www.eenadupratibha.net
సమయం చాలా కీలకమైనది!
- ఎడ్‌సెట్ - 2012 ఇంగ్లిష్ స్టేట్ టాప్ ర్యాంకర్ సదాశివాని
పోటీ పరీక్షలో సమయం చాలా ముఖ్యమనీ, నిర్ణీత సమయంలో సరైన సమాధానాన్ని గుర్తించే విధంగా అభ్యర్థులు తయారు కావాలని ఎడ్‌సెట్ 2012 - ఇంగ్లిష్ స్టేట్ టాప్ ర్యాంకర్ ఎన్.సదాశివాని అన్నారు. ఎడ్‌సెట్ 2012లో ఇంగ్లిష్‌లో 125 మార్కులతో టాపర్‌గా నిలిచిన శివాని 'న్యూస్‌టుడే'తో పంచుకున్న సక్సెస్ విశేషాలు...
ప్ర. మీ కుటుం నేపథ్యం...
జ. మా నాన్నగారు టీచరు. అమ్మ గృహణి. ఒక అక్కయ్య ఉన్నారు. వైజాగ్‌లోని గోపాలపట్నం మా ఊరు.
ప్ర. మీ విద్యార్హతలు...
జ. నేను ఎంఏ (ఇంగ్లిష్), పీజీ డీటీఈ చేశాను. డిగ్రీ, పీజీల్లో 64 శాతం మార్కులు వచ్చాయి. ప్రస్తుతం ఫ్యామిలీ బాధ్యతలు నెరవేరుస్తున్నాను. మా వారు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వైజాగ్‌లో పనిచేస్తున్నారు.
ప్ర. ప్రోత్సాహం ఎలా ఉంది?
జ. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా బాగుంది. పరీక్షకు బాగా ప్రిపేర్ కావాలని వెన్నుతట్టి ప్రోత్సహించారు.
ప్ర. ఎలా ప్రిపేర్ అయ్యారు?
జ. ఎడ్‌సెట్ రాస్తున్న సమయంలోనే నెట్ కూడా ఉంది. అందువల్ల రెండింటికీ సిద్ధం కావాల్సి వచ్చింది. అన్నీ డిగ్రీ, పీజీలో చదివినవే కాబట్టి ఎక్కువ కంగారు పడలేదు. పరీక్ష కోసం మూడు నెలల ముందునుంచీ రోజుకు 5 గంటలు చదివాను.
* కరెంట్ అఫైర్స్‌కు పూర్తిగా పత్రికలపైనే ఆధారపడ్డాను. ముఖ్యమైన పాయింట్లకు సంబంధించి నోట్స్ తయారు చేసుకున్నాను.
* నాది లిటరేచర్ కాబట్టి ఎక్కువ శ్రద్ధ చూపాల్సి వచ్చింది. లిటరేచర్ పేపర్ చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ప్రిపరేషన్ విషయంలో కూడా జాగ్రత్త వహించాను. 5వ శతాబ్దపు రచయితల నుంచి 20వ శతాబ్దపు రచయితల వరకు వరుస ప్రకారం వారి రచనలు, బిరుదులు అన్నీ చదివాను. ప్రధానమైన రచయితల గురించి ప్రత్యేకంగా నోట్స్ తయారుచేసుకున్నాను. వీటికోసం మార్కెట్లో దొరికే పుస్తకాల కంటే డిగ్రీ, పీజీల్లో ఉన్న అకాడమీ పుస్తకాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపాను.
* ఇంగ్లిష్ గ్రామర్ మీద పట్టు కోసం ఇంటర్, డిగ్రీ, పీజీ ఇంగ్లిష్ పుస్తకాలతోపాటు గ్రామర్ పుస్తకాలను కూడా చదివాను.
* పరీక్షలో సమయం చాలా కీలకమైంది కాబట్టి మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేశాను. ఇంగ్లిష్ పేపర్ కోసం బ్యాంక్ ఇంగ్లిష్ మోడల్ పేపర్లు కూడా అధ్యయనం చేశాను. ఏది చేసినా ఆసక్తితో చేశాను. కేవలం పరీక్షలో మార్కులు లేదా ర్యాంకు వస్తే సరిపోతుందని మాత్రం అనుకోలేదు. సబ్జెక్టును ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ప్రయోజం ఉంటుందని తెలుసు కాబట్టి అదే మార్గంలో వెళ్లాను.
సలహా: లక్ష్యాన్ని ముందుగానే ఏర్పర్చుకోవాలి. సబ్జెక్టును ఆసక్తితో, పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలనే దృక్పథంతో చదవాలి. తద్వారా పరీక్షలో ప్రశ్న ఎలా వచ్చినా సమాధానాన్ని రాయవచ్చు. ఒకసారి సక్సెస్ కాకపోవచ్చు. అంతమాత్రాన నిరాశ పడాల్సిన అవసరంలేదు. మళ్లీ ప్రయత్నించాలి. గతంలో ఎక్కడ పొరపాటు దొర్లిందో తెలుసుకుని దాన్ని సరిదిద్దు కోవాలి. పోటీ పరీక్షల్లో సమయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది కాబట్టి ముందుగానే చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలి. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది. పట్టుదలతో, ఓపికతో కృషి చేస్తే తప్పక సక్సెస్ సాధిస్తామనడంలో సందేహం లేదు.
ప్రతి పాయింట్‌నూ అర్థం చేసుకోవాలి!
- ఎడ్‌సెట్ -2012 మ్యాథమెటిక్స్ స్టేట్ టాప్ ర్యాంకర్ బాపిరాజు
పోటీ పరీక్షల్లో నెగ్గుకు రావాలంటే సబ్జెక్టులను ఆషామాషీగా చదవకూడదనీ, ప్రతి పాయింట్‌నూ అర్థం చేసుకుంటూ చదవాలని ఎడ్‌సెట్ - 2012 మ్యాథమెటిక్స్ స్టేట్ టాప్ ర్యాంకర్ శ్రీ వీర వెంకట బాపిరాజు అన్నారు. ఇటీవల జరిగిన ఎడ్‌సెట్‌లో మ్యాథమెటిక్స్ విభాగంలో 126 మార్కులు సాధించి మొదటి ర్యాంక్‌ను అందుకున్న బాపిరాజు తన సక్సెస్ విశేషాలను 'న్యూస్‌టుడే'కు తెలిపారు.
ప్ర. కుటుంబ విశేషాలను వివరించండి?
జ. మా నాన్నగారు విశ్రాంత సిపాయి. అమ్మ గృహిణి. ఒక అక్కయ్య ఉన్నారు. ప్రస్తుతం నేను ట్రిపుల్ ఐటీ, నూజివీడులో మ్యాథమెటిక్స్ మెంటర్‌గా చేస్తున్నాను.
ప్ర. మీ విద్యార్హతలు...
జ. నేను వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్‌ని. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్‌లో 78 శాతం మార్కులు సాధించాను. డిగ్రీ కూడా వైజాగ్‌లోనే చేశాను. ఇటీవలే సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అర్హత పొందాను.
ప్ర. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉండేది?
జ. తల్లిదండ్రులు, స్నేహితులు అనుక్షణం ప్రోత్సహించే వారు. డిగ్రీ మ్యాథ్స్ లెక్చరర్, పీజీ మ్యాథ్స్ ప్రొఫెసర్‌తోపాటు ఇతర సబ్జెక్టుల లెక్చరర్ల గైడెన్స్‌తో నేను పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాను.
ప్ర. ప్రిపరేషన్ విధానం....
జ. నేను ఏ పరీక్షను తీసుకున్నా తేలిగ్గా భావించలేదు. ప్రతి దానికీ ముందునుంచే ప్రణాళిక, షెడ్యూల్ సిద్ధం చేసుకునే వాణ్ణి. రెగ్యులర్ స్టడీస్ వార్షిక పరీక్షల నుంచి పోటీ పరీక్షల వరకు అన్నింటినీ జాగ్రత్తగానే రాయాలని భావించాను. మొదటినుంచి అదేవిధంగా కృషి చేస్తూ వస్తున్నాను. పరీక్షలో సక్సెస్ అందుకోవాలనే తపనతో రోజుకు 5 గంటలు చదివాను.
* జనరల్ ఇంగ్లిష్ కోసం 6 నుంచి డిగ్రీ, పీజీ వరకు ఇంగ్లిష్ సబ్జెక్టు పుస్తకాలనే బాగా చదివాను. మ్యాథ్స్ మీద పట్టు సాధించేందుకు బీఎస్సీ 3 సంవత్సరాల మ్యాథ్స్ పుస్తకాలను పదేపదే చదివాను. ముఖ్యమైన పాయింట్లను విడిగా రాసుకున్నాను. బేసిక్స్ కోసం 6 నుంచి ఇంటర్ వరకు మ్యాథ్‌పుస్తకాలను బాగా పరిశీలించాను. ఏ పాయింట్‌నూ వదల్లేదు.
* జనరల్‌స్టడీస్ కోసం కూడా 6 నుంచి 10 వ తరగతి వరకు ఉన్న సోషల్, సైన్స్ సబ్జెక్టులపై ఆధారపడ్డాను. మార్కెట్లోని మోడల్ పేపర్లను ప్రాక్టీస్ కోసం ఎంచుకున్నాను.
సలహా: సిద్ధమవుతున్న పరీక్షకు రెండు మూడు నెలల ముందునుంచే ప్రణాళిక రూపొందించుకోవాలి. కేవలం పరీక్ష తేదీకి కొద్ది రోజుల ముందు బాగా చదవడం సరికాదు. నిర్ణీత షెడ్యూల్‌ను తయారుచేసుకుని దాని ప్రకారం చదవాలి. పాయింట్ టు పాయింట్ చదువుతూ అర్థం చేసుకోవాలి. ఏ పాయింట్ కష్టం అనిపిస్తే దాన్ని మళ్లీ చదవాలి. డిగ్రీ పుస్తకాలతోపాటు ఎస్ చాంద్ పోటీ పరీక్షల పుస్తకాలను రోజూ చదువుతూ ప్రత్యేకంగా సొంత నోట్స్ రాసుకుంటే పరీక్షలో మంచి ప్రయోజనం కలుగుతుంది. మోడల్ పేపర్లు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలనే విషయాన్ని మర్చిపోకూడదు.
పరీక్ష కోసం కాదు, రోజూ చదవాలి!
- ఎడ్‌సెట్ - 2012ఫిజికల్సైన్సెస్స్టేట్టాప్ర్యాంకర్సుధ
జీవితంలో పైకి రావాలంటే కేవలం పరీక్షల కోసమే చదవకూడదని, రోజూ చదవాలని, అలాగే వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని అప్పుడే అభివృద్ధి మార్గాన పయనిస్తామని ఎడ్‌సెట్ - 2012 ఫిజికల్ సైన్సెస్ స్టేట్ టాప్‌ర్యాంకర్ పి.ఎస్.సుధ అన్నారు. ఎడ్‌సెట్‌లో ఫిజికల్ సైన్సెస్‌లో 107 మార్కులతో టాపర్‌గా నిలిచిన సుధ 'న్యూస్‌టుడే'కు అందించిన సక్సెస్ విశేషాలు....

