాశాలల ప్రవేశ పరీక్ష రాసిన సాయినిఖిల 'ఈనాడు-అరోరా' నిర్వహించిన ఎంసెట్‌ మాక్‌ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచి ప్రతిభ చాటింది.