Toppers Voice


ఏపీపీఎస్సీ
సాంకేతికత తోడవ్వడం మంచి పరిణామమే కదా!
*
గ్రూప్ - IV మెదక్ జిల్లా టాపర్

చదివింది ఇంజినీరింగ్ విద్య.. ఎంచుకున్న మార్గం ప్రభుత్వ ఉద్యోగం ద్వారా సమాజానికి సేవచేయడం. ఆ క్రమంలో ఆర్థిక బాధలూ.. అనేక ఒడుదుడుకులు... వీటన్నింటినీ ఆత్మస్త్థెర్యంతో ఎదుర్కొని ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ - IV సర్వీసెస్ (నోటిఫికేషన్ నంబర్ 38/ 2011) పరీక్షలో మెదక్ జిల్లా టాపర్‌గా నిలిచారు సిద్దిపేటకు చెందిన గందే శ్రీనివాస్. పేపర్ - I లో 137, పేపర్ - II లో 142 మార్కులతో మొత్తం 300 మార్కులకుగాను 279 మార్కులు సాధించారు. మార్చి 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన ఫలితాల ప్రకారం కడప జిల్లాకు చెందిన అభ్యర్థి (హాల్ టికెట్ నంబరు: 41104139) 284 మార్కులు సాధించగా... శ్రీనివాస్ (హాల్ టికెట్ నంబరు: 42206124) 279 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం మెదక్ జిల్లా మిరిదొడ్డిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను ఈనాడుప్రతిభ బృందం పలుకరించగా అనేక విషయాలను వెల్లడించారు....

* మీ కుటుంబ నేపథ్యం, చదువు గురించి తెలపండి.
మాది సిద్దిపేట దగ్గర్లోని బక్రిచెప్యాల్ గ్రామం. నేను మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని ఎస్‌హెచ్‌సీఎస్‌టీ కాలేజీ నుంచి 2007లో ఈసీఈ విభాగంలో బీటెక్ పూర్తి చేశాను.

* బీటెక్ చేసి కాంపిటేటివ్ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం...
నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలని కోరిక. ఇంజినీరింగ్ పూర్తయ్యాక కొంత కాలంపాటు ఇందూర్ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాను. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిపేరయ్యాను. గ్రూప్ - I స్థాయి పోస్టులకు సిద్ధం కావడానికి ఆర్థికంగా, మానసికంగా చాలా దృఢంగా ఉండాలని తొందరగానే గ్రహించి, ముందు దిగువ స్థాయి పోస్టులను లక్ష్యంగా ఎంచుకున్నాను. ఈ క్రమంలో గత ఏడాది నిర్వహించిన వీఆర్వో పరీక్షలో జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించాను. ఆ తర్వాత ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో అర్హత సాధించాను. తాజాగా గ్రూప్ - II విభాగంలోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా పూర్తయ్యింది.

* చాలాకాలంపాటు ఖాళీగా ఉండి, పోటీ ప్రపంచంలో వరుసగా విజయాలు సాధిస్తున్నారు. ఈ విజయాలను మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు?
కాంపిటేషన్ రంగం కోసం సుదీర్ఘకాలంగా ప్రిపేరవడం ఆషామాషీ వ్యవహారం కాదు. తాత, అన్నయ్య నాకు అన్నివిధాలా సహకారమందించి, ఆర్థికంగా ఏ లోటు రానివ్వకుండా చూడటం వల్లే ఇది సాధ్యమైంది. పడిన కష్టానికి ఫలితం దక్కడంతో అమ్మ కళ్లల్లో ఆనందం చూసి, ఆనందభాష్పాలు రాల్చాను. ఈ స్ఫూర్తితో మరింత ఎత్తుకు ఎదగడానికి కృషి చేస్తాను.