ప్ర. మీ కుటుంబ వివరాలు చెప్పండి?
జ. నేను కేరళకు చెందిన వ్యక్తిని. మా నాన్నగారు విశ్రాంత ఉద్యోగి. అమ్మ గృహిణి. నేను తిరుచిలోని ఎన్.ఐ.టి. నుంచి ఎంఎస్సీ (కెమిస్ట్రీ) చేశాను. దీన్లో 77 శాతం మార్కులు వచ్చాయి. తర్వాత ఎంటెక్ చేశాను. ప్రస్తుతం విజయవాడలోని ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నాను. మావారు గేట్ వంటి ప్రధాన పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
ప్ర. పరీక్షకు ఎలా ప్రిపేర్ అయ్యారు? జ. చాలా మంది పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవుతారు. నేను మాత్రం సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో చదివాను. పోటీ పరీక్షల కోసం టెన్షన్ పడలేదు. అవికూడా జీవితంలో భాగంగా భావించాను. విజయాన్ని అందుకోవడం కోసం సబ్జెక్టుల మోడల్ పేపర్లను బాగా ప్రాక్టీస్ చేశాను.
* చదవడం అంటే కేవలం సరదా కోసమో, పరీక్షకు చదవాలి కాబట్టి అనే ఉద్దేశంతో చదవలేదు. ప్రతి సబ్జెక్టును అర్ధం చేసుకోవడానికి బాగా ప్రయత్నించాను. పలానా సబ్జెక్టుతో నాకు సంబంధం లేదని ఎప్పుడూ అనుకోలేదు. అందువల్లే కరెంట్ అఫైర్స్ విషయంలో ప్రతి పాయింట్ మీదా మంచి అవగాహన ఏర్పడింది.
* నేను ఇంగ్లిష్ మీడియంలో చదివాను కాబట్టి ఇంగ్లిష్ విభాగానికి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం లేకపోయింది.
* ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి డిగ్రీ, పీజీల్లో చదివిన సబ్జెక్టులపైనే ఆధారపడ్డాను. వాటినే రివిజన్ చేశాను.
* పోటీ పరీక్ష అనే భావనతో ఉన్నాను కాబట్టి మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేశాను. పరీక్షలో దీనివల్ల మంచి లాభం కలిగింది.
సలహా: నాలెడ్జ్ ఒక్క రోజులో వచ్చేది కాదు. అలాగే సక్సెస్ కూడా ఒక్కసారే వస్తుందనుకోవడం సమంజసం కాదు. పట్టుదలతో ముందుకు కదలాలి. ప్రతి సబ్జెక్టు పైనా అవగాహన పెంచుకోవాలి. ఇది నా సబ్జెక్టు కాదు అనే భావన తగదు. ఏ సబ్జెక్టు వల్ల ఎప్పుడు ప్రయోజనం ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్లే వారు అన్ని సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. టాపర్ కావడం అనేది జీవితంలో ఒక భాగమని, టాపర్‌గా మారేందుకే జీవితాన్ని పణంగా పెట్టాలని అనుకోకూడదు. ఎప్పటికప్పుడు నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్తుంటే జీవితంలో విజేతలుగా రాణిస్తూనే ఉంటాం.

ఇష్టపడి చదావాలి, కష్టపడి కాదు!
* ఎడ్‌సెట్ - 2012 సోషల్ స్టడీస్ స్టేట్ టాప్ ర్యాంకర్ లక్ష్మీ నారాయణ
ఏ పరీక్షకైనా ఇష్టపడి చదివితే తప్పకుండా విజయం వరిస్తుందని ఎడ్‌సెట్-2012 సోషల్ స్టడీస్ టాప్ ర్యాంకర్ కొప్పోలు లక్ష్మీ నారాయణ అన్నారు. ఎడ్‌సెట్ సోషల్ స్టడీస్‌లో 119 మార్కులతో స్టేట్‌లో టాప్ ర్యాంకర్‌గా నిలిచిన ఆయన తన సక్సెస్ విశేషాలను 'న్యూస్‌టుడే'కు వివరించారు.
ప్ర: మీ కుటుంబ విశేషాలు చెప్పండి?
జ. మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాన్న విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి. అమ్మ గృహిణి. నాకు ఒక భార్య, ఒక బాబు. కావలి మా సొంత ఊరు. ప్రస్తుతం నేను ఒక స్వచ్ఛంద సంస్థలో అవేర్‌నెస్ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాను.
ప్ర. మీ విద్యార్హతలు...
జ. కుటుంబ పరిస్థితుల కారణంగా నేను 8వ తరగతి వరకే చదివాను. తర్వాత తెలిసిన టీచర్ల ప్రోత్సాహంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ చేశాను. డిగ్రీలో నాకు 56 శాతం మార్కులు వచ్చాయి.
ప్ర. పోటీ పరీక్షలకు మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉండేది?
జ. కుటుంబ సభ్యులు, మిత్రులు, టీచర్లు నన్ను బాగా ప్రోత్సహించారు. డిగ్రీ చదవడం మొదలు పెట్టినప్పటినుంచే బీఈడీ చేయాలనే ఆలోచన ఉండేది. అదే సమయంలో పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ అయ్యేవాణ్ణి.
ప్ర. ఎడ్‌సెట్‌కు ఎలా ప్రిపేర్ అయ్యారు?
జ. నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టాను. నేను ఏది చదివినా ఇష్టంతో చదివాను. తద్వారా కష్టపడుతున్నామనే భావన ఎక్కడా కలగలేదు. కష్టపడుతూ చదివితే కేవలం చదివినట్లే ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఉదాహరణకు హిస్టరీ సబ్జెక్టునే తీసుకుంటే చరిత్ర సంఘటనలను చదువుతున్నప్పుడు ఆ దృశ్యాలు కళ్లముందు కదలాడాలి. నేనుకూడా అందులో పాల్గొంటున్నట్లు భావించే వాణ్ణి. ఈ విధానంలో చదవడం ద్వారా నాకు ఎంతో లాభం కలిగింది. సబ్జెక్టు మీద మంచి పట్టు వచ్చింది.
* పరీక్షకు మూడు నెలల ముందు నుంచి రోజుకు 6 గంటలు ప్రిపేరయ్యాను. జీవనాధారం కోసం పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నా కూడా మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా దినపత్రికను బాగా చదివే వాణ్ణి.
* కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజూ ఏదో ఒక పత్రికను చదవాలి. దీనికోసం నేను తెలుగులో ఒక ప్రధాన పేపరు, ఇంగ్లిష్‌లో ఒక ప్రధాన పేపరు చదివే వాణ్ణి. కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించడం కోసం ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకునే వాణ్ణి. పరీక్షలో బాగా ఉపయోగపడింది. ఏకలవ్యుడి విధానంలో నా టార్గెట్‌ను చేరుకోవాలనే తపనతో ప్రతిరోజూ చదివేవాణ్ణి.
* ఇంగ్లిష్ మీద పట్టు సాధించడం కోసం 'ఫ్రాంక్స్ ఇంగ్లిష్ రివైజ్‌డ్ గ్రామర్ బుక్' చదివాను. అలాగే వర్డ్ పవర్, కాంప్రహెన్షన్ పెరగడం కోసం ఇంగ్లిష్ చందమామ కూడా చదివాను. తద్వారా వాక్య నిర్మాణాలు, పదాలకు సందర్భోచిత అర్ధాలు బాగా తెలిసేవి.
* జనరల్‌నాలెడ్జ్ కోసం అగర్వాల్ జీకే బుక్స్ చదివాను. వీటిలో సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక కాన్సెప్ట్‌లను బాగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను. తర్వాత బిట్ బ్యాంక్, మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేశాను.
* సోషల్ స్టడీస్, ఎకనమిక్స్, హిస్టరీ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఆయా పుస్తకాలను క్రమం తప్పకుండా చదివాను. వాటిలోని ముఖ్యమైన పాయింట్లను విడిగా నోట్ చేసుకున్నాను. సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై మరింత అవగాహన కోసం టాటా మెక్‌గ్రాహిల్ - సివిల్స్ జనరల్ స్టడీస్ పుస్తకాలు చదివాను.
* మోడల్ పేపర్లను పరీక్షకు రెండు నెలల ముందునుంచి ప్రాక్టీస్ చేస్తే, బిట్ బ్యాంక్‌లను మాత్రం రోజూ ప్రాక్టీస్ చేశాను. కేవలం బిట్లకు జవాబులను గుర్తించడం వరకే సరిపెట్టలేదు. వాటిని అర్ధం చేసుకుంటూ ప్రాక్టీస్ చేశాను. దీనివల్ల అవే మాదిరి బిట్లు తర్వాత ప్రాక్టీస్‌లో వచ్చినప్పుడు కరెక్ట్ సమాధానాన్ని తేలికగా, తొందరగా గుర్తించే వాణ్ణి.
సలహా:
ఎడ్‌సెట్‌కావచ్చు, గ్రూప్స్ కావచ్చు లేదా మరేదైనా కావచ్చు ముందు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. దీనికోసం తమ చుట్టూ ఉన్న విజేతలను గమనించాలి. తద్వారా తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి కొంత అవగాహన కలుగుతుంది. తర్వాత లక్ష్యాన్ని స్థిరంగా ఏర్పర్చుకోవాలి. ఇక అప్పటినుంచి ఆ లక్ష్యం నుంచి మరొక మార్గానికి మారకూడదు. అంటే ఒకసారి ఎడ్‌సెట్అనీ, మరోసారి బ్యాంక్ పరీక్ష... ఇలా లక్ష్యంలో మార్పు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కో పరీక్షకు ఒక్కో విధంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఇక నోటిఫికేషన్‌తో ఏమాత్రం సంబంధం పెట్టుకోకూడదు. అది ఎప్పుడైనా రావచ్చు. ప్రిపరేషన్ మాత్రం ఆపకూడదు. నిరంతరం సాగాలి. కరెంట్ అఫైర్స్ కోసం కనీసం ఏడాది నుంచి నోట్స్ తయారుచేసుకుంటే మంచింది. వేలాది బిట్స్ ప్రాక్టీచేయాలి. సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన కోసం 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న పుస్తకాలను ఏదీ వదలకుండా చదవాలి. తర్వాత మార్కెట్లో దొరికే మెటీరియల్‌ను చదవాలి. కృషిని నమ్ముకుంటే తప్పకుండా విజయం లభిస్తుంది. రాణించగలమనే తపనతో, పట్టుదలతో ఇష్టపడి చదివితే చాలు. లక్ష్యాన్ని ఈ రోజు కాకపోయినా, మరో రోజైనా చేరుకుంటాం. ఇదే నా సలహా, అభిప్రాయం.


లక్ష్యం మారకూడదు!
* ఎడ్‌సెట్ - 2012 సోషల్ స్టడీస్ స్టేట్ రెండో ర్యాంకర్ కృష్ణ
ఆర్థిక వెసులుబాటు లేకపోయినా, కుటుంబ సభ్యుల సహకారం, లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే కచ్చితంగా విజేతగా నిలుస్తామని ఎడ్‌సెట్ -2012లో 114 మార్కులతో రెండో ర్యాంకర్‌గా నిలిచిన పి.కృష్ణ అన్నారు. ఎడ్‌సెట్‌లో తాను సాధించిన సక్సెస్ గురించిన విశేషాలను 'న్యూస్‌టుడే'కు
తెలియజేశారు.

