Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

TS Eamcet - 2015 Engineering Toppers Voice
 • ఐఐటీ ముంబయిలో చదివి శాస్త్రవేత్తనవుతా

  - మోపర్తి సాయి సందీప్, మొదటి ర్యాంకర్, కుత్బుల్లాపూర్

   మొదటి ర్యాంకు సాధించినందుకు ఆనందంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లోనూ ఆరో ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం ముంబయిలోని ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలంపియాడ్‌లో శిక్షణ పొందుతున్నా. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ చదివి, శాస్త్రవేత్త కావాలన్నది నా లక్ష్యం. ఐఐటీ ప్రవేశ పరీక్షలో రెండో ర్యాంకు సాధిస్తా. మా కుటుంబం గుంటూరు జిల్లా లెమెళ్లపాటు నుంచి నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆదర్శ్‌నగర్‌లో స్థిరపడింది. తమ కుమారుడికి ఊహించిన ర్యాంకే వచ్చిందని సందీప్ తల్లిదండ్రులు రవి, కృష్ణకుమారి చెప్పారు.
 • కంప్యూటర్ రంగంలో మార్పులు తీసుకొస్తా

  - రౌతు నిహార్ చంద్ర, రెండో ర్యాంకరు, నిజాంపేట

   ఐఐటీలో చదివి, అమెరికాలోని మైక్రోసాఫ్ట్ సంస్థలో సీఈవో స్థాయికి ఎదగాలన్నదే నా లక్ష్యం. సమాజానికి ఉపయోగపడే సరికొత్త కంప్యూటర్ పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తా. నా విజయం వెనుక అమ్మ విజయలక్ష్మి, నాన్న నాగేశ్వరరావుల ప్రోత్సాహం ఎంతో ఉంది. నాన్న కంప్యూటర్స్ రంగంపై పుస్తకాలు రాస్తుంటారు. మాదాపూర్‌లోని శ్రీచైతన్య నారాయణ కళాశాలలో ఇంటర్ చదివా.
 • సివిల్స్ సాధనే లక్ష్యం

  - బోగి కీర్తన, మూడో ర్యాంకరు, బొబ్బిలి, విజయనగరం జిల్లా

   డాక్టర్‌ అవ్వాలనేది చిన్నప్పట్నుంచీ నా కల. కానీ పెరిగి పెద్దవుతుంటే నాకు ఆ రంగం నప్పదనిపించింది. అందుకే ఇంజినీరింగ్‌ వైపు మొగ్గు చూపా. మాది విజయనగరం జిల్లా బొబ్బిలి. నాన్న వ్యాపారి. అమ్మ గృహిణి. వైజాగ్‌లోని శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో ప్రవేశ పరీక్ష రాయడంతో ఆరు నుంచి పది వరకూ రాయితీతో చదువుకునే అవకాశం వచ్చింది. దాంతో అమ్మానాన్నలకి దూరంగా ఉండి హాస్టల్‌లో చదువుకున్నా. పదో తరగతిలో పదికి పది పాయింట్లు, ఇంటర్‌ 984 మార్కులు వచ్చాయి. అమ్మానాన్నలకీ, పండగలకీ, పుట్టిన రోజులకీ దూరంగా ఉంటున్నానే అని చాలాసార్లు అనిపించేది. కానీ పరీక్షల్లో మంచి మార్కులొచ్చినప్పుడు ఆ దిగులు ఉఫ్‌న ఎగిరిపోయేది. ఇంటర్‌ పరీక్షలూ, ఎంసెట్‌ కోసం నేననుకున్న ప్రణాళిక ప్రకారం క్షణం వృథా చేయకుండా చదివేదాన్ని. అలాగని ఏ సినిమాలూ, సరదాలూ ఉండవని కాదు. క్యాంపస్‌లో ఉంటే చదువే లోకం. ఇంటికెళితే స్నేహితుల్ని కలవడం, సినిమాలు చూడటం. ప్రణాళిక ప్రకారం చదువుకోవడం, క్రమబద్ధమైన జీవనశైలే నాకు ర్యాంకు తెచ్చిపెట్టాయని అనుకుంటున్నాను. ఎప్పటికైనా ఐఐటీలో సీటు సంపాదించడం నా లక్ష్యం. నా వల్ల అమ్మానాన్నలకి గుర్తింపు రావడం నాకెంతో సంతోషంగా ఉంది. మా బంధువులంతా ఫోన్లు చేసి వాళ్లిద్దరికీ అభినందనలు చెబుతుంటే వాళ్ల కళ్లలో వెలుగు కనిపిస్తోంది.
 • రెండేళ్ల కష్టానికి ప్రతిఫలమిది

