ఇంట‌ర్వ్యూలు

కేపీఎంజీ ఇండియా ముఖ్య కార్యనిర్వహణ అధికారి రిచర్డ్‌ రేఖీతో ఇంటర్వ్యూ

* కష్ట కాలంలోనూ కాసులు సంపాదిస్తాం
* భారత్‌ దీర్ఘకాలిక వృద్ధికి ఢోకా లేదు
* మూడేళ్లలో సిబ్బందిని రెట్టింపు చేస్తాం
* వొడాఫోన్‌, 2జీ వివాదాలతో విదేశీ మదుపరుల విశ్వాసం సడలింది

'బిగ్‌4'గా వ్యవహరించే నాలుగు ప్రపంచ స్థాయి ఆడిట్‌, కన్సల్టెన్సీ సేవల సంస్థల్లో కేపీఎంజీ ఒకటి. ఈ సంస్థ ఈమధ్య భారత్‌లో విస్తరణపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాల్లో భారత్‌కు నానాటికీ అధిక ప్రాధాన్యం లభిస్తోందని, తదనుగుణంగా ఇక్కడ కార్యకలాపాలు విస్తరిస్తున్నామని అంటున్నారు కేపీఎంజీ ఇండియా ముఖ్య కార్యనిర్వహణ అధికారి రిచర్డ్‌ రేఖీ. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నా.. భవిష్యత్తుకు ఢోకా లేదని చెబుతున్నారు ఆయన. భారత్‌లో సిబ్బందిని, భాగస్వాముల సంఖ్యను పెంచడంతో పాటు విద్య, వైద్య, రక్షణ విభాగాలకు కన్సల్టెన్సీ సేవలను బహుముఖంగా విస్తరించే యత్నాల్లో ఉన్నట్లు 'ఈనాడు'కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇతర ముఖ్యాంశాలు....

» ప్రధానంగా ఏ విభాగాల మీద కేపీఎంజీ ఇండియా దృష్టి సారిస్తోంది?
ఐటీ, బీపీఓ రంగాల్లో మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ విభాగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్నల్‌ ఆడిట్‌ ప్రాక్టీస్‌లో మేం ఇప్పటికే భారతీయ మార్కెట్లో అగ్రగామిగా ఉన్నాం. పన్ను విభాగంలో 'ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌' ప్రాక్టీస్‌ పెద్ద విభాగం. పరోక్ష పన్నులు, పన్ను వివాదాల్లోనూ మాకు ప్రాక్టీస్‌ అధికంగా ఉంది. ఇంకా మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవలు, టెలికామ్‌ రంగాలకు సంబంధించి అధికంగా కన్సల్టెన్సీ ప్రాజెక్టులు లభిస్తున్నాయి. ఢిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్‌ ప్రాజెక్టుకు అవసరమైన కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్నాం. కొత్తగా బ్యాంకింగ్‌ లైన్సెన్సులు జారీ చేసేందుకు ఆర్‌బీఐ దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో మాకు పలు అసైన్‌మెంట్లు లభించాయి. అలాగే భారత్‌ కేంద్రంగా ఆఫ్రికా దేశాల్లో పలు టెలికామ్‌ సంస్థలకు సేవలు అందిస్తున్నాం.

» కేపీఎంజీ ప్రపంచవ్యాప్త కన్సల్టెన్సీ వ్యాపారంలో భారత్‌ వాటా ఎంత? మున్ముందు ఇదింకా పెరిగే అవకాశం ఉందా..
ఇప్పటికైతే నామమాత్రమే. కానీ వృద్ధి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. దీన్ని గుర్తించే గురుగావ్‌, బెంగళూరులలో 'కేపీఎంజీ గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌'లను నెలకొల్పాం. తద్వారా భారత్‌కు కేపీఎంజీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. మున్ముందు అమెరికా, చైనా, భారత్‌ అత్యంత ముఖ్యమైన మార్కెట్లుగా ఉంటాయి. వచ్చే నాలుగైదేళ్లలో కేపీఎంజీకి బిలియన్‌ డాలర్ల ఆదాయాలు భారత్‌ నుంచి సమకూర్చాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం సాధిస్తున్న వృద్ధిరేటును కొనసాగిస్తే వచ్చే అయిదేళ్లలో కేపీఎంజీ కార్యకలాపాలకు సంబంధించి అయిదో అతిపెద్ద దేశంగా భారత్‌ ఎదుగుతుంది. ఇదేకాకుండా ఇనార్గానిక్‌ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ట్యాక్స్‌ ప్రాక్టీస్‌, టెక్‌ ప్రాక్టీస్‌, డేటా అనలిటిక్స్‌ విభాగాల్లో ఇనార్గానిక్‌ అవకాశాల కోసం అన్వేషిస్తున్నాం. ప్రస్తుతం మాకు దేశవ్యాప్తంగా 160 మంది భాగస్వాములు ఉన్నారు. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో మరో 320 మందిని తీసుకోవాలనేది మా ప్రణాళిక.