ప్ర.. మీ కుటుం నేపథ్యం...
జ. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న వ్యవసాయదారుడు. అమ్మ గృహిణి. నాకు ఇద్దరు అక్కయ్యలు. ఆముదాలవలసలోని నిమ్మటోర్లువాడ మా సొంత ఊరు.
ప్ర.. మీ విద్యార్హతలు వివరించండి?
జ. నేను బీఏ చదివాను. 51 శాతం మార్కులు వచ్చాయి. తర్వాత ఎంఏ (ఎకనమిక్స్) చేశాను. దీన్లో 63 శాతం మార్కులు వచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలనే ఉద్దేశం ఎడ్‌సెట్ రాశాను.
ప్ర.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది?
జ. అందరూ నన్ను ప్రోత్సహించారు. ఎవ్వరూ వద్దనలేదు.
ప్ర.. ప్రిపరేషన్ ఎలా ఉండేది?
జ. ఎడ్‌సెట్ అనేది కూడా ఒక పోటీ పరీక్షే. దీనికీ కాంపిటీషన్ ఎక్కువే. అందుకనే నా వరకు నేను గట్టిగానే ప్రిపరేయ్యాను. ఇంగ్లిష్ మీద పట్టు సాధించేందుకు ప్రత్యేకంగా నోట్స్ తయారుచేసుకున్నాను. మార్కెట్లో అనేక రకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఉన్నా, ప్రాథమిక తరగతుల పుస్తకాలను బాగా చదివాను. గతంలో డీఎస్సీ కూడా రాశాను. కాబట్టి ఇంగ్లిష్ మీద మంచి అవగాహన ఏర్పడింది.
* ఇక హిస్టరీ, జాగ్రఫీ, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులపై పూర్తి అవగాహన కోసం 4వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ వరకు చదివిన ఆయా సబ్జెక్టుల పుస్తకాలను దగ్గర పెట్టుకుని నోట్స్ తయారు చేసుకున్నాను. ప్రత్యేకించి అకాడమీ బుక్స్ బాగా చదివాను.
* పరీక్షకు రెండు నెలల ముందు నుంచి రోజుకు 8 గంటలపాటు చదివాను. మొదట ఒక సబ్జెక్టును తీసుకుని ఒక వారం రోజులు కేటాయించే వాణ్ణి. ఆ సబ్జెక్టు బేసిక్ పాయింట్లను ఈ వారం రోజుల్లో క్షుణ్ణంగా నేర్చుకునే వాణ్ణి. తర్వాత మరో సబ్జెక్టు. ఇలా చదివాను. అదే సమయంలో ప్రతిరోజూ ఒక మోడల్ పేపరు బాగా ప్రాక్టీస్ చేశాను. అంతేకాదు ఎన్ని బిట్లు తప్పుగా పెట్టానో సరిచూసుకుని ఆ పొరపాట్లు మరోసారి రాకుండా జాగ్రత్త పడే వాణ్ణి. మోడల్ పేపర్లు ఎంతగా ప్రాక్టీస్ చేస్తే అంతగా లాభం ఉంటుంది.
* కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలు చదివేవాణ్ణి. కేవలం చదవడమే కాకుండా ఇక్కడ కూడా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ అంశాలపై విడిగా నోట్స్ రాసుకునే వాణ్ణి.
సలహా:
ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకుంటే దాని నుంచి పక్కకి వెళ్లకూడదు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారు తోటి వారిని చూసి లక్ష్యాన్ని మార్చుకుంటారు. ఇది సరికాదు. అనుకున్న లక్ష్యం కోసం ప్రణాళిక రూపొందించుకుంటే సగం విజయాన్ని సొంతం చేసుకున్నట్లు అవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతి వ్యక్తి మొదట అకాడమీ పుస్తకాలను బాగా చదవాలి. తర్వాత మార్కెట్లో దొరికే రెడీమేడ్ బుక్స్‌ను అనుసరించాలి. కొంచెం ఆలస్యమైనా గమ్యాన్ని చేరుకోవాలనే తపన, ఓర్పు ఉంటే చాలు. సక్సెస్ తప్పకుండా వరిస్తుంది.

సహనం... శ్రద్ధ... శ్రమ...!
* విజయానికి మార్గాలు
* సివిల్స్ 2012 టాపర్ ప్రిన్స్ ధావన్ (పురుషుల్లో మొదటి ర్యాంకర్, మొత్తం మీద 3వ స్థానం)
జీవితానికో లక్ష్యం ఉండాలని, అనుకున్నది సాధించడానికి అలుపెరుగని శ్రమతోపాటు ఓపిక కూడా అవసరమని సివిల్స్ 2011 -12 టాపర్ ప్రిన్స్ ధావన్ అన్నారు.
మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ టాపర్‌గా నిలిచిన ధావన్ సక్సెస్ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం...
జీవితంలో ప్రతి సంఘటనను సానుకూల దృక్పథంతో చూడాలనేది నా అభిమతం. మనసులో ఏదీ దాచుకోను. సివిల్స్‌కు ఎంపిక అయ్యాననే విషయం తెలిశాక మొదట నాకు చాలా సంతోషం వేసింది. నేను పడిన కృషికి లభించిన ప్రతిఫలంగా దీన్ని భావిస్తున్నాను. ఇప్పుడు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది.
* కుటుంబ సభ్యుల ప్రోత్సాహం
మా నాన్న కమిషనర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్‌గా పనిచేస్తున్నారు. నేను ఐఐటీ, ఢిల్లీ నుంచి డిగ్రీ చేశాను. 9వ తరగతిలో ఉండగానే సివిల్స్‌పై అవగాహన పెంచేందుకు మా నాన్నగారు కృషి చేశారు. అమ్మ, అన్నయ్య పరీక్ష ప్రిపరేషన్‌లోనే కాదు, జీవితంలోకూడా ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. అన్ని విషయాల్లో అండగా నిలిచారు.
సివిల్స్ వంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడంలో భాష ఒక అవరోధంగా మారుతుందని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ముఖ్యంగా 'ఇంగ్లిష్ మీడియం'లో చదివిన వారికి సివిల్స్ తేలిక అని విద్యార్థులు అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. భాష ఏదైనా కావచ్చు. లక్ష్య సాధన దిశగా మనం ప్రణాళికాబద్ధంగా కృషి చేశామా లేదా అన్నదే ముఖ్యం. ప్రస్తుతం యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్స్ పరీక్ష విధానం కూడా సరైన పంథాలోనే ఉంది. ఈ పరీక్షను ఒక సవాల్‌గా తీసుకునే విధంగా యూపీఎస్సీ నిర్వహించడం అందరూ ఆహ్వానించదగినదే.
* నా బలాలు, విజయానికి దోహదపడిన అంశాలు...
1) బాగా కష్టపడటం.
2) పట్టుదల
3) దేనినీ తేలికగా తీసుకోకపోవడం.
4) భగవంతుడి మీద నమ్మకం.
5) సహనం
ఇవే సివిల్స్‌లో నన్ను విజేతగా నిలబెట్టాయి. ఎవరైనా సరే ఓటమి వచ్చినా కుంగిపోకూడదు. శ్రద్ధగా, ఓపికతో, నమ్మకంతో, పట్టుదలతో కృషి చేయాలి. అప్పుడే అంతిమ విజయం మనదవుతుందని నా నిశ్చిత అభిప్రాయం.
* సివిల్స్‌లో నా ఆప్షన్లు:
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లను ఆప్షనల్స్‌గా ఎంచుకున్నాను. ఆప్షనల్స్ ఎంపిక అనేది కేవలం అభ్యర్థి ఆసక్తి మీదే ఆధారపడి ఉండాలి. ఆయా సబ్జెక్టుల అధ్యయనంపై అతని వైఖరి కూడా ముఖ్యం. అంతేగానీ ఇతరులు ఎంపిక చేసుకున్నవి మనం కూడా ఎంపిక చేసుకుందామని అనుకోకూడదు.
* ప్రిపరేషన్ విధానం:
కంపల్సరీ పేపర్లను సాధన చేయడానికి ప్రతిరోజూ దినపత్రికలు చదివాను. ముఖ్యంగా జనరల్ స్టడీస్ కోసం పత్రికలతోపాటు ఇంటర్‌నెట్‌లోనుంచి సమాచారాన్ని సేకరించాను. వివిధ మ్యాగజైన్లలో ఒకే అంశంపై వచ్చిన సమాచారాన్ని పరిశీలించి ముఖ్యమైన పాయింట్లను నోట్‌చేసుకున్నాను. పోటీ పరీక్షల మ్యాగజైన్లలో ప్రచురితమయ్యే వ్యాసాలు సైతం తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని అందించాయి. ఇవి చదువుతున్నప్పుడు మనం కూడా ఆ విధంగా వ్యాసాలు రాయాలనే ఉత్సాహం కలుగుతుంది. ఇది అవసరం కూడా. పరీక్ష తేదీ సమీపిస్తున్నకొద్దీ టెస్ట్ పేపర్ల సాధనకు ఎక్కువ సమయం కేటాయించాను. దీనివల్ల పరీక్ష హాల్లో ఏ విధమైన వాతావరణానికి లోనవుతామో విడిగా కూడా అదే స్థితికి లోనయ్యాను. మోడల్ పేపర్ చేస్తున్నా 'నిజంగానే పరీక్ష రాస్తున్నాను' అని భావించాను. ఇక ఇంటర్వ్యూకు వెళ్లబోయే ముందు నేను పోటీ పరీక్షల మ్యాగజైన్లలో వచ్చిన సివిల్స్ విజేతల ఇంటర్వ్యూలను బాగా చదివాను. ఇంటర్వ్యూ సభ్యుల ఎదుట ఎలా ఉండాలి? ఎలాంటి ప్రశ్నలు వారినుంచి వస్తాయి? వాటిని ఎలా స్పందించాలి.. వంటి అనేక విషయాలను తెలుసుకున్నాను. గత విజేతల ఇంటర్వ్యూలు చదవడం ద్వారా ఇంటర్వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. మనపై మనకు నమ్మకం అధికమవుతుంది. ఆత్మవిశ్వాసం ఇంకా పెరుగుతుంది.
* ఇంటర్వ్యూ బోర్డు గురించి...
ఇంటర్వ్యూ బోర్డులోని సభ్యులు బాగా చదువుకున్న వారు. తమ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తినీ గౌరవించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడారు. బోర్డు సభ్యుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇంటర్వ్యూ బోర్డును గమనించిన తర్వాత నాకు ఏర్పాడిన అభిప్రాయం - నిజాయితీయే విజయానికి బలమైన పునాది.
* నా సలహా
సివిల్స్‌లాంటి ఉన్నత స్థాయి పరీక్షల్లో విజయం సాధించడానికి ఎన్ని సంవత్సరాలు కేటాయించాలనేది అభ్యర్థి వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. సమయం సంగతి ఎలా ఉన్నా పరీక్ష మీద, సబ్జెక్టులపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. తన మీద తనకు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి.
విజయానికి దగ్గరి దారులేవీ లేవని ప్రతి అభ్యర్థి గుర్తించాలి. ఎప్పుడూ సందర్భోచితంగా వ్యవహరించాలి. తెలివితేటలను పెంపొందించుకోవాలి. అలాగే సహనాన్ని ఏ మాత్రం కోల్పోకూడదు. అనుకున్న లక్ష్యం మీదే మనసు కేంద్రీకరిస్తూ ప్రతి క్షణాన్ని దానికోసమే కేటాయించాలి. కఠిన శ్రమ పడటమే కాదు, తెలివిగా కష్టపడటం అవసరమని గుర్తించండి. దీనివల్ల తక్కువ సమయంలో విజయాన్ని చేరుకోవచ్చు.
ఏఐఈఈఈ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆలిండియా టాప‌ర్ సందీప్ ప‌త్రి
ఏఐఈఈఈ ఇంజినీరింగ్‌ విభాగంలో అఖిలభారత స్థాయిలో ఇంజినీరింగ్‌ విభాగంలో ఢిల్లీకి చెందిన సందీప్ ప్రతి మొదటి ర్యాంక్‌ సాధించాడు. ఢిల్లీలోని శ్రీ చైత‌న్య బ్రాంచీలో లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్ తీసుకున్నాన‌ని అక్కడి శిక్షణా విధానం డిఫ‌రెంట్‌గా ఉంద‌ని తెలిపాడు. కోచింగ్ పూర్తయ్యే సమ‌యానికి క‌చ్చితంగా ర్యాంక్ కొడ‌తాన‌నే న‌మ్మకం క‌లిగింద‌ని తెలియ‌జేశాడు. త‌ల్లి, దండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సూచ‌న‌లు, స‌బ్జెక్టుల రివిజ‌న్ త‌న విజ‌యానికి కార‌ణ‌మ‌ని తెలిపాడు.
2011లో ఐఐటీ - జేఈఈలో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించిన పృధ్వీతేజ్‌ను త‌న విజ‌యానికి ఇన్‌స్పిరేష‌న్ అని అత‌ని లాగే జాతీయ స్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించాల‌నే ల‌క్ష్యంతో చ‌దివాన‌ని చెప్పాడు. సందీప్ ఐఐటీ-జేఈఈ - 2012లో ఆలిండియా 1021వ ర్యాంకు సాధించాడు. ఇప్పుడు ఏఐఈఈఈలో బి.టెక్ ఆలిండియా ఓపెన్ విభాగంలో ఫ‌స్ట్ ర్యాంకు సాధించాడు.
సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి!
* ఏఐఈఈఈ- 2012 జాతీయస్థాయి నాలుగో ర్యాంకర్ 'సాయి అఖిల్'
'ఏ పోటీ పరీక్షలోనైనా, వార్షిక పరీక్షల్లోనైనా అత్యధిక మార్కులు సాధించాలంటే సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలని' ఏఐఈఈఈ- 2012 జాతీయస్థాయి నాలుగో ర్యాంకర్ 'సాయి అఖిల్' అన్నారు. ఇటీవల ప్రకటించిన ఏఐఈఈఈలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు అందుకున్న నేపథ్యంలో 'న్యూస్‌టుడే'తో తన విజయ విశేషాలను పంచుకున్నారు. వాటి వివరాలు...