* మీ ప్రిపరేషన్ విధానం గురించి చెప్పండి.
సిలబస్‌కు సంబంధించి నిర్దిష్టమైన మెటీరియల్‌ను ఎంపిక చేసుకున్నాను. ఎకానమీ సబ్జెక్టు కోసం కోచింగ్ తీసుకున్నాను. రోజూ ఈనాడు పత్రికను చదివి, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి నోట్సు ప్రిపేర్ చేసుకున్నాను. రోజులో కనీసం 3 గంటలు www.eenadupratibha.net లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్‌ను చదవడానికి కేటాయించాను. ఆయా అంశాల్లో ఆన్‌లైన్ పరీక్షలను ప్రాక్టీస్ చేయడం నాకు బాగా తోడ్పడింది. వీటితోపాటు ప్రతిభ పేజీల్లో వచ్చే కరెంట్ అఫైర్స్ (కృష్ణ ప్రసాద్), పాలిటీ (వీరబ్రహ్మం), అనంత రామకృష్ణ (ఫిజిక్స్), వేడియం భాస్కర్ (చరిత్ర), జనరల్ స్టడీస్ వ్యాసాలను గత రెండేళ్లుగా క్రమం తప్పకుండా చదువుతున్నాను. నలుగురం స్నేహితులం కలిసి సిద్దిపేటలో రూమ్ తీసుకొని సాధన చేశాం. ప్రతిరోజు వివిధ అంశాలపై డిస్కషన్ చేసేవాళ్లం. మిత్రులందరూ దాదాపుగా ఏకకాలంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికవ్వడం అత్యంత సంతోషానిచ్చింది.

* మీ ప్రిపరేషన్ కాలంలో కాంపిటేటివ్ రంగానికి సంబంధించి మీరు గమనించిన మార్పులేమిటి?
కొన్నేళ్ల కిందటి వరకూ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్థులకు సరైన అవగాహన ఉండేది కాదు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రస్తుతం డిగ్రీలు చేస్తూనే ఈ అంశాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. మెరుగైన మెటీరియల్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో ఎలాంటి పోస్టుకైనా అధికంగా శ్రమించడం తప్పనిసరైంది.

* ఒకప్పుడు సంప్రదాయ డిగ్రీ చేసినవారే ఎక్కువగా ఈ రంగంలోకి వచ్చేవారు. ప్రస్తుతం బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేసినవారు కూడా ఎక్కువగా ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలను ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు?
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న భద్రత, హోదా, గౌరవమే దీనికి ప్రధాన కారణం. ఏ రంగంలోనైనా నైపుణ్యమున్నవారికే అవకాశాలు వస్తున్నాయి. కొన్నేళ్ల కిందటివరకూ ప్రభుత్వ రంగంలో వివిధ ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ రంగానికి సాంకేతిక విద్య కూడా తోడవ్వడం మంచి పరిణామమే కదా! ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందడం శుభ సూచకమే.

* కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సిద్ధమవుతున్నవారికి మీరిచ్చే సూచనలు...
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాని కోసం అహర్నిశలు కృషి చేయండి. ఎంతమంది పోటీలో ఉన్నారనే విషయాన్ని ఆలోచించకుండా, వైఫల్యాలు ఎదురైనా పట్టుదల వీడకుండా సాధన చేయండి. మార్కెట్లో రకరకాల మెటీరియల్ లభిస్తోంది. నిపుణుల సలహాలతో నిర్దిష్టమైన పుస్తకాలనే ఎంపిక చేసుకొని చదవండి. మోడల్ పేపర్లను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. వీటితోపాటు యోజన, వివేక్ లాంటి పత్రికలనూ చదవండి.

