ఇంట‌ర్వ్యూలు

కంప్యూటర్ సైన్స్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రఘు కొర్రపాటి ఇంటర్వ్యూ

* ఇంజినీర్ల స్థాయికి డిగ్రీ విద్యార్థులు
* బీఎస్సీ, బీకాం(ఆనర్స్) వారికీ పెద్ద కంపెనీల్లో ఉద్యోగావకాశాలు
* ఏ కోర్సు చదివినా సత్తాతోనే రాణింపు

ఇంజినీరింగ్ చదివిన వారికే కాకుండా డిగ్రీ విద్యార్థులకూ ఉపాధి అవకాశాల్లో బహుళజాతి సంస్థలు పాధాన్యమిస్తున్నాయని కంప్యూటర్ సైన్స్ కార్పొరేషన్ (సీఎస్సీ-మల్టీనేషనల్ కంపెనీ) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రఘు కొర్రపాటి వెల్లడించారు. ఏ కోర్సు చదివినా విషయ అవగాహన, భాషా నైపుణ్యాలు విద్యార్థుల సత్తాకు నిదర్శనంగా నిలుస్తాయని తెలిపారు. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌గానూ వ్యవహరిస్తున్న రఘు భారత్‌కు వచ్చిన సందర్భంగా 'ఈనాడు-ఈటీవీ'తో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతర్జాతీయవిపణిలోని తాజా ధోరణులు, ఉద్యోగుల నియామకాల్లో వస్తోన్న మార్పులను ఆయన వివరించారు.

» ఐటీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి?
అంతర్జాతీయ విపణిలోని ఒడిదుడుకుల ప్రభావం ఐటీ రంగంపైనా కనిపిస్తోంది. అమెరికా మార్కెట్‌పై ఆధారపడే సంస్థలు ఖర్చును తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా బీటెక్ గ్రాడ్యుయేట్లతో పాటు బీఎస్సీ, బీకాం (ఆనర్స్) చదివిన విద్యార్థులనూ బహుళజాతి సంస్థలు ఉద్యోగులుగా తీసుకొంటున్నాయి. మాసంస్థ (సీఎస్సీ)తోపాటు టీసీఎస్, విప్రో లాంటి కంపెనీలు ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం డిగ్రీ విద్యార్థులకు 10శాతం మేర ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో ఇది మూడో వంతుకు పెరగనుంది.

» బీటెక్ పట్టాలతో లక్షల మంది సిద్ధంగా ఉండగా డిగ్రీ వారికి అవకాశాలు కల్పించడానికి కారణం?
బీటెక్ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా కొందరు నిలకడగా ఉండడంలేదు. ప్రతియేటా (నెలకు రూ.26వేలు) వీరికి కనీసం రూ.3 లక్షల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఏడాదికాగానే ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్నారు. బీటెక్ ఉద్యోగికిచ్చే వేతనానికే ఇద్దరు డిగ్రీ విద్యార్థులకు (నెలకు రూ.13వేల వంతున) అవకాశం కల్పించవచ్చు. అందువల్లే బహుళ జాతి సంస్థలు ఢిల్లీ లాంటి చోట్ల డిగ్రీ కళాశాలల్లోనే ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నాయి. ఇంజినీరింగ్ విద్య సమస్య పరిష్కార నైపుణ్యాలకు సంబంధించినది. దీనినే డిగ్రీ విద్యార్థులకు నేర్పిస్తున్నాము. దీనివల్ల వ్యత్యాసం కనిపించదు.

» ఇంజినీరింగ్‌లో చేరబోయే విద్యార్థులు కోర్సుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య.. విద్యార్థులకు అందుబాటులోకి రావటం ఆహ్వానించదగినదే. ఈ విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న బంధువులు, శ్రేయోభిలాషులను సంప్రదించాలి. ఇంజినీరింగ్‌లో ఏ కోర్సు చదివినా ఉద్యోగ అవకాశాలకు కొదవేలేదు. పరిస్థితులిలా ఉంటే రాష్ట్రంలో ఈసీఈ కోర్సుకు కళాశాలల యాజమాన్యాలు రూ.లక్షల్లో డొనేషన్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

» నియామకాల సమయంలో విద్యార్థుల్లో మీరు గుర్తించిన లోపాలు?
చాలామంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులవుతున్నా ఆంగ్లంలో సరిగా మాట్లాడలేకపోతున్నారు. ఇతర విషయాల్లోనూ వారి ప్రతిభ ఆశించిన స్థాయికి తగినట్లు ఉండడంలేదు.

» పరిష్కారం ఏమిటి?
విద్యార్థులకు కళాశాలల్లో చేరిన రెండో ఏడాది నుంచే ప్రాంగణ నియామకాల్లో నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్ వంటి అంశాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇప్పించాలి. విద్యార్థులు ప్రాజెక్టు వర్కులను మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో చేయాలి. కళాశాలల యాజమాన్యాలూ ఆ దిశగా ప్రోత్సహించాలి. ప్రతి కళాశాలలో 'టోస్టర్ మాస్టర్ ఇంటర్నేషనల్ క్లబ్స్'ను ఏర్పాటు చేయాలి. బిడియం లేకుండా నిర్భయంగా మాట్లాడేందుకు ఇవి దోహదపడతాయి. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని విద్యా సంస్థల్లో ఇవి విజయవంతంగా నడుస్తున్నాయి. ప్లేస్‌మెంట్ విభాగాన్ని పటిష్ఠంగా నిర్వహించాలి.

» అమెరికా-భారత్‌ల మధ్య విద్యావిధానంలో తేడా ఏమిటి?
మనదేశంలో జ్ఞాపకశక్తిపై ఆధారపడి విద్యకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అక్కడ విద్యలో ప్రాజెక్టులు, ఆచరణీయత, ప్రయోగాలకు ప్రాధాన్యమిస్తారు.

డాక్టర్ రఘు గురించి క్లుప్తంగా...
గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన డాక్టర్ రఘు కంప్యూటర్ సైన్సెస్, మేనేజ్‌మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేశారు. కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తెలుగులో '108 విలువైన సూత్రాలు' అనే పుస్తకాన్ని రచించారు. ఆంగ్లంలోనూ ఈ పుస్తకం ప్రచురితమైంది. గుంటూరు జిల్లాలోనే తెలుగు మాధ్యమంలో పదో తరగతి చదివిన రఘు మహారాష్ట్రలోని అమరావతి విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ విద్య నభ్యసించారు. ఎంటెక్ చేశారు. టీసీఎస్ లాంటి సంస్థల్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. డాక్టర్ రఘు పలు గ్రంథాలు, వందలాది పరిశోధనలు, బిజినెస్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విషయాలపై వ్యాసాలు రాశారు. సీఎస్సీలో లక్ష మంది ఉద్యోగులు ఉండగా రాష్ట్రంలో 25 వేల మంది పని చేస్తున్నారు.