ప్ర.. సక్సెస్‌కు ప్రధాన కారణం ఏమిటి?
జ. అనుభవజ్ఞులైన టీచర్లు చెప్పిన పాఠాలు, వారిచ్చిన గైడెన్స్, ఫ్రెండ్స్‌తో చర్చించడం. ఇవి ఒకవైపు అయితే, మరో ప్రధాన కారణం సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవడానికి కృషి చేయడం. బేసిక్స్‌పై ఎంత అవగాహన ఉంటే పరీక్షల్లో అంత ఎక్కువగా మార్కులు వస్తాయి.
ప్ర.. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
జ. ప్రస్తుతం మేం శ్రీకాకుళంలోని న్యూ కాలనీలో ఉంటున్నాం.. మా నాన్నగారు కాసుల బాబు రణస్థలంలోని గవర్నమెంట్ స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా చేస్తున్నారు. అమ్మగారు వెంకటలక్ష్మి గృహిణి. అక్కయ్య జీఎంఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ చేస్తోంది.
ప్ర.. మీ విద్యార్హతలు..
జ. శ్రీకాకుళంలోని భాష్యం స్కూల్‌లో నేను పదో తరగతి చదివాను. 572 మార్కులు వచ్చాయి. ఇక ఇంటర్ కూడా గుంటూరులోని భాష్యం సంస్థలకు చెందిన కాలేజీలోనే చదివాను. 968 మార్కులు వచ్చాయి.
ప్ర.. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు రావడంలో మీ కుటుంబ సభ్యుల, మిత్రుల సహకారం ఎలా ఉంది? ఏ విధమైన ప్రోత్సాహాన్ని అందించారు?
జ. తలిదండ్రులు నిరంతరం నా వెన్నంట ఉండి ప్రోత్సహించారు. కొన్ని సబ్జెక్టుల్లో మార్కులు తక్కువ వస్తున్నా నిరుత్సాహ పడవద్దని, వచ్చే పరీక్షల్లో ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని చెప్పారు. ఇక మిత్రులతో ఎప్పుడూ సబ్జెక్టుల గురించి చర్చించే వాడిని. దాంతో వారు కూడా కొత్తకొత్త ఆలోచనలను నా ముందుంచే వారు. నిరుత్సాహపరిచిన వారు చాలా తక్కువ.
ప్ర.. ఏఐఈఈఈ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందారా? ప్రిపరేషన్ ఎలా సాగింది?
జ. ఇంటర్ చేరినప్పటి నుంచే ఐఐటీ జేఈఈ, ఎంసెట్‌తదితర పరీక్షలకు కాలేజీలోనే శిక్షణ ఇచ్చేవారు. లెక్చరర్లు రోజుకు నాలుగున్నర గంటలు పాఠాలు చెప్పేవారు. ఆ సమయంలో నేను ముఖ్యమైన పాయింట్లపై విడిగా నోట్స్ రాసుకునే వాడిని. ఒక్కో సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై బాగా దృష్టి పెట్టే వాడిని. క్లాసులు పూర్తయిన తర్వాత మళ్లీ దాదాపు మూడు గంటలు చదివే వాడిని. ప్రతి రోజూ ఏం చదువుతున్నాం; ఎంత వచ్చింది? ఇంకా ఎంత చదవాలి? వంటి ప్రశ్నలు వేసుకుని ఆలోచించే వాడిని. తద్వారా ఏం చేయాలో తెలిసేది. అంతేకాదు మిత్రులతో కూడా చర్చించే వాడిని. దీనివల్ల మా ఆలోచనా పరిధి బాగా పెరిగింది. ఐఐటీ ప్రిపరేషన్ సమయంలోనే ఏఐఈఈఈ గురించి కూడా చర్చించి దీనికి కూడా ప్రిపేర్ అయ్యాను.
ప్ర.. పరీక్షల కోసం తీసుకున్న జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా?
జ. ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండేందుకు టెన్షన్‌కు లోనుకాలేదు. చదివేటప్పుడు వచ్చే అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి మొదట ఆలోచించే వాడిని. తర్వాత ఫ్రెండ్స్‌తో చర్చించే వాడిని. అప్పటికి కూడా నివృత్తి కాకపోతే లెక్చరర్లను సంప్రదించే వాడిని.
ప్ర.. పరీక్షలు ఇంగ్లిష్ మీడియంలో ఉంటాయి కదా? తెలుగు మీడియం విద్యార్థులు ఎలా చదవాలి?
జ. మీడియం ఏదైనా ముందు సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై లోతైన అవగాహన ముఖ్యం. సహజంగా ఇంటర్‌లో అందరూ ఇంగ్లిష్ మీడియం పుస్తకాలపైనే ఎక్కువ ఆధారపడతారు. కాబట్టి ఇంటర్‌నుంచే ఇంగ్లిష్ సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధిస్తే బాగుంటుంది. నా వరకు నేను టెన్త్, ఇంటర్ ఇంగ్లిష్ మీడియంలో చదివాను కాబట్టి, లాంగ్వేజ్ గురించి అంతగా భయం కలగలేదు.
ప్ర.. భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
జ. ఐఐటీ ముంబయిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నాను. తర్వాత సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలుపెడతాను.
ప్ర.. కొత్త వారికి మీరిచ్చే సలహా.
జ. పరీక్ష ఏదైనా కావచ్చు. హార్డ్ వర్క్ చాలా ముఖ్యం. సబ్జెక్టుపై అవగాహనకు మొదట ఆలోచించాలి. తర్వాత మిత్రులతో చర్చించాలి. తర్వాత లెక్చరర్లను సంప్రదించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ టెన్షన్ పడకూడదు. కూల్‌గా ఉండాలి. చేసే పనిలో నిజాయితీ ఉండాలి. ఎన్ని గంటలు చదివామని కాకుండా చదివనంత వరకు ఆసక్తితో చదవాలి. క్లాసులో చెప్పేటప్పుడు శ్రద్ధగా వినడతోపాటు టైమ్ మేనేజ్‌మెంట్ కోసం మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. కాలేజీలో ఈ విధానాన్ని అమలు చేస్తుంటే ప్రిపరేషన్ సమయంలో ఏ పాయింట్ల దగ్గర ఇబ్బందులు వస్తున్నాయో గుర్తించి వాటిని లెక్చరర్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలి. సమయాన్ని సరైన మార్గంలో ఉపయోగించడంలోనే సగం విజయం ఆధాపడి ఉంటుంది. కాబట్టి కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచి ఎలాంటి లక్ష్యం నిర్దేశించుకున్నారో దానికి తగిన విధంగా నడుచుకోవాలి. చదవాలి. తద్వారా విజయం సొంతమవుతుంది.
2012 ఐసెట్ స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌ జయప్రకాశ్‌చారి
ఐసెట్ - 2012 ప‌రీక్షలో హైద‌రాబాద్‌కు చెందిన జయప్రకాశ్‌చారి స్టేట్ ఫస్ట్‌ర్యాంక్ కైవ‌సం చేసుకున్నాడు. ప‌ట్టుద‌ల‌తో చ‌దివి విజ‌యం సాధించాడు. ఈ విజయం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిద‌ని, భ‌విష్యత్తుల్లో రాయ‌బోయే ఇత‌ర పోటీ ప‌రీక్షల‌కు స్పూర్తి పొందాన‌ని చెప్పాడు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేయాలనేదే త‌న ల‌క్ష్యమ‌ని తెలిపాడు. చ‌దువు విష‌యంలో త‌న త‌ల్లి దండ్రులు ఎక్కడ రాజీ ప‌డ‌లేద‌ని వారి ప్రోత్సాహంతోనే ఏ లక్ష్యాన్నైనా సాధించగలన‌నే ధైర్యం త‌న‌లో పెరిగింద‌ని చెప్పాడు. జయప్రకాశ్‌చారి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫ్యాక్ట్‌సెట్ కంపెనీలో ఫైనాన్షియల్ డేటా ప్రొవైడర్‌గా పనిచేస్తున్నాడు. మ్యాట్ తో పోల్చుకుంటే ఐసెట్ సిలబస్ త‌క్కువ‌గా ఉండ‌టంతో రోజుకు రెండుగంటల చొప్పున పరీక్షకు ప్రిపేర‌య్యాన‌ని తెలిపాడు.