TOP
ఓపిక, పట్టుదల అవసరం
*
గ్రూప్-2 ఫలితాల్లో మొదటి ర్యాంకర్ వెంకటేశ్వరరావు

కలల తీరానికి చేరువయ్యే మార్గంలో ఓ తప్పటడుగు పడినా కుంగిపోలేదు.లక్ష్యసాధనలో కోరుకున్న కుర్చీ దక్కకపోయినా దిగులు చెందలేదు. సహనం, పట్టుదలను ఆయుధాలుగా మలచుకుని గమ్యానికి చేరుకున్నారు తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వరరావు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 380 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్న వెంకటేశ్వరరావుతో 'న్యూస్‌టుడే' మాట్లాడింది.
బండారుపల్లి గ్రామానికి చెందిన రైతు బసవపున్నారావు, అచ్చమాంబ దంపతులకు వెంకటేశ్వరరావు రెండో సంతానం. పాఠశాల చదువంతా గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలోనే సాగింది. పదో తరగతిలో 440 మార్కులు సాధించారు. తల్లిదండ్రులు, గురువుల సూచన మేరకు బైపీసీలో చేరారు. ఇంటర్ ఫలితాల్లో 70 శాతం మార్కులు సాధించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఎంసెట్ రాయగా 2 వేల ర్యాంకు రాగా బీఫార్మసీలో సీటొచ్చొంది. పేరేచర్లలోని ప్రైవేటు ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేశారు. ఫార్మసీ విద్యలోనే పీజీ చేయాలని జాతీయ స్థాయి పోటీ పరీక్ష గేట్‌కు హాజరైనా ర్యాంకు రాలేదు. దీంతో పోటీ పరీక్షలకు హాజరై రెవెన్యూ శాఖలో ఉద్యోగాన్ని పొందాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. గ్రూపు-2లో రాష్ట్ర స్థాయిలో ప్రథముడిగా నిలిచి స్వగ్రామానికి గుర్తింపు తీసుకువచ్చారు.
మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం: బీఫార్మసీ పూర్తయ్యాక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో ఏపీపీఎస్సీ 2004లో గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ ఏడాది గ్రూప్-2కు హాజరైన వెంకటేశ్వరరావుకు విజయం వరించినా రెవెన్యూ శాఖలో ఉద్యోగం లభించలేదు. అప్పట్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కలిపి మొత్తం 369 (500) మార్కులు రావటంతో దేవాదాయశాఖలో ఈఓగా ఉద్యోగం వచ్చింది. ఒంగోలులోని చెన్నకేశవస్వామి ఆలయం, ప్రత్తిపాడు గ్రూపు దేవస్థానాలకు ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వోద్యోగం చేస్తున్నా నిర్దేశించుకున్న లక్ష్యం మాత్రం నిద్ర పట్టనివ్వలేదు. 2008లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి మళ్లీ గ్రూప్-2 పరీక్షకు సిద్ధమయ్యారు. నగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ, ప్రాంతీయ గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న పుస్తకాలతో కుస్తీ పట్టారు. రోజూ గ్రంథాలయాలకు రావటం 4 నుంచి 5 గంటలపాటు చదవటం చేశారు. 2008లో నోటిఫికేషన్ విడుదలైనా పరీక్ష మాత్రం 2011 అక్టోబరులో జరిగింది. ఈ మధ్యకాలం మూడేళ్లపాటు అందుబాటులో ఉన్న ప్రతి పుస్తకాన్ని ఆయన చదివారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా పోటీపడిన గ్రూప్-2 రాత పరీక్షను దిగ్విజియంగా పూర్తి చేశాడు. రాతపరీక్ష ద్వారా ఇంటర్వ్యూకు ఎంపికైన 1,204 మందిలో ఒకరుగా నిలిచారు. మార్చి 22న నలుగురు అధికారుల బృందం నిర్వహించిన ఇంటర్వ్యూలో సమాధానాలు చకాచకా చెప్పారు. ఈ ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. రాష్ట్ర స్థాయిలో ఎవరూ సాధించని విధంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కలిపి 380 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు.
కుంగిపోకూడదు
