Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

TS Eamcet - 2015 Medicine Toppers Voice
 • రోజుకు 14 గంటలు సాధన చేశా

  - ఉప్పలపాటి ప్రియాంక, మొదటి ర్యాంకరు

   'పోరాడు... పోరాడుతూనే ఉండు లక్ష్యం సాధించే వరకూ' అనే వివేకానందుడి మాటలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. అందుకే డాక్టర్‌ని అవ్వాలని చిన్నప్పట్నుంచీ శ్రద్ధగా చదివా. మెడిసిన్‌లో మొదటి ర్యాంకు సాధించగలిగా. దీని వెనక అమ్మానాన్న శ్రమ కూడా ఎంతో ఉంది. మాది ప్రకాశం జిల్లాలోని నాగులపాలెం గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. మా బంధువుల్లో కొందరు వైద్యులున్నారు. నన్నూ ఎంబీబీఎస్‌ చదవమని పదేపదే చెప్పేవారు. ఆ ప్రభావం నామీద బాగానే పని చేసింది. చిన్నప్పుడు ఆసుపత్రికి వెళితే డాక్టర్‌లని గమనిస్తూ ఉండేదాన్ని. ప్రతి ఒక్కరికీ వాళ్లతో అవసరం ఉంటుంది. దాంతో నేనూ వైద్యురాలినవ్వాలని ఆ చిన్నతనంలోనే అనుకున్నా. ఆరోతరగతికి వచ్చాక విజయవాడ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చేరా. అమ్మానాన్నలు నన్ను వదిలి ఉండలేకపోయారు. నాన్న పొలం కౌలుకిచ్చేసి, విజయవాడ వచ్చేశారు. అక్కడే చిన్న ఉద్యోగం చూసుకుని, నన్ను హాస్టల్‌లో చేర్పించారు. వారంలో రెండు మూడుసార్లు వచ్చి చూసి వెళ్లేవారు. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ నేను ఉచితంగానే చదువుకున్నా. ఏ తరగతిలో ఉన్నా ఫస్టు మార్కు నాదే కావాలన్నట్టు చదివేదాన్ని. పదో తరగతిలో, ఇంటర్‌లో మంచి మార్కులొచ్చాయి. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావాలనుకున్నా కానీ నేనే ఫస్ట్‌ వస్తానని వూహించలేదు. అమ్మానాన్నలకి ఆర్థిక భారం పడకుండా చదువుకుని ఇక్కడి రావడం ఎంతో సంతోషాన్నిస్తోంది.
   ఉదయం ఆరింటికి లేచి కాసేపు చదువుకుని క్లాస్‌లకు వెళ్లేదాన్ని. రాత్రి పదకొండు తరవాత పుస్తకం తీసేదాన్ని కాదు. ఏడు గంటల నిద్ర అవసరం అనే నియమం పెట్టుకున్నా. కాలేజీలో తరచూ పరీక్షలు పెట్టేవారు. వాటిల్లో మార్కులకు ప్రాధాన్యం ఉండదు. విద్యార్థులు చేసే తప్పులూ, సరిదిద్దడం మీదే దృష్టి పెట్టేవారు. దాంతో ఈసారి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని అన్నదానికంటే ఏ పొరపాట్లు చేయకూడదు అనుకునేదాన్ని. బాగా ఒత్తిడిగా అనిపించిప్పుడు ఇష్టమైన డ్రాయింగ్‌ వేసుకొనేదాన్ని. పుస్తకాలు చదవడమన్నా నాకెంతో ఇష్టం. ముఖ్యంగా వివేకానందుడివి. మంచి మాటలు ఎక్కడ కనిపించినా దాచి పెట్టుకుంటా. ఇవాళ ఏం చదివానూ, ఎంత గుర్తుంచుకున్నా అనే ఆలోచిస్తా. అనవసర ఒత్తిళ్లను దగ్గరికి రానివ్వను. అందుకే ఈ రోజు నంబర్‌వన్‌ ర్యాంకు తెచ్చుకోగలిగా! దిల్లీ ఎయిమ్స్‌లో సీటు సంపాదించడం నా లక్ష్యం.
 • మంచి వైద్యునిగా పేరు తెచ్చుకుంటా