ఎలాంటి కోచింగ్ లేకుండా కేవ‌లం టెక్ట్స్‌బుక్స్‌తోపాటు ఇత‌ర‌ పుస్తకాలు చ‌ద‌వ‌డం, ఐసెట్ పాత పరీక్ష ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్‌చేయ‌డం వల్ల పరీక్షవిధానం, పరీక్షలో ఏవిధంగా ప్రశ్నలు అడుగుతున్నారు అనే విష‌యంపై అవగాహ‌న వచ్చిందని తెలిపాడు.

ఇష్టంగా చదవడమే విజయరహస్యం
* 9వ ర్యాంకర్ కృష్ణభాస్కర్ (హైదరాబాద్)
''కష్టంగా కాకుండా ఇష్టపడి చదవడమే నా విజయరహస్యం. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌లు కావడంతో నాకు కూడా ఐఏఎస్ కావాలనే ఆకాంక్ష ఉండేది. ఐఎస్‌బీలో చదివేటప్పుడు ఈ కోరిక బాగా బలీయంగా మారింది. తొలి ప్రయత్నంలో మూడు, నాలుగు మార్కులు తక్కువ రావడంతో ఐపీఎస్ వచ్చింది. చేరాను. లక్ష్యం సాధించాలనే తపనతో మళ్లీ ప్రయత్నించాను. సివిల్స్‌లో విజయం సాధించాలంటే ఒక పద్ధతి ప్రకారం కష్టపడాల్సిందే. మొదట 90వ ర్యాంకు వచ్చింది. తరువాత సున్నా తొలగి తొమ్మిదో ర్యాంకు వచ్చింది. సోదరుడు పార్థసారధి భాస్కర్‌కూ, నాకూ ర్యాంకులు రావడం చాలా ఆనందంగా ఉంది".

స్వదేశంలోనే సేవలు చేయాలని..
20 వ ర్యాంకర్ మల్లికార్జున (కడప జిల్లా)
కడప నగరం: '' మాది కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారిపల్లె. తల్లిదండ్రులు రాములమ్మ, నాగమల్లయ్య. మేము ముగ్గురం. అన్న రామ్మూర్తి, చెల్లెలు మల్లీశ్వరి. మాకు రెండెకరాల పొలం ఉంది. నాన్ననిత్యం కడప నగరానికి సైకిల్‌పై వెళ్లి ఇంటింటికీ పాలుపోసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పరిస్థితులు. మా చదువుల కోసం రూ.3 వడ్డీకి అప్పులు తెచ్చారు. బాల్యంలో నాన్న మాచదువుల కోసం పడుతున్న శ్రమ ప్రత్యక్ష్యంగా చూసి కుటుంబ పరిస్థితుల్లో మార్పులు రావాలంటే మేం బాగా చదవాలి అనుకున్నాం. మంచి ఉద్యోగం సాధించాలన్న పట్టుదలే నన్ను వైద్యుడిని చేసింది.
ఆ వృత్తిలో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్యసేవలందిస్తూ వారి జీవన స్థితిగతులు చూసి మళ్లీ మనసు చలించింది. వీరి జీవన స్థితిగతుల్లో మార్పులు తేవాలి అని భావించాను. అందుకు సివిల్స్ అనే దారి కనిపించింది. మూడుసార్లు అపజయాలే. అయినా గురి తప్పలేదు. నాలుగోసారి ప్రయత్నించి సివిల్స్ 252 ర్యాంకు సాధించా. ఆ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపిక కావాల్సి ఉంది. కానీ ఎత్తు కాస్త తక్కువని ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసు)కు ఎంపిక చేశారు. ఇక్కడ చదువులు చదివి విదేశాల్లో సేవలందించటం నాకు ఇష్టంలేదు. మాతృగడ్డకు నా సేవలందాలనే పట్టుదలతో ఆ సర్వీసును త్యజించా. మళ్లీ ప్రయత్నించి సివిల్స్ సర్వీసులో జాతీయ స్థాయిలో 20వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకును సొంతం చేసుకున్నా. రెండుసార్లు ప్రయత్నంలో విఫలం అయ్యా. మూడోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి మళ్లీ తప్పా. దాంతో ఇక అపేద్దాం అనిపించింది. ఒక వైపు భయంవేసింది. అయినా ఎక్కడో ఆశ. ఇంతకాలం పడిన శ్రమ ఊరికేపోతుందని మళ్లీ ప్రయత్నించా. విజయం సాధించా. అయితే వచ్చిన సర్వీసుతో సొంత దేశంలో పనిచేయాలనే కోరిక తీరకుండా పోతుందని దాన్ని వదిలేసుకుని మళ్లీ ప్రయత్నించి సఫలీకృతుడినయ్యా.
రోజుకు 8 గంటలు చదివా. ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. నా మిత్రులు ఐపీఎస్ అధికారి బాబుజి, ఐఏఎస్ అధికారి కిరణ్ మార్గదర్శకత్వం అందించారు. కష్టపడితే ఫలితం ఊరికేపోదు అనేదానికి నా విజయమే ఉదాహరణ. ప్రణాళిక ప్రకారం చదవాలి. నా విజయం అమ్మనాన్నలకే అంకితం. నాకు చదవుకునే సమయంలో బాలవికాస్ పాఠశాల కరస్పాండెంటు, మా మామగారు అయిన సుబ్బరాయుడు, అత్త దేవి, మామయ్య గంగయ్య సహకారం మరవలేనిది. ప్రజల జీవన విధానాల్లో నాణ్యతను తీసుకురావాలన్నదే నా సంకల్పం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కాగా పేదలకు అందేలా చూస్తా. పేదప్రజలకు సేవలందించటమే నా లక్ష్యం".
నాన్న కష్టాన్ని తలచుకుని కసిగా చదివా
53వ ర్యాంకర్ మాలపాటి పవన్‌కుమార్
అనంతపురం (విద్య) : 'నా చదువు కోసం నాన్న కష్టపడిన తీరు తలచుకుంటే ఏడుపు వస్తుంది. ఆయన కష్టం నిత్యం కళ్లల్లో మెదులుతూ ఉంది. అందుకే కసితో చదివి సివిల్స్ సాధించా. నాన్న తన కష్టాన్ని నా భవిష్యత్తు కోసం ధారపోశారు. అన్న, అక్క, బావ కృషి, ప్రోత్సాహాన్ని జీవితంలో మరిచిపోలేను సివిల్స్‌లో విజయం సాధించిన మాలపాటి పవన్‌కుమార్ అన్న మాటలవి. ప్రతిష్ఠాత్మక అఖిల భారత సివిల్స్ పోటీ పరీక్షలో పవన్ అత్యుత్తమ ప్రతిభ చూపారు.
53వ ర్యాంకు సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. రాష్ట్ర స్థాయిలో మూడో స్థానాన్ని ఆక్రమించారు. నిర్దేశించుకున్న లక్ష్యసాధనకు ఆయన ఎలా శ్రమించారో ఆయనమాటల్లోనే.. ''బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు మా స్వగ్రామం. సాధారణ రైతు ఆదినారాయణ, జానకిలకు నేను మూడో సంతానం. అన్న ఉదయ్‌కుమార్, అక్క స్వప్న. ఇంటర్మీడియట్ వడ్లమూడి విజ్ఞాన్‌లో పూర్తి చేశాను. 2003-2005 మధ్య బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేశా. 2007లో హైదరాబాద్ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ప్రవేశం. 2009 దాకా అక్కడే ఉద్యోగం. ఆ తర్వాత ఓ ఆరు మాసాలు బళ్లారిలో జేఎస్‌డబ్ల్యూలో పని చేశా. సంపూర్ణంగా ప్రజాసేవ చేయాలంటే సివిల్స్‌లోకి ప్రవేశించాలన్న పట్టుదలతో 2009 తర్వాత న్యూఢిల్లీకి మకాం మార్చాను. రెండేళ్లపాటు అక్కడే కఠోరంగా తర్ఫీదు పొందారు. గతేడాది నవంబరు దాకా అక్కడే ఉన్నా. ఇక మౌఖిక పరీక్ష మాత్రమే మిగిలి ఉంది. దీని కోసం హైదరాబాద్‌లో ఉన్న విశ్రాంత ఐఎఎస్ గోపాల్‌కృష్ణ వద్ద శిష్యురికం చేశా. రెండు నెలలపాటు పలు అంశాలపై మెళకువలు నేర్చుకున్నాను. గుండె నిండా నింపుకున్న మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో మౌఖిక పరీక్షను ఎదుర్కొన్నాను. ఎంతో ఓపిక, సహనంతో సమాధానాలు చెప్పాను.
సమాజసేవకే..
శ్వేత, 163వ ర్యాంక్ (మహబూబ్‌నగర్‌జిల్లా)
''సమాజసేవ చేసేందుకు ఈ రంగమే సరైందనే నమ్మకంతో సివిల్స్‌కు చదివాను. భర్త సుమన్ ప్రోత్సాహంతోనే సాధించగలిగాను".
అపజయాలే సోపానాలు
* శీరం సాంబశివరావు, 164వ ర్యాంక్ (విజయవాడ) ''
గతంలో మూడుసార్లు విఫలమైనా నిరాశ చెందలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదలుకుని ఏకాగ్రత, పట్టుదలతో చదివి సివిల్స్‌లో విజయం సాధించా. నాలుగో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించగలిగాను".
ఉమేష్‌చంద్ర స్ఫూర్తితో..
మహేశ్వర్‌రెడ్డి, 196వ ర్యాంక్ (కడపజిల్లా)
''దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్ర నాకు స్ఫూర్తి. పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగం విన్నాక ఆయనలా ఐపీఎస్ కావాలని నిర్ణయించుకున్నా. రెండు సార్లు ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా విజయం సాధించలేదు. గత ఫలితాల్లో 512వ ర్యాంకు రావడంతో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చింది. అందులో చేరకుండా మళ్లీ చదివి 196వ ర్యాంక్ సాధించా.
APPSC GROUP - II
*ఓపిక, పట్టుదల అవసరం
* గ్రూప్-2 ఫలితాల్లో మొదటి ర్యాంకర్ వెంకటేశ్వరరావు


కలల తీరానికి చేరువయ్యే మార్గంలో ఓ తప్పటడుగు పడినా కుంగిపోలేదు.లక్ష్యసాధనలో కోరుకున్న కుర్చీ దక్కకపోయినా దిగులు చెందలేదు. సహనం, పట్టుదలను ఆయుధాలుగా మలచుకుని గమ్యానికి చేరుకున్నారు తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వరరావు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 380 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్న వెంకటేశ్వరరావుతో 'న్యూస్‌టుడే' మాట్లాడింది.