లక్ష్యసాధనలో ఓటములు ఎదురయ్యాయని కుంగిపోతే కలల్ని సాకారం చేసుకోలేం. గ్రూపు పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ముఖ్యంగా ఓపిక, పట్టుదల, నిరీక్షించేతత్వం ఉండాలి. ఎన్ని గంటలపాటు చదివామని కాకుండా ఎంత అర్థం చేసుకుని చదివామనేదే ముఖ్యం. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు రోజుకు 7 నుంచి 8 గంటలపాటు చదివా. పాఠ్యాంశాలపై తోటివారితో చర్చిస్తూ సిద్ధం కావటం ద్వారా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఎక్కువ పుస్తకాలను చదవటం కంటే కూడా చదివిన దాన్ని పునశ్ఛరణ చేసుకోవటం మంచిది. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వారు వదంతుల్ని నమ్మకూడదు. పోటీని తట్టుకునే స్థాయిలో నైపుణ్యాలు సాధిస్తే విజయం మనదే. సమాజాభివృద్ధిలో భాగస్వామిని కావాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నించా. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవటంలో 'ఈనాడు' దినపత్రిక, గ్రంథాలయాలు ఎంతో సహకారాన్ని అందించాయి. ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించేందుకు పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తలుపు తట్టడం ఖాయం.
* కచ్చితమైన సమయపాలనతోనే అన్నీ సబ్జెక్టులను చదివాను. చదవడం ప్రారంభించిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ ఒకే విధంగా చదివాను. ప్రభుత్వ కొలువు పొందాలన్న ఆశావాదం మరింత ప్రోత్సాహం ఇచ్చింది.
* ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండా ప్రభుత్వ ప్రచురణ పుస్తకాలు, మరికొన్ని గుర్తింపు పొందిన పుస్తకాలను బాగా చదివాను. ది హిందూ, ఈనాడు పత్రికలు బాగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఎకానమీకి సంబంధించిన అంశాలను క్రమం తప్పాకుండా అప్‌డేట్ చేసుకోవడం వల్ల మంచి స్కోరింగ్ వచ్చింది. ఈనాడు ప్రతిభలో ప్రచురితమయ్యే కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడింది. డిప్యూటీ తహశిల్దార్ పోస్టుకే నా ప్రథమ ప్రాధాన్యం.
* నోమన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్యూలో గతనెల్లో మన రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ గెలవడానికి గల కారణాలు, రాజీవ్ యువకిరణాలు, దేశంలో అవినీతికి గల కారణాలు - నిర్మూలనకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పాను. ఆర్థికపరంగా, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. వారి సహాకారంతోనే నేను విజయం సాధించగలిగాను.
TOP
సమయ పాలన, స్వీయ ప్రేరణతోనే విజయం
గ్రూప్-2 ఉమెన్ టాపర్: జయలక్ష్మీ పద్మజ
పట్టుదల ఉంటే సాధించలేనది ఏదిలేదని నిరూపించారు ప్రకాశం జిల్లాకు చెందిన గ్రూప్-2 టాపర్ జయలక్ష్మీ పద్మజ. అందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. కొందరే విజయం సాధిస్తారు. దీనికి కారణం వారు అనుసరించిన విధానమే. సరైన సమయంలో సరైన పంథాలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లిన వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు. జయలక్ష్మీ పద్మజ కూడా ఇదే కోవకు చెందుతారు. ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో 356 మార్కులతో టాపర్‌గా నిలిచిన ఆమె సక్సెస్ విశేషాలను 'న్యూస్‌టుడే'కు వివరించారు.
ప్రశ్న: మీ విద్యార్హతలేమిటి?
జ: నేను ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తిచేశాను.
ప్ర: గ్రూప్-2కే ఎందుకు సిద్ధమయ్యారు? ఇతర ఉద్యోగాలు చాలా ఉన్నాయి కదా?