  - కాడ శ్రీవిదుల్, రెండో ర్యాంకరు

   మంచి వైద్యునిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. స్పెషలైజేషన్‌పై ఇంకా ఆలోచించలేదు. నాన్న సత్యనారాయణ, అమ్మ రమాదేవి ఇద్దరూ వైద్యులే. ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. రోజుకు 8 గంటలు చదివా. జాతీయ స్థాయి పరీక్షలకు సిద్ధపడుతున్నా. అమ్మానాన్నలాగే నేనూ వైద్యుడిని కావాలనుకున్నా.
 • కార్డియాలజిస్ట్ కావాలని...

  - వంగాల అనూహ్య, మూడో ర్యాంకరు

   'కంగ్రాట్స్‌' అని అమ్మానాన్నలకు సంక్షిప్త సందేశాలూ, ఫోన్లూ వస్తుంటే వాళ్లెంత సంతోషంగా ఉన్నారో! ముఖ్యంగా అమ్మ వల్లే నేను పట్టుదలతో ఎంబీబీస్‌లో సీటు సాధించగలిగా. చిన్నప్పుడు కథలు చెప్పమంటే అమ్మ డాక్టర్ల గురించి చెప్పేది. 'ఎంతోమంది వారి సేవలకోసం ఎదురుచూస్తుంటారు. నువ్వూ పేదలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి' అనేది. ఆ మాటలు నా నరనరానా జీర్ణించుకుపోయాయి. అమ్మకీ చదువంటే ప్రాణం. నేను పుట్టాక కూడా చదువుకుంది. తనలా నేను చదువుకి విలువివ్వడం అలవాటు చేసుకున్నా కాబట్టే ర్యాంకు సాధించగలిగా.
   మాది నల్గొండ జిల్లాలోని గోడలదిన్న గ్రామం. నాన్న రైతు, అమ్మ టీచర్‌. 'చదువుకోకపోతే నాలా కష్టపడాలి. చదువుకుంటే అమ్మలా ఉద్యోగం వస్తుంది' అంటూ నాన్న తరచూ చెప్పేవారు. ఎనిమిదో తరగతి పూర్తయ్యాక గుడివాడ విశ్వభారతి స్కూల్‌కి ప్రవేశ పరీక్ష రాశా. అందులో ఉచిత సీటు రావడంతో అక్కడికి వెళ్లిపోయా. ఎప్పుడూ నేనే క్లాస్‌ ఫస్ట్‌. పదిలో 9.8 పాయింట్లు వచ్చాయి. తరవాత ఇంటర్‌ హైదరాబాద్‌ నారాయణలో చేరా. ఇంటర్‌, ఎంసెట్‌ పరీక్షల సమయానికి నాన్న పొలం పనులు పక్కనపెట్టి హైదరాబాద్‌ వచ్చేవారు. తనే వంట చేసి, లంచ్‌బాక్సు సిద్ధం చేసిచ్చేవారు. చదువుకున్నంతసేపూ పక్కనే ఉండేవారు. నేను కూడా ప్రశ్న-జవాబులు కాకుండా టెక్స్ట్‌బుక్‌లు చదివి.. పాఠాల సారాంశాన్ని గుర్తుపెట్టుకొనేదాన్ని. ఇదే నాకు సానుకూలాంశమైంది. అలానే ఏ సందేహం వచ్చినా దాన్ని వాయిదా వేయకుండా వెంటనే మా లెక్చరర్లని అడిగి తెలుసుకొనేదాన్ని.
 • జాతీయ స్థాయి సంస్థల్లో ఎంబీబీఎస్ చేస్తా

  - పారశెల్లి సాయితేజ, నాలుగో ర్యాంకరు

   ఏపీ ఎంసెట్‌లో 84వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. నాన్న నారాయణరావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అమ్మ నీరజ గృహిణి. ఎయిమ్స్, జిప్‌మర్ తదితర జాతీయ వైద్యవిద్యా సంస్థల్లో మెడిసిన్ చేయాలని కోరిక. వాటి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధనకు కృషి చేస్తున్నా.
 • న్యూరాలజిస్ట్‌ను అవుతా