బండారుపల్లి గ్రామానికి చెందిన రైతు బసవపున్నారావు, అచ్చమాంబ దంపతులకు వెంకటేశ్వరరావు రెండో సంతానం. పాఠశాల చదువంతా గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలోనే సాగింది. పదో తరగతిలో 440 మార్కులు సాధించారు. తల్లిదండ్రులు, గురువుల సూచన మేరకు బైపీసీలో చేరారు. ఇంటర్ ఫలితాల్లో 70 శాతం మార్కులు సాధించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఎంసెట్ రాయగా 2 వేల ర్యాంకు రాగా బీఫార్మసీలో సీటొచ్చొంది. పేరేచర్లలోని ప్రైవేటు ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేశారు. ఫార్మసీ విద్యలోనే పీజీ చేయాలని జాతీయ స్థాయి పోటీ పరీక్ష గేట్‌కు హాజరైనా ర్యాంకు రాలేదు. దీంతో పోటీ పరీక్షలకు హాజరై రెవెన్యూ శాఖలో ఉద్యోగాన్ని పొందాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. గ్రూపు-2లో రాష్ట్ర స్థాయిలో ప్రథముడిగా నిలిచి స్వగ్రామానికి గుర్తింపు తీసుకువచ్చారు.
మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం: బీఫార్మసీ పూర్తయ్యాక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో ఏపీపీఎస్సీ 2004లో గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ ఏడాది గ్రూప్-2కు హాజరైన వెంకటేశ్వరరావుకు విజయం వరించినా రెవెన్యూ శాఖలో ఉద్యోగం లభించలేదు. అప్పట్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కలిపి మొత్తం 369 (500) మార్కులు రావటంతో దేవాదాయశాఖలో ఈఓగా ఉద్యోగం వచ్చింది. ఒంగోలులోని చెన్నకేశవస్వామి ఆలయం, ప్రత్తిపాడు గ్రూపు దేవస్థానాలకు ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వోద్యోగం చేస్తున్నా నిర్దేశించుకున్న లక్ష్యం మాత్రం నిద్ర పట్టనివ్వలేదు. 2008లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి మళ్లీ గ్రూప్-2 పరీక్షకు సిద్ధమయ్యారు. నగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ, ప్రాంతీయ గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న పుస్తకాలతో కుస్తీ పట్టారు. రోజూ గ్రంథాలయాలకు రావటం 4 నుంచి 5 గంటలపాటు చదవటం చేశారు. 2008లో నోటిఫికేషన్ విడుదలైనా పరీక్ష మాత్రం 2011 అక్టోబరులో జరిగింది. ఈ మధ్యకాలం మూడేళ్లపాటు అందుబాటులో ఉన్న ప్రతి పుస్తకాన్ని ఆయన చదివారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా పోటీపడిన గ్రూప్-2 రాత పరీక్షను దిగ్విజియంగా పూర్తి చేశాడు. రాతపరీక్ష ద్వారా ఇంటర్వ్యూకు ఎంపికైన 1,204 మందిలో ఒకరుగా నిలిచారు. మార్చి 22న నలుగురు అధికారుల బృందం నిర్వహించిన ఇంటర్వ్యూలో సమాధానాలు చకాచకా చెప్పారు. ఈ ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. రాష్ట్ర స్థాయిలో ఎవరూ సాధించని విధంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కలిపి 380 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు.

కుంగిపోకూడదు
లక్ష్యసాధనలో ఓటములు ఎదురయ్యాయని కుంగిపోతే కలల్ని సాకారం చేసుకోలేం. గ్రూపు పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ముఖ్యంగా ఓపిక, పట్టుదల, నిరీక్షించేతత్వం ఉండాలి. ఎన్ని గంటలపాటు చదివామని కాకుండా ఎంత అర్థం చేసుకుని చదివామనేదే ముఖ్యం. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు రోజుకు 7 నుంచి 8 గంటలపాటు చదివా. పాఠ్యాంశాలపై తోటివారితో చర్చిస్తూ సిద్ధం కావటం ద్వారా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఎక్కువ పుస్తకాలను చదవటం కంటే కూడా చదివిన దాన్ని పునశ్ఛరణ చేసుకోవటం మంచిది. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వారు వదంతుల్ని నమ్మకూడదు. పోటీని తట్టుకునే స్థాయిలో నైపుణ్యాలు సాధిస్తే విజయం మనదే. సమాజాభివృద్ధిలో భాగస్వామిని కావాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నించా. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవటంలో 'ఈనాడు' దినపత్రిక, గ్రంథాలయాలు ఎంతో సహకారాన్ని అందించాయి. ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించేందుకు పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తలుపు తట్టడం ఖాయం.
* కచ్చితమైన సమయపాలనతోనే అన్నీ సబ్జెక్టులను చదివాను. చదవడం ప్రారంభించిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ ఒకే విధంగా చదివాను. ప్రభుత్వ కొలువు పొందాలన్న ఆశావాదం మరింత ప్రోత్సాహం ఇచ్చింది.
* ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండా ప్రభుత్వ ప్రచురణ పుస్తకాలు, మరికొన్ని గుర్తింపు పొందిన పుస్తకాలను బాగా చదివాను. ది హిందూ, ఈనాడు పత్రికలు బాగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఎకానమీకి సంబంధించిన అంశాలను క్రమం తప్పాకుండా అప్‌డేట్ చేసుకోవడం వల్ల మంచి స్కోరింగ్ వచ్చింది. ఈనాడు ప్రతిభలో ప్రచురితమయ్యే కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడింది. డిప్యూటీ తహశిల్దార్ పోస్టుకే నా ప్రథమ ప్రాధాన్యం.
* నోమన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్యూలో గతనెల్లో మన రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ గెలవడానికి గల కారణాలు, రాజీవ్ యువకిరణాలు, దేశంలో అవినీతికి గల కారణాలు - నిర్మూలనకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పాను. ఆర్థికపరంగా, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. వారి సహాకారంతోనే నేను విజయం సాధించగలిగాను.

TOP
సమయ పాలన, స్వీయ ప్రేరణతోనే విజయం
గ్రూప్-2 ఉమెన్ టాపర్: జయలక్ష్మీ పద్మజ
పట్టుదల ఉంటే సాధించలేనది ఏదిలేదని నిరూపించారు ప్రకాశం జిల్లాకు చెందిన గ్రూప్-2 టాపర్ జయలక్ష్మీ పద్మజ. అందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. కొందరే విజయం సాధిస్తారు. దీనికి కారణం వారు అనుసరించిన విధానమే. సరైన సమయంలో సరైన పంథాలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లిన వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు. జయలక్ష్మీ పద్మజ కూడా ఇదే కోవకు చెందుతారు. ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో 356 మార్కులతో టాపర్‌గా నిలిచిన ఆమె సక్సెస్ విశేషాలను 'న్యూస్‌టుడే'కు వివరించారు.
ప్రశ్న: మీ విద్యార్హతలేమిటి?
జ: నేను ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తిచేశాను.
ప్ర: గ్రూప్-2కే ఎందుకు సిద్ధమయ్యారు? ఇతర ఉద్యోగాలు చాలా ఉన్నాయి కదా?
జ: ఆసక్తే అందుకు కారణం. ప్రారంభంలో బ్యాంకు ఉద్యోగం చేయాలనుకున్నా అంతగా ఆసక్తి కనబరచలేకపోయాను. గ్రూప్స్ మీద ఆసక్తితో 2008లో గ్రూప్ -2 దరఖాస్తు చేశాను. పద్ధతిగా పరీక్షలు రాయడంతో కమర్షియల్ టాక్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది.
ప్ర: టాపర్‌గా మీ స్పందన ఏమిటి?
జ: ఈ సారి గ్రూప్-2 పరీక్షల్లో మంచి ర్యాంక్ వస్తుందనుకున్నాను. కానీ ప్రథమస్థానం గురించి ఆలోచించలేదు. ప్రథమ స్థానం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.
ప్ర: పరీక్షలకు ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రత్యేకించి ఏదైనా ప్రిపరేషన్ విధానాన్ని అనుసరించారా?
జ: ఏ పరీక్షలో విజయం అందుకోవాలన్నా సమయపాలన, స్వీయ ప్రేరణ (సెల్ఫ్ మోటివేషన్) చాలా అవసరం. గ్రూప్-2కు సిద్ధమయ్యే ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లోని ఆర్‌సీరెడ్డి స్టడీ సర్కిల్‌లో కోచింగ్ తీసుకున్నాను. ఇది నా విజయానికి ఎంతగానో బాటలు వేసింది. కోచింగ్ తీసుకున్నంత మాత్రానా సక్సెస్ వస్తుందనుకోవడం సరికాదని నా అభిప్రాయం. నా వరకు నేను పరీక్షకు సంబంధించిన పలు రిఫరెన్స్ పుస్తకాలు చదివాను. పరీక్ష ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో సమయ పాలన నిర్దేశించుకున్నాను. ప్రతిరోజూ ఏంచేయాలో ముందుగానే ప్లాన్ చేసుకుని దాని ప్రకారం నడుచుకున్నాను.
ప్ర: మీ విజయానికి ప్రధాన కారణాలేమిటి?
జ: సిలబస్‌ను వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయడం, స్వయం ప్రేరణే నా విజయానికి ప్రధాన కారణాలు. కష్టపడే తత్వం, చేసే పనిని బట్టే ఫలితం ఆధారపడి ఉంటుందనే నమ్మకమే నన్ను గెలిచేలా చేశాయి.
ప్ర: మీ కుంటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది?
జ: ముఖ్యంగా నా భర్త ప్రోత్సాహం మరువలేనిది. సహచర మిత్రులు, తెలిసిన వారు అందరూ నన్ను ప్రోత్సహించారు.
ప్ర. ఏ పోస్టులకు మీరు ప్రాధాన్యం ఇచ్చారు?
జ: గ్రూప్ 2 విభాగాల్లో 'ఏసీటీవో' పోస్టును ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్నాను.
ప్ర: ఇంటర్వ్యూకు ఎలా సిద్ధపడ్డారు?ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు?
జ: ఇంటర్వ్యూకు సంబంధించి భవానీ శంకర్ గైడెన్స్ చాలా బాగా ఉపయోగపడింది. ఇంటర్వ్యూలో టాక్సేషన్ పై ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అన్నీ రకాల టాక్స్‌లు, వ్యాట్‌లు, సేవా పన్నులపై ప్రశ్నలు అడిగారు. ఇంకా కేరళ - తమిళనాడు ముళ్ల పెరియార్ డ్యాం వివాదం, ట్రావెన్ కోర్ దేవస్థానం లాంటి వాటిపై ప్రశ్నలు అడిగారు.
ప్ర: కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి మీరిచ్చే సూచనలు...?
జ: అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటే కోచింగ్‌లో ఇచ్చిన సలహాలను, సూచనలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. నోట్స్ రాసుకోవాలి. సమయాన్ని ఎక్కడా వృధా చేయకుండా పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధపడితే విజయం తప్పక వరిస్తుంది.

