ఇంట‌ర్వ్యూలు

క్యూరియాసిటీ ప్రాజెక్టు శాస్త్రవేత్త అశ్విన్‌ తో ఇంటర్వ్యూ

* అంగారకుడిపై దిగినట్టు కలగన్నా..!
* వైకింగ్‌ ఫొటోలు చూసి మైమరిచా
* అప్పుడే అంతరిక్ష రంగంపై మోజు కలిగింది
* జీవంపై ఏదైనా సమాచారం దొరికితే..
* భవిష్యత్‌ కార్యక్రమాలకు వూతం
* అంతరిక్షంలో భారత కార్యక్రమాల పట్ల గర్వంగా ఉంది

ఫొటోల్లో అరుణగ్రహపు శోభను చూసి ఆ బాలుడు మనసు పారేసుకున్నాడు. మైమరపుతో కనురెప్పలు మూతలు పడ్డాయి.. మనస్సే రాకెట్‌ అయ్యింది. అందులో కోట్లాది కిలోమీటర్లు ప్రయాణించి.. ఆ గ్రహానికి చేరుకున్నాడు. కుతూహలంతో అంతా కలియతిరిగాడు. ఎటు చూసినా కుప్పలు కుప్పలుగా ఆరబోసినట్లుగా అరుణవర్ణమే.. పాదరక్షల నిండా ఎర్రటి ధూళే.. అబ్బ! ఎంత అద్భుతం ఈ అరుణోదయం! ఇంతలో ఏదో అలికిడి.. కళ్లు తెరుచుకున్నాయి.. ఎదుట సాక్షాత్కరించిన సుందరస్వప్నం కరిగిపోయింది. వాస్తవ ప్రపంచంలోకి వచ్చేశాడు. అప్పటిదాకా తాను కల కన్నానన్న వాస్తవాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడే ఒక దృఢ సంకల్పం ఆ పసిమనసులో బలంగా నాటుకుంది.. అంగారక యాత్రలో పాలుపంచుకోవాలని గట్టిగా అనుకున్నాడు. ఆ దిశగా కష్టపడ్డాడు. గ్రహ అధ్యయన శాస్త్రం (ప్లానెటరీ సైన్స్‌)లో డాక్టరేట్‌ పొందాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా చేరారు. చిన్ననాటి స్వప్నానికి చేరువయ్యారు. నాసా తాజాగా చేపట్టిన 'క్యూరియాసిటీ' యాత్రకు డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్‌గా ఎదిగారు. ఆయనే.. భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త అశ్విన్‌ ఆర్‌ వాసవదా. రానున్న రోజుల్లో ఆయన నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం.. అంగారకుడిపై లోగడ ఎప్పుడైనా జీవం ఉనికికి అనువైన పరిస్థితులు ఉండేవా అన్నది తేలుస్తుంది. క్యూరియాసిటీ ప్రాజెక్టుతో తీరిక లేకుండా ఉన్నా.. 'ఈనాడు'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. విశ్వాన్వేషణకు సంబంధించిన అనేక అంశాలపై తన మస్తిష్కాన్ని ఆవిష్కరించారు. ఈ వివరాలు..

