టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్నతో ఇంటర్వ్యూ

విద్యార్థులధోరణిమారాలి

ప్రపంచ మార్కెట్‌కు తగ్గట్లు ఉండాలి

ఆంగ్లంలోపట్టుఉండడంలేదు

పాఠ్యాంశాలపై అడిగే ప్రశ్నలకు తడబడకుండా సమాధానం చెప్పాలి

డిమాండ్‌ను అనుసరించి ఆఫ్‌క్యాంపస్ ఇంటర్వ్యూలు

'ఈనాడు-ఈటీవీ' ఇంటర్వ్యూలో టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్న వెల్లడి

అర్హులైన బోధకులు, మౌలిక సదుపాయాలు, ఉత్తీర్ణత శాతాన్ని పరిగణనలోనికి తీసుకుని ఎంపికచేసిన కళాశాలల్లో మాత్రమే ప్రాంగణ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వైస్‌ప్రెసిడెంట్, ప్రాంతీయ అధిపతి, ఐటీ అండ్ ఐటీఈఎస్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వి.రాజన్న వెల్లడించారు. రాష్ట్రంలో 42 నుంచి 45 కళాశాలలకు అక్రిడిటేషన్ ఇచ్చి, ప్రాంగణ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాష ప్రావీణ్యం చాలా తక్కువగా ఉందని క్యాంపస్ ఇంటర్వ్యూల సందర్భంగా తాము గమనించినట్లు వెల్లడించారు. ఇంటర్వ్యూల నిర్వహణ గురించి ముందుగా తెలిసినా విద్యార్థులు తగిన విధంగా సన్నద్ధం కావటంలేదని విచారం వ్యక్తం చేశారు. పాఠ్యప్రణాళిక పరంగా ఎటువంటి సమస్యలు లేవని, పాఠ్యప్రణాళిక ఖరారులో పరిశ్రమల భాగస్వామ్యం కూడా ఉందని వెల్లడించారు. 2012-13 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాల హడావుడి మొదలైన నేపథ్యంలో రాజన్న 'ఈనాడు-ఈటీవీ'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా 3,400 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా రాష్ట్రంలోనే 707 కళాశాలలు ఉన్నాయి. పట్టభద్రుల్లో కేవలం 10% నుంచి 15% మంది మాత్రమే పరిశ్రమలకు ఉపయోగపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి? దీనిపై ఏమంటారు?

ఇంజినీరింగ్ విద్యలో రాష్ట్రం ముందంజలో ఉండడం శుభపరిణామం. ఏదైనా పరిశ్రమకు రెండువేల మంది ఉద్యోగులు కావాలంటే వెంటనే ఆంధ్రప్రదేశ్ అందివ్వగలిగే స్థితిలో ఉండడం మంచిదే. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు...కళాశాలల్లో అర్హులైన బోధకుల కొరత తీవ్రంగా ఉంది. మౌలిక సదుపాయాల కొరత ఉంది. తగిన అర్హతలతో బోధకులు ఉన్న కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి. వారులేని చోట్ల విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. దీనికితోడు విద్యార్థుల్లోనూ శ్రద్ధ ఉండడంలేదు. దీనివల్లే శక్తి, సామర్థ్యాలు కలిగిన ఇంజినీర్లు బయటకు రాలేకపోతున్నారు. ఈ కారణంగానే.. పరిశ్రమలకు ఉపయోగపడే ఇంజినీరింగ్ అభ్యర్థులు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్ ముందున్న విషయాన్ని గమనించాలి. మన తరువాత స్థానంలో తమిళనాడు ఉంది. అత్యధిక సంఖ్యలో నియామకాలు ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) విద్యార్థులకు లభిస్తున్నాయి.

పరిష్కారం ఏమిటి?

కళాశాలల యాజమాన్యాలు అర్హులైన వారితో బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల వారితో సత్ససంబంధాలు కొనసాగించి కార్యకలాపాలను పెంచుకోవాలి. విద్యార్థులను నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలి. కొద్దికాలం కిందట రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 50 మంది ప్రొఫెసర్లకు మారిన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగించాం. ఇలాంటివి విస్తృతం కావాలి. విద్యార్థుల్లో ఆంగ్ల భాష ప్రావీణ్యం పెరిగేందుకు కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించాలి. అవసరమైతే ఆంగ్లభాష మాట్లాడడం తప్పనిసరి చేయాలన్నది నా అభిప్రాయం. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బ్యాక్‌లాగ్ ఉన్నా విద్యార్థులు మూడో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ విధానంలో మార్పులు తీసుకువచ్చే విషయాన్ని అకడమిక్ బోర్డులు పరిశీలించాలి. విద్యార్థుల్లోనూ మార్పు రావాలి. ప్రాంగణ ఇంటర్వ్యూలు జరుగుతాయని మూడు నుంచి నాలుగు నెలల ముందే సమాచారం ఉంటున్నా అందుకు తగినట్లు వారు సన్నద్ధం కావడంలేదు..

2012-13 విద్యా సంవత్సరంలో ప్రాంగణ ఇంటర్వ్యూలు ఎప్పటినుంచి ప్రారంభించబోతున్నారు? ఎంతమందిని ఈదఫా ఎంపిక చేయబోతున్నారు?