TOP
నిరంతర కృషే విజయానికి మార్గం

గ్రూప్-2 ఉమెన్ సెకండ్ టాపర్: మునగల రాజ్యలక్ష్మి
నిరంతర కృషి పరాజితులను విజేతలుగా మారుస్తుంది. పట్టుదలతో, సమస్యలు ఎదురైనా ఓపికతో విజయంపై నమ్మకంతో శ్రమించే వారు తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటారు. దీనికి నిదర్శనం ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -2 పరీక్షల్లో 353 మార్కులతో ఉమెన్ సెకండ్ టాపర్‌గా నిలిచిన మునగల రాజ్యలక్ష్మి. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన రాజ్యలక్ష్మి కష్టపడితే ఎవరైనా విజయం సాధించవచ్చని తన సక్సెస్ విశేషాలను 'న్యూస్‌టుడే'కు వివరించారు.
ప్రశ్న: మీ కుటుంబ విశేషాలను వివరించండి? జ: మాది వ్యవసాయ కుటుంబం. నాన్న వ్యవసాయదారుడు. మేము ముగ్గురం ఆడపిల్లలం. ప్ర: ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టారు?
జ: గత 2008 నుంచి ఇటీవలి ఇంటర్వ్యూల వరకు పరీక్షలకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా సిద్ధమవుతూనే వచ్చాను.
ప్ర: మీ విజయ రహస్యం ఏమిటి?
జ: ఎలాగైనా ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టు సంపాదించాలి. అదే లక్ష్యంగా కృషి చేశాను. గతంలో జరిగిన గ్రూప్-2లో మా ముగ్గురు అక్కచెల్లెళ్లం ఉత్తీర్ణులయ్యాం. అప్పుడు నాకు నాన్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఒంగోలులోని ఏపీస్టేట్ ఆడిట్ విభాగంలో సీనియర్ ఆడిటర్‌గా పనిచేస్తున్నాను. అయినా ఎగ్జిక్యూటివ్ కేడర్ఉద్యోగం సాధించాలనే తపన నాలో తొలగిపోలేదు. ఈ కారణంగానే పట్టుదలతో తిరిగి గ్రూప్-2 రాశాను. రోజుకు 8 గంటలు చదివాను.
ప్ర: పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏదైనా ప్రిపరేషన్ పద్ధతిని అనుసరించారా? (ప్రిపరేషన్ స్ట్రేటజీ).
జ: నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. సొంతంగానే ప్రిపేర్ అయ్యాను. పరీక్ష సిలబస్ మొత్తాన్ని ముందుగా అర్ధం చేసుకున్నాను. పరీక్ష తేదీ ముందుగా ప్రకటించకపోయినా రోజూ ఎలా చదవాలనే విషయమై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. వారానికి ఇంత మేర సిలబస్ పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాను. దాని ప్రకారమే అనుసరించాను. జనరల్ స్టడీస్‌కు మాత్రం పరీక్ష తేదీ ప్రకటించిన తర్వాత దానికి తగినట్లు ప్రణాళిక మార్చుకున్నాను. హిస్టరీ మాత్రం 2008 నుంచి చదువుతూనే ఉన్నాను. దేనికదే విడివిడిగా నోట్స్ తయారుచేసుకుంటూ వచ్చాను. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న తెలుగుమీడియం పాఠ్య పుస్తకాలు; చరిత్ర, ఎకానమీకి సంబంధించి డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు; ఈనాడు ప్రతిభలో ప్రచురించిన కరెంట్ ఎఫైర్స్, ఇతర ముఖ్యమైన కంటెంట్ ఎంతగానో ఉపయోగపడ్డాయి.
ప్ర: టాపర్‌గా మీ స్పందన ఏమిటి?
జ: టాప్ ర్యాంక్ ఏదో ఒకటి వస్తుందని భావించాను. కాకపోతే ఉమెన్ సెకండ్ టాపర్‌గా రావడం చెప్పలేని సంతోషాన్ని కలిగించింది.
ప్ర: ప్రిపరేషన్ విషయంలో మీకు మిగతా వాళ్లకి తేడా ఏమిటనుకుంటున్నారు?
జ: పరీక్ష ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో వేచి చేశాను. ఓపిక పట్టాను. కొందరు మధ్యలోనే వదిలేయడం, పరీక్ష తేదీ ఇంకా ప్రకటించలేదుకదా అని వాయిదా వేయడం లాంటివి చేస్తూ వచ్చారు. నేను మాత్రం ఓపికతో, ప్రణాళికాబద్ధంగా చదివాను.
ప్ర: ఏ పోస్టులకు ప్రాధాన్యం ఇచ్చారు?
జ: నేను గ్రామీణ వాతావరణంలో పెరిగాను కాబట్టి మొదటి ప్రాధాన్యం డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు ఇచ్చాను. తర్వాత మున్సిపల్‌కమీషనర్, ఏసీటీవోలకు ఇచ్చాను.
ప్ర: ఇంటర్వ్యూ విశేషాలు ఏమిటి?ఇంటర్వ్యూ ఎలా జరిగింది?
జ: ఇంటర్వ్యూ ప్రధానంగా మహిళా సమస్యలపైనే సాగింది. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగారు. మహిళల జనాభా ఎందుకు తగ్గుతోంది? ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం మహిళల శాతం తగ్గడానికి మహిళలే ఒక కారణం అంటున్నారు? ఇదెంత వరకు నిజం? స్త్రీలలో అవినీతికి పాల్పడే వారు కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నారు కదా? వంటి ప్రశ్నలు అడిగారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్ అయితే గ్రామీణ మహిళలకు నీవు ఏ రకంగా సహాయపడగలవు?అని కూడా అడిగారు. తర్వాత ఫ్యామిలీ విశేషాలను చెప్పమన్నారు.
ప్ర: కుటుంబ సభ్యుల నుంచి మీకు అందిన సహకారం ఎలా ఉంది?
జ: మా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు, మిత్రులు పరీక్ష కోసం ఓపిగ్గా వేచిచూడమన్నారు. ఎక్కడా నిరాశకు గురి కావద్దని ప్రోత్సహించారు.
ప్ర:. కొత్తగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి మీరిచ్చే సలహా ఏమిటి?
జ: ఏ పరీక్షకైనా హార్డ్‌వర్క్ తప్పనిసరి. అది ఒక్కటే విజయాన్ని దగ్గర చేస్తుంది. అదృష్టం మీద ఆధారపడటం సరికాదు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు తుది వరకు శ్రమించాలన్నదే నా అభిప్రాయం.

TOP
నిరుత్సాహ పడకూడదు, పట్టుదలతో చదవాలి
* గ్రూప్-2 ఉమెన్ సెకండ్ టాపర్ కోసూరు రాజ్యలక్ష్మి

పోటీ పరీక్షల్లో పట్టుదలతో చదివిన వారికి విజయం సొంతం అవుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళలకు తరచూ నిరుత్సాహ పూరిత వాతావరణం ఎదురవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని దీక్షతో లక్ష్యం సాధించాలనే తపనతో కృషిచేసిన వారికి విజయం తలొంచక తప్పదు. ఈ కోవకు చెందిన వారే కోసూరు రాజ్యలక్ష్మి.
ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో 353 మార్కులతో సెకండ్ టాపర్‌గా నిలిచారు. తన సక్సెస్ విశేషాలను న్యూస్‌టుడేకు వివరించారు.
ప్ర: మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
జ. నాన్న బిజినెస్ చేస్తారు. అన్నయ్య కోటమండలం (నెల్లూరు జిల్లా) తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. నేను ఇంటర్‌లో బైపీసీ చదివాను. డిగ్రీ బీఏ (సోషియాలజీ) చేశాను. ప్రస్తుతం నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నాను.
ప్ర: మీ విజయ రహస్యం ఏమిటి?
జ: మా అన్నయ్య ఇచ్చిన సలహాలు, సూచనలు, సాధించాలనే నాకున్న పట్టుదల.. ఇవే నా విజయ రహస్యం. పరీక్ష ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అందుకోసం ఒకరోజు వదిలి, మరొక రోజు చదువుదాం అనే ఆలోచనతో ఉండలేదు. పరీక్ష ఎప్పుడు జరిగినా సరే నేను రెడీగా ఉండాలనే లక్ష్యంగా నిరంతరం పునఃపరిశీలన చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చదివాను. టైమ్ టేబుల్ వేసుకునేదాన్ని. దాన్ని అనుసరించేదాన్ని. ప్రతిరోజూ కష్టపడాలి, లక్ష్యాన్ని అందుకోవాలనేదే నా ధ్యేయంగా ఉండేది. టాపర్‌గా మీస్పందన? జ. ఉమెన్స్ విభాగంలో సెకండ్ టాపర్‌గా వస్తానని ఊహించలేదు. ఈ స్థాయిని అందుకోవడం నిజంగా చెప్పలేని ఆనందాన్ని కలిగించింది.
ప్ర: ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టారు?(ప్రిపరేషన్ స్ట్రేటజీ).
జ. గ్రూప్-1 ప్రిపరేషన్‌లో భాగంగా 2009 నుంచే చదవడం మొదలుపెట్టాను. ప్రతిరోజూ ఎలా చదవాలనే విషయమై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని ప్రకారం చదువుతూ వచ్చాను. ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌లో కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ మెటీరియల్ మీదే ఎక్కువగా ఆధారపడ్డాను. పరీక్షకు సమయపాలన చాలా అవసరం కాబట్టి సబ్జెక్టుల వారీగా సమయాన్ని కేటాయించుకున్నాను.
ప్ర: ప్రిపరేషన్‌లో మీకు, మిగతా వారికి తేడా ఏమిటి?
జ. ప్రిపరేషన్ విషయంలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఎవరి సిస్టమ్ వారిది. నా వరకు మాత్రం సమయం చాలా ముఖ్యమైంది. పరీక్ష + సమయం రెండూ పోల్చుకుంటూ చదివాను.
ప్ర: ఏ పోస్టులకు ప్రాధాన్యం ఇచ్చారు?
జ. మొదటి ప్రాధాన్యం డిప్యూటీ తహసీల్దార్‌కు ఇచ్చాను. రెండోది మున్సిపల్‌కమిషనర్.
ప్ర: ఇంటర్వ్యూ విశేషాలు ఏమిటి? ఇంటర్వ్యూ ఎలా జరిగింది?
జ. ఇంటర్వ్యూ చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. నేను మహిళను కాబట్టి ఎక్కువ ప్రశ్నలు మహిళా సమస్యలపైనే వచ్చాయి. అంతేకాదు ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నాను. కాబట్టి ఉద్యోగ విశేషాలను అడిగారు. ఆఫీసు వాతావరణం ఎలా ఉంటుందన్నారు. మీ సేవ - ఈ సేవ మధ్య ఉన్న తేడాలేమిటి? ప్రస్తుతం సమాజంలో మహిళలకు ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? వంటి ప్రశ్నలు వేశారు. తర్వాత డిగ్రీలో చదివిన బీఏ సోషియాలజీ సబ్జెక్టుపై ప్రశ్నలు వేశారు.
ప్ర: మీ కుటుంబ సభ్యుల, బంధువుల ప్రోత్సాహం ఎలా ఉంది? జ. తల్లిదండ్రులు, అన్నయ్య వెన్నంటి ప్రోత్సహించారు. 'అడపిల్లవు కదా, ఉన్నదాంతో సరిపెట్టుకోవచ్చు కదా అని కొందరు సర్దిచెప్పాలని చూశారు కానీ, నేను మాత్రం పట్టుదల వదల్లేదు. మా కుటుంబ సభ్యులు నన్ను ఎక్కడా నిరుత్సాహ పరచలేదు. అదే నాకు కొండంత బలాన్ని ఇచ్చింది.
ప్ర: కొత్తవారికి మీరిచ్చే సలహా ఏమిటి?
జ. లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే దానికి తగిన కృషి చేయాల్సిందే. ఏ పరీక్ష రాయాలనుకుంటే దానికి తగిన మెటీరియల్‌ను మొదట సేకరించాలి. చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకుని తదనుగుణంగా చదవాలి.