» అంగారకుడి మీదకు స్పిరిట్‌, ఆపర్చునిటీ రోవర్లు, ఫీనిక్స్‌ ల్యాండర్‌ వంటి శాస్త్రీయ మిషన్లు చేపట్టాక.. అరుణ గ్రహానికి మరో రోవర్‌ను పంపాల్సిన అవసరం ఏంటి? క్యూరియాసిటీ రోవర్‌.. లోగడ ప్రయోగించిన వాటికి ఏ మేర భిన్నమైంది?
అంగారకుడిపై లోగడ ఎప్పుడైనా జీవం ఉండేదా అన్నది నిర్ధరించాలన్న లక్ష్యం చుట్టూనే నాసా అరుణ గ్రహ అన్వేషణ కార్యక్రమం సాగింది. 1970లలో వైకింగ్‌ యాత్రద్వారా ఈ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇచ్చేందుకు మేం ప్రయత్నించాం. ఇది అంత సులువు కాదని వెంటనే గ్రహించాం. ఆమాటకొస్తే.. భూమి మీదున్న చాలా పురాతన శిలల్లో జీవం ఉనికిని గుర్తించడం చాలా కష్టం. అందువల్ల మేం చాలా జాగ్రత్తగా అంగారకుడిని శోధిస్తున్నాం. దాని చరిత్ర, పర్యావరణ పరిస్థితులు.. అవి కాలానుగుణంగా ఎలా మార్పు చెందాయి వంటివి పరిశీలిస్తున్నాం. జీవం భద్రంగా ఉండటానికి అవసరమైన అంశాలు దానిమీద ఉన్నాయా అని శోధిస్తున్నాం. అరుణ గ్రహాన్ని మ్యాప్‌ చేయడానికి ఆర్బిటర్లను పంపాం. ఉపరితలంపై అన్వేషణకు ల్యాండర్లు, రోవర్లను పంపాం. ఆరోవర్లు.. అరుణగ్రహంపై నీరు ఉందని నిర్ధరించాయి. అయితే ఈ గ్రహం మీదకు లేబొరేటరీలను తీసుకెళ్లిన మొట్టమొదటి రోవర్‌ క్యూరియాసిటీనే. ఈఅత్యాధునిక ప్రయోగశాలలు.. నీరు, శక్తి వనరులు, కార్బన్‌, రేడియోధార్మికత వంటి జీవులకు అవసరమయ్యే అంశాలు, హానికారకాలపై శోధిస్తాయి. అంగారకుడి నుంచి నమూనాల సేకరణకు ఒక రోబోటిక్‌ హస్తం, డ్రిల్లింగ్‌ వ్యవస్థ దానికి కావాలి. ఇవన్నీ క్యూరియాసిటీలో ఉన్నాయి. ఈప్రయోగశాలలు, శాంప్లింగ్‌ పరికరాల కారణంగానే రోవర్‌ బరువు అంతగా పెరిగింది.

» క్యూరియాసిటీ తయారీకి 9 ఏళ్లు పట్టింది. 230 కోట్ల డాలర్లు ఖర్చయింది. అయితే ఇన్ని వ్యయప్రయాసలకోర్చి పంపినా.. ల్యాండింగ్‌కు ఏడు నిమిషాల ముందు జరిగే పరిణామాలే దాని మనుగడకు కీలకం. ఈ 'భీతావహ ఏడు నిమిషాల'ను తట్టుకోవడానికి నాసా ఎలాంటి చర్యలు చేపట్టింది?
క్యూరియాసిటీని భద్రంగా దించేందుకు అత్యంత సురక్షితమైన వ్యవస్థను రూపొందించాం. ఇందుకోసం నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ (జేపీఎల్‌) ఇంజినీర్లు ఎన్నో ఏళ్లుగా కసరత్తు చేశారు. మరో గ్రహంలో మేం ఎన్నడూ 900 కిలోల బరువును దించలేదు. అందువల్ల కొత్త ల్యాండింగ్‌ వ్యవస్థ అవసరమైంది. అనేక చర్చోపచర్చలు, తర్జనభర్జనల తర్వాత క్యూరియాసిటీ.. తన సొంత చక్రాలపైనే ల్యాండ్‌ కాగలదని తేల్చాం. ఫలితంగా భారీ ల్యాండింగ్‌ వేదిక తయారుచేయాల్సిన అవసరం తప్పింది. క్యూరియాసిటీని కిందకు దించే రాకెట్‌షిప్‌.. ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎగువనే ఉండిపోతుంది. దీనివల్ల రాకెట్లు ఉపరితలాన్ని ఢీ కొట్టడం వల్ల తలెత్తే అస్థిరత్వం తప్పిపోయింది. క్యూరియాసిటీని భద్రంగా నిర్దేశిత ప్రాంతంలో దించేలా దాని ల్యాండింగ్‌ వ్యవస్థను రూపొందించాం. ఇంత ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా.. అంగారకుడి మీద ల్యాండింగ్‌ చాలా కష్టం. ఎన్నో రూపాల్లో ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇది.. అంగారకుడి మీదకు దిగిన ఏడో వ్యోమనౌకే అన్నది మనం గుర్తుంచుకోవాలి.