జ: ఆసక్తే అందుకు కారణం. ప్రారంభంలో బ్యాంకు ఉద్యోగం చేయాలనుకున్నా అంతగా ఆసక్తి కనబరచలేకపోయాను. గ్రూప్స్ మీద ఆసక్తితో 2008లో గ్రూప్ -2 దరఖాస్తు చేశాను. పద్ధతిగా పరీక్షలు రాయడంతో కమర్షియల్ టాక్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది.
ప్ర: టాపర్‌గా మీ స్పందన ఏమిటి?
జ: ఈ సారి గ్రూప్-2 పరీక్షల్లో మంచి ర్యాంక్ వస్తుందనుకున్నాను. కానీ ప్రథమస్థానం గురించి ఆలోచించలేదు. ప్రథమ స్థానం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.
ప్ర: పరీక్షలకు ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రత్యేకించి ఏదైనా ప్రిపరేషన్ విధానాన్ని అనుసరించారా?
జ: ఏ పరీక్షలో విజయం అందుకోవాలన్నా సమయపాలన, స్వీయ ప్రేరణ (సెల్ఫ్ మోటివేషన్) చాలా అవసరం. గ్రూప్-2కు సిద్ధమయ్యే ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లోని ఆర్‌సీరెడ్డి స్టడీ సర్కిల్‌లో కోచింగ్ తీసుకున్నాను. ఇది నా విజయానికి ఎంతగానో బాటలు వేసింది. కోచింగ్ తీసుకున్నంత మాత్రానా సక్సెస్ వస్తుందనుకోవడం సరికాదని నా అభిప్రాయం. నా వరకు నేను పరీక్షకు సంబంధించిన పలు రిఫరెన్స్ పుస్తకాలు చదివాను. పరీక్ష ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో సమయ పాలన నిర్దేశించుకున్నాను. ప్రతిరోజూ ఏంచేయాలో ముందుగానే ప్లాన్ చేసుకుని దాని ప్రకారం నడుచుకున్నాను.
ప్ర: మీ విజయానికి ప్రధాన కారణాలేమిటి?
జ: సిలబస్‌ను వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయడం, స్వయం ప్రేరణే నా విజయానికి ప్రధాన కారణాలు. కష్టపడే తత్వం, చేసే పనిని బట్టే ఫలితం ఆధారపడి ఉంటుందనే నమ్మకమే నన్ను గెలిచేలా చేశాయి.
ప్ర: మీ కుంటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది?
జ: ముఖ్యంగా నా భర్త ప్రోత్సాహం మరువలేనిది. సహచర మిత్రులు, తెలిసిన వారు అందరూ నన్ను ప్రోత్సహించారు.
ప్ర. ఏ పోస్టులకు మీరు ప్రాధాన్యం ఇచ్చారు?
జ: గ్రూప్ 2 విభాగాల్లో 'ఏసీటీవో' పోస్టును ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్నాను.
ప్ర: ఇంటర్వ్యూకు ఎలా సిద్ధపడ్డారు?ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు?
జ: ఇంటర్వ్యూకు సంబంధించి భవానీ శంకర్ గైడెన్స్ చాలా బాగా ఉపయోగపడింది. ఇంటర్వ్యూలో టాక్సేషన్ పై ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అన్నీ రకాల టాక్స్‌లు, వ్యాట్‌లు, సేవా పన్నులపై ప్రశ్నలు అడిగారు. ఇంకా కేరళ - తమిళనాడు ముళ్ల పెరియార్ డ్యాం వివాదం, ట్రావెన్ కోర్ దేవస్థానం లాంటి వాటిపై ప్రశ్నలు అడిగారు.
ప్ర: కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి మీరిచ్చే సూచనలు...?
జ: అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటే కోచింగ్‌లో ఇచ్చిన సలహాలను, సూచనలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. నోట్స్ రాసుకోవాలి. సమయాన్ని ఎక్కడా వృధా చేయకుండా పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధపడితే విజయం తప్పక వరిస్తుంది.
TOP
నిరుత్సాహ పడకూడదు, పట్టుదలతో చదవాలి
గ్రూప్-2 ఉమెన్ సెకండ్ టాపర్: మునగల రాజ్యలక్ష్మి
పోటీ పరీక్షల్లో పట్టుదలతో చదివిన వారికి విజయం సొంతం అవుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళలకు తరచూ నిరుత్సాహ పూరిత వాతావరణం ఎదురవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని దీక్షతో లక్ష్యం సాధించాలనే తపనతో కృషిచేసిన వారికి విజయం తలొంచక తప్పదు. ఈ కోవకు చెందిన వారే కోసూరు రాజ్యలక్ష్మి.
ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో 353 మార్కులతో సెకండ్ టాపర్‌గా నిలిచారు. తన సక్సెస్ విశేషాలను న్యూస్‌టుడేకు వివరించారు.