TOP
VRO/VRA - 2012

భోజనం.. నిద్ర లేవు

* శిష్టు చిట్టిబాబు (వీఆర్ఓ ఫస్ట్ ర్యాంక్)

వీరఘట్టం: శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం అని చెప్పారు. అకస్మాత్తుగా దాన్ని ఇచ్చాపురానికి మార్చారు. మా గ్రామం నుంచి ఏడుగంటల ప్రయాణం. అందుకే ముందురోజు బయల్దేరి అష్టకష్టాలు పడి ఇచ్ఛాపురం చేరుకున్నా. ఆ రాత్రి భోజనం లేదు.. కంటిమీద కునుకు లేదు.. రాత్రంతార దోమల బాధ. తెల్లారితే పరీక్ష. స్నానం, టిఫిన్ ఏమీ లేవు. ఎలాగైతేనేం పరీక్ష రాశా. రాష్ట్రస్థాయిలోనే ప్రథముడిగా నిలిచా. ఇపుడు చాలా ఆనందంగా ఉంది.

* వీఆర్వో పరీక్షల్లో రాష్ట్రస్థాయిలోనే ప్రథముడిగా నిలిచిన శిష్టు చిట్టిబాబు చెప్పిన మాటలివి. ఇతనిది వీరఘట్టం మండలం తలవరం గ్రామం. తన ప్రతిభ ద్వారా కన్నవారికి ఉన్న ఊరికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు.
చిట్టిబాబుది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు స్వగ్రామం తలవరంలోనే పూర్తయింది. ఇంటర్మీడియెట్ వీరఘట్టం, డిగ్రీ అనకాపల్లి, ఎంఎస్సీ ఉస్మానియా యూనివర్సిటీ, బీఈడీ నంద్యాల్లో పూర్తిచేశారు. తల్లిదండ్రులు విశ్వేశ్వరరావు, అచ్చన్నమ్మలు పెద్దగా చదువుకోలేదు. అయినా తమ ఏకైక కుమారుడు చిట్టిబాబును నిరంతరం ప్రోత్సహిస్తూ వచ్చారు. అతను ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి పంపించారు. కుటుంబసభ్యులైన డి.వేణు కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, కె.గీత, కె.మురళీమోహన్, సరస్వతి ఆర్థికంగా ఆదుకున్నారు.

పూర్వానుభవమే విజయానికి కారణం.
వీఆర్వో పరీక్షలకు చిట్టిబాబు ప్రత్యేకంగా తర్ఫీదు పొందలేదు. ఇందుకోసం ప్రత్యేక సమయాన్నీ కేటాయించలేదు. గతంలో గ్రూప్-2, డీఏవో పరీక్షలకు రెండేళ్లపాటు హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయం సాధించలేకపోయాడు. ఆ అనుభవంతోనే వీఆర్వోపరీక్షలు రాశారు. డీఏవో పరీక్షలో అర్ధమేటిక్, రీజినింగు అంశాలు వీఆర్వో పరీక్షలో అక్కరకొచ్చాయి. ఈ విభాగంలో 38 మార్కులు సాధించారు. గ్రూప్-2లో తర్ఫీదు పొందిన జనరల్ స్టడీస్ ఈ పరీక్షలో బాగా ఉపయోగపడింది. ఈ విభాగంలో 55 మార్కులు సాధించగలిగారు. మొత్తం 93 మార్కులతో రాష్ట్రంలోనే ప్రథముడిగా నిలిచారు.గ్రూప్-2లో విజయం సాధించి ఉపతహశిల్దారు కావాలన్నదే ఇప్పటికి తన లక్ష్యమని చిట్టిబాబు చెబుతున్నారు. ష్యమని చిట్టిబాబు చెబుతున్నారు.

TOP
విద్యావలంటీరు సాధించిన విజయం

నారాయణపురం(మందస): మందస మండలంలోని నారాయణపురం పంచాయతీ మల్లేనవారిపేటకు చెందిన మల్లేన నాగేశ్వరరావు వీఆర్వో నియామక పరీక్షలో 3వ ర్యాంకు సాధించారు. 1 నుంచి 10వ తరగతి వరకు హరిపురం, బాలిగాం ప్రభుత్వ పాఠశాలల్లో, ఇంటర్ శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో చదివిన నాగేశ్వరరావు డిగ్రీ (బీఎస్సీ గణితం) పలాస ప్రజ్ఞ కళాశాలలో పూర్తి చేశారు. ఉన్నత చదువులకు ఆర్థిక పరిస్థితులు సహకరించక నాగేశ్వరరావు గ్రామంలోని పాఠశాలలో విద్యా వలంటీరుగా పని చేస్తూ తాజాగా వీఆర్వో పరీక్షకు హాజరయ్యారు. ఎలాగైనా ఉద్యోగం పొందాలన్న పట్టుదలతో శిక్షణ తీసుకొని పరీక్షరాశారు.

 
'మొదట్నుంచీ వీఆర్వో పరీక్షలో విజయం సాధిస్తానన్న నమ్మకముంది.. అదిలా సాకారమైనందుకు చాలా సంతోషంగా ఉంద'ని నాగేశ్వరరావు 'న్యూస్‌టుడే'తో సంతోషాన్ని పంచుకున్నారు. 100కు 87 మార్కులు సాధించిన నాగేశ్వరరావు 'నా జీవిత లక్ష్యం.. సివిల్స్. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాక.. ఆ లక్ష్య సాధనకు కృషి చేస్తా ' అన్నారు. వీఆర్వో పరీక్షకు ఆరో తరగతి నుంచి టెన్త్ వరకూ పాఠ్య పుస్తకాలు, కరెంట్ అఫైర్స్‌కు విజేత కాంపిటీషన్స్ పుస్తకాలు, పత్రికలు చదివా.. అని వివరించారు.

TOP
లక్ష్యం దిశగా ముందడుగు

* రాజేష్ కుమార్ ( వీఆర్ఓ రెండోర్యాంకు)
సింగుపురం(రామలక్ష్మణకూడలి):
గ్రూప్స్ లక్ష్యంగా ప్రయత్నించిన రాజేష్‌కుమార్ వీఆర్ఓ పరీక్షలో జిల్లా స్థాయిలో ద్వితీయ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలనుకునే వాళ్లున్న ఈ రోజుల్లో ఎయిర్ ఫోర్సులో ఉద్యోగం వచ్చినా వదిలేసి... గ్రూప్స్‌ను లక్ష్యంగా చేసుకొని సాధన చేపట్టారు. వీఆర్ఓ పరీక్ష ఫలితాల్లో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచారు. శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని సింగుపురం కొత్త దేవాంగుల వీధికి చెందిన రాజేష్ వీఆర్వో పరీక్షలో 87 మార్కులు సాధించాడు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాజేష్ బీఎస్సీ బీఈడీ చదువుకున్నారు.
పదోతరగతి వరకు సింగుపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చదివి 414 మార్కులు సాధించాడు. మునసబుపేట గాయత్రీ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదువును పూర్తి చేశాడు. చదువు కొనసాగుతుండగానే మధ్యలో 2001లో ఎయిర్ ఫోర్సు ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగించి, వారికి సేవ చేసేందుకు అవకాశం ఉన్న కొలువే కావాలనుకొని తన ఉద్యోగానికి రాజీనామాచేశాడు. అనంతరం బీఈడీ చదువు పూర్తి చేశాడు. అనంతరం గ్రూప్స్‌కు సాధన మొదలుపెట్టి.. 2008లో గ్రూప్-2 రాసిన రాజేష్ కుమార్‌కు నిరాశే ఎదురయింది. గ్రూప్-4లో తొమ్మిదో స్థానంలో నిలిచినా.. అప్పుడు ఓపెన్‌లో మూడింటినే తీయడంతో అవకాశం రాలేదు. ఒక సారి చేతికొచ్చిన అవకాశం వదిలేసి.. రెండు సార్లు నిరాశ ఎదురైన రాజేషకుమార్‌కు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా తన లక్ష్యం వైపు ముందుకు సాగారు. దీంతో తాజాగా నిర్వహించిన వీఆర్ఓ పరీక్షకు హాజరై సత్తాచాటారు.

TOP
లక్ష్యం గ్రూప్-2

* వీఆర్‌వో రాష్ట్ర రెండో ర్యాంకర్ వీరబాబు

కోదాడ: భవిష్యత్తులో గ్రూప్-2 సాధించడమే లక్ష్యమని నల్గొండ జిల్లా చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన వీరబాబు అన్నారు. వీఆర్‌వో పరీక్షలో 92 మార్కులు సాధించి రెండో ర్యాంకర్‌గా నిలిచిన ఈయన ప్రస్తుతం కోదాడలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీఎస్) 3 వ సంవత్సరం చదువుతున్నారు. టాప్ 10 లో ఉండొచ్చని ఊహించాననీ టాప్ - 2 లోనే స్థానం లభించడం నిజంగా ఆనందాన్ని కలిగిస్తోందని వీరబాబు 'న్యూస్‌టుడే' విలేకరికి తెలిపారు. వాగ్దేవి విద్యా సంస్థల ఛైర్మన్ వెంకటరెడ్డి, తన బాబాయి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ర్యాంక్ అందుకోగలిగినట్లు చెప్పారు.

TOP
గ్రూప్ 2 సాధిస్తా...

* వీఆర్వో 8వ ర్యాంకర్ ఏమిరెడ్డి రాజేందర్‌రెడ్డి

గుర్రంపోడు: గ్రూప్ 2 సాధించడమే లక్ష్యం. మాది కనగల్ మండలం ఏమిరెడ్డిగూడెం. గ్రూప్2 కు సాధన చేస్తూ వీఆర్వో ఉద్యోగానికి పరీక్షలు రాశాను. అన్న ఎలేందర్‌రెడ్డి, తమ్ముడు ఉపేందర్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులే. నేను కూడా గ్రూప్2 ద్వారా ఉన్నత ఉద్యోగం సాధించాలని భావిస్తున్నా. తండ్రి మోహన్‌రెడ్డి సాధారణ రైతు. తల్లి లలితమ్మ గృహిణి. డిగ్రీ వరకు నల్గొండలో, పీజీ హైదరాబాదులో పూర్తి చేశాను.
TOP