» భారత్‌లోని కార్పొరేట్‌ సంస్థలకు మీరు ప్రత్యేకంగా ఎటువంటి సేవలు అందిస్తున్నారు?
విదేశాల్లో వ్యాపార నిర్వహణకు, దేశం వెలుపల విస్తరించటానికి అవసరమైన మద్దతును కేపీఎంజీ ఇండియా ఇక్కడి కార్పొరేట్‌ సంస్థలకు అందిస్తోంది. ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని వివిధ దేశాలకు భారతీయ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు కేపీఎంజీ సేవలను తీసుకుంటున్నాయి.

» మీ సిబ్బంది సంఖ్య ఎంత.. దీన్ని పెంచుకోవలసిన అవసరం ఉందా?
ప్రస్తుతం భారత్‌లో మాకు 6600 మంది సిబ్బంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వచ్చే మూడేళ్లలో దీన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నాం.

» రాజకీయ, ఆర్థిక కారణాలతో భారత్‌లో వ్యాపార కార్యకలాపాల విస్తరణ కష్టంగా ఉంది. పెట్టుబడులు రావడం లేదు. అనేక నిబంధనలు, పన్ను వివాదాలు చుట్టిముట్టి కార్పొరేట్‌ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీ కార్యకలాపాలు కూడా దెబ్బతింటాయి కదా..
వ్యాపార వాతావరణం బాగోలేని మాట నిజమే. కానీ దాని ప్రభావం మాపై అంతగా లేదు. పైగా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచే మాకు కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు ఆర్థిక సేవల రంగం కష్టాల్లో కనిపిస్తోంది. కానీ కొత్త బ్యాంకింగ్‌ లైనెన్సుల జారీ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో పలు ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల నుంచి మాకు ఈ విషయంలో సేవలు అందించాల్సిగా అసైన్‌మెంట్లు లభించాయి. బ్యాంకింగ్‌ లైసెన్సు కోసం దరఖాస్తు చేయటం నుంచి ఆర్‌బీఐకి అవసరమైన సమాచారం, వివరణలు అందించటం, తదుపరి లైసెన్సు జారీ అయితే బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని ఆయా సంస్థలు స్ధాపించేందుకు అవసరమైన సాంకేతిక- సాధారణ సేవలు అందించటం ఈ ప్రాజెక్టులో భాగం. ఇక మౌలిక రంగ కంపెనీలు స్థిరీకరణ వైపు చూస్తున్నాయి. అందులో భాగంగా పునర్‌వ్యవస్థీకరణకు సిద్ధపడుతున్నాయి. ఈ పనులు ఇప్పటి పరిస్థితుల్లో అధికంగా మాకు వస్తున్నాయి. టెలికామ్‌ రంగంలో వివాదాలు, అంతగా ఆదాయాలు ఆర్జించని స్థితి పైకి కనిపిస్తున్న అంశాలు. కానీ ఎప్పటికప్పుడు కొత్త అసైన్‌మెంట్లు మాకు టెలికాం కంపెనీలు నుంచి వస్తూనే ఉన్నాయి. అందువల్ల కష్టకాలం కూడా మాకు కలిసివచ్చేదే అని.

» భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్థికాభివృద్ధి రేటు విషయంలో మీ అంచనాలెలా ఉన్నాయి.. ఎందుకంటే ఆర్థికాభివృద్ధికి, కన్సల్టెన్సీ వ్యాపారాభివృద్ధికి నేరుగా సంబంధం ఉంది కాబట్టి...
స్వల్పకాలంలో పెద్దగా మార్పు ఉండదు. దీర్ఘకాలంలో భారత్‌ వృద్ధి అవకాశాలకు ఢోకా లేదు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అనువైన నిర్ణయాలను ప్రభుత్వం సత్వరం తీసుకోవాలి. బీమా, రిటైల్‌, రక్షణ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఎక్కువగా సంపాదించాలి. విద్యుత్తు సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. స్థిరాస్తి రంగాన్ని మళ్లీ వెలుగులోకి తేవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సార్వత్రిక ఎన్నికల తర్వాత వృద్ధి రేటు పెరగొచ్చు. ఈమధ్య పలు జపాన్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడికి ముందుకొస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నారనేది ప్రశ్న. జీఎస్‌టీ, ప్రత్యక్ష పన్నుల కోడ్‌ వంటి ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక విధానాలపై సత్వర నిర్ణయం తీసుకోవటం ద్వారా మళ్లీ 8-9 శాతం వృద్ధిని ఆశించవచ్చు. అంతర్జాతీయంగా ముడిచమురు, వస్తు-లోహాల ధరలు తగ్గుతున్నాయి. ఇది మేలు చేసే అంశం. తద్వారా లోటును తగ్గించుకోవచ్చు. అదే సమయంలో ప్రభుత్వ- ప్రైవేటు రంగంలోని సంస్థలు విదేశాల్లో వ్యాపారాస్తులను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం వీలుకల్పించాలి. అధిక వృద్ధిరేటును నమోదు చేయటానికి ఈ పరిస్థితులు వీలు కల్పిస్తాయి.

» ప్రభుత్వం నుంచి స్థిరమైన విధానాలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై విదేశీ పెట్టుబడిదారుల నుంచి మీకు ఎటువంటి సమాచారం ఉంది?
వొడాఫోన్‌ పన్ను ఉదంతం, 2జీ లైసెన్సుల రద్దు విదేశీ మదుపుదార్ల విశ్వాసాన్ని బాగా దెబ్బతీశాయి. పన్ను ఎంత అయితే అంత చెల్లించాలనే విషయాన్ని వారేమీ కాదనటం లేదు. కానీ గత యాభై ఏళ్ల నుంచి వర్తించే విధంగా ఇప్పుడు పన్ను విధించటం ఏమిటి? అనే ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి పలు అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌పై విదేశీ సంస్థలకు ఎంతో విశ్వాసం ఉంది. అయితే వొడాఫోన్‌ ఉదంతం వారిని బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పవచ్చు.

» ఆంధ్రప్రదేశ్‌లో కేపీఎంజీ ఇండియా కార్యకలాపాలెలా ఉన్నాయి?
ఇక్కడ ఔషధ, మౌలిక, ఐటీ.. ఇలా అన్ని ముఖ్య రంగాల్లోని సంస్థలకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నాం. హైదరాబాద్‌ కార్యాలయంలో మాకు 260 మంది సిబ్బంది ఉన్నారు. విశాఖకు సైతం మా సేవలు విస్తరించాం.

» కన్సల్టెన్సీ, ట్యాక్స్‌ ఆడిట్‌ విభాగాల్లో పోటీ ఎలా ఉంది?
పోటీ ఉంది. 'బిగ్‌4' వరకూ తీసుకుంటే, సలహా సేవల విభాగంలో దేశంలో మేం 2వ స్థానంలో ఉన్నాం. ట్యాక్స్‌ ప్రాక్టీస్‌లో మాది 3వ స్థానం. త్వరలో 2వ స్థానానికి ఎదిగే అవకాశం కనిపిస్తోంది. మంచి బ్రాండ్‌ విలువ, ప్రతిష్ఠ కేపీఎంజీ సొంతం. దీనికి నాణ్యమైన సేవలు జతకలిపి వేగంగా విస్తరిస్తున్నాం.

» 'బిగ్‌4'లో ఒకటి మూడేళ్ల క్రితం సత్యం కంప్యూటర్‌ తప్పుడు ఖాతాల వివాదంలో చిక్కుకుంది. ఈ ఉదంతం మీపైన కూడా ప్రభావం చూపిందా?
దీన్ని అందరికీ వర్తించి చూడకూడదు. ఏ సంస్థ అయితే అందులో చిక్కుకుందో, ఆ సంస్థకు నష్టం జరిగింది. అంతేతప్ప మిగిలిన సంస్థలకు వచ్చిన నష్టమేమీ లేదు. మా విషయంలోనూ అంతే. అయితే ప్రతిష్ఠపరంగా 'బిగ్‌4'కి కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. అయితే తదుపరి తీసుకున్న దిద్దుబాటు చర్యలతో నష్టాన్ని భర్తీచేసుకోగలిగాం.