ప్ర: మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
జ. నాన్న బిజినెస్ చేస్తారు. అన్నయ్య కోటమండలం (నెల్లూరు జిల్లా) తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. నేను ఇంటర్‌లో బైపీసీ చదివాను. డిగ్రీ బీఏ (సోషియాలజీ) చేశాను. ప్రస్తుతం నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నాను.
ప్ర: మీ విజయ రహస్యం ఏమిటి?
జ: మా అన్నయ్య ఇచ్చిన సలహాలు, సూచనలు, సాధించాలనే నాకున్న పట్టుదల.. ఇవే నా విజయ రహస్యం. పరీక్ష ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అందుకోసం ఒకరోజు వదిలి, మరొక రోజు చదువుదాం అనే ఆలోచనతో ఉండలేదు. పరీక్ష ఎప్పుడు జరిగినా సరే నేను రెడీగా ఉండాలనే లక్ష్యంగా నిరంతరం పునఃపరిశీలన చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చదివాను. టైమ్ టేబుల్ వేసుకునేదాన్ని. దాన్ని అనుసరించేదాన్ని. ప్రతిరోజూ కష్టపడాలి, లక్ష్యాన్ని అందుకోవాలనేదే నా ధ్యేయంగా ఉండేది. టాపర్‌గా మీస్పందన?
జ. ఉమెన్స్ విభాగంలో సెకండ్ టాపర్‌గా వస్తానని ఊహించలేదు. ఈ స్థాయిని అందుకోవడం నిజంగా చెప్పలేని ఆనందాన్ని కలిగించింది.
ప్ర: ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టారు?(ప్రిపరేషన్ స్ట్రేటజీ).
జ. గ్రూప్-1 ప్రిపరేషన్‌లో భాగంగా 2009 నుంచే చదవడం మొదలుపెట్టాను. ప్రతిరోజూ ఎలా చదవాలనే విషయమై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని ప్రకారం చదువుతూ వచ్చాను. ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌లో కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ మెటీరియల్ మీదే ఎక్కువగా ఆధారపడ్డాను. పరీక్షకు సమయపాలన చాలా అవసరం కాబట్టి సబ్జెక్టుల వారీగా సమయాన్ని కేటాయించుకున్నాను.
ప్ర: ప్రిపరేషన్‌లో మీకు, మిగతా వారికి తేడా ఏమిటి?
జ. ప్రిపరేషన్ విషయంలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఎవరి సిస్టమ్ వారిది. నా వరకు మాత్రం సమయం చాలా ముఖ్యమైంది. పరీక్ష + సమయం రెండూ పోల్చుకుంటూ చదివాను.
ప్ర: ఏ పోస్టులకు ప్రాధాన్యం ఇచ్చారు?
జ. మొదటి ప్రాధాన్యం డిప్యూటీ తహసీల్దార్‌కు ఇచ్చాను. రెండోది మున్సిపల్‌కమిషనర్.
ప్ర: ఇంటర్వ్యూ విశేషాలు ఏమిటి? ఇంటర్వ్యూ ఎలా జరిగింది?
జ. ఇంటర్వ్యూ చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. నేను మహిళను కాబట్టి ఎక్కువ ప్రశ్నలు మహిళా సమస్యలపైనే వచ్చాయి. అంతేకాదు ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నాను. కాబట్టి ఉద్యోగ విశేషాలను అడిగారు. ఆఫీసు వాతావరణం ఎలా ఉంటుందన్నారు. మీ సేవ - ఈ సేవ మధ్య ఉన్న తేడాలేమిటి? ప్రస్తుతం సమాజంలో మహిళలకు ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? వంటి ప్రశ్నలు వేశారు. తర్వాత డిగ్రీలో చదివిన బీఏ సోషియాలజీ సబ్జెక్టుపై ప్రశ్నలు వేశారు.
ప్ర: మీ కుటుంబ సభ్యుల, బంధువుల ప్రోత్సాహం ఎలా ఉంది?
జ. తల్లిదండ్రులు, అన్నయ్య వెన్నంటి ప్రోత్సహించారు. 'అడపిల్లవు కదా, ఉన్నదాంతో సరిపెట్టుకోవచ్చు కదా అని కొందరు సర్దిచెప్పాలని చూశారు కానీ, నేను మాత్రం పట్టుదల వదల్లేదు. మా కుటుంబ సభ్యులు నన్ను ఎక్కడా నిరుత్సాహ పరచలేదు. అదే నాకు కొండంత బలాన్ని ఇచ్చింది.
ప్ర: కొత్తవారికి మీరిచ్చే సలహా ఏమిటి?
జ. లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే దానికి తగిన కృషి చేయాల్సిందే. ఏ పరీక్ష రాయాలనుకుంటే దానికి తగిన మెటీరియల్‌ను మొదట సేకరించాలి. చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకుని తదనుగుణంగా చదవాలి.
TOP