» అరుణగ్రహంపై వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో వైరుద్ధ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ధూళి తుపాన్లు, అంతరిక్షం నుంచి అధికమోతాదులో వచ్చే రేడియోధార్మికత, ఎగుడుదిగుడుగా ఉన్న ఉపరితలం.. ఇవన్నీ సవాళ్లు రువ్వుతాయి. వీటిని తట్టుకొని రోవర్‌ సాఫీగా రెండేళ్లపాటు పనిచేయగలగాలి. ఇందుకు మీరెలా సిద్ధమయ్యారు?
ఉష్ణోగ్రతల్లో వైరుద్ధ్యాలు, రేడియోధార్మికతను తట్టుకునేలా రోవర్‌, అందులోని ఎలక్ట్రానిక్‌ పరికరాలను ప్రత్యేక పదార్థాలతో తయారుచేశాం. పేలోడ్‌, ఎలక్ట్రానిక్స్‌ రోవర్‌ లోపల భద్రంగా ఉంచాం. రోవర్‌ బాడీ మొత్తానికి పటిష్ఠమైన ఇన్సులేషన్‌ ఉంది. శీతల వాతావరణంలో కూడా అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయడం కోసం వాటిని వేడి వాతావరణంలో ఉంచుతాం. ఇందుకోసం రోవర్‌లోని 'రేడియో ఐసోటోపిక్‌ థర్మోన్యూక్లియర్‌ జనరేటర్‌' నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఈ జనరేటర్‌.. ప్లూటోనియం-238 రేడియోధార్మికత క్షీణత నుంచి వెలువడే ఉష్ణం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. సౌర విద్యుత్‌పై ఆధారపడాల్సిన పనిలేదు. సూర్య కాంతి అందని ప్రాంతాల్లోనూ రోవర్‌ పనిచేస్తుంది. క్యూరియాసిటీకి చెందిన సస్పెన్షన్‌, చక్రాలను 65 సెం.మీ. ఎత్తువరకూ ఉన్న అవరోధాలను అధిగమించేలా రూపొందించాం.

» ఇప్పుడు నాసాలో బడ్జెట్ల కోతల కాలం నడుస్తోంది. వచ్చే ఏడాది 'మావెన్‌' పేరుతో అరుణ గ్రహం మీదకు ఒక ఆర్బిటర్‌ను నాసా ప్రయోగించనుంది. ఆ తరువాతి యాత్రలపై స్పష్టతలేదు. ఐరోపా భాగస్వామ్యంతో 'ఎక్సోమార్స్‌' పేరిట ఒక ప్రాజెక్టును చేపట్టాలనుకున్నా.. నాసా అర్ధంతరంగా వైదొలిగింది. ఇప్పుడు క్యూరియాసిటీ విజయంతో మీ అంగారక అన్వేషణ కార్యక్రమానికి ఒక దిశ ఏర్పడుతుందని భావిస్తున్నారా?
భవిష్యత్‌లో చేపట్టబోయే అరుణగ్రహ యాత్రలపై నాసా అధ్యయనాలు జరుపుతోంది. అయితే అంగారకుడిపై ఒకప్పుడు జీవం మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయనడానికి సంబంధించి క్యూరియాసిటీ ఎలాంటి సమాచారం సేకరించినా.. అది మా భవిష్యత్‌ అన్వేషణలకు ప్రేరణ అవుతుంది.

» అరగారకుడి ఉపరితలంపై లావా చుట్టల్లాంటి ఆకృతులు కనిపించాయి. అవి ఎలా ఏర్పడ్డాయి. క్యూరియాసిటీ వాటిని పరిశీలిస్తుందా?
అవి ఏంటన్నది ఇతమిత్థంగా చెప్పలేం. అయితే క్యూరియాసిటీ అక్కడికి వెళ్లడంలేదు.

