ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ శాంతిస్వరూప్ తో ఇంటర్వ్యూ

అనుసంధానిస్తేనే ఉజ్వల భవిత

పరిశ్రమలు-కళాశాలల మధ్య అంతరం చెరిగిపోవాలి

పరిశోధనలు జత కలవాలి

ప్రతిభచాటే ప్రొఫెసర్లకే పదోన్నతులివ్వాలి

ప్రయోగానుభవ రాహిత్యమే మన ఇంజినీర్ల ప్రధాన లోపం

రాబోయే పదేళ్లలో భారత్‌లోనే అపార అవకాశాలు

ఐరోపా, అమెరికాల ప్రాభవం తగ్గుతుంది

వందల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు.. వాటి నుంచి ఏటా లక్షల సంఖ్యలో ఇంజినీర్లు.. అయినా సాధిస్తోంది ఏమిటి? వారిలో ఎంతమందికి అర్హతకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయి! దేశాభివృద్ధిలో ఎంతో ప్రాధాన్యమున్న సాంకేతి విద్య అసలు లక్ష్యం నెరవేరుతోందా!! ప్రధాన లోపం ఎక్కుడుంది? ఈ లోపాన్ని సరిదిద్దటమెలా? ఇత్యాది ప్రశ్నలకు తన సుదీర్ఘానుభవంతో విశ్లేషణాత్మక సమాధానాలిచ్చారు..ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరు మేడసాని శాంతిస్వరూప్. ఇంజినీరింగ్ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానిస్తేనే (లింక్) సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. పరిశోధనలకు పెద్దపీట లభించాల్సిన ప్రాధాన్యాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలని చెప్పారు. మన విద్యార్థుల్లో కనిపించే ప్రధాన లోపం ప్రాక్టికల్ అనుభవం కొరవడటమే. అమెరికాలో ఏ పెద్ద కళాశాలకు వెళ్లినా...అక్కడి పెద్ద పెద్ద పరిశ్రమల పేరుతో విభాగాలు కనిపిస్తాయి. ఆయా పరిశ్రమల ఆర్థిక సహాయంతో వివిధ విభాగాల్లో చదువుకొనే విద్యార్థులు నిత్యం పరిశోధనలు చేస్తూ కొత్త పరిజ్ఞానాన్ని కనుగొనటానికి తాపత్రయపడుతుంటారని వెల్లడించారు. పరిశ్రమలకు, కళాశాలలకు మధ్య ఏ సంబంధం లేనప్పుడు ఒక విద్యార్థికి సమాజానికి ఏది అవసరమో ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. అనుభవ జ్ఞానం లేని వారికి పరిశ్రమలు మంచి ఉద్యోగాలు ఇవ్వలేవని, అందువల్లే అత్యధికులు ఉద్యోగ వేటలో విఫలమవుతున్నారని విశ్లేషించారు శాంతిస్వరూప్. 'న్యూస్‌టుడే'తో ఆయన ఇంటర్వ్యూ విశేషాలివి..

అమెరికాకు, మనకి ఇంజినీరింగ్ విద్యలోని ప్రధాన వ్యత్యాసం, లోపాలు ఏమిటీ?

బీటెక్ పాసయ్యాక నేను అమెరికా వెళ్లి ఏడేళ్లు కష్టపడి చదివితేనే పీహెచ్‌డీ వచ్చింది. ఆ తర్వాత విశ్వవిద్యాలయంలో ఒక శాస్త్రవేత్తకు సహాయకుడిగా మరో మూడేళ్లు పనిచేశా. అంటే పదేళ్లు మళ్లీ నిర్విరామంగా చదివా. ఆ తర్వాతే ప్రముఖ ఇంజినీరుగా గుర్తింపు వచ్చింది. అదే ఇక్కడ...ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన విద్యార్థుల్లో మళ్లీ పదేళ్లు నిర్విరామంగా చదివి పరిశోధనల వైపు పయనించేవారెందరున్నారో మీరే చెప్పండి. ఇక్కడ విద్యా సంస్థలకు, పరిశోధనలకు అనుసంధానం లేదు. అమెరికాలో అది ఉంది. ఈ ప్రధానమైన లోపాన్ని సరిదిద్దనంత కాలం ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత పెరగదు. అక్కడ ప్రొఫెసర్లకు వారు చేసే పరిశోధనల ఆధారంగానే పదోన్నతులు, ప్రోత్సాహకాలుంటాయి. ఒక ప్రొఫెసర్ ప్రైవేటు కంపెనీల నుంచి ఎన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చారు, కొత్తగా విద్యార్థులతో కలసి వినూత్నమేవైనా కనిపెట్టారా? అనే అంశాల ఆధారంగానే గుర్తింపు ఉంటుంది. ఇక్కడ అవి మచ్చుకైనా ఉన్నాయా. పరిశోధనలు చేయని ప్రొఫెసర్లకు పదోన్నతులు ఆగుతున్నాయా. కేవలం జీతభత్యాల కోసం పనిచేసినంత కాలం విద్యలో నాణ్యత పెరగదు. పరిశోధనలో మునిగి తేలుతూ విద్యార్థులను ఆ దిశగా నడిపించాలి.

