మౌలికవసతులున్న ఇంజినీరింగ్ కళాశాలను ఎంచుకోవడం ఉత్తమం
కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్ కె.రఘునాథ్ సూచనలు
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరుకాబోయేవారికి ప్రత్యేకం
|
|
ఎంసెట్ ఫలితాలు వచ్చాయి. త్వరలోనే ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ కళాశాలను ఎంచుకోవాలి? ఏ బ్రాంచిలో చేరాలి? లాంటి ప్రశ్నలు విద్యార్థులను ముప్పిరిగొంటూ ఉంటాయి. ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియలో విశేష అనుభవమున్న క్యాంప్ ఆఫీసర్ కె.రఘునాథ్ విద్యార్థులకు ఈ విషయంలో ఇస్తున్న సలహాలివి.
ఇంజినీరింగ్‌లో చేరబోయే విద్యార్థి కళాశాలను ఎంచుకోవడం ఎలా?
సాధారణంగా చాలా కాలంగా బోధనరంగంలో ఉన్న (పాత) ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక వసతులు బాగా ఉండే అవకాశం ఉంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులూ ఉంటారు. అయినా, విద్యార్థి తాను చేరాలనుకునే కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అధ్యాపకుల బోధనానుభవం ఏమిటి? లేబోరేటరీ, లైబ్రరీ, హాస్టల్, రవాణా వంటి సదుపాయాలేమిటి? తదితర సంగతులను తెలుసుకోవాలి. అంతకుముందు ఆయా కళాశాలల్లో చదివిన విద్యార్థుల ద్వారా లేదా స్వయంగా పరిశీలించి ఈ వివరాలను సేకరించాలి. తరువాతే నిర్ణయం తీసుకోవాలి..
బ్రాంచిని ఎలా ఎంపిక చేసుకోవాలి?
ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచ్‌లో చేరాలనేది ప్రాథమికంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
1. చేయాలనుకునే వృత్తి/ ఉద్యోగాన్ని బట్టి బ్రాంచ్‌ను నిర్ణయించుకోవచ్చు.
2. విద్యార్థికి ఉన్న అభిరుచిని బట్టి నిర్ణయించుకోవచ్చు. ఏమైనా విద్యార్థి తన బలాబలాను బేరీజు వేసుకుంటూ బ్రాంచి ఎంపికలో జాగ్రత్తగా ఆలోచించాలి. భవిష్యత్తులో ఆ బ్రాంచికి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో కూడా ఒక అంచనాకు రావాలి. అందరూ చేరుతున్నారు కదా అని ఆలోచన లేకుండా బ్రాంచిని ఎంపిక చేసుకోవడంవల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి.
విద్యార్థులను ఎంపిక చేసేటప్పుడు లోకల్-నాన్‌లోకల్ కేటగిరీని ఎలా నిర్ణయిస్తారు?
లోకల్, నాన్‌లోకల్ అభ్యర్థులను ఎలా నిర్దేశిస్తారనే విషయమై చాలా సందేహాలున్నాయి.
* విద్యార్థికి అర్హత పరీక్ష అయిన ఇంటర్మీడియట్ నుంచి వెనుకకు వరుసగా నాలుగేళ్లు ఏ ప్రాంతంలో చదివితే ఆ విద్యార్థి ఆ ప్రాంతానికే లోకల్ అవుతాడు.
* ఒకవేళ 9, 10 తరగతులు ఒక ప్రాంతంలో, ఇంటర్మీడియట్ మరో ప్రాంతంలో చదివి ఉంటే, ఇంటర్ నుంచి వెనుకకు ఏడు వరుస సంవత్సరాలను పరిశీలిస్తాం. అందులో నాలుగేళ్లు ఎక్కడ చదివాడో ఆ ప్రాంతానికి ఆ విద్యార్థి లోకల్ అవుతాడు. అంటే ఉదాహరణకు ఇంటర్మీడియట్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో; 9, 10 తరగతులు ఆంధ్రా వర్సిటీ పరిధిలో చదివి ఉంటే 7, 8 తరగతులు (అవసరమైతే ఆరో తరగతి కూడా) ఎక్కడ చదివాడో చూడాలి. ఈ తరగతులు ఉస్మానియా పరిధిలో చదివి ఉంటే ఏడు వరుస సంవత్సరాల్లో నాలుగేళ్లు ఓయూలోనే చదివాడు కాబట్టి ఓయూ ప్రాంతంలో లోకల్‌గా పరిగణిస్తాం.
* ఒకవేళ ఒక విద్యార్థి తొమ్మిదో తరగతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో; పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉస్మానియా పరిధిలో చదివి ఉంటాడు. 6, 7, 8 తరగతులు ఓయూలో చదివాడనుకుందాం. ఆ విద్యార్థి ఇంటర్మీడియట్ (ఎంసెట్ అర్హత పరీక్ష) సహా వరుసగా మూడేళ్లు ఎక్కడ చదివాడో అక్కడ లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తాం.
* తొమ్మిదో తరగతి ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో చదివి ఉంటే ఆ విద్యార్థిని నాన్-లోకల్‌గా పరిగణిస్తాం.
* ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో లోకల్ కేటగిరీకి 85 శాతం సీట్లను కేటాయిస్తారు.మిగతా 15 శాతం అన్‌రిజర్వ్డ్ కేటగిరీ కింద ఉంటాయి. ఈ కోటాలోనే నాన్‌లోకల్ అభ్యర్థులకూ సీట్లిస్తారు. ఈ సీట్లకు కూడా ఎస్‌సి, ఎస్‌టి, బీసీ తదితర రిజర్వేషన్లన్నీ వర్తిస్తాయి.
|