» క్యూరియాసిటినీ దించడానికి ప్రత్యేకించి గేల్‌ బిలంనే ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ తేమ పరిస్థితులు ఉండటం మినహా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా?
గేల్‌ బిలం ఒక ఆశ్చర్యకరమైన ప్రాంతం. 150 కిలోమీటర్ల వ్యాసం ఉన్న ఈ బిలం.. ఒక ఖగోళ వస్తువు ఢీ కొట్టడం వల్ల ఏర్పడింది. ఇందులో పొరలుపొరలుగా అవక్షేప శిల (సెడిమెంటరీ రాక్‌) ఉంది. బిలం ఏర్పడ్డాక ఇది ఏర్పడి ఉంటుంది. ఈ బిలం, దాని పరిసర ప్రాంతం కొన్ని కిలోమీటర్ల మందంతో కూడిన అవక్షేపం కింద సమాధి అయినప్పుడు ఇది ఏర్పడి ఉంటుంది. ఆ తర్వాత.. గాలి కాని నీరు కాని ఈ శిలామయ పొరలను చాలా మేర తొలగించాయి. దీంతో గేల్‌ బిలం లోపల 'మౌంట్‌ షార్ప్‌' అనే చిన్న పర్వతం ఏర్పడింది. దీన్ని 2000లలో గుర్తించాం. తర్వాతి కాలంలో జరిగిన పరిశోధనల్లో ఈ పర్వతం ఎత్తును బట్టి అందులోని ఖనిజాలు మారుతున్నట్లు కనుగొన్నాం. కింది భాగంలో మట్టి ఖనిజాలు ఉన్నాయి. అంతకన్నా కింద ప్రాంతంలో సల్ఫేట్‌ లవణాలు, ధూళి ఉన్నాయి. దీన్ని బట్టి ఈ పర్వతంలోని అవక్షేపాలు.. అంగారకుడి వాతావరణంలో తలెత్తిన ముఖ్యమైన మార్పులకు సాక్షీభూతంగా ఉన్నాయన్న అంచనాకు మేం వచ్చాం. భారీ స్థాయిలో తాజా నీరు అందుబాటులో ఉన్నప్పుడు దిగువభాగంలో మట్టి ఏర్పడింది. నీటికి కొరత ఏర్పడినప్పుడు లవణాలు అక్కడ ఉండిపోయాయి. ఆ తర్వాతి పరిస్థితుల్లో గ్రహంపై ఏర్పడ్డ ధూళి వాతావరణానికి సంబంధించి కూడా అక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. ఇది మాకు ఎంతో ఆసక్తిని కలిగించింది. దీనిపై పరిశోధనల ఆధారంగా అంగారక చరిత్రలో ఎక్కువ భాగం మేర జీవం మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అన్నది మేం నిర్ధరిస్తాం.

» అంగారకుడిపై లోగడ నీరు ఉండేదనడంపై అనేక అంచనాలు, పరిశోధనలు జరిగాయి. అసలు అక్కడ ఎంత పరిమాణంలో నీరు ఉండి ఉండొచ్చు?
అంగారకుడి ధ్రువ ప్రాంతాల్లో కిలోమీటర్ల మందంతో మంచు ఫలకాలు ఉన్నాయి. భూగర్భంలోనూ ఐస్‌ ఉన్నట్లు 'ఫీనిక్స్‌' ల్యాండర్‌ చేపట్టిన తవ్వకాల్లో వెల్లడైంది. మొత్తం మీద ఆ గ్రహంపై భారీ స్థాయిలో నీరుంది. అందులో ఎక్కువ భాగం ఇప్పుడు ధ్రువాల వద్ద ఘనీభవించి ఉంది. లోగడ మాత్రం ద్రవ రూపంలోనే నీరు ప్రవహించింది. అప్పట్లో అంగారకుడిపై వెయ్యి కిలోమీటర్ల పొడవైన నదులూ ఉండేవి. భవిష్యత్‌లో అంగారకుడిపై ఆవాసం ఏర్పర్చుకుంటే ధ్రువ ప్రాంతాలోని మంచు మనకు ఒక వనరుగా పనికొస్తుంది. అయితే అంగారకుడి శీతాకాలాన్ని తట్టుకోవడం చాలాచాలా కష్టం. ఇంతకుముందు అరుణ గ్రహపు వాతావరణం కొంత సాంద్రంగా ఉండేది. ద్రవ రూపంలో నీరు పుష్కలంగా ప్రవహించేది. అప్పుడు అది జీవం మనుగడకు అనువుగా ఉండేది.