  - చెన్నూరి సాయితేజరెడ్డి, ఐదో ర్యాంకరు

   ఎయిమ్స్‌లో ప్రవేశం పొందడానికి కృషి చేస్తున్నా. న్యూరాలజిస్ట్‌ను కావాలని ఉంది. నాన్న నాగిరెడ్డి, అమ్మ కళావతి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇంటర్‌లో 984 మార్కులు సాధించా. రోజుకు 14 గంటలపాటు చదివా. వైద్యునిగా పేదలకు సేవ చేస్తా. తీరిక సమయాల్లో సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతుంటా. అన్నయ్య సాయిచరణ్‌రెడ్డి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు.
 • పేదలకు ఉచిత వైద్యం అందిస్తా

  - పైడి తేజేశ్వరరావు, ఆరో ర్యాంకరు

   పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తా. మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం. నాన్న అప్పారావు రైతు. అమ్మ అరుణ గృహిణి. ఇంటర్‌లో 976 మార్కులు వచ్చాయి. రోజుకు 14 గంటల పాటు చదివా. తీరిక సమయాల్లో క్రికెట్ ఆడతా. స్వామి వివేకానంద రచనలు చదువుతుంటా.
 • గుండె వైద్య నిపుణురాలినవుతా..

  - పొన్నాడ నాగసత్య వరలక్ష్మి , ఏడో ర్యాంకరు

   ఏపీ ఎంసెట్ ఫలితాల్లో 46వ ర్యాంకు వచ్చింది. మాది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం. రాజమండ్రి శ్రీ చైతన్య కళాశాలలో చదివా. భవిష్యత్తులో గుండె వైద్య నిపుణురాలు కావాలన్నది నాలక్ష్యం.
 • అమ్మా నాన్నల ప్రోత్సాహంతో...

  - బాలబోలు కీర్తన, ఎనిమిదో ర్యాంకరు

   ఏపీ ఎంసెట్‌లోనూ నాకు 19వ ర్యాంకు వచ్చింది. ఎయిమ్స్, జిప్‌మర్ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకుల సాధనకు కృషి చేస్తున్నా. జాతీయ స్థాయి వైద్య విద్యాసంస్థల్లో మెడిసిన్ చదవాలన్నది నా లక్ష్యం. నాన్న రమేష్, అమ్మ అనురాధ ఇద్దరూ విశాఖ కేజీహెచ్‌లో వైద్యులుగా పనిచేస్తున్నారు. నా విజయం వెనుక వారి ప్రోత్సాహం ఎంతో ఉంది.
 • ఎయిమ్స్ కాకుంటే.. ఉస్మానియాలో చేరతా

  - అన్ష్ గుప్త, తొమ్మిదో ర్యాంకరు

   మంచి న్యూరాలజిస్ట్‌గా పేరు తెచ్చుకుంటా. నాన్న మనీష్ గుప్త, అమ్మ అనామిక గుప్త ఇద్దరూ వైద్యులే. ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. రోజూ 8 నుంచి 10 గంటల పాటు చదివా. తీరిక వేళల్లో బాస్కెట్‌బాల్ ఆడతా. ఫ్రెండ్స్‌తో చాటింగ్, నవలలు చదవడం ఆసక్తి. ఎయిమ్స్. జిప్‌మర్ పరీక్షల్లో వచ్చే ర్యాంకులను చూసుకుని.. ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరతా.
 • ఇది నా చిన్ననాటి కల

  - సిరంచెట్టి సాయిప్రీతమ్, పదో ర్యాంకరు

   వైద్యుడిని కావాలనేది నా చిన్ననాటి కల. మంచి కళాశాలలో సీటు రావాలన్న సంకల్పంతో, ర్యాంకే లక్ష్యంగా చదివా. నాన్న భాస్కర్ వరంగల్‌లో వైద్యుడు. అమ్మ మాధవి గృహిణి. ఇంటర్‌లో 973 మార్కులు వచ్చాయి. రోజుకు ఎనిమిది గంటల పాటు అభ్యాసం చేశా. ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేయాలని ఉంది. ప్రస్తుతం ఎయిమ్స్, జిప్‌మర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నా. న్యూరాలజీ విభాగంలో స్పెషలైజేషన్ చేస్తా.