  - జీ సాయితేజ, నాలుగో ర్యాంకరు, హైదరాబాద్

   ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నా. ఇంటర్‌లో 978, జేఈఈ మెయిన్స్‌లో 320 మార్కులు వచ్చాయి. జేఈఈ తుది ఫలితాల్లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. రెండేళ్ల కష్టానికి ప్రతిఫలమిది.
 • ఐఐటీలో చేరతా

  - వెన్నపూస హేమంత్‌రెడ్డి, ఐదో ర్యాంకరు, పులివెందుల, కడప

   154 మార్కులతో ఐదోర్యాంకు సాధించా. జేఈఈ మెయిన్స్‌లో 299, ఇంటర్‌లో 978 మార్కులు వచ్చాయి. మాది కడప జిల్లా పులివెందుల. 'ఈనాడు నిర్వహించిన మాక్ ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచా. ఐఐటీలోనే చేరతా.
 • మంచి ఇంజినీరుగా పేరు తెచ్చుకుంటా

  - తన్నీరు శ్రీహర్ష, ఆరో ర్యాంకరు, కోదాడ, నల్గొండ

   ఇది ముందే ఊహించిన ర్యాంకు. ఎంసెట్‌కు ప్రణాళికబద్ధంగా సన్నద్ధమయ్యా. అధ్యాపకుల సాయంతో ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకున్నా. మంచి ఇంజినీరుగా స్థిరపడి, దేశానికి సేవ చేస్తా. ఇంటర్‌లో 986, జేఈఈ మెయిన్స్‌లో 250 మార్కులు వచ్చాయి. ఐఐటీలో ఎలక్ట్రికల్ లేదా సివిల్ విభాగంలో చేరతా.
 • ధ్యాసంతా చదువుపైనే

  - మజ్జి సందీప్‌కుమార్, ఏడో ర్యాంకరు, విజయనగరం

   చిన్నతనం నుంచి చదువంటే నాకిష్టం. పట్టుదలగా చదివి రెండు రాష్ట్రాల ఎంసెట్లలోనూ పది లోపు ర్యాంకులు సాధించా. జేఈఈ మెయిన్స్‌లో 335 మార్కులు వచ్చాయి. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేరతా.
 • కొత్త ఆవిష్కరణలకు కృషి

  - గార్లపాటి శ్రీకర్, ఎనిమిదో ర్యాంకరు, నాచారం

   ఇది ఊహించిన ర్యాంకే. ప్రణాళికాబద్ధంగా రోజుకు 9 నుంచి 12 గంటలపాటు చదివాను. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి, సమాజాభివృద్ధికి దోహదపడే కొత్త ఆవిష్కరణలకు కృషి చేస్తా. ఏపీ ఎంసెట్‌లోనూ ఏడో ర్యాంకు వచ్చింది. నాన్న శ్రీనివాస్‌రావు వ్యాపారి. అమ్మ కృష్ణశ్రీ గృహిణి. ఇంటర్‌లో 975 మార్కులు, జేఈఈ మెయిన్స్‌లో 335 మార్కులు వచ్చాయి.
 • ఐఏఎస్ కావడమే లక్ష్యం

  - దొంతుల అక్షిత్‌రెడ్డి, తొమ్మిదో ర్యాంకరు, వరంగల్

   ఎంచుకున్న రంగంలో అందరికంటే ముందుండాలన్నదే నా ఆశయం. అందుకు తగినట్టుగానే ఎప్పటికప్పుడు సిద్ధపడుతున్నా. నేను రాసిన చాలా ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులొచ్చాయి. భవిష్యత్తులో ఐఐటీ ముంబయిలో బీటెక్ పూర్తిచేసి, ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా.
 • ఒత్తిడి లేకుండానే ర్యాంకులు సాధించా

  - అనిరుథ్‌రెడ్డి, పదో ర్యాంకరు, హైదరాబాద్

   ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదు. స్వేచ్ఛగా చదువుకునే ఈ ర్యాంకు సాధించా. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు వచ్చింది. నాన్న శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ జెన్‌కోలో కార్యనిర్వాహక ఇంజినీరు.