» సౌరకుటుంబానికి వెలుపలున్న నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్న అనేక గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. వీటిలో అనేకం జీవుల మనుగడకు వీలు కల్పించే సమశీతోష్ణ స్థితి ఉండే ప్రాంతం (గోల్డీలాక్స్‌ జోన్‌)లో ఉన్నాయి. అక్కడ జీవం ఉందా అన్నది మనం తెలుసుకోవచ్చా?
మిగతా నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న వందలాది గ్రహాలను కనుగొన్నాం. వీటిలో కొన్ని.. ద్రవ రూపంలో నీటి ప్రవాహాలకు ఆస్కారమున్న వాతావరణం ఉండే ప్రాంతంలో ఉన్నాయి. ఇది అద్భుత విజయం. అయితే టెలిస్కోపుల సాయంతో వాటి మీద జీవం ఉనికిని గుర్తించడం అంత తేలిక కాదు. జీవ ప్రక్రియలతో సంబంధమున్న కొన్ని రసాయనాల ఆచూకీని మనం చూడొచ్చేమో! అయితే వాటిని శాస్త్రీయంగా నిర్ధరించడం చాలా కష్టం. అంగారకుడి విషయాన్నే తీసుకుంటే.. అక్కడి నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చి, మనకున్న అత్యుత్తమ స్థాయి ప్రయోగశాలల్లో పరీక్షిస్తేనే జీవం ఉనికి గురించి కచ్చితమైన సమాచారం తెలుస్తుంది. విశాల విశ్వంలో ఎక్కడైనా.. కదిలే లేదా భారీ శిలాజాలను ఏర్పర్చే జీవం ఉంటే అది అద్భుతమే. ప్రస్తుతానికైతే సౌరకుటుంబంపైనే దృష్టిసారిస్తున్నాం. అందులో మనకు బాగా అందుబాటులో ఉన్న అంగారకుడిపై అన్వేషణ సాగిస్తున్నాం.

» వచ్చే ఏడాది అరుణగ్రహంపైకి ఒక ఆర్బిటర్‌ను భారత్‌ పంపబోతోంది. అభివృద్ధి చెందుతున్న దేశమొకటి ఈ యాత్రను చేపట్టడం ప్రయోజనకరమేనా?
విశ్వాన్వేషణలో భారత పరిశోధనలు చూసి.. ఒక భారత-అమెరికన్‌గా గర్వపడుతున్నా. సవాళ్లతో కూడుకున్న ఇంజినీరింగ్‌ అద్భుతాల కోసం ప్రయత్నించి, సైన్స్‌కు సంబంధించిన అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలను వెతకడం ఒక గొప్ప జాతికి ఉండే లక్షణం. సందేహం లేదు.. ఆ యాత్ర ఎంతో వ్యయంతో కూడుకున్నదే. అయినా యావద్దేశం ముక్తకంఠంతో యాత్రను సమర్థించాలి. నిజానికి భారత్‌, అమెరికాలు విశ్వాన్వేషణను ఒక అద్భుత విజయంగా మాత్రమే చూడటంలేదు. కొత్త పరిజ్ఞానాల అభివృద్ధి; నవతరం శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు ప్రేరణ కలిగించడానికి, శిక్షణ ఇవ్వడానికి ఒక మార్గం అని కూడా దీన్ని భావిస్తున్నాయి.

