జీవ వైవిధ్య మండలి ఛైర్మన్‌ హంపయ్య తో ఇంటర్వ్యూ

రూ.100 కోట్లతో జీవ వైవిధ్య ప్రదర్శనశాల

దేశంలోని వృక్ష, జంతుజాలాల ఏర్పాటు

రూ.450 కోట్ల విలువైన 15 ఎకరాలు కేటాయింపు

జీవ వైవిధ్య సదస్సుకు ఐరాస ఖర్చు రూ.6 వేల కోట్లు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగే అత్యంత ప్రతిష్ఠాత్మక జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనే 193 దేశాల నుంచి అధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు వంటి వివిధ స్థాయుల విదేశీ ప్రతినిధుల కోసం ఐక్యరాజ్యసమితి (ఐరాస) సుమారు రూ.6 వేల కోట్ల దాకా వ్యయం చేస్తోందని రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఛైర్మన్‌ ఆర్‌.హంపయ్య తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్ల కోసం రూ.600 కోట్ల వరకు ఖర్చుపెడుతున్నాయన్నారు. ఈ సదస్సు భాగంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో దేశంలోనే మొదటిసారిగా అతిపెద్ద జీవవైవిధ్య ప్రదర్శనశాలకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. సదస్సు ఏర్పాట్లపై హంపయ్య 'న్యూస్‌టుడే' ప్రతినిధితో ముఖాముఖి మాట్లాడారు. వివరాలివే..

జీవ వైవిధ్య సదస్సు ఎప్పట్నుంచి జరుగుతుంది. ఏర్పాట్లెలా సాగుతున్నాయి?

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరుగనుంది. ఈ సందర్భంగా జీవవైవిధ్య ఛాయాచిత్ర ప్రదర్శనను హెటెక్స్‌్‌లో ఏర్పాటు చేస్తున్నాం. 193 దేశాల నుంచి అధ్యక్షులు, ప్రధానిమంత్రుల స్థాయి మొదలు, అటవీ శాఖ మంత్రులు తదితర స్థాయి ప్రతినిధులతో మొత్తంగా పదివేల మంది దాకా అతిథులు హాజరవుతారని అంచనా. వీరి కోసం హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో హోటల్‌ గదులను సిద్ధం చేశాం. సదస్సును ఒకటో తేదీన ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ప్రారంభించనున్నారు. 1 నుంచి 5వ తేదీ వరకు జపాన్‌లో రెండేళ్ల క్రితం జరిగిన సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరుగుతుంది. 6, 7 తేదీల్లో సదస్సుకు సెలవు ఉంటుంది. 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రతినిధుల సమక్షంలో ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీని ప్రయోజనాలను ప్రపంచ దేశాలు ఎలా పంచుకోవాలి అన్న అంశాలపై చర్చ జరుగుతుంది. ఈ రెండో విడత సదస్సును 8వ తేదీన రాష్ట్రపతి ప్రారంభిస్తారు. సదస్సు ఆఖరి మూడు రోజులు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ హైదరాబాద్‌లోనే ఉంటారు. సదస్సు తుది డిక్లరేషన్‌పై ప్రధాని కూడా సంతకం చేస్తారు.

సదస్సు కోసం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తోందా?

సదస్సు నేపథ్యంలో హైదరాబాద్‌ గచ్చిబౌలి వద్ద రాయదుర్గం పోలీసుస్టేషన్‌కు సమీపంలో రూ.100 కోట్లతో జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించే అతిపెద్ద ప్రదర్శనశాలను ఏర్పాటుకు శంకుస్థాపన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.450 కోట్ల విలువైన 15 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. జీవవైవిధ్యం అంశంపై దేశంలోని అతి పెద్ద ప్రదర్శనశాల ఇదే. ఇందులో దేశంలో లభిస్తున్న అనేక వృక్ష, జంతుజాలాలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ సదస్సుతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటి?

హైదరాబాద్‌ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. రాజధాని పరిసరాల్లోని చార్మినార్‌, గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి పర్యాటక ప్రాంతాలను 193దేశాల అధ్యక్షులు ఇతర ప్రతినిధులకు చూపించనున్నందు వల్ల పర్యాటకంగా హైదరాబాద్‌కు భవిష్యత్తులో ఆదరణ లభించే అవకాశం ఉంది.

దేశీయ ఉత్పత్తులను విదేశీ ప్రతినిధులకు చూపించబోతున్నారా?

దేశీయ ఉత్పత్తులతో శిల్పారామంలో అతి పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలో లభించే అనేక ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శన, అమ్మకానికి పెట్టబోతున్నాం. అనేక దేశాల ప్రతినిధులు వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల 193 దేశాల్లో దేశీయ ఉత్పత్తులపై ఒక అవగాహన ఏర్పడి భవిష్యత్తులో వీటికి ఆదరణ లభించడమే కాకుండా, దేశానికి ఈ రూపంలో మేలు జరిగే అవకాశం ఉంది.