నాలుగో సంవత్సరం విద్యార్థులు రెండో సెమిస్టరులోకి వచ్చినప్పుడు ప్రాంగణ ఇంటర్వ్యూలు ప్రారంభిస్తాం. సంఖ్యను ఇప్పుడే చెప్పలేం. ఐటీ రంగానికి ప్రస్తుతం 2.3 లక్షల మంది అవసరం ఉందని అంచనా వేస్తున్నాం. ఇందులో 15% ఆంధ్రప్రదేశ్ నుంచి అవసరమని అంచనా వేస్తున్నాం. ఏపీ నుంచే 40% ఎగుమతులు జరుగుతున్నాయి. నియామకాల సంఖ్య పెరగాలంటే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు కావాలి. సంస్థలు తమ కార్యకలాపాలను పెంచాలి. దీనికి తగినట్లే నియామకాలు జరుగుతాయి. కిందటేడాది దేశవ్యాప్తంగా 45వేల మందిని ఎంపిక చేశాం. వీరిలో 5,500 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. వీరికి ఉద్యోగ ప్రవేశాల లేఖలను రెండు, మూడు నెలల నుంచి పంపిణీ ప్రారంభించాం. ఇది మరో ఆరునెలల వరకు కొనసాగే అవకాశం ఉంది.

ప్రాంగణ ఇంటర్వ్యూల కోసం కళాశాలలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? వాటి సంఖ్య ఎంత? గ్రామీణ నేపథ్యం కలిగిన కళాశాల విద్యార్థులు ప్రాంగణ ఇంటర్వ్యూలకు దూరమవుతున్నారని చెబుతున్నారు?

ప్రస్తుతం 42 నుంచి 45 కళాశాలల్లో మాత్రమే ప్రాంగణ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. కనీసం మూడు బ్యాచుల విద్యార్థులు పట్టాలతో బయటకొచ్చి, అర్హులైన బోధకులు, తగిన సౌకర్యాలతో ప్రయోగశాలలు, మౌలిక సదుపాయాలు ఉన్న కళాశాలలను ఉత్తీర్ణత శాతాన్ని ఆధారంగా చేసుకుని ఎంపికచేస్తున్నాం. మా సంస్థకు చెందిన బిజినెస్, మేనేజ్‌మెంట్, మానవ వనరుల విభాగాల ప్రతినిధులు వెళ్లి కళాశాలల పనితీరును అంచనా వేసి సమర్పించిన నివేదికలను అనుసరించి ఈ ఎంపిక జరుగుతోంది. అక్రిడిటేషన్ కళాశాలల సంఖ్య మరో ఐదారుకు పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత కళాశాలలకు మేము దూరంగా ఉండడం లేదు. మేము గుర్తించిన కళాశాలలు కాకినాడ, వరంగల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, ఇతరచోట్ల ఉన్నాయి. ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా అన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాము. డిమాండ్ ఉన్న సమయంలో ఇవి జరుగుతాయి.

ప్రాంగణ ఇంటర్వ్యూల్లో మీరు విద్యార్థుల నుంచి ఏమి ఆశిస్తున్నారు?

విద్యార్థులు 60% మార్కులతో ఉత్తీర్ణతపొంది, తమ కరిక్యులమ్‌లో ఛాంపియన్‌గా ఉండాలి. మేము నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష ఉత్తీర్ణులయిన అనంతరం సాంకేతిక, మౌఖిక పరీక్షల్లో తగిన ప్రతిభ కనబరచాలి. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే ప్రశ్నలు ఉండవు. కరిక్యులమ్‌లో తమకు నచ్చిన అంశాలేవో తెలిపి, వాటిల్లో అడిగే ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పాలి. అలాగే ప్రోగ్రామింగ్ (సి++, జావా, డాట్‌నెట్, ఇతర వాటిల్లో) ఒక దానిపై మంచి పట్టు సాధించి ఉండాలి. మౌఖిక పరీక్షలో నాయకత్వ లక్షణాలను పరిశీలిస్తాం. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. ఇందులోనూ ఎక్కువమంది విద్యార్థులు అశ్రద్ధతో ఉంటున్నారు. కనీసం మూడు నెలల పాటు పత్రికలు చదివినా, టీవీ ఛానళ్లు చూసినా ఆంగ్లంపై పట్టు సాధించవచ్చు. అయినా విద్యార్థులు పట్టించుకోవడంలేదు. పనిచేయాల్సిన ప్రదేశాల పరిమితులు విధించుకుంటున్నారు. ఇది తగదు. గ్లోబల్ మార్కెట్‌కు తగినట్లు విద్యార్థుల ధోరణి మారాలి.

ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో చేరబోయే విద్యార్థులు, తల్లిదండ్రులకు మీరిచ్చే సలహా..
మా దృష్టిలో ఏ కోర్సైనా ఒకటే. ఆయా రంగాలకు మాత్రమే పరిమితమైన సంస్థలు సంబంధిత కోర్సులో చదివిన విద్యార్థులను తీసుకుంటాయి. మా వరకు ఎటువంటి పరిమితిలేదు. డిగ్రీ పూర్తిచేయగానే పిల్లలకు ఉద్యోగం రావాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పేమీలేదు. కానీ దానికి తగినట్లు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారా? లేదా? అన్నది చూడాలి.