» అంతరిక్ష రంగంలో స్థిరపడాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది? మీ భవిష్యత్‌ లక్ష్యాలేంటి?
1976లో వైౖకింగ్‌ ల్యాండర్లు అందించిన తొలిచిత్రాలను చూసి.. ఒక బాలుడిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా. నేనే అంగారకుడిపై నడుస్తున్నానన్న భావన కలిగింది. అరుణగ్రహపు ధూళి నా బూట్ల నిండా అంటినట్లు అనిపించింది. అప్పుడే అంతరిక్ష రంగంపై విపరీతమైన ఆసక్తి కలిగింది. అంగారకుడిపై దిగేమిషన్‌లో భాగస్వామి కావాలన్న దృఢ సంకల్పం ఊపిరి పోసుకుంది. ఆ దిశగానే నా పయనం సాగింది. ఇక భవిష్యత్‌ లక్ష్యం విషయానికొస్తే.. ఆగస్టు 6 తర్వాత నుంచి క్యూరియాసిటీ ద్వారా ప్రయోగాలు చేపట్టే దాదాపు 400 మంది శాస్త్రవేత్తలకు నేను నాయకత్వం వహిస్తా. రోవర్‌ను సురక్షితంగా ఉంచుతూ, దాన్ని పనిచేయించే ఇంజినీర్లు.. రోవర్‌లోని పరికరాలతో ప్రయోగాలు చేపట్టే శాస్త్రవేత్తల మధ్య సమన్వయకర్తగా ఉంటా. రాబోయే సంవత్సరాలన్నీ అద్భుతంగా ఉంటాయి. విశ్వంలో జీవానికి సంబంధించి మనకున్న అభిప్రాయాలను అవి మార్చేస్తాయని నేను అనుకుంటున్నా.

» అంగారకుడి మీదకు 'రాక'లే సాగుతున్నాయి. రాక-పోకలు ఎప్పుడు జరుగుతాయి?
మానవులను అంగారకుడి మీదకు పంపి, సురక్షితంగా భూమికి తిరిగి ఎలా తీసుకురావాలన్న దానిపై ఒక్కో యాత్ర ద్వారా.. కొద్దికొద్దిగా నేర్చుకుంటున్నాం. క్యూరియాసిటీలో ఒక రేడియేషన్‌ డిటెక్టర్‌ ఉంది. వ్యోమగాములు ఎంత రేడియోధార్మికతకు గురవుతారన్నది నిర్ధరించడానికే ప్రత్యేకంగా దీన్ని పెట్టాం. మునుపటి రోవర్ల కన్నా ఐదు రెట్లు ఎక్కువ బరువైనదాన్ని అంగారకుడిపైకి దించడం ద్వారా.. మానవసహిత వ్యోమనౌకను సురక్షితంగా దించడం ఎలాగో నేర్చుకుంటున్నాం. వ్యోమగాములను అరుణగ్రహంపైకి తీసుకెళ్లే నౌక.. క్యూరియాసిటీ కన్నా 10 రెట్లు పెద్దదిగా ఉండొచ్చు.

» అంగారక అన్వేషణకు సంబంధించి నాసా.. 1990ల నుంచి 'నీటి జాడల కోసం అన్వేషించు' అనే వ్యూహంలో సాగింది. ఇప్పుడు క్యూరియాసిటీ దాన్ని మార్చి.. అంగారకుడిపై ఎప్పుడైనా జీవం మనుగడకు తోడ్పడిన పరిస్థితులు ఉన్నాయా అనే దిశగా పరిశోధనలు సాగించనుంది. ఈ కొత్త వ్యూహం ఎందుకు?
నేను ఇంతకుముందు చెప్పినట్లు.. అంగారకుడిపై నాసా అన్వేషణ కార్యక్రమం మొత్తం.. జీవం మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అన్న కోణంలోనే సాగాయి. నీటి జాడల కోసం శోధించాం. జీవం మనుగడకు అది చాలా అవసరం. అరుణగ్రహంపై లోగడ దీర్ఘకాలంపాటు ద్రవస్థితిలో నీరు ఉండేదనడానికి స్పిరిట్‌, ఆపర్చ్యునిటీ రోవర్లు గట్టి ఆధారాలు సంపాదించాయి. అందువల్ల ఇప్పుడు మేం రెండో దశకు వచ్చాం. జీవానికి సంబంధించిన అంశాలు అక్కడ ఉన్నాయా? జీవం వృద్ధికి అడ్డుగా నిలిచిన ఏమైనా ఉత్పాతాలు ఉండి.. ప్రాణులు వృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాయా అన్నది ఈ దశలో మేం తేల్చాలి.