|
పట్టభద్రులు కావాలని కోరుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగితోందని, కానీ వారిలో ఉద్యోగాలు సాధించే నైపుణ్యాలు లేవని ప్రధానమంత్రి సలహాదారు, టీసీఎస్ వైస్‌ఛైర్మన్ ఎస్.రామదొరై పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పట్టభద్రుల్లో కేవలం 20 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని, మిగతా వారిలో నైపుణ్యాల కొరత ఉందని తెలిపారు. నైపుణ్యాల్లో మెరుగైన శిక్షణ పొందిన మానవ వనరులతో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఉద్యోగం, ఉపాధి కల్పించలేని శిక్షణ దేశానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. కోర్సులు పూర్తిచేసుకొని బయటకు వస్తున్న వారిలో భావవ్యక్తీకరణ, భాష, సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ కోసం 'ఫినిషింగ్ స్కూల్స్' ఏర్పాటు చేయాలని సూచించారు. నైపుణ్య శిక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నిజంగా నిర్ణీత లక్ష్యాన్ని సాధించేలా ఉన్నాయా? అనే విషయమై పాలకులు సమీక్షించాలని కోరారు.
రామదొరై చెప్పిన మరికొన్ని విషయాలు...
* ఉద్యోగం, ఉపాధి కల్పించలేని శిక్షణ ప్రమాదకరం. శిక్షణ అనేది యువతలో ఆశలు కల్పిస్తుంది. ఒకవేళ ఉద్యోగాలు దక్కకపోతే వారిలో నిరాశ కలుగుతుంది. ఇది వెంటనే తీవ్ర సామాజిక సమస్యగా రూపాంతరం చెందుతుంది. అందుకే నౌకాశ్రయాలు, విద్యుత్తు, ఇతర ప్రాజెక్టుల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలి.
* ఉన్నత విద్యలో లోపాలను భరించే స్థితిలో దేశం లేదు. ఇప్పటి వరకు జరిగిన లోపాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరూ పట్టభద్రులు కావాలనుకుంటున్నారు. కానీ ఉద్యోగాలు సాధించే అర్హతున్న వారిని వేళ్లమీద లెక్కించవచ్చు.
* ప్రతి సంవత్సరం 30 లక్షల మంది పట్టభద్రులు అవుతుండగా.. అందులో కేవలం 20 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతావారికి భావవ్యక్తీకరణ, సాంకేతిక నైపుణ్యాలు అవసరం. అందుకోసం ఐటీఐ, పాలిటెక్నిక్, యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, జూనియర్, ఇతర కళాశాలల్లో 'ఫినిషింగ్ స్కూల్స్'ను ప్రారంభించాలి.
* 'బ్లూకాలర్ జాబ్స్' వివరాలు, వేతనాలు, వృత్తిలో మెరుగైన అవకాశాలు తదితర వివరాలతో ఒక పోర్టల్ ప్రారంభించాలి. కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కార్పొరేట్ సంస్థలు, చిన్న, మధ్యతరహా కంపెనీలు ప్రభుత్వంతో కలిసి ఉద్యోగ అవకాశాలతో కూడిన పోర్టల్‌ను రూపొందించాలి.
* 2022 నాటికి 50 కోట్ల మందికి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. 12వ పంచవర్ష ప్రణాళికలో 8 కోట్ల మందికి శిక్షణ ఇవ్వాలని ప్రధానమంత్రి సూచించారు. కొన్ని రాష్ట్రాలు కేవలం శిక్షణ వరకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఉద్యోగాలు కల్పించే విషయాన్ని పక్కనపెట్టాయి. ఉద్యోగాలు దక్కేలా మెరుగైన శిక్షణ ఉండాలి.
|