ఆ దిశగా మళ్లాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ?

పరిశ్రమలు, కళాశాలల మధ్య కచ్చితమైన అనుసంధానం ఏర్పాటు చేయాలి. సమాజంలో ప్రజలకు ఏం అవసరమో వాటినే పరిశ్రమలు, కంపెనీల్లో తయారు చేస్తుంటారు. ఇప్పటికే వాడుకలోఉన్న పరికరాలు, వస్తువులను మరింత సులభంగా వినియోగించేలా ఆధునికీకరించడానికి, కొత్తవి కనిపెట్టడానికి కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బాగా పరిశోధనలు జరగాలి. అమెరికాలోని ప్రొఫెసర్ల వద్దకు పరిశ్రమల నుంచి కష్టమైన, అసాధ్యమనుకున్న ప్రాజెక్టుల కాంట్రాక్టులు వస్తాయి. వాటిపై పరిశోధన చేయడానికి విద్యార్థులను బృందాలు ఏర్పాటుచేసి ప్రొఫెసర్లు కష్టపడతారు. కొందరు విజయవంతమైనా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడ కూడా పెద్ద పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేయాలి.

అమెరికాలో మీ విజయాలేమిటి. ఎలాంటి గుర్తింపు వచ్చింది?

అంతరిక్షంలోనున్న అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తోన్న రోబోనాట్ అనే యంత్రం తయారీ ప్రాజెక్టులో పాలుపంచుకొన్నాను. దీన్ని మరింత ఆధునికీకరించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడ రక్షణ దళాలకు కొత్త పరికరాలు అందించడానికి జరిగే పరిశోధనల్లోనూ భాగస్వామినయ్యా. ఎలక్ట్రానిక్స్ రంగంలో నా ప్రతిభను అమెరికా ప్రభుత్వం గుర్తించింది. 2007లో 86 మంది ఉత్తమ ఇంజినీర్లను ఎంపికచేయగా అందులో నాకు చోటు దక్కింది.

మన చదువులు బాగాలేవంటున్నారు. మీలాంటి తెలుగు విద్యార్థులు అవార్డులు పొందే స్థాయికి చేరుతున్నారు కదా.

దేనికైనా ప్రతిభ ముఖ్యం. ఇక్కడ ఇంజినీరింగ్ చదివి అమెరికాకు వెళ్లినా...అక్కడ మళ్లీ కనీసం నాలుగైదేళ్లు కష్టపడి పెద్ద చదువులు చదివిన వారికే మంచి గుర్తింపు లభిస్తుంది. లేదంటే చిన్న ఉద్యోగాలతోనే కాలం గడపాల్సి వస్తుంది. మన చదువుల్లో థియరీకే అధిక ప్రాధాన్యం. అది బాగా చదివిన వారు అమెరికా వెళ్లాక ప్రాక్టికల్‌గా దానిని అమలుచేసి చూపితే పేరొస్తుంది. అది కూడా ఎంతో కష్టపడితేనే సాధ్యం. దీనివల్లనే నాసాలాంటి సంస్థల్లో మనవారు ఎక్కువగా పనిచేస్తున్నారు. నాసాలో సగం మందికిపైగా భారతీయ మూలాలున్నవారే.

మన విద్యార్థులు పరిశోధనల్లో ముందడుగు వేయటం ఎలా. వారి ప్రతిభను వెలికి తీసేదెలా?

పరిశోధన అనంతం. ఉదాహరణకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. దీనికి ఓ పరిష్కారం కనుగొనేందుకు మేం ఆధునిక కెమెరా రూపకల్పనపై దృష్టి సారించాం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర దానిని అమరిస్తే 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ ఫొటోలు తీస్తుంటుంది. అక్కడితో ఆగదు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఏం జరిగినా ఆ సంఘటనను ఫొటో తీసి...దానిని సంబంధిత పోలీసు కార్యాలయానికి ఆన్‌లైన్ ద్వారా తక్షణం పంపిస్తుంది. ముందుగా సెల్‌నెంబరు ఫీడ్ చేస్తే ఆ నెంబరుకు వెంటనే ఎస్.ఎం.ఎస్., ఎం.ఎం.ఎస్.లు వంటివి కూడా పంపుతుంది. ఇదే పరిజ్ఞానాన్ని దేశ సరిహద్దులో సైనికులకు సైతం ఉపకరించేలా చూస్తాం. సరిహద్దు పొడవునా ఈ కెమెరాలు అమరిస్తే అక్కడ ఏం జరిగినా సైనిక కార్యాలయానికి నిరంతరం ఫొటోలు వచ్చేస్తాయి. ఎలాంటి వైర్లు ఉండవు. ఉపగ్రహం ద్వారా పనిచేస్తాయి. ఇలా నిత్యం మనం ఎదుర్కొనే సమస్యలకు ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి కొత్త పరికరాల తయారీకి విద్యార్థులు, ప్రొఫెసర్లు కృషిచేయాలి. ఒక గోడకు ఇవతలివైపు పరికరం అమర్చితే అవతలివైపు ఏం జరుగుతుందో అంతా కంప్యూటర్ తెరపై చూడొచ్చు. ఇలాంటి పరికరాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.

మనం అమెరికా, ఐరోపాలతో పోటీపడగలమా?

మున్ముందు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఇక్కడే లభిస్తాయి. ప్రస్తుతం ప్రపంచంలో యువత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐరోపా, అమెరికా దేశాల్లో 2030కల్లా అక్కడి జనాభాలో సగం మందికిపైగా వృద్దులే ఉంటారు. యువత అక్కడ చాలా తక్కువ. పైగా ఇక్కడ వనరులు, మార్కెట్ డిమాండు కారణంగా పరిశ్రమల స్థాపనకు ఇక్కడే అధిక అవకాశాలున్నాయి. పైగా చౌకగా మానవశక్తి లభిస్తుంది. ఇప్పటికే ఆధునిక పరిజ్ఞానాన్ని పొందడానికి అమెరికా మనపైనే ఆధారపడింది. హాలివుడ్ సినిమాలకు గ్రాఫిక్స్ సమకూర్చి వారి పేర్లు పరిశీలిస్తే వాటిలో తప్పకుండా భారతీయుల కనిపిస్తారు. ఇక్కడి నుంచే గ్రాఫిక్స్, యానిమేషన్ పరిజ్ఞానం అందుతోంది. ఏం చేయాలన్నా తక్కువ ఖర్చుతో ఇక్కడే సాధ్యం. రాబోయే పదేళ్లలో భారత్‌లోనే అపార అవకాశాలుంటాయి. 1950లలో అమెరికా, న్యూయార్క్ నగరం ఎలా ఉండేవో ఇప్పుడు భారత్ అలా ఉంది. అమెరికా ఎలా వృద్ధి చెందిందో మున్ముందు మనమూ అలాగే దూసుకెళతాం.

జేఎన్‌టీయూ అ'పూర్వ' విద్యార్థి..

శాంతిస్వరూప్ 1987లో అనంతపురం జేఎన్‌టీయూ క్యాంపస్‌లో బీటెక్ చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి పీహెచ్‌డీ పూర్తిచేసి 20 ఏళ్ల పాటు శాస్త్రవేత్తగా పనిచేశారు. అమెరికా రక్షణ దళాలకు ఆత్యాధునిక పరికరాల తయారీలో భాగస్వాములయ్యారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉపయోగిస్తున్న రోబోనాట్ రూపకల్పనలో పనిచేశారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఇక్కడ 'ఊర్మి సిస్టమ్స్' అనే పరిశ్రమను నెలకొల్పారు. మానవుల జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు, రక్షణ దళాలకు, పెద్ద సంస్థలకు అవసరమైన ఆధునిక పరికరాల తయారీకి ఊర్మి సంస్థలో ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. 120 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డాక్టరేట్లు ప్రస్తుతం ఈ సంస్థలో పని చేస్తున్నారు. ఇంకా ప్రతిభావంతులను తీసుకుంటామని, కానీ పరిశోధనలో బాగా ఆసక్తి ఉన్నవారికే అవకాశమిస్తామని శాంతిస్వరూప్ స్పష్టం చేశారు. దరఖాస్తులను సంస్థ ఈమెయిల్ info@uurmi.com కు పంపవచ్చు.